08-06-1971 అవ్యక్త మురళి

08-06-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జీవితానికి అవసరమైనవి మూడు - ఆహారం సంతోషం మరియు ధనము.

                జీవితంలో ముఖ్యంగా మూడింటి అవసరం ఉంటుంది. అవి ఏవి? లౌకిక జీవితంలోనైనా, అలౌకిక జీవితంలోనైనా రెండింటిలో కూడా మూడు అవసరం. అవి ఏవి? 1. ఆహారం 2.సంతోషం మరియు 3. ధనము (ఖజానా). ఈ మూడు విషయాలు అవసరం. ధనము లేకుండా ఏది ఉండదు, సంతోషం లేకుండా జీవితం ఉండదు మరియు ఆహారం కూడా అవసరం. కనుక ఈ మూడు విషయాలు ఇక్కడ కూడా అవసరం. ఆహారం అని దేనిని అంటారు? సంతోషం అనేది ప్రాప్తి కానీ ఆహారం అంటే ఏమిటి? ధనము ఏమిటి? ధనము అనగా జ్ఞానము, స్మృతి ద్వారా ఏదైతే శక్తి నిండుతుందో అది ఆహారం. ఆహారమే జీవశక్తికి ఆధారం. అయితే మూడూ ప్రాప్తించాయా లేక ప్రాప్తిస్తున్నాయా? ధనము కూడా పూర్తిగా లభించింది కదా! ఆహారం కూడా. లభించింది. సంతోషం అయితే ఉండనే ఉంది. అఖండ ధనము లభించింది కదా! మంచిది. అఖండ ఖజానాని లెక్కించి సహజ పద్దతిలో ఎవరికైనా చెప్పాలంటే ఏరకంగా చెప్తారు? ఎలా వర్ణించి చెప్పాలంటే దాంట్లోనే సహజంగా ఖజానా అంతా వచ్చేయాలి. సముద్రాన్ని కుండలో నింపి చూపించాలి. ధనముని ఎలా లెక్కిస్తారు? 1...2....3..... అంటూ లెక్కించి మా దగ్గర ఇంత ధనము ఉందని చెప్తారు కదా! అలాగే ఒకటి అనగానే ఒకటికి చెందిన విషయాలు చెప్పాలి అనగా ఒకే బాబా, ఒకే జ్ఞానం... ఇలా ఒకటి అనే విషయంపై వచ్చేవి వర్ణన చేస్తే ఎన్నో విషయాలు వస్తాయి. రెండు అనేది వర్ణన చేస్తే ఎన్ని విషయాలు వస్తాయి. ఇలా ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు - వీటి ద్వారా జ్ఞానం అంతా వర్ణించి చెప్పవచ్చు. ధనాన్ని వ్రేళ్ళతో ఎలా లెక్కిస్తారో అలాగే మీరు కూడా జ్ఞాన ఖజానాని ఈ అయిదు అంకెల్లో వర్ణించి చెప్పవచ్చు. ఈ క్లాస్ చేయాలి. అప్పుడు పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలా మననం చేయాలి. దీని ద్వారా జ్ఞానం సహజం కూడా అయిపోవాలి మరియు జ్ఞానం రమణీయంగా కూడా అవ్వాలి. 5 అంకెల్లో జ్ఞానమంతటినీ వర్ణించి వినిపించండి. ఖజానా అంతటినీ వర్ణించి వినిపించడానికి ఇది సహజ పద్ధతి. చిన్న పిల్లలకు కూడా 1....2.....3.... అంటూ నేర్పిస్తారు కదా! అలాగే అయిదు అంకెల్లో ఖజానా అంతా వర్ణించబడాలి. మరియు ఖజానాని మననం చేయటం ద్వారా మగ్న స్థితి స్వతహాగానే వస్తుంది. సంతోషం కూడా లభిస్తుంది, ఆహారం కూడా లభిస్తుంది మరియు ఖజానా అంతా స్మృతిలోకి వస్తుంది. ఆ మూడు విషయాలు కూడా గుర్తుంటాయి. అలాంటి జీవితాన్ని శ్రేష్ట జీవితం అని అంటారు. స్మృతియాత్రలో ఉండటం వలన ఏమైనా గారడీ జరుగుతుందా? (శక్తులు ప్రాప్తిస్తాయి) శక్తులు ప్రాప్తించడాన్ని గారడీ అని అంటారా? ప్రజలు కొన్ని అభ్యాసాలు చేస్తారు, మంత్రతంత్రాల ద్వారా కొన్ని గారడీలు చేస్తారు. అలా దీనిని కూడా గారడీ అని అంటారా? ఏ శక్తి ఆధారంగా మీరు కర్తవ్యం చేస్తున్నారో దానిని గారడీ అని అంటారా? (అనరు) గారడీగా భావించి ప్రయోగించటం లేదు. మీరు కర్తవ్యంగా భావించి శక్తిని ప్రయోగిస్తున్నారు. కర్తవ్యం చేయటం అనేది భాద్యత కదా! శ్రీమతాన్ని మీ ప్రత్యక్ష కర్తవ్యంగా భావించి నడుస్తున్నారు. ఆ మనుష్యుల దగ్గర అయితే గారడీ ఉంటుంది. మీ బుద్ధిలోకి ఉండేది -శ్రీమతం. శ్రీమతం మరియు గారడీ రెండింటిలో తేడా ఉంది. మీకు శక్తులు ప్రాప్తిస్తే ఏమి గుర్తిస్తుందంటే శ్రీమతం ద్వారా ఇవన్నీ ప్రాప్తించాయని. గారడీగా భావించి శక్తులను ప్రయోగించరు. కర్తవ్యంగా భావించి శక్తులు ప్రయోగిస్తారు. శక్తులు తప్పకుండా వస్తాయి. నోటితో మాట్లాడవలసిన అవసరం ఉండదు, సంకల్పంతోనే కర్తవ్యం సిద్ధిస్తుంది. నోటి ద్వారా కర్తవ్యాన్ని సిద్ధి చేసుకోవటానికి మీకు మొదట్లో చాలా మాట్లాడవలసి వచ్చేది. అప్పుడే సిద్ధి లభించేది. అంతర్యామి వలె సంకల్పంతో కర్తవ్యం పూర్తి చేయటం అనేది కూడా అభ్యాసం అయిపోతుంది. సంకల్పంతో ఎవరినైనా పిలవగలరు, సంకల్పంతో ఎవరికైనా కార్యానికి ప్రేరణ ఇవ్వగలరు. ఇవి కూడా శక్తులు కానీ వాటిని కర్తవ్యంగా భావించి ప్రయోగించాలి. ఇవన్నీ శ్రీమతం ద్వారా ప్రాప్తించాయి. బటన్ నొక్కగానే టి.విలో దృశ్యాలు వచ్చినట్లుగా మీరు ఇక్కడ సంకల్పం చేయగానే అక్కడ వారి బుద్ధిలో చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా కనెక్షన్ నడుస్తుంది. ఈ శక్తులన్నీ ప్రాప్తిస్తాయి. ఈ ప్రాప్తి కొరకు బుద్ధిలో మిగతా విషయాలన్నీ సమాప్తం అయిపోవాలి. కేవలం శ్రీమతం యొక్క ఆజ్ఞ ఏదైతే లభించిందో అదే నడవాలి. మరేదీ కలవకూడదు. వ్యర్థ సంకల్పాలు శ్రీమతం కాదు, ఇది మీ మన్మతం. బుద్ధిలో శ్రీమతం తప్ప మరేదీ కలవనప్పుడు శక్తులు వస్తాయి. సమీపంగా వస్తూ ఉన్నారు. శక్తులకు చాలా మహిమ ఉంది. కర్తవ్యం ఆధారంగా శక్తుల యొక్క మహిమ ఎక్కువ. ఎందుకంటే సాకారంలో అంతిమ కర్తవ్యం యొక్క సమాప్తి శక్తుల ద్వారానే. కనుక కర్తవ్యం యొక్క స్మృతి లేదా స్మృతిచిహ్నం కూడా శక్తులకే ఎక్కువ. భవిష్యత్తులో రోజు రోజుకీ దేవతా స్వరూపం యొక్క పూజ యొక్క స్మృతిచిహ్నం తగ్గిపోతుంది.శక్తుల యొక్క పూజ మహిమ పెరిగిపోతూ ఉంటుంది. మహిమ జరుగుతూ జరుగుతూ ప్రత్యక్షం అయిపోతారు. మంచిది. 
                       (నిర్మలశాంత దాదీ బాప్ దాదా ఎదురుగా కుర్చున్నారు) కలకత్తాలో సేవా సాధనాన్ని అయితే స్థాపన చేశారు. సేవాసాధనాన్ని ఎలా అయితే స్థాపన చేశారో అదేవిధంగా పాలన యొక్క రూపం ఇప్పుడు విస్తారాన్ని పొందాలి. కలకత్తా మ్యూజియం ద్వారా ఆత్మలందరికీ శాంతి యొక్క వరదానం ఎలా ప్రాప్తిస్తుంది? ఎందుకంటే కలకత్తాలో అశాంతి ఎక్కువగా ఉంది. కనుక ఇక్కడ ధ్వనిని ఎంతగా వ్యాపింప చేయాలంటే ఈ స్థానం ద్వారా శాంతి తప్పకుండా ప్రాప్తిస్తుంది అని ప్రభుత్వం వరకు చేరుకోవాలి. శాంతి దళం అయిన మీకు ప్రభుత్వం వారి నుండి అవకాశం వస్తుంది. ఎందుకంటే పాపాత్మలను పుణ్యాత్మలుగా తయారు చేసే సాధనం ఇదే. కనుక ఆహ్వానిస్తారు. ఎక్కడ అశాంతి ఉన్నా కానీ శక్తిదళం, శాంతిదళం ఉన్నారని భావిస్తారు. ప్రభుత్వం వారి ద్వారా ఆహ్వానం వచ్చి ప్రసిద్దులు అవుతారు. కనుక నలువైపుల ధ్వని వెళ్ళేలా ప్లాను చెయండి. అశాంతి మధ్యలో ఈ శాంతి దళం రక్షణకి సాధనం అని మీరు ప్రసిద్ధి అవుతారు. భట్టీ కార్యక్రమం గురించి మహిమ ఉంది కదా! అగ్ని అంటుకున్నా కానీ ఆ స్థానం రక్షణగా ఉందని. నలువైపుల అగ్ని ఉంటుంది. కానీ ఈ ఒక్క స్థానమే శాంతిగా ఉందని అనుభవం చేసుకుంటారు. ఈ స్థానం నుండే మాకు రక్షణ, శాంతి లభిస్తుందని భావిస్తారు. పాలన యొక్క ఈ కర్తవ్యాన్ని పెంచండి. ఆ స్థానం విశేష అభ్యాస (యోగం) స్థానంగా ఉండాలి దాంట్లోకి వెళ్ళగానే మేము అసలు ఎక్కడికి వచ్చాము అనేలా అనుభవం అవ్వాలి. స్థానం కూడా  స్థితిని పెంచుతుంది. మధువన స్థానం స్థితిని పెంచుతుంది కదా! అదేవిధంగా కొన్ని స్థానాలను ఈవిధంగా తయారు చేయండి. ఎంతటి అలజడి దు:ఖి ఆత్మ అయినా కానీ, చింతలో కూరుకుపోయిన వారు అయినా కానీ రాగానే మేము ఎక్కడికి వచ్చాము అని అనుకునేలా అనుభవం అవ్వాలి. అలాంటి ప్లాను తయారు చేయండి. స్వయాన్ని సఫలతామూర్తిగా భావిస్తున్నారా? సఫలతామూర్తిగా అయ్యేటందుకు ముఖ్యంగా ఏ గుణాన్ని ధారణ చేయాలి? సఫలతామూర్తులు అయ్యేటందుకు ముఖ్యంగా కావలసిన గుణం - సహనం, సహనశీలత మరియు సరళత. ఏ కార్యాన్ని అయినా సఫలం చేస్తాయి. ధైర్యం గల ఏ మనిషి అయినా ఆలోచించి అర్థం చేసుకుని ఏ పని అయినా చేస్తే అది తప్పక సఫలం అవుతుంది. అదేవిధంగా సహనశీలత యొక్క శక్తితో ఎటువంటి కఠిన సంస్కారం గలవారినైనా కానీ శీతలం చేయవచ్చు మరియు కార్యాన్ని సహజంగా చేయవచ్చు. ఎవరిలో సహనశీలత గుణం ఉంటుందో వారు గంభీరంగా ఉంటారు. గంభీరంగా ఉన్నవారు గుహ్యతలోకి వెళ్ళేవారిగా ఉంటారు. వారు ఏ కార్యంలోను భయపడరు. గుహ్యతలోకి వెళ్ళి సఫలతను పొందుతారు. సహనశీలత గలవారు బాహ్య తరంగాలకే కాదు, మనస్సులో ఏవైతే సంకల్పాలు ఉత్పన్నం అవుతాయో ఆ సంకల్పాల ఉత్పత్తిని చూసి కూడా భయపడరు. సహనశీలత గలవారి ముఖంలో ఏమి కనిపిస్తుంది? ఎవరిలో సహనశీలత ఉంటుందో వారి ముఖంలో సదా సంతుష్టత కనిపిస్తుంది. వారి ముఖకవళికలలో ఎప్పుడూ కూడా అసంతుష్టత కనిపించదు. ఎవరైతే స్వయం సంతుష్టమూర్తిగా ఉంటారో వారు ఇతరులను కూడా సంతుష్టంగా చేయగలరు. నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తాగా అనుభవం అవుతారు. సహనశీలత చాలా ముఖ్య ధారణ. ఎంత సహనశీలత మీలో ఉంటే అంతగా స్వయంతో సంతుష్టంగా మరియు సర్వులతో సంతుష్టంగా ఉంటారు. సంతుష్టం అవ్వటం అంటే సఫలత పొందటం. ఏ విషయంలోనైనా సహిస్తున్నారంటే సహించటం అంటే విషయం యొక్క లోతులోకి వెళ్ళటం. సాగరం యొక్క లోతులకి వెళ్తే రత్నాలను తీసుకుని వస్తారు. అదేవిధంగా సహనశీలత గలవారు లోతులోకి వెళ్తారు. ఆ గుహ్యత ద్వారా చాలా శక్తులు ప్రాప్తిస్తాయి. సహనశీలులే మనన శక్తిని పొందుతారు. సహనశక్తి గలవారు లోలోపల మననంలో తత్పరులై ఉంటారు. మరియు ఎవరైతే మననంలో తత్పరులై ఉంటారో వారు మగ్నస్థితిలో ఉంటారు. కనుక సహనశీలత చాలా అవసరం. వారి ముఖమే గుణమూర్తిగా ఉంటుంది. కనుక సహనశీలత యొక్క ధారణపై శ్రద్ధ పెట్టాలి. సహనశీలురే డ్రామా అనే డాలుని పట్టుకుని ఉండగలరు. మరి దీనిపై అంత శ్రద్ధ ఉందా? సదా ఏదోక గుణాన్ని ఎదురుగా ఉంచుకుని దాని యొక్క లోతులోకి వెళ్ళాలి. ఎంతెంత లోతులోకి వెళ్తారో అంతగా ఆ గుణం యొక్క విలువ మనకి తెలుస్తుంది. మరియు ప్రతీ గుణం యొక్క విలువ ఎంతగా తెలుస్తుందో అంతగా ఆయా గుణాలను గ్రహించటం, వర్ణన చేయటం సహజం అవుతుంది. కానీ ఒకొక్క గుణం యొక్క గుహ్యత ఎంత ఎవరు తెలుసుకుంటారో వారే విలువైనవారిగా అవుతారు. వారికే సర్వగుణ సంపన్నులు అనే మహిమ జరుగుతుంది. గుణాల ఆధారంగానే విలువ ఉంటుంది. ఏ గుణాల ఆధారంగా మీరు విలువైనవారిగా అయ్యారో ఆయా గుణాలకు ఎంత విలువ ఉంటుంది? ఈ విధంగా లోతులోకి వెళ్ళాలి మరియు గుణాల యొక్క విలువ స్వయానికి ఎంతగా తెలుస్తుందో అంత విలువగా ఇతరులకు కూడా చెప్పగలరు. మంచిది. విలువైనవారి జాబితాలో మీరు ఉన్నట్లు భావిస్తున్నారా? విలువైనవారి ముఖ్య లక్షణం ఏమిటి? ఎలాగైతే బాప్ దాదాని త్రిమూర్తి అని అంటారో అలాగే మీ ఒకొక్కరి మూర్తి ద్వారా మూడు మూర్తుల సాక్షాత్కారం అవుతుందా? బాబా అయితే మూడు దేవతల రచయిత. కనుక త్రిమూర్తి అని అంటారు. కానీ మీ యొక్క ఒకొక్క మూర్తి ద్వారా మూడు మూర్తులు సాక్షాత్కారం అవుతుందా? ఆ మూడు మూర్తులు ఏవి? శక్తుల ద్వారా ఏ మూడు మూర్తులు సాక్షాత్కారమవ్వాలి? మీ ద్వారా ఇప్పుడు మూడు కర్తవ్యాలు జరుగుతున్నాయి. కొందరి ఆత్మలలో దైవీ సంస్కారాల రచన అనగా స్థాపన చేస్తున్నారు. అంటే స్థాపనా కార్యం చేస్తున్నారు. మరియు కొంతమంది ఆత్మల సంస్కారం ఎలా ఉంటుందంటే వారు నిర్బలంగా ఉంటారు. వారు తమ సంస్కారాలను పరివర్తన చేసుకోలేరు మరియు తమ సంస్కారాలను సేవలో ఉపయోగించలేరు, వారికి సహాయం అందించి ముందుకి తీసుకువెళ్ళాలి - ఇదే పాలన. పాలన అనేది పెద్దవారు చిన్నవారికి అందించాల్సి ఉంటుంది. మరియు కొంతమంది ఆత్మలు తమ శక్తితో పాత సంస్కారాలను తొలగించుకోలేరు, కనుక వారికి కూడా సహాయకారి అయ్యి వారి వికర్మలను వినాశనం చేయటంలో సహాయపడాలి. ఈ విధంగా మూడు కర్తవ్యాలు జరుగుతున్నాయి. ఈ మూడు కర్తవ్యాల కొరకు మూడు మూర్తులు ఏవి? ఏ సమయంలో అయితే ఏ ఆత్మలోనైనా దైవీ సంస్కారాల రచన చేస్తున్నారో ఆ సమయంలో మీరు జ్ఞానమూర్తి అయ్యారు. పాలన చేసే సమయంలో దయ మరియు స్నేహం రెండూ అవసరం. కనుక రెండు మూర్తులు అవసరం. దయ రాకపోతే స్నేహం కూడా రాదు. కనుక పాలన చేసే సమయంలో 1. దయాహృదయులు మరియు 2. స్నేహ మూర్తి. ఏ సమయంలో ఎవరి యొక్క పాత సంస్కారాలను అయినా నాశనం చేస్తున్నారంటే ఆ సమయంలో శక్తి స్వరూపం మరియు ప్రతాపానికి బదులు ఆత్మీయతలో ఉండాలి. ఆత్మీయతలో ఉండనంత వరకు వారి యొక్క వికర్మలను వినాశనం చేయలేరు. అజ్ఞాన కాలంలో ఎవరినైనా చెడు నుండి విడిపించేటందుకు తమ ప్రతాపాన్ని చూపిస్తారు కాని ఇక్కడ కోపంతో కాదు, ఆత్మీయతలో ఉండాల్సి వస్తుంది. ఆత్మీయతలో ఉండకపోతే వారి పాత సంస్కారాలను నాశనం చేయలేరు. శక్తి రూపంలో విశేషంగా ఈ ఆత్మీయతను ధారణ చేయాలి. ఈ గుణాల ద్వారా మీరు మూడు కరవ్యాలు చేస్తున్నారు. ఎవరితోనైనా ఆత్మీయత తక్కువగా ఉంటే పాలన చేయగలరు. కానీ వారి సంస్కారాలను నాశనం చేయలేరు. కేవలం దయ మరియు స్నేహమే ఉంటే వినాశనం చేయలేరు. స్నేహం, దయ, లేకపోతే పాలనా కర్తవ్యం చేయలేరు. ఆత్మీయత ఎక్కువగా ఉంది కానీ దయ తక్కువగా ఉంటే పాలన కార్యంలో అంత సహాయకారులు కాలేరు. కానీ వికర్మలను వినాశనం చేయటంలో సహాయకారులు కాగలరు. జ్ఞానమూర్తిగా అవ్వకపోతే క్రొత్త సంస్కారాలను రచించలేరు. ఒకరిలో ఒక విశేష గుణం ఉంటుంది, మరొకరిలో మరొకటి ఉంటుంది కానీ మూడూ కావాలి. ప్రత్యక్ష రూపంలో మూడూ సమానంగా ఉంటే సఫలత చాలా త్వరగా లభిస్తుంది. ఏదోకటి లోపంగా ఉన్నట్లయితే త్వరగా ఏదయితే సంపూర్ణ సఫలత రావాలో మరియు త్వరగా ఏదయితే రావాలో దానికి సమయం పట్టేస్తుంది. కనుక ఇప్పుడు ఇదే లక్ష్యం పెట్టుకోవాలి - మూడు కర్తవ్యాలు చేసేటందుకు మూడు మూర్తులుగా అవ్వాలి. వాటిలో లోటు ఉండకూడదు. అప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. బాబాలో సర్వ గుణాల సమానత ఉన్నట్లుగా వీటిలో సమానత తీసుకురావాలి. ఇప్పుడు ఒకరిలో ఒక విశేషత, మరొకరిలో మరొకటి ఉన్నాయి. అంటే తేడా ఉంది కదా! బాప్ దాదా ఏ కానుక ఇచ్చేటందుకు వచ్చారు? నిరాకారి తండ్రి యొక్క బహుమతి ఏమిటి మరియు సాకారి తండ్రి యొక్క బహుమతి ఏమిటి? రెండు బహుమతులు లభించాయా? ఇద్దరి బహుమతి ఒకటేనా? వేర్వేరా? బహుమతి అయితే అందరికీ లభించింది. బాబా మరియు దాదా ద్వారా బహుమతి లభిస్తుంది. సర్వాత్మల కోసం కానుక అయితే స్వర్గ రాజ్యభాగ్యం. ఇది అయితే అందరికీ లభిస్తుంది. కానీ ఎవరైతే అమూల్య పిల్లలు ఉంటారో, స్నేహి మరియు సర్వ కార్యాలలో సహయోగి అవుతారో వారికి ఎవరికి వారికి బహుమతి ఉంటుంది. ఇద్దరి ద్వారా సాకార బాప్ దాదా ద్వారా ఒకే విశేష బహుమతి ఏమి లభించింది? అది కేవలం స్నేహి మరియు సహయోగి రత్నాలకే లభిస్తుంది. స్వర్గం యొక్క బహుమతి అయితే వరదానంగా లభిస్తుంది. సాకారి మరియు నిరాకారుని ద్వారా ప్రతీ ఒక్కరికి ప్రత్యేక వరదానం కూడా లభించింది మరియు కానుక కూడా లభించింది. ప్రతీ ఒక్కరికీ ఇలాంటి వరదానం లభించింది, దాని ద్వారా శ్రమ లేకుండానే సఫలతను పొందుతారు. మీ మీ వరదానాలు ఏమిటో తెలుసు కదా! కొందరికి ఏదోక విశేష శక్తి వరదానంగా లభించింది. కొందరికి ఇంకొక శక్తి యొక్క వరదానం లభించింది. ఆ వరదానాలను ప్రతీ ఒక్కరు అనుభవం కూడా చేసుకుంటున్నారు. కొందరికి సర్వులకి సహయోగి అయ్యే వరదానం లభిస్తుంది. కొందరికి సర్వులకి స్నేహిగా అయ్యే వరదానం లభిస్తుంది. కొందరు సర్వుల సంబంధంలోకి వచ్చే వరదానం లభిస్తుంది. కొందరికి ఏ సమస్య ఎదురుగా వచ్చినా కానీ ఎదుర్కోనే శక్తి యొక్క వరదానం లభిస్తుంది. ఇలా ప్రతీ ఒక్కరికీ తమ తమ వరదానాలు లభించాయి. దాంతోపాటు బహుమతి కూడా లభించింది. ఒకొక్కరిలో చూసినట్లయితే వారికి సర్వశక్తులలో ఒక శక్తి వరదానం రూపంలో లభించి ఉంటుంది. దాని కోసం వారు శ్రమించవలసిన అవసరం ఉండదు. స్వతహాగా లభిస్తుంది. వారికి, పరస్పర సంప్రదింపుల్లో ఆ విషయం అనుభవంలోకి వస్తుంది. ఎలాగైతే పరస్పర గుణాలను వర్ణన చేస్తారో అలాగే ప్రతీ ఒక్కరి వరదానం కూడా మనకి తెలుస్తుంది. కానీ ఏదైతే వ్యక్తిగత బహుమతి ఉంటుందో దానితో విశేష స్నేహం ఉంటుంది. ఆ బహుమతి ఏమిటో ఆలోచించండి. మరియు ఆ వ్యక్తిగత బహుమతిని సదా స్థిరంగా ఉంచుకునేటందుకు విశేషంగా ఏ విషయంపై శ్రద్ధ పెట్టాలి? అమృతవేళలో ఈ విషయం గురించి విచార సాగర మధనం చేయాలి.
                    స్మృతియాత్ర ద్వారా ఆత్మకి ఆత్మిక శక్తి వస్తుంది. ఎంతెంత ఆత్మిక శక్తిని ధారణ చేస్తారో అంతగా బుద్ధిని ఎక్కడ కావాలంటే ఎంత సమయం కావాలంటే అంత సమయం ఉపయోగించగలరు. ఆత్మిక శక్తి ఎలా వస్తుంది? అర్పణ చేయటం ద్వారా. అర్పణ చేశారా లేదా అనేది మీ ఆత్మిక శక్తి ద్వారా తెలుసుకోవచ్చు. సర్వశక్తులను మీరు అర్పణ చేస్తే బాబా సర్వశక్తులను మీకు అర్పణ చేస్తారు. సర్వశక్తివంతుడు తోడుగా అయిపోతే సర్వశక్తులు మీ తోడుగా అయిపోతాయి. అప్పుడు విజయమే విజయం. భక్తిమార్గంలో కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు ఇది పూర్తవుతుందో లేదో అని అనుకుంటారు. అందువలన భగవంతునిపై వదిలేస్తారు - ఓ భగవంతుడా! ఇది మీ పని, కనుక మీరే చూస్కోండని. భక్తిమార్గంలో నిండిన ఈ సంస్కారాన్ని ఇప్పుడు ప్రత్యక్షం చేస్తున్నారు. భక్తిమార్గంలో కేవలం అన్నారంతే కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో అలా చేశారు. జ్ఞాన మార్గంలో చేసే శక్తి ఉంటుంది, భక్తి మార్గంలో కేవలం చెప్పే శక్తి మాత్రమే. రెండింటికీ రాత్రి,పగలుకి ఉన్నంత తేడా ఉంది. మంచిది.

Comments