08-05-1973 అవ్యక్త మురళి

* 08-05-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సర్వోత్తమ  స్వమానము"

           వర్తమాన సమయంలో మిమ్మల్ని మీరు ఏ స్వమానంలో భావిస్తున్నారు? మీ స్వమానమును గూర్చి మీకు తెలుసా? అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన స్వమానము ఇప్పుడే ఉంటుంది అని కూడా మీకు తెలుసు. కాని అది ఏ స్వమానము? ఇప్పుడు ఉన్న ఉన్నతోన్నతమైన స్వమానం ఏది? దానిని గూర్చి వర్ణన చేయడంతోనే దీని కన్నా ఉన్నతమైన స్వమానము ఇంకేదీ ఉండజాలదు అని అనిపించే ఆ స్వమానము ఏమిటి? ఈ సమయంలో మీరు బాబాకు కూడా యజమానులుగా అయిపోతారు. ఇదే ఈ సమయంలోని ఉన్నతోన్నతమైన స్వమానము. విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకు ముందు మీరు విశ్వరచయితకు కూడా యజమానులుగా అయిపోతారు. మీరు శివబాబాకు కూడా యజమానులు, కావుననే మాలేకం సలాం అని అంటారు. సుపాత్రులైన పిల్లలు తండ్రి పైన కూడా యజమానులు. ఈ సమయంలో మీరు బాబాను కూడా మీ వారిగా చేసేసుకున్నారు. మొత్తం కల్పమంతటిలో తండ్రిని మీరు మీ వారిగా ఇలా చేసుకోలేరు. ఇప్పుడైతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో బాబాను మీ వారిగా చేసుకోగలరు. బాబా కూడా ఈ సమయంలో ఏ బంధనలో ఉన్నారు? (పిల్లల బంధనలో). కావున రచయితను కూడా బంధనలో బంధించే, రచయితను కూడా సేవాధారిగా చేసే ఇటువంటి స్వమానమును మళ్ళీ ఇంకెప్పుడైనా అనుభవం చేసుకుంటారా? మీ సేవ కొరకు తండ్రిని కూడా సేవకునిగా చేసేసుకున్నారు కదా! ఇది శుద్ధ స్వమానము. ఇందులో అభిమానం ఉండదు. ఎక్కడైతే స్వమానం ఉంటుందో అక్కడ అభిమానం ఉండదు. బాబాను సేవాధారిగా చేసుకున్నారు కాని అక్కడ అభిమానం రాదు. కావున మీ యొక్క ఇటువంటి శుద్ధ స్వమానంలో, ఎక్కడైతే అభిమానపు నామరూపాలు కూడా ఉండవో ఆ స్థితిలో స్థితులవుతున్నారా?

          ఏ విధంగా బాబా ఎల్లప్పుడూ అవును పిల్లలూ, మధురమైన పిల్లలూ, విశ్వాధిపతులైన పిల్లలూ అని భావిస్తూ తమ శిరోకిరీటాలుగా చేసుకుంటారో అలా మీరు కూడా శిరోకిరీట స్థితిలో స్థితులై ఉంటున్నారా? బ్రాహ్మణుల పిలక స్థానం ఎక్కడ ఉంటుంది? శిరస్సు పైన కదా! కావున పిలక స్థానంలో ఉన్న బ్రాహ్మణులు అనగా బాబాకు శిరోకిరీటాలు. కావున ఏవిధంగా బాబా ఎల్లప్పుడూ పిల్లలకు స్వమానమును ఇస్తూ తమ సమానంగా తయారుచేస్తారో అలా మీరందరూ కూడా ప్రతి ఒక్క ఆత్మకు సదా స్వమానమును ఇస్తూ బాబా సమానంగా తయారుచేస్తున్నారా? ఈ సమయంలో ఒక్క బాబా నుండి తీసుకోవాలి, మిగిలిన వారందరికీ ఇవ్వాలి అన్నది సదా స్మృతిలో ఉంటోందా? ఆత్మలైన మీరు ఆత్మల నుండి తీసుకోకూడదు, వారికి ఇవ్వాలి. కేవలం ఒక్క తండ్రి నుండే తీసుకోవాలి. ఏదైతే తీసుకున్నారో దానిని ఇవ్వాలి. మీరు దాతలు కదా! ఇది సదా స్మృతిలో ఉంటోందా? లేక ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ కూడా తీసుకోవాలనే కోరికను కలిగి ఉంటున్నారా? ఆత్మ ఆత్మ ద్వారా ఏదైనా తీసుకోవాలనే కోరికను కలిగి ఉంటే ఆ ప్రాప్తి ఎలా ఉంటుంది? అల్పకాలికంగా ఉంటుంది కదా! అల్పజ్ఞ ఆత్మల నుండి అల్పకాలికమైన ప్రాప్తియే లభిస్తుంది. సర్వజ్ఞులైన తండ్రి ద్వారా సదాకాలికమైన ప్రాప్తి లభిస్తుంది. కావున ఎక్కడినుండైతే తీసుకోవాలో అక్కడి నుండి తీసుకుంటున్నారా మరియు ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇస్తున్నారా లేక అప్పుడప్పుడు మార్చివేస్తున్నారా? ఆత్మ ఆత్మకు ఏదైనా ఇచ్చినా అది తండ్రి నుండి తీసుకున్నదే ఇస్తుంది కదా! కొద్దిగ కూడా ఏ విధంగానైనా తీసుకోవాలి అనే కోరికను ఉంచితే, అది మీ స్వమానం నుండి క్రింద పడవేస్తుంది.

          అలాగే మీరు కూడా ఏ ఆత్మకైనా బాబా ద్వారా లభించిన ఖజానాలను ఇచ్చేందుకు నిమిత్తులుగా అయినప్పుడు ఏ స్మృతి ఉంటుంది? ఆత్మ వద్ద తనదంటూ ఏదైనా ఉందా? బాబా ద్వారా ఇవ్వబడిన దానినే ఆత్మ తనదిగా చేసుకుంది. ఇతరులకు ఇచ్చేందుకు నిమిత్తులుగా అయినప్పుడు కూడా బాబా యొక్క ఖజానా నుండి ఇస్తున్నాను అన్న స్మృతి లేకపోతే ఆ ఆత్మలను శ్రేష్ఠ సంబంధంలో జోడించలేరు. ఇటువంటి స్మృతిలో ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నారా? మీ శ్రేష్ఠ స్వమానపు నషా కూడా ఉండాలి, దానితో పాటు ఇంకేమి ఉంటుంది? (సంతోషము). ఎంతగా బుద్ధిలో నషా ఉంటుందో అంతగానే కర్మలలో నమ్రత ఉంటుంది. ఆ నషా యొక్క గుర్తు ఇదే. నషా కూడా ఉన్నతంగా ఉంటుంది, కాని కర్మలో నమ్రత ఉంటుంది. నయనాలలో ఎల్లప్పుడూ నమ్రత ఉంటుంది. కావున నషాలో ఎప్పుడూ నష్టం కలుగదు, అర్థమైందా?

          కేవలం నషాను ఉంచకండి. ఒకవైపు అతి నషా ఇంకొకవైపు అతి నమ్రత, ఉన్నతోన్నతుడైన తండ్రి కూడా పిల్లల ముందు సేవాధారిగా అయి వస్తారు. మరి అది నమ్రతయే కదా? ఎంత ఉన్నతంగా ఉంటారో అంతగానే నమ్రత కూడా ఉండాలి. ఇటువంటి బ్యాలెన్స్ ఉంటోందా లేక ఏ సమయంలోనైతే నషాలో ఉంటారో ఆ సమయంలో ఇంకేదీ స్పృశించదా? మేము విశ్వరచయితకు కూడా అధిపతులము అన్న ఇటువంటి నషాలో ఉండేవారి కర్తవ్యం ఎలా ఉంటుంది? నమ్రత లేకుండా విశ్వకళ్యాణము జరుగజాలదు. ఎప్పుడైతే బాబా కూడా నమ్రతతో పిల్లలకు సేవాధారిగా అయ్యారో, అప్పుడే బాబా కూడా తమవారిగా  చేసుకున్నారు, అలాగే బాబాను అనుసరించండి.

          బాబా నుండి ఎన్ని ఖజానాలు లభించాయి అని అన్నివేళలా పరిశీలించుకోండి. మీరు ఎన్ని ఖజానాలకు అధిపతులో మీకు తెలుసా?(లెక్కలేనన్ని). అయినా ముఖ్యమైనవాటినైతే లెక్కించగలరు కదా? ఈ సంగమయుగంలో ముఖ్యమైన ఖజానాలు ఎన్ని ఉన్నాయి? మీకు ఎన్ని లభించాయి? అన్నింటికన్నా పెద్ద ఖజానాగా బాబా లభించారు. మొట్టమొదటి ఖజానా అయితే ఇదే కదా! ఎవరికైనా  తాళంచెవి లభిస్తే, వారికి సర్వస్వమూ లభించినట్లే. బాబా లభించారు అనగా సరస్వమూ లభించినట్లే ఇంకేం లభించింది? అది కూడా తోడుగా వర్ణన చేయండి. జ్ఞానం కూడా ఉంది, అష్ట శక్తులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క శక్తిని వేరువేరుగా వర్ణన చేసినట్లయితే వేరువేరు శక్తులు కూడా ఖజానాల రూపంలో ఉన్నాయి. అదేవిధంగా బాబా గుణాలనేవైతే వర్ణన చేస్తారో వాటిని కూడా ఖజానాల రూపంలో వర్ణన చేయవచ్చు. అదేవిధంగా ఈ అమూల్యమైన సంగమ యుగపు ఒక్క క్షణం కూడా ఖజానాయే. ఏ విధంగా ఖజానాల ద్వారా ప్రాప్తి లభిస్తుందో అలాగే ఈ సంగమయుగపు ఒక్కొక్క క్షణం ద్వారా శ్రేష్ఠ ప్రాప్తిని పొందగలరు. కావున ఈ సంగమ యుగపు సమయము అనగా ఒక్కొక్క క్షణము అనేక కోటానురెట్ల కన్నా ఎక్కువ ఖజానా. అనేక కోటానురెట్ల సంపదను పోగు చేసుకొని ఇంకొకవైపు సంగమ యుగపు ఒక్క క్షణమును ఉంచినా శ్రేష్ఠ సంగమ యుగపు ఆ ఒక్క క్షణమే లెక్కింపబడుతుంది. ఎందుకంటే ఈ ఒక్క క్షణంలోనే సదాకాలిక ప్రారబ్ధపు ప్రాప్తి లభిస్తుంది. ఒక్క క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోవచ్చు అని అందరికీ వినిపిస్తారు కదా! మరి ఆ ఒక్క క్షణానికి కూడా విలువ ఉన్నట్లే కదా! కావున సంగమ యుగపు ఆ సమయం కూడా ఎంతో పెద్ద ఖజానా.

          మేము ఈ ఖజానాలన్నింటినీ మా లోపల ఎంతవరకు ధారణ చేయగలిగాము అని ఇప్పుడు ఆ ఖజానాలన్నింటినీ పరిశీలించుకోండి. ఏదో ఖజానా ధారణ అయి ఇంకొక ఖజానా ధారణ అవ్వకుండా ఉండడం కాదు. ఏ ఖజానా నుండీ అసంపూర్ణంగా అయితే లేరు కదా! వంచితులుగా అయితే అవ్వరుకాని తక్కువగా ప్రాప్తించుకున్నా చంద్రవంశీయులుగా అవుతారు కాని సూర్యవంశీయులుగా అవ్వరు. సూర్యవంశీయులు అనగా సంపన్నులు. ఏ విషయంలోనైనా సంపన్నంగా అవ్వకపోతే వారిని సూర్యవంశీయులు అని అనరు. కావున ఖజానాలన్నింటినీ మీ ముందు ఉంచుకుంటూ ఇవి ఎంతవరకు ఉన్నాయి, లోలోపల ఎంతగా ఉన్నాయి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏదో కొద్దిలోనే సంతోషపడిపోవడం కాదు.

           కావున ఈ ఖజానాలన్నింటినీ పరిశీలించుకోండి మరియు ఏ ఖజానాలైతే లభించాయో వాటికి మహాదానులుగా అయ్యారా లేక వాటిని మీ కొరకే ఉంచుకున్నారా అని పరిశీలించుకోండి. ఎవరైతే మహాదానులుగా ఉంటారో వారు తమ వాటిని కూడా ఇతరులకు ఇచ్చేస్తారు. అయినా కాని వారు బికారులుగా అవ్వరు. ఎందుకంటే వారు ఏదైతే ఇస్తారో అది వారి వద్ద ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కావున పవిత్రత యొక్క ఈ ఖజానాను ఎంతవరకు అనేక ఆత్మలకు దానంగా ఇచ్చాను అని కూడా పరిశీలించుకోండి. అతీంద్రియ సుఖము ఖజానాను కూడా ఎక్కువగా తమ కొరకే ఉపయోగించుకుంటున్నారా లేక విశ్వసేవార్థం ఉపయోగించుకుంటున్నారా అన్నది కూడా పరిశీలించుకోవాలి. మీ ప్రాప్తినైతే అనుభవం చేసుకుంటున్నారు కదా? కాని ఇప్పటి ఈ స్థితి విశ్వసేవార్థం ఉపయోగించవలసింది, కావున ప్రతి ఖజానాను తమకొరకు ఎంతవరకు వినియోగించుకున్నారు మరియు ఇతరుల కోసం ఎంతవరకు వినియోగించుకుంటున్నారు అన్నది పరిశీలించుకోండి. దీనినే సంపూర్ణ స్థితి అని అంటారు. సర్వఖజానాలను ఇతరుల కోసం వినియోగించారా? మీ పురుషార్థం కొరకే జ్ఞాన ఖజానాను లేక శక్తుల ఖజానాను వినియోగిస్తున్నట్లయితే అది కూడా సంపూర్ణ స్థితి కాదు. ఇప్పుడు ఇది ఇతరుల కోసం వినియోగించే సమయం. ఇప్పటివరకు కూడా సర్వశక్తులను తమ కొరకే వినియోగిస్తున్నట్లయితే ఇతరుల కొరకు మహాదానులుగా లేక వరదానులుగా ఎప్పుడవుతారు? ఇప్పుడు ఎటువంటి అభ్యాసం చేయాలంటే, వాటిని స్వయం కొరకు వినియోగించుకోవలసిన అవసరం ఉండకూడదు. అన్ని ఖజానాలను ఇతరుల కోసం వినియోగిస్తూ ఉన్నట్లయితే మీరేమైనా ఖాళీ అయిపోతారా?

           ఏవిధంగా బాబా తమ విశ్రాంతి సమయమును ఏదైతే శరీరం కోసం అవసరమో దానిని కూడా తన కొరకు వినియోగించకుండా విశ్వకళ్యాణార్థము వినియోగిస్తూ ఉంటారో అలా సర్వశక్తులను కూడా విశ్వకళ్యాణం కొరకు వినియోగించాలే కాని తమ కొరకు కాదు. అందరూ బాబా సమానంగా అవ్వవలసినప్పుడు బాబా సమానమైన స్థితిని కూడా ధారణ చేయాలి కదా! ఇతరులకు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడే తమనుతాము సర్వ విషయాలలో సంపన్నంగా అవుతున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఇతరులను చదివించడంలో స్వయమును చదివించుకోవడం దానంతట అదే ఇమిడిపోయి ఉంటుంది. ఇప్పుడు డబుల్ అనగా స్వయం కొరకు వేరుగా, ఇతరుల కొరకు వేరుగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఒకే సమయంలో డబుల్ పని చేయండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు డబుల్ కోర్సు చేస్తారు, ఇది కూడా అంతే. సమయం సమీపంగా వస్తోంది, కావున ఇతరులకు ఇవ్వడంతో పాటు మీ కొరకు కూడా జమ చేసుకోండి. కేవలం మీ కోసమే ఉపయోగించకండి. ఇప్పటివరకు కూడా మీ కొరకే ఉపయోగించుకుంటూ, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే విశ్వమహారాజులుగా అవ్వజాలరు. లక్ష్యమైతే విశ్వమహారాజులుగా అవ్వాలి అనే ఉంది కదా!

           ప్రారంభంలో ఎప్పుడైతే జ్ఞానగంగలు వెలువడ్డారో ఆ సమయంలోని సేవ యొక్క విశేషత ఏమిటి? ఆ సమయంలో వెలువడ్డ వారసులు మరియు ఈ సమయంలో వెలువడ్డ ఆత్మలకు తేడా ఏమిటి? సేవ అయితే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. కాని, వారసులు కనిపించడం లేదు, ఎందుకు? కారణాలు విస్తారంలో అయితే ఎన్నో ఉన్నాయి, కాని మూల కారణం ఏమిటి? ఆ సమయంలో నాదీ అనేది లేదు. విశ్వకళ్యాణార్థం తమ సర్వస్వాన్నీ ఇవ్వాలి అన్న భావన ఉండేది. ఏకనామిగా మరియు ఎకానమీ వారిగా ఉండేవారు. సర్వఖజానాల ఎకానమీ ఉండేది. వేటినీ వ్యక్తం చేసేవారు కాదు. సమయము, శక్తులు ఏవైతే తీసుకున్నారో వాటిని ఇతరులకు ఇవ్వాలి అనగా మహాదానీ స్థితి ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో విశేషంగా నిమిత్తమై ఉన్నారు. కావున ఆ సమయపు స్థితికి మరియు ఈ సమయపు స్థితికి ఎంత తేడా ఉందో చూడండి! ఇప్పుడు మొదట తమ సాధనాలను గురించి ఆలోచిస్తారు, ఆ తర్వాత సేవా సాధనాలను గురించి ఆలోచిస్తారు. అనగా మొదట పరిష్కారము ఆ తర్వాత సేవ. కాని ప్రారంభంలో మొదట సేవ, ఆ తర్వాత పరిష్కారం లభించినా లభించకపోయినా ఫర్వాలేదు. లభించే పరిష్కారాన్ని బట్టి సేవ చేయడమన్నది సంకల్పమాత్రంగా కూడా ఉండేది కాదు. ఎక్కడకు వెళ్ళినా, ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎటువంటి సంబంధంలోనైనా సహనశక్తితో సేవను పెంచాలి, ఇది మహాదానీ స్థితి.

           స్వయం యొక్క త్యాగం ద్వారా ఇతరుల యొక్క భాగ్యం తయారవుతుంది. ఎక్కడైతే స్వయం యొక్క త్యాగం ఉండదో అక్కడ ఇతరుల భాగ్యం తయారవ్వదు. బాబా స్వయం యొక్క త్యాగమును చేశారు, అప్పుడే అనేక ఆత్మలైన మీ భాగ్యం తయారైంది. కావున ప్రారంభపు స్థితిలో స్వయం యొక్క సర్వసుఖాల త్యాగం ఉండేది, దాని ద్వారా ఈ భాగ్యాలు తయారవుతున్నాయి. ఇప్పుడు ఎంతగా త్యాగం చేస్తారో అంతగా ఇతరుల భాగ్యమును తయారుచేస్తున్నారు. కావుననే వారసులు గుప్తమైపోయారు. కావున ఇప్పుడు మళ్ళీ ఆ మహాదానులుగా అయ్యే సంకల్పమును లేక సదా సర్వప్రాప్తులు ఉంటూ కూడా సర్వసాధనాలు ఉంటూ కూడా సాధనాలలోకి రాకండి, సాధనలో ఉండండి. ఇప్పుడు సాధన తక్కువగా ఉంది సాధనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రారంభంలో సాధనములు తక్కువగా ఉండేవి మరియు సాధన ఎక్కువగా ఉండేది. కావున ఇప్పుడు నిరంతరము ఆ సాధనలో ఉండండి అనగా సాధనాలు ఉన్నా కూడా త్యాగవృత్తిలో ఉండండి. తద్వారా కొద్ది సమయంలోనే ఆనేక ఆత్మల భాగ్యమును తయారుచేయగల్గుతారు. బాప్ దాదా మీ అందరి చేతులలో ఇప్పుడు ఆత్మల భాగ్యరేఖను దిద్దే అథారిటీని ఇచ్చారు. కావున మీ త్యాగపు లోటు కారణంగా అనేక ఆత్మల భాగ్యపు రేఖను సంపన్నంగా చేయలేకపోవడం అనేది ఉండకూడదు. ఎంతో బాధ్యత ఉంది. ఎంతెంతగా సమయం సమీపంగా వస్తోందో అంతంతగా సంకల్పములో కూడా వ్యర్థం చేసుకోకూడదు అన్న బాధ్యత కూడా ప్రతి ఆత్మ పట్ల పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు దీనిని మీ బాల్యముగా భావించకండి. బాల్యంలో ఏది చేసినా అది మంచిగానే అనిపిస్తుంది. పిల్లల నిర్లక్ష్యం కూడా మంచిగానే అనిపిస్తుంది కాని పెద్దరికం మంచిగా అనిపించదు. అలాగే మళ్ళీ పెద్దవారి నిర్యక్ష్యం మంచిగా అనిపించదు. కావున సమయానుసారంగా మీ స్వమానమును నిలిపి ఉంచుకుంటూ బాధ్యతలను సంభాళిస్తూ ఉండండి. అర్థమైందా?

           అచ్ఛా, ఇటువంటి తండ్రిని సర్వసంబంధాలతో తమ వారిగా చేసుకునే, సదా సర్వఖజానాలను సర్వాత్మల పట్ల దానమునిచ్చే మహాదాని, వరదాని, మహాత్యాగి మరియు కోటానురెట్ల భాగ్యవాన్ ఆత్మలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments

Post a Comment