* 06-08-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"వృత్తి చంచలముగా అయ్యేందుకు కారణము - వ్రతములో తేలికతనము"
పరివర్తన భూమిలోకి వచ్చి మీ పరివర్తనను అనుభవం చేసుకుంటున్నారా? భట్టీలోకి రావడము అనగా బలహీనతలను, లోపాలను భస్మం చేయడము. బలహీనతలు సదాకాలికంగా దూరమవుతున్నాయి అని అనుభవం చేసుకుంటున్నారా? స్వయములో అంతటి ధైర్యతా శక్తిని, విల్ పవర్ ను నింపుకుంటున్నారా? ఎందుకంటే ఈ సమయపు పరివర్తన సదాకాలికమైన పరివర్తనగా అయిపోతుంది. ఏవిధంగా అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు ఆ వస్తువు రూపము, రంగు మరియు కర్తవ్యము మారిపోతుందో మళ్ళీ అది ఇంతకుముందు ఉన్న రూపంలోకి ఏ విధముగా రాజాలదో, సదాకాలికంగా దాని రూపము, రంగు, కర్తవ్యము అన్నీ మారిపోతాయి. స్వయంలో కూడా అదేవిధంగా అనుభవం చేసుకుంటున్నారా? బలహీనతల రూపము, రంగు మారుతున్నట్లుగా ఇటువంటి పరివర్తనను తీసుకువస్తున్నారా? నేను పరివర్తన అయ్యే వెళ్ళాలి అని మొట్టమొదట లోపల దృఢ సంకల్పం ఉండాలి. ఈ దృఢ సంకల్పమురూపీ అగ్నితో లోపలి పూర్తి బలహీనతలన్నీ భస్మమైపోవాలి. అగ్ని తీవ్రంగా లేకపోతే మొదటి రూపమూ ఉండదు అలాగే పరివర్తన చెందిన రూపమూ ఉండదు. మధ్యలోనే అసంపూర్ణంగా ఉండిపోతుంది. కావున మొదట ఈ శ్రేష్ఠ సంకల్పమురూపీ అగ్ని అంత తీవ్రంగా ప్రజ్వలితమై ఉందా లేక, అవును ప్రయత్నం చేస్తున్నాను, అయిపోతుందిలే అంటూ ఇటువంటి సాధారణ సంకల్పాలను చేస్తున్నారా? దీనిని తీవ్ర పురుషార్థము అని అనరు. మేము తప్పక చేసి చూపిస్తాము అని అనడమునే తీవ్ర పురుషార్థము అని అంటారు. ఈ సమయంలో ఈ భట్టీలోకి వచ్చినవారు తమ స్థితిని తీవ్ర పురుషార్థయుక్తంగా అనుభవం చేసుకుంటున్నారా? పరివర్తన భూమిలోకి రావడంతోనే తీవ్ర పురుషార్థపు లిస్ట్ లోకి వచ్చేశాము అని భావించేవారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థపు అవినాశీ ముద్రను వేయించుకున్నారా? అవినాశీ తండ్రి ద్వారా అవినాశీ ప్రాప్తిని పొందుతున్నారు కదా! తండ్రి అవినాశి అయినప్పుడు, మరి ప్రాప్తులు కూడా అవినాశి అయినప్పుడు అవినాశీ ప్రాప్తి ద్వారా మీ స్థితినేదైతే తయారుచేసుకున్నారో అది కూడా అవినాశిగా ఉండాలి కదా! కావున మీ శుభ వృత్తి ద్వారా ప్రవృత్తిని, పరిస్థితిని, ప్రకృతిని మార్చగలరా? స్వయంలో అంతటి ధైర్యమును అనుభవం చేసుకుంటున్నారా? మీ వృత్తి శ్రేష్ఠముగా ఉన్నట్లయితే దాని ముందు ప్రవృత్తి లేక పరిస్థితి ఎటువంటి యుద్ధమునూ చేయజాలదు. ఎందుకంటే నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నాలెడ్జ్ ఫుల్ ను, పవర్ ఫుల్ ను అన్న శుభవృత్తి ఉంది. మరి మీరు మీ వృత్తిని ఇంత శ్రేష్ఠముగా తయారుచేసుకున్నారా? అన్నివేళలా మీ వృత్తి శ్రేష్ఠముగా ఉందా? సాధారణ వృత్తిగా అయితే లేదు కదా అని పరిశీలించుకోండి. వృత్తిని శ్రేష్ఠంగా చేసుకునేందుకు లేక ప్రవృత్తిలో ఉంటూ ప్రవృత్తి యొక్క పరిస్థితుల నుండి నివృత్తిగా ఉండేందుకు ఏ సాధనమును ధారణ చేయవలసి ఉంటుంది? భక్తిలో సాధన చేస్తారు, ఈ జ్ఞానమార్గంలో ఉండేది సాధనము. అది ఏ సాధనము? వృత్తి చంచలంగా అవుతుంటే ఏం చేస్తారు? అసలు వృత్తి చంచలంగా అయ్యేందుకు కారణాలేమిటి?
వృత్తి చంచలంగా లేక సాధారణంగా అవ్వడానికి కారణము - మీరు రావడంతోనే ఏ వ్రతమునైతే, ప్రతిజ్ఞనైతే చేపట్టారో దాని నుండి క్రిందకు వచ్చేస్తారు. వ్రతమును భంగపర్చుకుంటారు లేక ప్రతిజ్ఞను మర్చిపోతారు. మొట్టమొదటి వ్రతము - మనసా వాచా కర్మణా పవిత్రంగా ఉంటాము అని ఈ మొట్టమొదటి వ్రతమును చేపట్టారు, ఆ తర్వాత రెండవ వ్రతము - ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని. ఈ వ్రతమును అందరూ చేపట్టారు. ఈ వ్రతమును అందరూ తీసుకున్నారు. ఎవరైతే వ్రతమును చేపట్టి మధ్యలో వదిలివేస్తారో వారి వ్రతమును భక్తిమార్గంలో కూడా చేపట్టి మధ్యలోనే వదిలివేస్తారు. మరి దీనిని ఏమంటారు? పుణ్యాత్మకు బదులుగా పాపాత్మగా అయిపోతారు. మీరు వ్రతాన్ని ఎంతవరకు చేపట్టారు. వ్రతమును సదా నిలిపి ఉంచుకుంటారు కదా! భక్తులు తమ ప్రాణం పోయినా కాని వ్రతాన్ని వదలరు. మరి మీరు రావడంతోనే వ్రతాన్ని ధారణ చేశారు. కావున సదా దీనిని స్మృతిలో ఉంచుకోండి. ఈ స్మృతి ద్వారా ఎప్పుడూ వృత్తి చంచలంగా అవ్వజాలదు. వృత్తి చంచలంగా అవ్వకపోతే ప్రవృత్తి లేక పరిస్థితి లేక ప్రకృతి యొక్క ఎటువంటి విఘ్నమునకు వశమవ్వరు, ప్రకృతిని దాసిగా, పరిస్థితిని స్వస్థితితో, ప్రవృత్తిని శుద్ధ ప్రవృత్తి యొక్క శాంపుల్ గా చేసి చూపిస్తారు. వ్రతమును నిర్లక్ష్యము చేయడం ద్వారానే వృత్తి చంచలంగా అవుతుంది. పవిత్రముగా అవ్వండి అన్న ప్రతిజ్ఞనే రాఖీ సమయంలో చేయిస్తారు కదా! కావున మొదట స్వయమునకు కంకణం కట్టుకోవాలి, అప్పుడే ఇతరులను కూడా ఈ కంకణంలో బంధించగల్గుతారు. ఎవరికైతే రాఖీని కడతారో వారు పవిత్రంగా అవుతారా లేక వ్రతమును తీసుకుంటారా? ఇంతటి ధైర్యమును కూడా ఉంచరు, దానికి కారణం ఏమిటి? మొదట రాఖీ కట్టేవారు స్వయం వ్రతములో ఉంటున్నారా? మనస్సులో ఏదైనా అపవిత్రత వచ్చినట్లయితే దానిని పూర్తి వ్రతము అని అంటారా? ఈ కారణంగా ఎంతగా రాఖీ కట్టేవారిలో లోపము ఉంటుందో అంతగా ఎవరికైతే కడతారో వారిపైన కూడా మీ పవిత్రతా ఆకర్షణ యొక్క ప్రభావము అంతే పడుతుంది. ఒక ఆచారం లాగా వీరు చెప్పే రహస్యము ఇది అని మీరు చెప్పేదానిని వింటారు, కాని వ్రతమును చేపట్టరు. అలా ఎందుకు జరుగుతుంది? దానికి మనమే కారణము అని అంటామా లేక వారి భాగ్యంలో లేదు అని అంటామా? భాగ్యమును తయారుచేసేది మీరే కదా! భాగ్యమును తయారుచేసి రండి లేక భాగ్యమును తయారుచేసుకోవాలి అనే ఎంతటి తీవ్రమైన ప్రేరణను ఇచ్చి రావాలంటే, వారు ఆకర్షితులై మీవెనుకే పరిగెడుతూ రావాలి, భాగ్యమును తయారుచేసుకోకుండా ఉండలేకపోవాలి. ఇంతటి ఆకర్షణగలవారిగా ఉన్నారు కదా! భక్తి మార్గంలో ఉన్నవారిని గూర్చి కూడా ఫలానావారు రెండు మాటలు మాట్లాడినా వారిలో ఎంతటి శక్తి ఉందంటే, ఇక అందరూ వారి వెనుక పరిగెడుతూ ఉంటారు అని అంటారు. వారితో పోల్చి చూస్తే మీరు ఎంత శ్రేష్ఠమైన ఆత్మలు! ఈ రోజుల్లోని మహాత్ములుగా పిలువబడేవారెవరైతే ఉన్నారో వారు మీ ప్రజలకు ప్రజలుగా కూడా లేరు. ఎందుకంటే వారు స్వర్గాధికారులుగా అయితే అవ్వరు కదా! మీ ప్రజలకు ప్రజలుగా ఉన్నవారు కూడా స్వర్గవాసులుగా అయితే ఉన్నారు కదా! వారు స్వర్గసుఖాలనైతే అనుభవం చేసుకుంటారు కదా! కాని వీరైతే స్వర్గంలోకి కూడా రాజాలరు. మరి మీరు ఇంతటి శ్రేష్ఠ ఆత్మలైనప్పుడు మరి అటువంటి విశేషమైన కర్తవ్యమును కూడా చేయాలి కదా! మీరు మాట్లాడే ఒక్కొక్క మాటలో ఎంతటి శక్తి ఉండాలంటే, అనుభవీ మూర్తులుగా అయి మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. మీరు మాట్లాడుతూ ఉండాలి మరియు వారు అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లోని మహాత్ములు, పండితులుగా పిలువబడే వారిలో కూడా అల్పకాలికమైన ఇంతటి శక్తి ఉన్నప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ ఒక్కొక్కరి మాటలోను ఎంతటి శక్తి ఉండాలి?
మీ ఒక్కొక్క మాటతో ఎవరికైనా అనుభవం చేయిస్తూ ఉండండి. ఎవరికైనా మీరు ఒక ఆత్మ అని మొట్టమొదటి పాఠమును చెబుతారు. ఆ మాటలతోపాటు వారికి అనుభవం కూడా చేయిస్తూ ఉండండి, ఇదే విశేషత. అలాగే భాషణ చేయడమును జనులు కూడా చేస్తూనే ఉంటారు, ఆ విధంగా మాట్లాడడం వారు కూడా చేస్తారు. కాని, అన్యులెవరూ చేయలేనిది శ్రేష్ఠ ఆత్మలైన మీరు చేయగలరు. ఆ తేడాయే ఇందులో ఉంది. కావున ఈ విశేషత ప్రాక్టికల్ లో కనిపించాలి. అది ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే స్వయములో సర్వశక్తులను ధారణ చేస్తారో అప్పుడు అది జరుగుతుంది. స్వయములో కూడా విశేషతను ధారణ చేయకపోతే ఇతరులను కూడా ధారణామూర్తులుగా చేయలేరు. కావున మీ వృత్తిని శ్రేష్ఠముగా తయారుచేసుకోండి. బాప్ దాదాల సమ్ముఖంగా ఏ వ్రతమునైతే చేపట్టారో అందులో సదా నిలిచి ఉండండి, అప్పుడిక రిజల్టు ఎలా వెలువడుతుందో చూడండి. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అన్న వ్రతమును చేపట్టాక మళ్ళీ బుద్ధి అటూ ఇటూ ఎందుకు వెళుతుంది? ఇతరుల నుండి వింటాము అన్న వ్రతమునేమన్నా చేపట్టారా? మీ నుండే వింటాము, మీతోనే మాట్లాడుతాము అన్న ఈ వ్రతమును చేపట్టాక ఇతర ఆత్మలవైపుకు అసలు చంచల వృత్తితో ఎందుకు చూస్తున్నారు లేక అటువంటివి ఎందుకు వింటున్నారు? బాబా నుండి ఏదైతే వింటారో అదే మాట్లాడాలి. ఆపై ఇతర మాటలు లేక వ్యర్థమైన మాటలు ఎలా మాట్లాడగలరు? ఇది వ్రతమును వదలడమే కదా! ఆత్మాభిమానిగా అయి ఉండే వ్రతమును చేపట్టాక అసలు మళ్ళీ దేహమును ఎందుకు చూస్తున్నారు? ఇది వ్రతమును భంగపరచడమే కదా!
అమృతవేళ నుండి ఏ వ్రతమునైతే చేపట్టామో దానిపై నడుస్తున్నామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సంకల్పం ఏం చేయాలి, వాణిలో ఏం మాట్లాడాలి, కర్మ చేస్తూ కర్మయోగీ స్థితి ఎలా ఉంటుందంటే... ఈ వ్రతమును చేపట్టారు కదా! ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉంటాము అన్న వ్రతమును చేపట్టారు కదా! ఎవరైతే కమలపుష్ప సమానంగా ఉంటారో వారు పరిస్థితులకు వశమవుతారా? వారు అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. శ్రేష్ఠ వృత్తిలో స్థితులై ఉన్నట్లయితే వాయుమండలము, వైబ్రేషన్లు మొదలైనవి అలజడిపర్చగలవా? వృత్తి ద్వారానే వాయుమండలము తయారవుతుంది. వృత్తి శ్రేష్టంగా ఉన్నట్లయితే వృత్తి యొక్క ఆధారంపై వాయుమండలమును కూడా అంత శ్రేష్ఠంగా తయారుచేయగలరు. అంతటి శక్తి ఉందా లేక వాయుమండలపు శక్తి అధికంగా ఉందా? ఎవరైనా వాయుమండలానికి వశమైనప్పుడు ఒకటేమో మనస్సులో బలహీనత వస్తుంది మరియు దానిని అక్కడే సమాప్తం చేయాలి. కాని, ఏమి చేయాలి, వాయుమండలము అలా ఉంది, వాయుమండలము కారణంగా నా వృత్తి చంచలంగా అయ్యింది అని కూడా వర్ణన చేస్తారు. ఈ మాటలు మాట్లాడినప్పుడు స్వయమును ఏమని భావిస్తారు? ఆ సమయంలో మీరు ఎటువంటి ఆత్మ? బలహీన ఆత్మగా ఉంటారు. ఆ సమయంలో మిమ్మల్ని మీరు మర్చిపోయారు. లౌకిక రీతిలో అయినా ఎవరైనా ఇలా తమను తాము మర్చిపోతారా? నేను ఎవరిని, ఎవరి సంతానమును, నా వృత్తి ఏమిటి అన్నది ఎవరైనా మర్చిపోతే అందరూ నవ్వుతారు కదా! ఆ సమయంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను స్వయమును, నా తండ్రిని, నా పొజిషన్ ను మర్చిపోయానా అని పరిశీలించుకోండి. ఈ వ్రతమును ఇప్పుడు పక్కా చేసుకోండి, అప్పుడిక సదాకాలికమైన విజయులుగా ఎలా అవుతారో పరిశీలించుకోండి అప్పుడిక ఎటువంటి విషయము చలింపచేయజాలదు. నేను ఏయే ప్రతిజ్ఞలను బాబాతో చేశాను అని, ఏ వ్రతమును చేపట్టాను అని పదే పదే మీ బుద్ధిలో రివైజ్ చేసుకోండి అప్పుడిక ఈ వ్రతము రిఫ్రెష్ అవుతుంది, స్మృతిలో ఉంటుంది మరియు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సామర్థ్యత ఉంటుంది. కావున ఈ విధంగా స్వయమును సమర్థంగా చేసుకోండి. నేను నెంబర్ వన్ లోకి రావాలి అన్న లక్ష్యమును ఉంచాలి. నెంబర్ వన్ గ్రూప్ యొక్క స్మృతి చిహ్నమును వరదాన భూమిలో ఏమి ఇచ్చి వెళతారు? ఆ గుర్తుతో నెంబరు దానంతట అదే నిరూపింపబడుతుంది. ఇటువంటి స్మృతి చిహ్నమును ఇచ్చి వెళ్ళండి. స్మృతి చిహ్నము ద్వారా వారి స్మృతి కలుగుతుంది కదా! ఇటువంటి ఉదాహరణామూర్తులుగా అయ్యేందుకు విశేషమైన అద్భుతమును చేయవలసి ఉంటుంది. ఏదైనా అద్భుత విషయం చేసి చూపించినప్పుడే స్మృతిచిహ్నము ఉంటుంది కదా! ఈ గ్రూపు ఏ స్మృతిచిహ్నమును నిలుపుకొని వెళుతుందో చూద్దాము. ఆ చిహ్నము కూడా అవినాశిగా ఉండాలి. ఇప్పుడు స్వయములో సర్వశక్తుల ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు కదా?
ధారణామూర్తుల పరీక్షలు కూడా ఇక్కడే జరుగుతాయి కదా! ప్రత్యక్షమైన పరీక్షలు పరిస్థితులను ఎదుర్కోవడము. వాటిని మీరు అక్కడకు వెళ్ళి పరీక్షను ఇవ్వవలసి ఉంటుంది. దాని రిజల్ట్ కూడా ఇక్కడకు వస్తుంది. వీరిలో ఎంతో పరివర్తన వచ్చింది అని అందరూ అనుభవం చేసుకునే విధంగా ఇటువంటి ప్రాక్టికల్ పరీక్షను ఇవ్వవలసి ఉంటుంది. ధైర్యమును ఉంచడం ద్వారా సహాయం దానంతట అదే లభిస్తుంది. ధైర్యంలో కొద్దిగా లోపం ఉన్నా సహాయంలో కూడా లోపం కనిపిస్తుంది. కొంతమంది సహాయం లభిస్తే చేసి చూపిస్తాము అని భావిస్తారు. కాని సహాయము ధైర్యమును ఉంచేవారికి మాత్రమే లభిస్తుంది. మొదట పిల్లలు ధైర్యమును ఉంచాలి, ఆ తర్వాత బాబా సహాయం చేస్తారు. ధైర్యమును ధారణ చేసినట్లయితే మీరు ఒక్క రెట్టు ధైర్యమును ఉంచినట్లయితే అనేక రెట్లు బాబా సహాయం చేస్తారు. మీరు ఒక్క అడుగు కూడా వేయకపోతే బాబా వంద అడుగులు వేయరు. ఎవరు చేస్తే వారు పొందుతారు. ధైర్యమును ఉంచడము అనగా చేయడము. బాబా, మీరు సహాయం చేస్తే అవుతుంది అని కేవలం బాబా పైన మోపడం కాదు. ఇది పురుషార్థ హీనుల లక్షణము. తాను సహాయం చేయాలి అన్నది బాప్ దాదాకు తెలియదా? వారు ఏమైనా మీరు అనడం వల్ల చేస్తారా? ఎవరైతే చెప్పడం ద్వారా చేస్తారో వారిని ఏమంటారు? ఎవరైతే స్వయం దాతగా అయి చేస్తున్నారో వారికి చెప్పిచేయించడము వారిని అవమానపర్చడం కాదా? సర్వస్వమును ఇచ్చే దాతకు మీరు ఐదు పైసలు ఇవ్వడం ఏమిటి? మీరు సహాయం చేయాలి అని బాప్ దాదాకు కూడా శిక్షణను గుర్తు చేయిస్తున్నారా? ఈ సంకల్పాన్ని ఎప్పుడూ ఉంచకండి. ఇదైతే స్వతహాగానే ప్రాప్తమవుతుంది. ఎప్పుడైతే స్వయమును వారసులుగా భావిస్తారో అప్పుడు వారసులు వారసత్వానికి అధికారులుగా స్వతహాగానే అయిపోతారు అడగవలసిన అవసరము ఉండదు. లౌకికంలో వారికి స్వార్థము ఉంటుంది, కావుననే అడుగుతారు. ఇక్కడ తమ స్వార్థమే లేనప్పుడు ఉంచుకొని ఏమి చేస్తారు? కావున ఈ సంకల్పమును ఉంచడం కూడా బలహీనతయే. పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి. బాబా మన తోడుగా ఉన్నారు, బాబా సహాయకులుగా ఉన్నారు, నిశ్చయబుద్ధి విజయంతి... ఈ విధంగా సదా స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి అడుగు వేసినట్లయితే విజయము మీ కంఠహారంగా అయిపోతుంది. ఎవరి కంఠములోనైతే విజయమాల పడుతుందో వారే విజయమాలలోని మణులుగా అవుతారు. ఇప్పుడు విజయులుగా అవ్వకపోతే విజయమాలలోకి కూడా రారు. కావున దీనిని సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి అడుగు వేసినట్లయితే సదా సిద్ధీస్వరూపులుగా అయిపోతారు. పురుషార్థపు విధి యథార్థంగా ఉన్నట్లయితే ఏదైనా సంకల్పము, మాట లేక కర్మ సిద్ధించకపోవడము అన్నది జరుగజాలదు. ఏ కర్మనైనా విధిపూర్వకంగా చేయడం ద్వారానే సిద్ధి లభిస్తుంది. విధిపూర్వకంగా చేయకపోతే సిద్ధి కూడా లభించదు. విధిపూర్వకంగా చేసినదానికి ప్రత్యక్షఫలము - సిద్ధి తప్పక లభిస్తుంది. అచ్ఛా!
Comments
Post a Comment