06-05-1971 అవ్యక్త మురళి

 * 06-05-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“బాప్ దాదాలకు విశేష అలంకారమైన 'కంటి రత్నాలు'గా పొజిషన్ లో ఉన్నట్లయితే అపోజిషన్ సమాప్తము."

           ఈరోజు రత్నాకరుడైన బాబా తమ రత్నాలను చూసి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్క రత్నము యధాశక్తిగా పురుషార్థము చేసి ముందుకు వెళుతున్నారని గమనించారు. ప్రతి ఒక్కరికీ మేము ఎటువంటి రత్నాలము అని తెలుసా? ఎన్ని రకాల రత్నాలు ఉంటాయి? (8రత్నాలు) మీరు ఏ నంబరు రత్నము? వజ్రంతో ఉంటూ వజ్ర సమానంగా అవ్వలేదా? అందరూ రత్నాలే. మొదటి రత్నమును కంటి రత్నము అని అంటారు. మరి అందరూ కంటి రత్నాలు కాదా? ఒకటి కంటి రత్నాలు, రెండవది - కంఠహారంలోని రత్నాలు. మూడవ స్టేజి ఏమిటో తెలుసా? మూడవది, చేతి కంకణంలోని రత్నాలు. అన్నిటికన్నా మొదటిది కంటి రత్నము. అలా ఎవరు అవుతారు? ఎవరి నయనాలలో అయితే బాబా తప్ప మరేదీ కనిపిస్తూ కూడా కనిపించకుండా ఉంటుందో వారు కంటి రత్నాలు. ఎవరైతే తమ నోటితో జ్ఞానాన్ని వినిపిస్తారు కానీ మొదటి నంబరు వారిలా తండ్రి స్మృతి, తండ్రి ముఖమే కనిపించాలి అన్నదానిలో కొంచెం తక్కువగా ఉంటారో వారు కంఠం ద్వారా సేవను చేస్తారు. అందుకే కంఠహారంలోని రత్నాలుగా అవుతారు. మూడవ నంబరుగా ఎవరైతే చేతి కంకణంలోని రత్నాలుగా అవుతారో వారి విశేషత ఏమిటి? ఏదో ఒక రూపంలో సహయోగులుగా అవుతారు. సహయోగులుగా అయినందుకు గుర్తుగా చేతి కంకణంలోని రత్నాలుగా అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి - నేను ఎటువంటి రత్నమును? మొదటి నంబరా, రెండవ నంబరా లేక మూడవ నంబరా? అందరూ రత్నాలే మరియు అందరూ బాప్ దాదాకు అలంకారమే. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రత్నము? కంటి రత్నాల విశేషత ఏదైతే వినిపించామో అందులో పాస్ విత్ హానర్‌గా ఉన్నారా? ఆశావాదులలో కూడా నంబరు ఉంటుంది కదా. కనుక, మేము బాప్ దాదాల కంటి రత్నాలము అని గుర్తుంచుకోండి. అప్పుడు మీ నయనాలలో మరియు దృష్టిలో మరే వస్తువు ఇమడజాలదు. నడుస్తూ-తిరుగుతూ, తింటూ-త్రాగుతూ మీ నయనాలలో ఏమి కనిపించాలి? తండ్రి మూర్తి మరియు ముఖము. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎటువంటి కంప్లెయింట్ చెయ్యరు. మిమ్మల్ని రకరకాల కష్టాలు వ్యాకులపరుస్తూ ఉంటాయి. వ్యాకులతతో ఉన్న కారణంగా మీ గౌరవం నుండి మీరు దూరమవుతారు. మరి పరేషాన్ అంటే అర్థమేమిటి? తమ షాన్ (గౌరవం) ఏదైతే ఉందో దాని నుండి దూరమైన కారణంగా పరేషాన్(వ్యాకులంగా) అవుతారు. ఒకవేళ మీ గౌరవంలో స్థితులై ఉన్నట్లయితే పరేషాన్ అవ్వరు. కనుక, సర్వ పరేషాన్లను తొలగించడానికి కేవలం మాటలోని అర్థంలో మునిగిపోండి అనగా తమ గౌరవంలో స్థితులవ్వండి. అప్పుడు గౌరవం నుండి ప్రతిష్ఠ సదా లభిస్తుంది. అందుకే గౌరవ ప్రతిష్ఠలు అని అంటారు. కనుక మీ గౌరవాన్ని తెలుసుకోండి. ఎంతగా తమ గౌరవంలో స్థితులవుతారో అంతగా ప్రతిష్ఠ లభిస్తుంది, మీ గౌరవం ఏమిటో తెలుసా! ఎంతటి గొప్ప గౌరవము? లౌకికంలో కూడా గౌరవం కలిగినవారు తమ గౌరవానికి భంగం కలిగే పనిని చెయ్యరు. మీ గౌరవాన్ని గుర్తుంచుకున్నట్లయితే గొప్పగా ఉంటారు, పరేషాన్ అవ్వరు. మరి వ్యాకులతను తొలగించడానికి ఇది సహజమైన యుక్తి కాదా? ఏ చెడు(బురాయీ)నైనా సమాప్తం చెయ్యాలంటే బాబా మహిమను (బడాయీ) చెయ్యండి. కేవలం ఒక్క అక్షరం తేడాతో ఎంత మార్పు వచ్చిందో చూడండి. కేవలం ఒక్క అక్షరాన్ని మార్చారు - బురాయీ  మరియు బడాయీ. ఇదైతే 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు కూడా చెయ్యగలడు. సదా అతిపెద్ద తండ్రి గురించి గొప్పగా వినిపించండి. ఇందులో పూర్తి చదువుంతా వచ్చేస్తుంది. ఇలా బాబా గొప్పను చెప్పడం వలన ఏమవుతుంది? యుద్ధం ఆగిపోతుంది. మాయతో యుద్ధం చేసి చేసి అలసిపోయారు కదా. బాబా మహిమను(బడాయీ) చేసినట్లయితే యుద్ధంతో (లడాయీ) అలసిపోరు. బాబా గుణాలను గానం చేస్తూ సంతోషంలో ఉన్నట్లయితే యుద్ధం కూడా ఒక ఆటలా కనిపిస్తుంది, ఆటలో ఆనందం ఉంటుంది కదా. ఎవరైతే యుద్ధాన్ని ఆటగా చూస్తారో, ఇటువంటి స్థితిలో ఉండేవారి గుర్తు ఏమిటి? సంతోషము. సదా సంతోషంగా ఉండేవారిని మాయ ఎప్పుడూ ఏ రూపంలోనూ ఆకర్షించలేదు. కావున మాయ ఆకర్షణ నుండి రక్షింపబడటానికి ఒకటి, సదా మీ గౌరవంలో ఉండండి, రెండు, మాయను ఆటగా భావించి సదా ఆటలో సంతోషంగా ఉండండి. కేవలం ఈ రెండు విషయాలు గుర్తున్నట్లయితే ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా అయిపోతుంది. ఎలా అయితే సాకారంలో అనుభవం చేసుకున్నారో - ఎలా ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా అయ్యిందో తెలుసు కదా. అలాగే మీ అందరి ప్రతి కర్మ సృతి చిహ్నంగా అవ్వాలి, ఇందు కోసం రెండు విషయాలను గుర్తుంచుకోండి - ఆధారమూర్తి మరియు ఉద్ధారమూర్తి. ఈ రెండు విషయాలను గుర్తుంచుకున్నట్లయితే ప్రతి కర్మ స్మృతిచిహ్నంగా అవుతుంది. ఎప్పుడైతే స్వయాన్ని సదా విశ్వ పరివర్తనకు ఆధారమూర్తులుగా భావిస్తారో అప్పుడు ప్రతి కర్మ ఉన్నతంగా జరుగుతుంది. దీనితో పాటు ఉదారచిత్తముగా అనగా సర్వాత్మల పట్ల సదా కళ్యాణ భావన నిండిన దృష్టి-వృత్తిలో ఉన్నట్లయితే ప్రతి కర్మ శ్రేష్ఠంగా అవుతుంది. కావున, తమ ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా అయ్యే యోగ్యమైన విధంగా చెయ్యండి. దీనిని అనుసరించడం కష్టమా? (మ్యూజియమ్ సేవకు పార్టీ వెళుతోంది) త్యాగానికి సదా భాగ్యం తయారవుతుంది. ఎవరైతే త్యాగం చేస్తారో వారికి భాగ్యం స్వతహాగా లభిస్తుంది. అందుకే అతి పెద్ద త్యాగం ఏదైతే చేస్తున్నారో అందుకు అతి పెద్ద భాగ్యం జమ అవుతుంది. అందుకే సేవకు సంతోషంగా వెళ్ళండి.

Comments