05-03-1971 అవ్యక్త మురళి

 * 05-03-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“భట్టీ యొక్క అలౌకిక ముద్ర”

           ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకము నుండి రెండు విషయాలను చూస్తున్నారు. అవి ఏవి? ఒకటి భాగ్యము, రెండవది సౌభాగ్యము. రెండు విషయాలనూ చూస్తున్నారు. భట్టీలోకి వచ్చి మీ భాగ్యము మరియు సౌభాగ్యములను మంచిరీతిలో చూసుకోగలరా, తెలుసుకోగలరా? మీ మస్తకముపై మెరుస్తున్న భాగ్య సితారను చూడగలరా? భట్టీలో ఈ దర్పణము లభించింది, ఈ దర్పణము ద్వారా మీ భాగ్యమును మరియు సౌభాగ్యమును చూడగలరా? భట్టీలోకి రావటము అనగా రెండు విషయాలను ప్రాప్తింపచేసుకోవటము. ఆ రెండు విషయాలు ఏవి? ఈరోజు భట్టిలోని వారిని కలిసేందుకు వచ్చాము కదా! కావున వారి పరీక్షను  తీసుకుందాము. చెప్పండి, ముఖ్యమైన ఏ రెండు విషయాలు లభిస్తాయి? (ప్రతి ఒక్కరూ భిన్న, చిన్న విషయాలను వినిపించారు) ప్రతి ఒక్కరూ వేటినైతే వినిపించారో చాలా బాగా వినిపించారు, ఎందుకంటే మాతలు ఈ మాత్రం వినిపించే యోగ్యులుగా తయారైనా చాలా సర్వీస్ చెయ్యగలరు. కావున భట్టీ నుండి ముఖ్యమైన ఈ రెండు విషయాలు లభించాయి, మరియు వాటిని మీతోటి తీసుకొనే వెళ్ళాలి - ఒకటైతే మిమ్మల్ని మీరు చూసుకొనే దర్పణము, మరియు రెండవ విషయము యోగము అనగా స్మృతి గోళము. లైటు గోళమును ఎప్పుడూ తోడుగా ఉంచుకొనేవారి చేతిలోకి ఏ గోళము వస్తుంది? అది మీ స్మృతిచిహ్న చిత్రము. కృష్ణుని చిత్రంలో సృష్టి గోళము ఉంది కదా. కావున లైట్ గోళము అనగా లైట్ చిత్రము లోపల ఎల్లప్పుడూ ఉండటము. లైట్ గోళముగా అవ్వటం ద్వారానే విశ్వరాజ్యము యొక్క గోళమును తీసుకోగలరు. కావున ఇప్పుడు ఉన్నది లైట్ గోళము. భవిష్యత్తులో ఉంటుంది - ఈ రాజ్య గోళము. కావున భట్టీ నుండి ఒకటేమో దర్పణము లభించింది మరియు రెండవది - స్మృతియాత్రను నిరంతరము శ్రేష్ఠముగా తయారుచేసుకొనేందుకు లైట్ గోళపు కానుక లభించింది. ఈ రెండు కానుకలను తోడుగా తీసుకొని వెళ్ళాలి, ఇక్కడే వదిలి వెళ్ళకూడదు. రెండు కానుకలనూ తోడుగా తీసుకొని వెళ్ళాలి మరియు ఎల్లప్పుడూ తోడుగా ఉంచుకొన్నట్లయితే తరువాత ఎలా తయారవుతారు? సత్యం శివం సుందరం అని తండ్రి మహిమను గూర్చి ఒక పాటను తయారుచేసారు కదా, అలా మీరందరు కూడా మాస్టర్ సత్యం శివం సుందరంలుగా అయిపోతారు. ఈ దర్పణము ద్వారా సత్యము మరియు అసలైన సుందరతల సాక్షాత్కారము జరుగుతుంది. మరి మీ ముఖాన్ని ఆవిధంగా తయారు చేసుకున్నారా? ఇందుకొరకే భట్టీలోకి వచ్చారు కదా. లౌకికత్వమును ఇప్పుడు భట్టీలో స్వాహా చేసారా? ఎటువంటి లౌకిక వృత్తి, దృష్టి, సంబంధపు స్మృతి, లౌకిక మర్యాద, లౌకిక పద్ధతులకు వశమై అలౌకిక రీతి మరియు ప్రీతినైతే మర్చిపోవటం లేదు కదా! అలౌకిక ప్రీతి మరియు అలౌకిక పద్ధతుల స్టాంపును మరియు దృఢమైన ముద్రను వేసుకొన్నారా? దానిని తొలగించేందుకు ఎవరు ఎంతగా ప్రయత్నము చేసినా కూడా తొలగిపోజాలదు. ఇటువంటి ముద్రను ఎవరైతే తమకు తాము వేసుకొన్నారో వారు చేతులెత్తండి. చూడండి, లౌకిక పద్ధతులు, అలవాట్ల పరీక్షలు చాలా కఠినంగా వస్తాయి. కొందరు చేతులెత్తలేదు. మేము మా సేఫ్టీని ఉంచుకుంటాము అని భావిస్తున్నారు. కానీ, ఎవరు ఎంతగా ధైర్యమును ఉంచుతారో అంతగా సహాయము లభిస్తుంది, సేఫ్టీ ఇందులోనే ఉంది. మొదట్లోనే మీలో సంశయబుద్ధి ఉన్నట్లయితే ఓటమి కలుగుతుంది. ఏమో తెలియదు, మేము ఫెయిల్ అయిపోతామేమో అన్న సంశయాన్ని కూడా మీలో ఎందుకు ఉంచుకుంటారు? మేము విజయమును ప్రాప్తి చేసుకొనే చూపిస్తాము అని ఎందుకు ఆలోచించరు? మీరు విజయీ రత్నాలు కదా! కావున ఎప్పుడూ పురుషార్థములో మిమ్మల్ని మీరు సంశయబుద్ధిగా తయారు చేసుకోకూడదు. సంశయబుద్ధిగా ఉండటం వలననే ఓటమి కలుగుతుంది. మీ సంశయ సంకల్పమే మాయాజీతులుగా తయారవ్వనివ్వదు. అచ్ఛా!

           మెజారిటీవారు విజయీ రత్నాలు. విజయతిలకాన్ని కూడా దిద్దించుకొనే వెళ్తున్నారు కదా! విజయము మా జన్మసిద్ధ అధికారము అన్నదానినే ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకొని అడుగు వేస్తారు. అధికారిగా అయ్యి కర్మ చెయ్యటం ద్వారా విజయము అనగా సఫలత యొక్క అధికారము తప్పక ప్రాప్తిస్తుంది. ఇందులో సంకల్పము చేసే ఆవశ్యకతయే లేదు. ఏమో తెలియదు, విజయము లభిస్తుందో, లేదో అని స్వప్నములో కూడా ఎప్పుడూ ఇటువంటి సంకల్పము రాకూడదు. మాస్టర్ జ్ఞానసంపన్నుల నోటి నుండి తెలియదు అన్న మాట వెలువడకూడదు. సృష్టి ఆది-మధ్య అంత్యమములను, మూడు కాలాలను తెలుసుకున్నారు, మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా అయిపోయారు, కావున ఇటువంటి మాస్టర్ జ్ఞానసంపన్నుల నోటి నుండి తెలియదు అన్న మాట వెలువడజాలదు. వారికైతే అన్నీ తెలుసు. ఇది అజ్ఞానుల భాష, జ్ఞానుల భాష కాదు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా కూడా తప్పు పని చేస్తున్నాను అని జ్ఞానము ఆధారముతో తెలిసిపోతుంది. తెలుస్తుంది కదా! ఇది అవుతుందో, లేదో తెలియదు... ఇలా అనటము బ్రాహ్మణుల భాష కాదు. కావున 21 జన్మలు ఈ ముద్ర దృఢంగా, అవినాశిగా ఉండేవిధంగా భట్టీ నుండి ఈ ముద్రను గట్టిగా వేయించుకొని వెళ్ళాలి. మరి భట్టీ యొక్క రెండు కానుకలనూ అందరూ తమవద్ద ఉంచుకొన్నారా? ఇప్పుడు భట్టీ నుండి వెళ్ళి ఏం చేస్తారు? స్వయమును పరివర్తన చేసుకొనేందుకే భట్టీకి వచ్చారు కదా! కావున ఎవరు ఎంతగా స్వయమును పరివర్తనలోకి తీసుకురాగలరో, వారు అంతగానే ఇతరులను కూడా పరివర్తనలోకి తీసుకురాగలరు. పరివర్తనలోకి తక్కువగా వస్తున్నారు అని ఒకవేళ మీ సర్వీస్ లో గమనించినట్లయితే, ఏ దర్పణమునైతే తీసుకొని వెళ్తున్నారో అందులో నన్ను నేను పరివర్తన చేసుకోవటంలో నాకు అంత శక్తి వచ్చిందా అని చూసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకొనేందుకు శక్తి తక్కువగా ఉన్నట్లయితే ఇతరులను కూడా అంతగానే పరివర్తనలోకి తీసుకురాగలరు. కావున రెండు విషయాలను గుర్తు ఉంచుకోవాలి. ఒకటేమో, ప్రతి విషయములో పరివర్తన అవ్వాలి. లౌకికము నుండి అలౌకికములోకి రావటము, రెండవది, పరిపక్వతలోకి రావటము. ఒకవేళ పరిపక్వత లేనట్లయితే కూడా సఫలత ఉండదు. కావున పరివర్తనలోకి కూడా రావాలి మరియు తమలో పరిపక్వత అనగా దృఢత్వమును కూడా తీసుకురావాలి. కావున ప్రవృత్తిలో ఉంటూ కార్యమును చేసే సమయములో ఈ రెండు ముఖ్యమైన విషయాలను గుర్తు ఉంచుకోవాలి. ఒకవేళ రెండు విషయాలనూ గుర్తు ఉంచుకున్నట్లయితే విజయము నిశ్చయము. సహజ విషయాన్ని వినిపించాము కదా! మాతలకు సహజ విషయాలు కావాలి కదా! ఎలాగూ మాతలు అలంకరణ కారణంగా దర్పణంలో చూస్తూనే ఉంటారు. కావున బాప్ దాదా కూడా అదే పనిని ఇస్తారు. అచ్ఛా!

           ఈ భట్టి మధువనపు అనంతమైన భట్టీ, కావున మీ ప్రవృత్తిలో కూడా ఈ అనంతమైన భట్టీని మోడల్ రూపముగా భావించి నడుచుకోవాలి. ఏ వస్తువు మోడల్ (నమూనా)నైనా చిన్నదిగానే తయారుచెయ్యటం జరుగుతుంది. ఏవిధంగా ఇక్కడ భట్టీ చేసి వెళ్తున్నారో, అలాగే మోడల్ రూపముగా మీ ప్రవృత్తిని కూడా తయారుచేసుకోవాలి. అప్పుడేమౌతుంది? భట్టీలోని ఆ విషయాలే, భట్టీలోని ధారణ, భట్టీ దినచర్య అన్నింటినీ అలాగే నిర్వహించగలరు కావున ప్రవృత్తిలోకి వచ్చి మీ వృత్తిని భట్టీలాగా ఉంచుకోవాలి. వృత్తిని మార్చవద్దు. ఏవిధంగా ఇక్కడ భట్టీలో ఉన్నతమైన వృత్తి ఉంటుందో, అటువంటి ఉన్నత వృత్తినే ప్రవృత్తిలో కూడా ఉంచాలి. వృత్తిని మార్చుకున్నట్లయితే తరువాత ప్రవృత్తిలోని పరిస్థితులు స్థితిని పైకీ క్రిందకూ చేస్తాయి. కానీ ఒకవేళ వృత్తిని అలాగే ఉన్నతంగా ఉంచుకున్నట్లయితే ప్రవృత్తిలో రాబోయే అనేక పరిస్థితులు మీ స్థితిని పైకీ క్రిందకూ చెయ్యజాలవు. అర్థమైందా! కావున శ్రేష్ఠ వృత్తిని తోడుగా తీసుకొని వెళ్ళాలి, విజయము ఉండనే ఉంది అని అప్పుడు చూడాలి. మాతలపై అందరికీ చాలా ఎక్కువ స్నేహము ఉంది, ఎందుకంటే మాతలు చాలా దుఃఖమును సహించారు. కావున పిలిచింది కూడా ఎక్కువగా మాతలే. కావున చాలా దుఃఖమును సహనము చేసిన కారణంగా, దెబ్బలను సహించిన కారణంగా, అలసిపోయి ఉన్న కారణంగా తండ్రి స్నేహముతో పాదాలను ఒత్తుతారు. మాతల కాళ్ళను ఒత్తాడు అని గాయనము కూడా ఉంది కదా! స్థూలమైన పాదాలేమీ కాదు, కానీ మాతల విశేష స్నేహరూపీ పాదాలను ఒత్తుతారు. వీరికి స్నేహము మరియు సాహసమును ఇవ్వాలి. కేవలము స్నేహాన్ని గుర్తు ఉంచుకోవద్దు, కానీ మీకు ఇచ్చిన సాహసాన్నికూడా గుర్తు ఉంచుకోవాలి. అచ్ఛా!

           భట్టీ యొక్క మొత్తము చదువు మరియు శిక్షణనేదైతే తీసుకున్నారో దాని సారాన్ని మూడు మాటలలో గుర్తు ఉంచుకోవాలి. ఆ మూడు మాటలు ఏవి? తోడ్ నా, మోడ్ నా, జోడ్ నా(తెంచాలి, మలచుకోవాలి, జోడించాలి). కర్మబంధనాలను తెంచడము నేర్చుకున్నారు కదా! మలచుకోవటమును కూడా నేర్చుకున్నారు. మీ సంస్కారాలను, స్వభావమును మలచుకోవటమును కూడా నేర్చుకున్నారు మరియు జోడించటమును కూడా నేర్చుకున్నారు, కావున ఈ మూడు మాటలను గుర్తు ఉంచుకోవాలి మరియు తెంచుకుంటూ ఉన్నానా? మలచుకుంటూ ఉన్నానా? మరియు జోడిస్తూ కూడా ఉన్నానా అని స్వయాన్ని ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలి. మూడింటిలో ఎటువంటి లోపమూ ఉండకూడదు. అప్పుడిక త్వరగా సంపూర్ణమైపోతారు. ఈ గ్రూపుకు ముఖ్యంగా ఈ స్మృతి తిలకాన్ని ఇస్తున్నారు. తిలకము స్మృతికి గుర్తు కదా! ఈ కనులతో వినాశీ వస్తువులు వేటినైతే చూస్తారో వాటిని చూస్తున్నా కూడా మీ క్రొత్త సంబంధము, క్రొత్త సృష్టినే చూస్తూ ఉండాలి అన్నదానిని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. ఆ కన్నుల ద్వారా ఏ వినాశీ వస్తువులైతే కనిపిస్తున్నాయో వాటిలో వినాశనపు స్మృతి ఉండాలి. ఈ స్మృతి తిలకమును ఈ గ్రూపుకు ఇస్తున్నాము. మళ్ళీ ఏ విషయములోనూ ఓటమిని పొందరు. ఎందుకంటే చూసేదే వినాశీ వస్తువులను, కావున తమను విజయులుగా తయారుచేసుకొనేందుకు ప్రతిరోజు అమృతవేళ ఈ స్మృతి తిలకము స్వయమునకు దిద్దుకోవాలి. అమాయకమైన మాతలు. ఇదే మాతలు ఒక వేళ మైదానములోకి వచ్చినట్లయితే ఈ రోజు ఎవరైతే తమను తాము సింహంగా భావిస్తారో వారే మేకలుగా అయ్యి మీ పాదాల వద్దకు వచ్చేస్తారు. ఎందుకంటే ఏ విషయములో అయితే వారు బలహీనంగా మరియు పిరికిగా ఉన్నారో ఆ విషయానికి మీరు ప్రత్యక్ష ప్రమాణము. మీ ప్రత్యక్ష ప్రమాణమును చూసి వారు సిగ్గుపడతారు. కావున మేకలుగా అయిపోయినట్లే కదా! ఒక్క క్షణములో సింహాన్ని మేకగా చెయ్యగల ఇంతటి శ్రేష్ఠ సేవను మాతలు చెయ్యగలరు. ఒక్క క్షణములో సింహాన్ని మేకగా మార్చగలరు. అటువంటి ఇంద్రజాలికులు మీరు! ఇంద్రజాలముతో సింహాన్ని మేకగా, మేకను సింహంగా మారుస్తారు కదా! మాతలైన మీరు కూడా అటువంటి ఇంద్రజాలమును చూపించగలరు. కేవలము మీరు సింహాలైనట్లయితే ఆ సింహము మేకగా అవుతుంది. కావున అంతిమ ధర్మయుద్ధమునేదైతే చూపించారో, అది పెద్ద శబ్దముగా రావాలి. మీ ఈ సేవ ద్వారా సింహము మేకగా అయిపోతుంది, తరువాత వారి ఫాలోయర్స్ అయితే వెనక వెనక ఉండనే ఉన్నారు. కేవలము ఒక్క సింహాన్నయినా కూడా మేకగా చేసినట్లయితే అనేక సింహాలు వలలోకి వచ్చేస్తాయి. కావున మాతలు ఇంతటి ఉన్నతమైన సేవ కొరకు సిద్ధముగా ఉండాలి. ఒకవేళ ఇంతటి శక్తిశాలీ గుంపును ఎదురించినట్లయితే వారు నిలవగలరా! చెప్పండి. ఎదిరించేందుకు ధైర్యము కావాలి. ఇప్పుడు ప్రాక్టికల్ లో పరీక్షలను దాటాలి. ఒకటి థియరీ పరీక్షగా ఉంటే, రెండోది ప్రాక్టికల్ పరీక్షగా ఉంటుంది. థియరీలో అయితే పాస్ అయ్యారు, ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్షలో పాస్ అవ్వాలి. శక్తులు ధైర్యము చేస్తే సర్వశక్తివంతుడు సహాయము చేస్తారు. ఇదైతే ఎల్లప్పుడూ గుర్తు ఉంది కదా. ఇప్పుడు కేవలము రిటర్న్ చెయ్యాలి. వీరందరూ పులులు! పులులుగా ఉన్నవారు ఎప్పుడూ ఎవ్వరికీ భయపడరు, నిర్బయులుగా ఉంటారు. ఏమౌతుందో తెలియదు అనటం కూడా భయం కాదా? దీని నుండి కూడా నిర్బయులుగా ఉండాలి. అటువంటి పులులుగా తయారయ్యారా?(అవుతాము) ఎప్పుడు? ఇదైతే మొదటి రోజు, భట్టిలోకి వచ్చారు. భట్టిలోకి రావటము అనగా మారటము. అర్థమైందా! పరివర్తన సమారోహమును జరుపుకుంటున్నారు కదా! బాప్ దాదా కూడా పరివర్తన సమారోహములోకి వచ్చారు. ఈ రోజు ఫైనల్ ముద్రను వేసుకోవాలి, తరువాత ఈ పరివర్తనను మరిచిపోకూడదు. ప్రతి ఒక్కరూ తమలో ఏదో ఒక విశేషతను నింపుకోవాలి. ఏదైనా ఒక సబ్జెక్టుల్లో నెంబర్ వన్ గా తప్పకుండా అవ్వాలి. అవ్వటమైతే అన్నింటిలోనూ అవ్వాలి. ఒకవేళ తయారవ్వలేకపోతే ఏదో ఒక సబ్జెక్టులో విశేషంగా నెంబర్ వన్ గా స్వయాన్ని తప్పక తయారుచేసుకోవాలి. ఇక్కడ నుండి వెళ్ళి ఇతర సర్వీసులలో సహాయకులుగా అయ్యేందుకు ఏదైతే చెప్పామో దాని ప్లానును తయారుచేసారా? ఏ ప్లానునైతే తయారుచేస్తారో దాని ప్రమాణంగా మళ్ళీ సిద్ధంగా కూడా తప్పక ఉండాలి. విఘ్నములైతే వస్తాయి, కానీ ఎప్పుడైతే అవసరమైన విషయంగా భావించటం జరిగిందో దాని ఏర్పాట్లు కూడా చెయ్యటం జరుగుతుంది. ఏవిధంగా మీ ప్రవృత్తిలో చాలా ఆవశ్యకమైన విషయాలు ఎదురుగా వచ్చినప్పుడు, ఏర్పాట్లను చేస్తారు కదా! ఈవిధంగా మిమ్మల్ని స్వతంత్రులుగా తయారుచేసుకొనేందుకు కూడా ఏదో ఒక ఏర్పాటును చెయ్యండి. ఎవరినైనా సహచరులుగా చేసుకోండి. పరస్పరములో ఒకరిద్దరు దైవీ పరివారమువారిని సహయోగులుగా తయారుచేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పరస్పరము స్నేహమును ఇచ్చి సహయోగులుగా చేసుకుంటారో అప్పుడే తయారుచేసుకుంటారు. ఎలా తమ బంధనములను తేలికగా చేసుకోవచ్చు అన్నదానికి ప్లాన్ చేసుకోవాలి. కొంతమంది చతురులు ఉంటారు, వారు తమ బంధనాలను వదిలించుకొనేందుకు యుక్తిని రచిస్తారు. ఏర్పాట్లు ఉంటే వెళ్ళగలను అని కాదు. ఏర్పాట్లను మీకు మీరు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు స్వతంత్రులుగా చేసుకోవాలి, ఇతరులు చెయ్యరు. యోగయుక్తులై అటువంటి ప్లానును ఆలోచించటం ద్వారా కోరిక పూర్తి అయ్యేందుకు ఏర్పాటు కూడా లభించేస్తుంది. కేవలము నిశ్చయబుద్ధిగా అయ్యి మీ ఉల్లాసమును తీవ్రముగా చేసుకోండి. ఉల్లాసము ఢీలా అయినట్లయితే ఏర్పాటు కూడా లభించదు, సహాయకులెవ్వరూ లభించరు. కావున ధైర్యవంతులుగా అయినట్లయితే ఎవరో ఒకరు సహాయకులుగా కూడా తయారవుతారు. తమను స్వతంత్రముగా చేసుకునేందుకు ఎంత శక్తిని ప్రతి ఒక్కరూ తమలో నింపుకున్నారు అన్నదానిని ఇప్పుడు చూద్దాము. మాయాజీతులుగా అయితే ఉన్నారు, కానీ తమను స్వతంత్రులుగా తయారుచేసుకొనే శక్తి కూడా చాలా అవసరము. శక్తి ఎంతవరకు నిండింది అన్న పరీక్ష కూడా ఉంటుంది. ఎవరైతే ప్రవృత్తిలో ఉంటూ స్వతంత్రులుగా అయ్యి సహాయకులుగా అవుతారో వారికి కానుకను కూడా పంపిస్తాము. అచ్ఛా!

           చిన్నవారు తండ్రి సమానంగా ఉంటారు. ఉండటమైతే అందరూ ఒక్కటిగానే ఉంటారు. కానీ గుర్తుపట్టేందుకొరకు గుజరాతీలము, పంజాబీలము అని అంటారు. గుజరాతు నెంబర్ వన్ గా అయ్యి చూపిస్తారు కదా! కానుకను తీసుకొనేందుకు యోగ్యులుగా ఎవరు అవుతారో చూద్దాము. ఒక్కొక్క రత్నానికి దాని దాని విశేషత ఉంది. కొందరిలో స్నేహము యొక్క, కొందరిలో సహయోగము యొక్క, కొందరిలో శక్తి యొక్క, కొందరిలో దివ్య గుణాలమూర్తిగా అయ్యే విశేషత, కొందరిలో జ్ఞాన విశేషత ఉన్నాయి. ఇప్పుడు సర్వశక్తులనూ తమలో నింపుకోవాలి. సర్వగుణ సంపన్నముగా, 16 కళల సంపూర్ణంగా అవ్వాలి. సర్వగుణ సంపన్నంగా అవ్వనట్లయితే 16 కళల నుండి 14 కళలుగా అయిపోతాయి. చంద్రునిలో కొంచెమన్నా కళ తక్కువగా ఉంటే మంచిగా అనిపించదు. సంపూర్ణత ద్వారా సుందరత వస్తుంది. తీవ్ర పురుషార్ధుల బాణము సదా గురి పైన ఉంటుంది. ఎప్పుడూ మాయతో ఓడిపోకూడదు. లైట్ గోళముగా అయ్యి వెళ్ళాలి. జ్ఞానమును కూడా లైట్ అని అంటారు మరియు లైట్ శక్తి కూడా. ప్రయత్నము అన్నమాట బలహీనతకు చెందినది. ఎక్కడైతే బలహీనత ఉంటుందో అక్కడ మొదటే మాయ సిద్ధముగా ఉంటుంది. ఏవిధంగా బలహీన శరీరమునకు రోగాలు త్వరగా వస్తాయో అలా ప్రయత్నము అన్న మాట మాట్లాడటము కూడా ఆత్మ బలహీనతయే. వీరు నా గ్రాహకులు అని మాయ భావిస్తుంది, కాబట్టి వచ్చేస్తుంది. నిశ్చయముదే విజయము. ఏవిధంగా మొత్తము రోజంతా ఏ స్మృతి ఉంటుందో అటువంటి స్వప్నమే వస్తుంది. ఒకవేళ మొత్తము రోజంతటిలో శక్తిస్వరూపుని స్మృతి ఉన్నట్లయితే బలహీనత స్వప్నములో కూడా రాదు. అచ్ఛా!

Comments