05-02-1975 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పవిత్రత - ప్రత్యక్షతకు ఆధారం మరియు వ్యక్తిత్వానికి జనని.
ఆత్మిక ఠీవి యొక్క సంస్కారాన్ని నింపేవారు, సర్వోత్తమ వ్యక్తిత్వాన్ని తయారుచేసేవారు, విశ్వం యొక్క పరమపిత శివుడు మాట్లాడుతున్నారు -
ఈ రోజు బాబా దేవాది దేవుడిగా రాజాధిరాజులుగా తయారుచేసే రచయిత యొక్క రచన అనగా శ్రేష్టాత్మల యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. మీరు ఉన్నతోన్నతంగా, బాబా కంటే కూడా ఉన్నతంగా తయారయ్యే ఆత్మలు. ఈరోజు అటువంటి ఉన్నతాత్మల యొక్క రెండు విషయాలు విశేషంగా చూస్తున్నారు. అవి ఏమిటి? ఒకటి - ఆత్మిక ఠీవి, రెండు వ్యక్తిత్వం. ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క ఉన్నతమైన సంతానం. మీ ముందు దేవతలు కూడా శ్రేష్టం కాదు. రాజులు కూడా మీ చరణాల ముందు వంగుతారు మరియు ప్రసిద్ధ ఆత్మలు కూడా బికారి అయి ఈశ్వరీయ ప్రసాదం తీసుకునేటందుకు కోరికతో వస్తారు. ఇలా సర్వాత్మల కోసం నిమిత్తమై ఉన్న మీరందరూ మాష్టర్ జ్ఞానదాత మరియు వరదాతలు. ఇలాంటి ఠీవి ఉందా? వాస్తవానికి పవిత్రతయే ఠీవి మరియు పవిత్రతయే వ్యక్తిత్వం. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి ఎంత శాతం పవిత్రతను ధారణ చేశాను? పవిత్రతకు పరిశీలన లేదా గ్రహింపు ప్రతి ఒక్కరి ఠీవి మరియు వ్యక్తిత్వం ద్వారానే తెలుస్తుంది. ఠీవి ఏమిటి? ఠీవి గల ఆత్మకు హద్దులోని వినాశి వస్తువులు లేదా వ్యక్తుల పట్ల ఎప్పుడూ ఆకర్షణ ఉండదు. లౌకిక రీతిలో కూడా ఠీవి గలవారికి, వ్యక్తిత్వం ఉన్న ఆత్మలకు చిన్న చిన్న వస్తువులపై కళ్ళు వెళ్ళవు. ఎవరైనా పడేసుకున్న ఏ వస్తువుని స్వీకరించాలనే కోరిక వారికి ఉండదు. వారి నయనాలు సదా సంపన్నంగా ఉన్నామనే నషాలో ఉంటాయి. అనగా నయనాలు కిందకి చూడవు. వారి మాటలు మధురంగా మరియు అమూల్యంగా మరియు లెక్కించేవిగా ఉంటాయి. వారిని సంప్రదిస్తే సంతోషం అనుభవంలోకి వస్తుంది. అదేవిధంగా ఆత్మిక ఠీవి గల వారు వీరికంటే కోటానుకోట్ల రెట్లు శ్రేష్ఠమైన వారు ఇలాంటి ఠీవిలో ఉండే ఆత్మలు ఎప్పుడూ కూడా పరస్పర అవగుణాలు లేదా బలహీనతలవైపు దృష్టి వెళ్ళదు. ఏవైతే ఇతరులు వదలాలనుకుంటారో లేదా తొలగించుకునే పురుషార్ధంలో ఉంటారో అలా వదిలిన వస్తువులను అనగా పడేసిన వాటిని పడేసే విషయాలను ఆత్మిక ఠీవిగల ఆత్మ సంకల్పంలో కూడా ధారణ చేయదు. ఇతరుల వస్తువుల వైపు, సంకల్పం అనే నేత్రం కూడా వెళ్ళదు. పాత తమోగుణీ స్వభావ సంస్కారాలు, బలహీనతలు శూద్రులవి, బ్రాహ్మణులవి కాదు. శూద్రుల వస్తువుల వైపు సంకల్పం ఎలా వెళ్తుంది? ఈ రోజు ఒక రూపాయి దొంగిలిస్తే రేపు లక్షలు దొంగిలించే వారవుతారని చెబుతారు కదా! అలాగే ఇక్కడ కూడా ఒక్క సెకెను అయినా లేదా సంకల్పం మాత్రంగా అయినా ధారణ చేస్తే రాయల్ ఆత్మగా పిలవబడరు. ఆత్మిక ఠీవి గల ఆత్మల యొక్క మాటలు మహవాక్యాలుగా ఉంటాయి. ఆ వ్యాక్యాలు స్వర్ణిమ వాక్యాలుగా ఉంటాయి. అవి విన్నవారు కూడా స్వర్ణిమ యుగానికి వెళ్ళడానికి అధికారులు అయిపోతారు. ఒక్కొక్క మాట రత్నం వలె విలువైనదిగా ఉంటుంది. దు:ఖాన్ని ఇచ్చే, పడవేసే రాళ్ళలాంటి మాటలు వారు మాట్లాడరు. సాధారణ మరియు వ్యర్ధ మాటలు కూడా మాట్లాడరు, సమర్థంగా మరియు స్నేహంతో మాట్లాడతారు. రోజంతటిలో మాట్లాడే మాటలు ఇంత శ్రేష్టంగా ఉంటున్నాయా? లెక్కించుకుంటే స్మృతిలోకి వస్తుంది, ఈ రోజు ఇలాంటి ఇన్ని మాటలు మాట్లాడానని, ఠీవి గల ఆత్మల గుర్తు లేదా విశేషత ఏమిటంటే 50 మాటలు మాట్లాడి విస్తారం చేయడానికి బదులు పది మాటల్లో సార రూపంగా మాట్లాడతారు. సంఖ్యని తగ్గిస్తారు, లక్షణంగా మాట్లాడతారు. ఇలాంటి ఆత్మిక ఠీవిగల ఆత్మల సంప్రదింపుల్లోకి ఏ ఆత్మ వచ్చినా కానీ వారికి కొద్ది సమయంలో కూడా ఆ ఆత్మ యొక్క దాత స్థితి, వరదాత స్థితి అనుభూతి అవుతుంది. శీతలత లేదా శాంతి అనుభూతి అవుతుంది. మా సంప్రదింపుల్లోకి వచ్చిన ఈ ఫరిస్తా ఎవరని ప్రతి ఒక్కరు మనసులో వీరి గురించి గుణగానం చేస్తారు. కొంచెం సమయంలోనే తపిస్తున్న, భ్రమిస్తున్న ఆత్మకు చాలాకాలం యొక్క దప్పిక తీరినట్లు, గమ్యం చూపించినట్లు అనుభవం అవుతుంది. పరుసవేది యొక్క సాంగత్యంతో లోహం కూడా బంగారంగా అవుతుందని దీనినే అంటారు. అనగా ఆత్మిక ఠీవి గలవారి, ఆత్మిక దృష్టితో అద్భుతం జరిగిపోతుంది. ఇలాంటి ఠీవిని అనుభవం చేసుకుంటున్నారా? ఇప్పుడు సేవ యొక్క వేగం తీవ్రం అవ్వాలి అది ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడైతే ఇలాంటి ఆత్మిక ఠీవి ముఖం ద్వారా కనిపిస్తుందో, అప్పుడే సర్వాత్మల యొక్క నింద పూర్తి చేయగలుగుతారు. పవిత్రత యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే మస్తకం ద్వారా శుద్ధ ఆత్మ మరియు సతో ప్రధాన ఆత్మ కనిపించాలి, అంటే అనుభవం చేసుకోగలగాలి. నయనాల ద్వారా సోదరవృత్తి అనగా శుద్ద, శ్రేష్ఠ వృత్తి ద్వారా వాయుమండలాన్ని లేదా తరంగాలను పరివర్తన చేయగలగాలి. లౌకిక వ్యక్తిత్వం గల ఆత్మ తన ప్రభావాన్ని వేయగలుగుతున్నప్పుడు పవిత్రత యొక్క వ్యక్తిత్వం అంత ప్రభావశాలిగా ఉండదా? శుద్ధ స్మృతి ద్వారా నిర్బల ఆత్మలను సమర్థ స్వరూపులుగా తయారు చేయగలుగుతున్నారా? ఇలాంటి ఠీవి మరియు వ్యక్తిత్వాన్ని స్వయంలో ప్రత్యక్ష రూపంలో తీసుకురండి. అప్పుడే స్వయాన్ని మరియు బాబాని ప్రత్యక్షం చేయగలరు. ఇప్పుడు విశేషంగా దయాహృదయులుగా అవ్వండి. స్వయంపై కూడా మరియు సర్వులపై కూడా దయా హృదయులు, అప్పుడు సహజంగానే సర్వులకు స్నేహీ, సహయోగి అయిపోతారు. అర్థమైందా! బాగ్య సితార ఇలా మెరుస్తూ ఉంది కదా? భూమిపై ఉన్న నక్షత్రాలను ఇలా మెరుస్తూ చూడాలని అందరూ అనుకుంటున్నారు. మంచిది.
స్వర్ణిమ వాక్యాల ద్వారా స్వర్ణిమయుగంలోకి తీసుకువచ్చేవారికి, సర్వుల పట్ల సదా దయా హృదయులుగా ఉండేవారికి, సర్వగుణ సంపన్నులకు, సర్వ ప్రాప్తులు చేసుకునేవారికి, ఒక్క ఆత్మను కూడా వంచితంగా ఉంచని వారికి, ఇటువంటి సుఖదాత, ఆత్మిక ఠీవి, వ్యక్తిత్వంలో ఉండేవారికి సదా మెరుస్తూ ఉండే సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment