05-02-1972 అవ్యక్త మురళి

* 05-02-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"నషా మరియు లక్ష్యము."

ఒక్క క్షణంలో మిమ్మల్ని మీరు మీ సంపూర్ణ లక్ష్యము మరియు నషాలో స్థిరము చేసుకోగలరా? సంపూర్ణమైన లక్ష్యము ఏమిటో దాని గూర్చి అయితే తెలుసు కదా! ఎప్పుడైతే సంపూర్ణ లక్ష్యము స్థితులవుతారో అప్పుడు నషా అయితే ఉంటుంది కదా! లక్ష్యముపై బుద్ధిని నిలుపుకోలేకపోతే నషా కూడా ఉండదు. లక్ష్యముపై మనస్సు స్థిరమవ్వడానికి గుర్తు - నషా, కావున ఇటువంటి నషా సదా ఉంటుందా? ఎవరైతే స్వయం నషాలో ఉంటారో వారు ఇతరులను కూడా నషాలో నిలుపగలరు. ఏవిధంగా ఏదైనా హద్దులోని నషాను తాగినప్పుడు వారి నడక ద్వారా, నయనాల ద్వారా వీరు నషాను తాగారు అని అర్థం చేసుకోగలరో అదేవిధంగా ఇది కూడా అన్నింటికన్నా శ్రేష్ఠమైన నషా, దీనిని ఈశ్వరీయ నషా అని అంటారు. ఇందులో స్థితులై ఉండేవారు కూడా దూరం నుండే కనిపిస్తారు కదా! దూరం నుండే ఆ స్థితి ద్వారా, వీరు ఏదో ఈశ్వరీయ లగనంలో ఉండే ఆత్మలు అని అర్థమవ్వాలి. ఈవిధంగా స్వయమును భావిస్తున్నారా? మీరు ఎక్కడకు వెళ్ళి వస్తున్నా కాని, వీరు ప్రభు ప్రియులు, అతీతమైన ఆత్మలు అని అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా అనుభవం చేసుకుంటున్నారా? భక్తిమార్గంలో కూడా ఇటువంటి ఆత్మలు ఉంటారు. వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా ప్రభు ప్రియులుగా కనిపిస్తారు. కావున ఇటువంటి స్థితిని ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ కార్య వ్యవహారాలలో నడుస్తూ ఈ స్థితి ఉండగలదు అని భావిస్తున్నారా? లేక కేవలం చివరిలో దర్శనీయమూర్తులకే ఈ స్థితి ఉంటుందా? మీరేం భావిస్తున్నారు. అంతిమం వరకు సాధారణ రూపమే ఉంటుందా? లేక ఈ ప్రకాశము ముఖముల ద్వారా కనిపిస్తుందా? లేక కేవలం చివరి సమయంలో పరదా లోపల తయారై, ఆ తరువాత పరదా తెరుచుకున్నప్పుడు ఆ దృశ్యం ముందుకు వచ్చి సమాప్తమైపోతుందా? ఇలా ఉంటుందా? కొంత సమయం ఈ ప్రకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ లేక సెకండ్ ఆత్మలు ఎవరైతే నిమితులయ్యారో వారే సాధారణ గుప్తరూపములో తమ సాకార రూపం యొక్క పాత్రను సమాప్తం చేసుకొని వెళ్ళిపోయారు, మరి ఇక మన ప్రకాశము ఎలా కనిపిస్తుంది? అని కొందరు భావిస్తారు. కాని అలా కాదు, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అన్న గాయనం ఉంది. పిల్లలు ప్రత్యక్షతలోకి తీసుకురావడం ద్వారానే తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. అహో ప్రభూ అన్న పిలుపు ఏదైతే ఆత్మల నుండి వెలువడుతుందో ఆ పశ్చాత్తాపపు అల ఏదైతే ఆత్మల్లోకి వస్తుందో అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఎవరైతే సాకారంలో అనుభవమే చేసుకోలేదో వారికి కూడా బాబా పరిచయం ద్వారా మేము బాబా పిల్లలము అనైతే అంగీకరిస్తారు. కాని, ఎప్పుడైతే వారు బాబా వచ్చారు. కాని, మేము ఏదీ పొందలేదు అని అంగీకరిస్తారో అప్పుడు అది జరుగుతుంది. కావున ఈ ప్రాక్టికల్ ఆత్మిక ప్రకాశము మరియు ఫరిస్తా స్వరూపం యొక్క నషా ముఖము ద్వారా మరియు నడవడిక ద్వారా కనిపించాలి. స్వయమును మరియు నిమిత్తమై ఉన్న ఆత్మలైన మీ యొక్క స్థితిని చూస్తూ అనుభవం చేసుకుంటారు. బాబా వీరిని ఎలా తయారుచేశారు అని గమనిస్తారు. ఆ తరువాత పశ్చాత్తాపపడతారు. ఈ ప్రకాశమును చూడకపోతే ఏమని భావిస్తారు? జ్ఞానము ద్వారా మిమ్మల్ని తెలుసుకునేంతగా అంత సమయము జ్ఞానమును తీసుకోరు. కావున ఈ ప్రాక్టికల్ ముఖము ద్వారా, ప్రకాశము మరియు నషా ద్వారా కనిపిస్తుంది. నేను పిల్లల ముందు ప్రత్యక్షమవుతాను అన్నది బాబా యొక్క మహావాక్యాలు. కాని, విశ్వం ముందు ఎవరు ప్రఖ్యాతమవుతారు? అది సాకారంలో బాబా యొక్క కర్తవ్యము, ప్రాక్టికల్ గా ప్రఖ్యాతమవ్వడం పిల్లల కర్తవ్యము మరియు వెన్నెముకగా అవ్వడం బాబా కర్తవ్యం. గుప్త రూపంలో సహాయకునిగా అవ్వడం బాబా కర్తవ్యము. కావున ఏవిధంగా మాతాపితల గుప్తమైన పాత్ర కొనసాగిందో అలాగే అంతిమం వరకు గుప్తమైన వాతావరణము ఉంటుందని కాదు. జైజైకారాలు శక్తులవి గానం చేయబడతాయి మరియు అహో ప్రభూ అన్న పిలుపు బాబా కొరకు గానం చేయబడుతుంది. మీరు పరస్పరంలో కూడా అనుభవం చేసుకుంటూ ఉండవచ్చు. ఎప్పుడైతే విశేషమైన అటెన్షన్ మీ లక్ష్యము మరియు నషాపై ఉంటుందో అప్పుడు ఎంత పెద్ద సంఘటనలో కూర్చున్నా కూడా, తప్పకుండా విశేషంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి తప్పకుండా కనిపిస్తుంది. ఈ సమయంలో స్మృతిలో చాలా మంచిగా కూర్చున్నారు అని భావిస్తారు. ఇప్పుడు సాధారణమైన అటెన్షన్ ఏదైతే ఉందో అది మారి సహజమైన విశేషమైన అటెన్షన్ గా అయిపోతుంది మరియు ముఖము ద్వారా ప్రకాశము మరియు నషా కనిపిస్తుంది. కేవలం స్మృతిని శక్తిశాలిగా తయారుచేయాలి. అచ్ఛా!

Comments