04-05-1973 అవ్యక్త మురళి

* 04-05-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“అధికారి మరియు అధీనత.”

            శబ్దములోకి వచ్చే ప్రాక్టీసు నిరంతరంగా మరియు నేచురల్ రూపములో ఎంతగా ఉంటుందో, అలాగే శబ్దమునుండి దూరమై తమ ఆత్మ స్వధర్మపు శాంత స్వరూప స్థితియొక్క అనుభవమునుకూడా అంతే నేచురల్ రూపములో మరియు నిరంతరముగా చేసుకుంటున్నారా? రెండు అభ్యాసాలనూ సమానరూపంలో అనుభవము చేసుకుంటున్నారా లేక 84 జన్మలలో శరీరధారిగా అయ్యే సంస్కారము చాలా కఠినంగా అయిపోయిందా? 84 జన్మలు వాణిలోకి వస్తూ ఉన్నారు, 84 జన్మల సంస్కారాలను ఒక్క క్షణములో పరివర్తన చెయ్యగలరా? అనగా వాణినుండి దూరంగా ఉండే స్థితిలో స్థితులవ్వగలరా లేక ఆ సంస్కారము పదే పదే తనవైపుకు ఆకర్షితము చేస్తుందా? ఏమని భావిస్తున్నారు? 84 జన్మల సంస్కారము ప్రబలమైనదా లేక ఈ మనోహరమైన సంగమయుగములోని ఒక్క క్షణములో అశరీరియై, వాణినుండి దూరమై తమ అనాది స్థితిలో స్థితులయ్యే అనుభవము ప్రబలమైనదా? వాటితో పోల్చిచూస్తే తనవైపుకు ఆకర్షితము చేయగల ఆ స్థితి శక్తివంతమైనదా లేక 84 జన్మల సంస్కారము శక్తివంతమైనదా? అవి 84 జన్మలు మరియు ఇది- క్షణకాలపు అనుభవము. అయినాకూడా శక్తి సంపన్నమైన అనుభవము ఏది? ఏమని భావిస్తున్నారు? ఏది ఎక్కువ ఆకర్షిస్తుంది? ఆ అనుభవమా లేక ఈ అనుభవమా? వాణిలోకి వచ్చే సంస్కారమా లేక వాణినుండి దూరంగా ఉండే అనుభవమా?

           వాస్తవానికి ఈ ఒక్క క్షణకాలపు అనుభవము బహుకాలపు అనుభవమునకు ఆధారము, ఒక్క క్షణములో అనేక ప్రాప్తులను అనుభవము చేయిస్తుంది, కనుక ఈ ఒక్క క్షణము అనేక సంవత్సరాలతో సమానము. ఇలా అనుభవము చేస్తున్నారు కదా? ఎప్పుడు కావాలంటే మరియు ఎలా కావాలంటే అలా మీ ముఖాన్ని తిప్పుకోగలగాలి. సెకండు అని దీనినే అంటారు. ఈ శరీరాన్ని నడిపించే మాస్టర్ యజమానత్వపు స్థితి. మరి యజమానులుగా అయ్యారా? శరీరానికి యజమానులుగా అయ్యారా? యజమానులుగా ఎవరు అవ్వగలరు అన్నది తెలుసా? ఎవరైతే మొదట బాలకులుగా అవుతారో వారే యజమానులుగా అవ్వగలరు. ఒకవేళ బాలకులుగా అవ్వనట్లయితే మీరు మీ శరీరానికి యజమానులుగా కూడా అవ్వజాలరు. సర్వశక్తివంతుని బాలకులు తమ ప్రకృతికి యజమానులుగా అవ్వరా? మేము బాలకులము-యజమానులము, ఇప్పుడు ఈ ప్రకృతికి యజమానులము మరియు తిరిగి విశ్వానికి యజమానులుగా అవుతాము అన్న ఈ స్మృతి ఎప్పుడైతే స్వరూపమైపోతుందో అనగా ఎంతగా బాలకత్వపు స్మృతి ఉంటుందో అంతగా యజమానత్వపు నషా ఉంటుంది, సంతోషము ఉంటుంది మరియు ఈ అమితానందములో మగనమై ఉంటారు. ఒకవేళ ఏ సమయములోనైనా ప్రకృతికి అధీనమైపోయినట్లయితే అందుకు కారణము ఏంటి? మీ మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిని మర్చిపోయారు, మీ అథికారమును ఎల్లప్పుడూ ముందు ఉంచుకోరు. అధికారి ఎప్పుడూ ఎవరి అధీనములోనూ ఉండడు.

           మిమ్మల్ని మీరు ఎవర్రెడీ మరియు ఆల్ రౌండర్లుగా భావిస్తున్నారా? ఎవర్రెడీ అన్నదానికి అర్థం ఏమిటి? ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి పరీక్షలు ఉన్నా కానీ శ్రీమత ప్రమాణంగా ఎటువంటి స్థితిలో స్థితులవ్వాలనుకుంటే అందులో స్థితులవ్వగలరా? ఆర్డర్ పై ఎవర్రెడీగా ఉండగలరా? ఆర్డర్ అనగా శ్రీమతము. మరి సంకల్పముకూడా శ్రీమతం ప్రమాణంగా నడిచే అటువంటి ఎవర్రెడీలా? అటువంటి ఎవర్రెడీ లేనా? శ్రీమతము - ఒక్క క్షణములో సాక్షి స్థితిలో స్థితులైపోండి, మరి ఆ సాక్షి స్థితిలో స్థితులవ్వటంలో ఒక్క క్షణమునకు బదులుగా ఒకవేళ రెండు క్షణాలను వెచ్చించినట్లయితే దానిని ఎవర్రెడీ అని అంటారా? ఏవిధంగా మిలట్రీ వారికి 'స్టాప్' అని ఆర్డర్ వేసినట్లయితే వెంబడే స్టాప్ అయిపోతారు. స్టాప్ అని అన్న తరువాత ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేరు. ఇదేవిధంగా శ్రీమతము లభించగానే లేక డైరెక్షన్ లభించగానే ఒక్క క్షణములో ఆ స్థితిలో స్థితులైపోవాలి, రెండో క్షణముకూడా పట్టకూడదు- దీనినే ఎవర్ రెడీ అని అంటారు. అటువంటి స్థితిలో ఒక్క క్షణములో ఆ స్థితిలో స్థితులైపోవాలి.

           ఒక్క క్షణములో స్వయమును స్థితి చేసుకొనే ఈ పురుషార్థమునే తీవ్ర పురుషార్థము అని అంటారు. అందరూ తీవ్ర పురుషార్థులేనా? పురుషార్టీ స్థితి నుండి ఇప్పుడు దూరమైపోయారు కదా? లేక అందరూ ఇప్పుడు తీవ్ర పురుషార్థపు స్టేజ్ పైకి చేరుకున్నారా? అలా మిమ్మల్ని మీరు అనుభవము చేసుకుంటున్నారా? సంకల్పాల అలజడి కొంచెము కూడా ఉండకూడదు, అటువంటి స్థితిని అనుభవము చేసుకుంటూ వెళ్తున్నారా? ఈ లెక్కలో అందరూ ఎవర్రెడీయేనా? శక్తిసేన అయితే ఎవర్రెడీగా తయారైంది కదా? శస్త్రధారులైన శక్తిసేన ఈ స్థితివరకు చేరుకుందా, లేక చేరుకోబోతున్నారా? ఇప్పుడు ఇంకా చేరుకోలేదా? ఏమని భావిస్తున్నారు? ఇందులో పాండవులు నంబర్ వనులా లేక శక్తులా? పాండవులు వాతావరణము లేక వాయుమండల సంపర్కములోకి వస్తూ కూడా తమ స్థితిని అలా తయారుచేసుకుంటారు, ఇది అద్భుతము! ఏవిధంగా, తమ కారును లేక మరేదైనా వాహనమునైనాగానీ దానిని ఎక్కడ ఆపాలనుకుంటే అక్కడ ఆపుతారా, ఆపరా? అలా మీ ప్రతి కర్మేంద్రియమును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా  కావాలంటే అలా ఉపయోగించండి మరియు ఎక్కడా ఉంచవలసిన అవసరము లేనట్లయితే కర్మేంద్రియములను కంట్రోల్ చేసుకోగలగాలి. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయము కావాలంటే అంత సమయము ఆ స్థితిలో స్థితి చెయ్యగలరు కదా? ఇందులో పాండవులు ఫస్ట్ కాదా? లేక ఏవిషయములో మీ రక్షణ ఉందో అందులో శక్తులను ముందు ఉంచుతారా? శక్తులను ఢాలుగా చేసుకుంటున్నారా? శక్తులు కూడా తక్కువ కాదు. శక్తులు పాండవులకు అదనంగా సహాయము చేస్తారు. శక్తులు మహాదానులు, కావున అటువంటి ఎవర్రెడీలను తయారుచేయాలి.

          అచ్ఛా, ఆల్ రౌండర్ అన్నదాని అర్థం తెలుసా? ఆల్ రౌండర్ అర్థం ఏంటి? మీరు ఆల్ రౌండర్ లే కదా? సంపూర్ణ స్థితిలో ఆల్ రౌండర్ స్థితి ఏది? ధ్యానములో ఉంచుకునేందుకు ఇందులో మూడు విశేష విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఆల్ రౌండర్‌గా ఉంటారో వారు ఒకటేమో సేవలో ఉంటారు, రెండు-స్వభావ, సంస్కారాలలో కూడా అందరితో కలిసిపోయే విశేష గుణము వారిలో ఉంటుంది. మూడవది-కర్మణాసేవ అని పిలువబడే ఎటువంటి స్థూల కార్యములోకూడా, ఆ కర్మణా సబ్జెక్ట్ లో కూడా వారిని ఏ సమయములో ఎక్కడ ఫిట్ చేయాలనుకుంటే అక్కడ ఎంత బాగా ఫిట్ అయిపోతారంటే, వీరు చాలాకాలమునుండి ఈ కార్యములోనే ఉన్నారు, కొత్తగా ఏమీ అనుభవమవ్వడం లేదు అన్నట్లుగా ఉంటుంది. ప్రతి కార్యములో చాలా పాతవారుగా మరియు అంతా తెలిసినవారుగా కనిపించాలి. ఎవరైతే ఈ మూడు విషయాలలో ప్రతి సమయము ఫిట్ అవుతారో లేక నిమగ్నమైపోతారో వారినే ఆల్ రౌండర్ లు అని అంటారు. ఎందుకంటే ఈ ఒక్కొక్క విషయము ఆధారముపైనే కర్మల రేఖలు తయారవుతాయి మరియు ఆత్మలో సంస్కారాల రికార్డ్ నిండుతుంది కావున ఈ అన్ని విషయాలకు ప్రారబ్దముతో చాలా కనెక్షన్ ఉంది.

          ఒకవేళ ఏ విషయములోనైనా 90 శాతము ఉండి, 10 శాతము తక్కువ ఉన్నట్లయితే ప్రారబ్దములోకూడా ఇంత తక్కువ లోటుదికూడా ప్రభావము పడుతుంది. ఈ సూక్ష్మమైన లోటు కారణంగానే నంబరు తగ్గిపోతుంది. తోటి పురుషార్థులలో పరస్పరం ముఖ్య విషయాలు సమానంగా కనిపిస్తాయి, కానీ సూక్ష్మరూపములో ఏదోఒక శాతములో లోటు ఉన్న కారణముగా తోటి పురుషార్థులలో సమానముగా కనిపిస్తూ కూడా నెంబరులో తేడా కనిపించేస్తుంది. కావున మాది ఏ నంబర్ అయి ఉంటుంది అని దీనిద్వారా మీ నంబర్‌ను తెలుసుకోగలరు. మూడు విషయాలలోనూ శాతము ఎంత ఉంది? మూడు విషయాలు నాలో ఉన్నాయి అని కేవలము ఈ మాత్రానికే సంతోషపడిపోకూడదు. దీనివలన నంబర్ తయారవ్వదు. ఎంత శాతములో ఉన్నారు అన్నదాని అనుసారంగా నంబర్ తయారవుతుంది. మరి అటువంటి ఎవర్రెడీలుగా మరియు ఆల్ రౌండర్లుగా అయ్యారా?

           అందరి లక్ష్యమైతే ఫస్ట్ అనే కదా? ఒకవేళ లాస్ట్ లో వచ్చినా ఎటువంటి ఆక్షేపణ లేదు, అన్న లక్ష్యమైతే లేదు కదా? ఒకవేళ, ఎంత లభిస్తుందో అంతే చాలు అన్న ఇటువంటి లక్ష్యమునుకూడా పెట్టుకుంటే అటువంటి వారిని ఏమని అంటారు? ఇటువంటి నిర్బల ఆత్మకు ఎటువంటి టైటిల్ ఉంటుంది? ఇటువంటి ఆత్మలకు శాస్త్రాలలో కూడా గాయనము ఉంది. ఒకటేమో వారి టైటిల్ ఏదో చెప్పండి, రెండోది వారి గాయనము ఏమిటో చెప్పండి. ఇటువంటి ఆత్మల గాయనము - భగవంతుడు భాగ్యాన్ని పంచుతుంటే వారు నిద్రిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యముకూడా సగము నిద్ర వంటిది. ఎవరైతే నిర్లక్ష్యములో ఉంటారో, వారిదికూడా నిద్రలో నిద్రించే స్థితి. ఒకవేళ నిర్లక్ష్యులుగా ఉంటేకూడా 'ఏం, నిద్ర పోతున్నావా' ? అని అంటారు. ఇటువంటి వారికి ఏ టైటిల్ ఉంటుంది? ఇటువంటి వారిని - కలిసొచ్చే భాగ్యంపై వేటు వేసుకొనేవారు అని అంటారు. భాగ్యవిధాత పిల్లలుగా కూడా అయ్యారు, అనగా అధికారిగా కూడా అయ్యారు, భాగ్యము ఎదురుగా వచ్చింది, అనగా భాగ్యవిధాత అయిన తండ్రి ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చిన భాగ్యాన్ని తయారుచేసుకొనేందుకు బదులుగా దానిపై దెబ్బ వేసుకుంటే అటువంటి వారిని ఏమని అంటారు? - భాగ్యహీనులు. వారు ఎక్కడా సుఖాన్ని పొందలేరు. ఇలా తయారయ్యేవారుగా అయితే ఎవరూ లేరు కదా? తమ అదృష్టాన్ని తయారుచేసుకొనేవారే కదా! ఎటువంటి అదృష్టాన్ని తయారుచేసుకుంటారో భవిష్యత్తులో అలాంటి ప్రారబ్దమురూపీ చిత్రము తయారవుతుంది.

          మీ భవిష్య చిత్రము తెలుసా? మీ చిత్రాన్ని తయారుచేసుకొనే కళాకారులే కదా? మరి మీ చిత్రము ఎంతవరకు తయారైంది అన్నది స్వయమునకైతే తెలుసు కదా? ఇప్పుడు చిత్రాన్ని తయారుచేస్తున్నారా, లేక కేవలము ఫైనల్ టచింగ్ దే ఆలశ్యమా? చిత్రమును తయారుచేసినట్లయితే అది తప్పకుండా ఎదురుగా వస్తుంది. ఒకవేళ ఎదురుగా రానట్లయితే తయారుచెయ్యటంలో నిమగ్నమై ఉన్నారని. తయారైపోయినట్లయితే అది పదే పదే ఎదురుగా వస్తుంది. మరి అందరూ నంబర్ వన్ ఆర్టిస్టులే కదా, సెకండ్ లేక థర్డ్ వారైతే కాదు కదా! కొంతమంది ఆర్టిస్టులు చాలా మంచిగా ఉంటారు, కానీ విశాలహృదయులు కానట్లయితే ఏదో ఒక లోపమును చేస్తారు. కావున ఏవిధంగా ఆర్టిస్ట్ మంచివాడో, సామానులు కూడా చాలా మంచిగా లభించాయో అలా విశాలహృదయులుగా కూడా అవ్వండి అనగా మీ సంకల్పాలు, కర్మ, వాణి, సమయము, శ్వాస అన్ని ఖజానాలను విశాలహృదయముతో ఉపయోగించినట్లయితే చిత్రము చాలా మంచిగా తయారౌతుంది. చాలా మంది వద్ద అన్నీ ఉన్నా కూడా వాటిని ఉపయోగించరు. పొదుపు చేస్తారు.. ఇందులో ఎంతటి విశాలహృదయులుగా అవుతారో అంతగా ఫస్టక్లాస్ గా అవుతారు. సమయాన్ని కూడా పొదుపు చెయ్యొద్దు, ఈ కార్యములో వెచ్చించటానికి పొదుపు చెయ్యొద్దు. వ్యర్థ కార్యములో పెట్టే విషయములో పొదుపు చెయ్యండి. శ్రేష్ఠ కార్యములో పొదుపు చెయ్యొద్దు. యథార్థమైన పొదుపు అని దేనిని అంటారో వినిపించాము కదా? ఏకనాములుగా అవ్వాలి. ఒక్కరి నామమే(పేరు) సదా స్మృతిలో ఉండాలి. ఇటువంటి ఏకనాములు ఎకానమీని(పొదుపును)చెయ్యగలరు. ఎవరైతే ఏకనాములు కాదో అటువంటివారు ఎంత ప్రయత్నము చేసినాగానీ యథార్థమైన ఎకానమీని చెయ్యలేరు. అచ్ఛా!

          ఇలా సదా స్వధర్మములో ఉంటూ అనగా వాణినుండి దూరమైన స్థితిలో స్థితులై ఉంటూ వాణిలోకి వచ్చేవారికి మరియు ఎల్లప్పుడు సర్వ శక్తులను కార్యములో వినియోగించే మాస్టర్ సర్వ శక్తివాన్ ఎవర్రెడీ, ఆల్ రౌండర్ పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments