* 04-03-1972 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అధికారిగా అయ్యేటందుకు ఆధీనతను వదలండి.
ఈరోజు విశేషంగా ఎందుకోసం వచ్చారు, తెలుసా? భవిష్యత్తులో విశేషతను చూపించే విశేష ఆత్మల గురించి వచ్చారు. మిమ్మల్ని విశేష ఆత్మలుగా అనగా విశేషతను చూపించేవారిగా భావిస్తారా? ఇప్పటివరకు ఏ గ్రూపూ చేసి చూపించనటువంటి ఏ విశేష కార్యమును చేసి చూపిస్తారు? ఇందుకొరకు ఏదైనా ప్లాన్ ను ఆలోచించారా? పాస్ విత్ ఆనర్ గా అయ్యే లక్ష్యము మరియు తండ్రిని ప్రత్యక్షము చేసే లక్ష్యమైతే అందరికీ ఉంది, కానీ మీరు విశేషంగా ఏ నవీనతను చూపిస్తారు? ఏ విఘ్నములోనైనా లేక ఏ కార్యములోనైనా ఇతరుల శ్రమను తీసుకోకుండా ఇంకా అన్య ఆత్మలను కూడా నిర్విఘ్నలుగా మరియు ప్రతి కార్యములో సహయోగులుగా చేస్తూ సహజముగానే సఫలతామూర్తులుగా తయారవుతాము మరియు తయారు చేస్తాము అన్న ఈ నవీనతను లేక విశేషతను చూపించాలి, మరియు చూపించాలనే నిశ్చయము చేసుకోవాలి. అనగా సదా సహజయోగము, సదా తండ్రి స్నేహులు, తండ్రి కార్యములో సహయోగులు, సదా సర్వ శక్తులను ధారణ చేస్తూ అలంకారమూర్తులుగా, శస్త్రధారీ శక్తిగా అయ్యి మీ చిత్రము ద్వారా, నడవడిక ద్వారా తండ్రి చరిత్ర మరియు కర్తవ్యమును ప్రత్యక్షము చెయ్యాలి. ఇటువంటి ప్రతిజ్ఞను మీతో మీరు చేసారా? చిన్న చిన్న విషయాలలో కష్టమునైతే అనుభవము చెయ్యటము లేదు కదా? మాయ యొక్క ఎటువంటి ఆకర్షితరూపములోనైనా మోసపోవటము లేదు కదా? ఎవరైతే స్వయము మోసపోతారో వారు ఇతరులను మోసము నుండి విడిపించలేకపోతారు. మేము దుఃఖహర్త-సుఖకర్త పిల్లలము అన్నదానిని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. ఇతరులెవరి దుఃఖమునైనా తేలిక చేసేవారు స్వయం ఎప్పుడూ ఒక్క క్షణము కొరకు కూడా, సంకల్పము లేక స్వప్నములో కూడా దు:ఖపు అలలోకి రాజాలరు. ఒకవేళ సంకల్పములోనైనా దు:ఖపు అల వచ్చినట్లయితే సుఖసాగరులైన తండ్రి సంతానమని ఎలా పిలువబడతారు? సుఖసాగరులు కానీ అప్పుడప్పుడు దుఃఖపు అల కూడా వస్తుంది అని తండ్రి మహిమలో ఎప్పుడైనా ఇటువంటి వర్ణనను చేసారా? మరి తండ్రి సమానంగా అవ్వాలి కదా! దుఃఖపు అల వస్తోందంటే ఎక్కడో అక్కడ మాయ మోసము చేసినట్లు, కావున అటువంటి ప్రతిజ్ఞను చెయ్యాలి. శక్తి రూపులు కాదా, శక్తి ఎలా లభిస్తుంది? ఒకవేళ సదా బుద్ధి సంబంధము ఒక్క తండ్రితోనే ఉన్నట్లయితే సంబంధము ద్వారా సర్వ శక్తుల వారసత్వము అధికారము రూపములో తప్పక ప్రాప్తిస్తుంది కానీ అధికారిగా భావించి ప్రతి కర్మనూ చేస్తూ ఉన్నట్లయితే అడగటములో లేక సంకల్పములో ఎప్పుడూ అడగాలన్న కోరిక ఉండదు. అథికారము లభించని కారణంగా ఎక్కడో అక్కడ ఏదో ఒక విధమైన అధీనత ఉంటుంది. అధీనత ఉన్న కారణంగా అథికారము ప్రాప్తమవ్వదు. అది తమ దేహభానపు అధీనత కావచ్చు, పాత సంస్కారాల అధీనత కావచ్చు, ఏవైనా గుణాల ధారణలో లోపము కారణంగా నిర్బలత లేక బలహీనతకు అధీనము కావచ్చు, కావుననే అధికారము యొక్క అనుభవమును చేసుకోలేరు. కావున మేము అధీనులము కాము, అథికారీలము. పాత సంస్కారాలపై, మాయపై విజయమును పొందే అధికారులము. దేహభానముపై మరియు దేహ సంబంధముపై మరియు సంపర్కములోకి వచ్చేవారు ఎవరైనాగానీ వారిపై విజయమును పొందే అధికారులము అని ఎల్లప్పుడూ భావించండి. ఒకవేళ ఈ అధికారీతనము ఎల్లప్పుడూ స్మృతిలో ఉన్నట్లయితే స్వతహాగనే సర్వ శక్తుల, ప్రాప్తుల అనుభవము జరుగుతూ ఉంటుంది. అధికారీతనమును మర్చిపోతారా? ఎవరైతే అధీనులుగా ఉంటారో వారు ఎల్లప్పుడూ యాచిస్తూ ఉంటారు, అధికారులుగా ఎవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. తండ్రివద్ద సర్వ శక్తుల ఖజానా ఎవరికోసం ఉన్నాయి? మరి ఏది ఎవరి వస్తువో దానిని ప్రాప్తి చేసుకోరా? సర్వ శక్తులైతే మా జన్మసిద్ధ అధికారము అన్న నషా ఎల్లప్పుడూ ఉండాలి. కావున అధికారులుగా అయ్యి నడవండి. ఎల్లప్పుడూ బుద్ధిలో ఇటువంటి శ్రేష్ఠ సంకల్పము ఉండాలి. ఒకవేళ సంకల్పము శ్రేష్ఠమైనదైనట్లయితే వచనము మరియు కర్మలోకి కూడా రాజాలరు కావున సంకల్పమును శ్రేష్ఠముగా చేసుకోండి మరియు సర్వశక్తివంతులైన తండ్రితో ఎల్లప్పుడూ బుద్ధి యొక్క సాంగత్యము ఉండాలి. ఇలా ఎల్లప్పుడూ సాంగత్యపు రంగులో రంగరింపబడి ఉన్నారా? అనుభవము చేస్తారా లేక ఇప్పుడు వెళ్ళిన తరువాత అనుభవము చేస్తారా? ఆలోచించాలంటే లేక మాట్లాడాలంటే లేక చెయ్యాలంటే అది అద్భుతమునకు చెందినదిగా ఉండాలే కానీ సాధారణమైనదిగా ఉండకూడదు అని ఎల్లప్పుడూ భావించండి. ఒకవేళ కామన్ అనగా సాధారణమైన సంకల్పము చేసినట్లయితే ప్రాప్తి కూడా సాధారణముగా ఉంటుంది. ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి తయారవుతుంది కదా! ఒకవేళ సంకల్పమే శ్రేష్ఠమైనది కానట్లయితే మీరు రచించబోయే నూతన సృష్టిలో పదవి కూడా సాధారణమైనదే లభిస్తుంది. కావున మేము ఏ సంకల్పమునైతే చేస్తున్నామో అది సాధారణంగా ఉందా లేక శ్రేష్ఠంగా ఉందా అన్నదానిని ఎల్లప్పుడూ పరిశీలించుకోండి. సాధారణ సంకల్పములు లేక నడవడికనైతే ఆత్మలన్నీ చేస్తూనే ఉంటాయి. ఒకవేళ సర్వశక్తివంతుని సంతానముగా అయిన తరువాత కూడా సాధారణ సంకల్పములు లేక సాధారణ కర్మలు ఉన్నట్లయితే ఇక అందులో శ్రేష్ఠత లేక విశేషత ఏముంది? నేను విశేష ఆత్మను, ఈ కారణంగా మనవన్నీ విశేషంగా ఉండాలి. మీ పరివర్తన ద్వారా ఆత్మలను మీవైపుకు మరియు మీ తండ్రి వైపుకు ఆకర్షితము చెయ్యగలరు, మీ దేహము వైపుకు కాదు. మీ అనగా ఆత్మ యొక్క ఆత్మికత వైపుకు. మీ పరివర్తన సృష్టిని పరివర్తనలోకి తీసుకువస్తుంది. సృష్టి పరివర్తన కూడా శ్రేష్ఠ ఆత్మల పరివర్తన కొరకు ఆగి ఉంది. పరివర్తనవైతే తీసుకురావాలి కదా, లేదంటే ఈ సాధారణ జీవితమే మంచిగా అనిపిస్తుందా? ఈ స్మృతి, వృత్తి మరియు దృష్టి అలౌకికమైపోయినట్లయితే ఈ లోకములోని ఏ వ్యక్తి లేక ఏ వస్తువూ ఆకర్షితము చెయ్యజాలదు. ఒకవేళ ఆకర్షితము చేసినట్టయితే స్మృతిలో లేక వృత్తిలో లేని దృష్టిలో అలౌకికత తక్కువగా ఉంది అని భావించాలి. ఈ లోటును క్షణములో పరివర్తనలోకి తీసుకురావాలి, ఈ గ్రూపు ఈ విశేషతను చూపించాలి - క్షణములో తమ సంస్కారాలు మరియు సంకల్పాలను పరివర్తనలోకి తీసుకొని వచ్చి చూపించాలి, అటువంటి ధైర్యము ఉందా? ఆలోచించడంలో ఎంత సమయము పడ్తుందో, చెయ్యటంలో అంత సమయము పట్టకూడదు. అంతటి ధైర్యము ఉందా? ఈ గ్రూపు సాహసవంతమైన గ్రూపు, కావున ఎవరైతే సాహసమును ఉంచేవారో వారితోటి తండ్రి సదా సహయోగులుగా ఉంటారు, కావున ఎప్పుడూ సాహసమును వదలకూడదు. ధైర్యము మరియు ఉల్లాసము ఎల్లప్పుడూ ఉండాలి. ధైర్యము ద్వారా సదా హర్షితంగా ఉంటారు. ఉల్లాసము ద్వారా ఏనువుతుంది? ఉత్సాహము దేనిని అంతము చేస్తుంది? సోమరితనమును. సోమరితనము కూడా విశేషమైన వికారము. పురుషార్థపు మార్గములో నడిచే పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారి ఎదురుగా మాయ యుద్ధము వర్తమాన సమయములో సోమరితనము రూపములో భిన్న భిన్న విధాలుగా వస్తుంది. కావున ఈ సోమరితనమును అంతము చేసేందుకు సదా ఉత్సాహములో ఉండండి. సంపాదన చేసుకొనేందుకు ఉత్సాహము ఉన్నప్పుడు సోమరితనము సమాస్తమైపోతుంది. ఇప్పుడు కూడా ఏదైనా కార్యముపట్లనైనా ఉత్సాహము లేనట్లయితే సోమరితనము తప్పకుండా ఉంటుంది, కావున సోమరితనమునకు వశులై శ్రేష్ట కర్మలనుండి వంచితులైపోయే విధముగా ఎప్పుడూ ఉత్సాహమును తక్కున చేసుకోవద్దు. సోమరితనము కూడా రకరకాలుగా ఉంటుంది. మీ పురుషార్థములో ముందుకు వెళ్ళడంలో సోమరితనము చాలా విఘ్నరూపంగా తయారవుతుంది.
అచ్చా, ఆలోచిద్దాము, ఈ కార్యము చేద్దాము, చేసేస్తాములే ...... ఇది సోమరితనమునకు గుర్తు. చేద్దాము చేసేస్తాములే, అయిపోతుందిలే..... కానీ అలా కాదు, చెయ్యడం మొదలుపెట్టాలి.... జ్ఞానము మరియు ధారణలేవైతే లభించాయో వాటిని బుద్ధిలో ధారణ చేసారు కదా! కానీ ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు ఏదైతే విఘ్నరూపంగా అవుతుందో అది స్వయము యొక్క సోమరితనము. అచ్ఛా, రేపటి నుండి చేద్దాములే, ఫలానావారు చేసినట్లయితే మేము కూడా చేస్తాము, ఈ రోజు ఆలోచిస్తాము రేపటి నుండి చేస్తాములే, ఈ పనిని చేసి తరువాత అది చేస్తాములే... ఇలాంటి ఆలోచనలే సోమరితనమునకు రూపము. ఏది చెయ్యవలసి ఉందో దానిని ఇప్పుడే చెయ్యాలి. ఎంత చెయ్యాలో దానిని ఇప్పుడే చెయ్యాలి. ఇకపోతే చేస్తాములే, ఆలోచిస్తాములే... ఈ పదాల చివర లే, లే అన్నది వస్తుంది కదా, మరి ఈ మాటనే చిన్ననాటితనమునకు గుర్తు. చిన్న పిల్లలు లే, లే అని అంటూ ఉంటారు కదా, ఇది నిర్లక్ష్యానికి గుర్తు కావున ఎప్పుడూ సోమరితనపు రూపమును మీవద్దకు రానివ్వవద్దు మరియు సదా స్వయమును ఉత్సాహములో ఉంచుకోవాలి ఎందుకంటే నిమిత్తముగా అవుతారు కదా. నిమిత్తముగా అయి ఉన్నవారు ఎల్లప్పుడూ పురుషార్థపు ఉత్సాహములో ఉంటారు, కావున వారిని చూసిన ఇతరులు కూడా ఉత్సాహములో ఉంటారు. నడుస్తూ నడుస్తూ పురుషార్థములో అలసట రావటము లేక నడుస్తూ నడుస్తూ పురుషార్థము సాధారణ వేగములోకి పోవటము, ఇది దేనికి గుర్తు? విఘ్నములు లేకపోయినాగానీ లగనముకూడా శ్రేష్ఠముగా లేనట్లయితే దానిని కూడా సోమరితనము అని అంటారు. కొందరు ఎలా అనుభవము చేస్తారంటే విఘ్నములు కూడా లేవు, మంచిగా నడుస్తూ ఉంటారు కానీ లగనము కూడా ఉండదు అనగా ఉత్సాహము లేక విశేషమైన ఎటువంటి ఉల్లాసము ఉండదు. మరి ఈ గుర్తు కూడా సోమరితనమునదే. సోమరితనము కూడా అనేక రకారకాలుగా ఉంటుంది. ఈ సోమరితనమును ఎప్పుడు కూడా రానివ్వకూడదు. సోమరితనము నెమ్మది నెమ్మదిగా మొదట సాధారణ పురుషార్ధిగా చేస్తుంది మరియు సమీపత నుండి దూరము చేస్తుంది, మళ్ళీ దూరము చేస్తూ చేస్తూ మోసము కూడా చేసేస్తుంది, బలహీనులుగా చేస్తుంది, నిర్బలులుగా చేస్తుంది. నిర్బలులు లేక బలహీనురుగా అవ్వటం ద్వారా లోపాల ప్రవేశత మొదలవుతుంది. కావున ఎల్లప్పుడూ నా బుద్ది యొక్క లగనము తండ్రి లేక తండ్రి కర్తవ్యము నుండి కొంచమైనా దూరంగా అయితే లేదు కదా అని పరిశీలించుకోవాలి, పూర్తి సమీసంగా ఉందా లేక తోడు-తోడుగా ఉందా? నేటి ప్రపంచములో ఎవరైనా ఎవరినైనా హత్య చేసినట్లయితే లేక ఏదైనా భ్రష్ట కార్యము చేసినట్లయితే మొదటగా వారిని దూరంగా తీసుకొని పోతారు. వారిని ఒంటరిగా, బలహీనంగా చేసి అప్పుడు వారిని ఎదుర్కొంటారు. మరి మాయ కూడా చతురమైనది. మొదట సర్వశక్తివంతుడైన తండ్రి నుండి బుద్ధిని దూరంగా చేస్తుంది, మళ్ళీ ఎప్పుడైతే బలహీనులుగా అవుతారో అప్పుడు యద్ధము చేస్తుంది, ఎవ్వరూ తోడు ఉండరు. ఏమైనాగానీ, మీ బుద్ధిని ఎప్పుడూ తండ్రి తోడు నుండి దూరము చెయ్యవద్దు. ఎవరితోనైనా యుద్ధము చేయవలసినప్పుడు స్వయమును రక్షించుకొనేందుకు ఎలా అరుస్తారు, పోరాడుతారు! దీని వలన ఎవ్వరూ దూరము తీసుకొని పోజాలరు. ఇక్కడ కూడా చూసినట్లయితే మాయ మన బుద్ధి లగనమును తండ్రి నుండి దూరము చేసేందుకు ప్రయత్నిస్తుంది, అప్పుడు మీలో మీరు తండ్రి గుణ గానము చెయ్యాలి, మహిమ చెయ్యాలి. మహా కర్తవ్యమును చేయడం మొదలు పెట్టండి. అరవవద్దు, భక్తిలో కూడా గుణగానము చేస్తారు కదా! ఈ స్మృతి చిహ్నము కూడా ఎప్పటినుండి తయారైంది? మనసులోని ఈ గుణగానమును వాచాలోకి తీసుకువచ్చారు. యథార్థరీతితో గుణగానమునైతే మీరే చెయ్యగలరు కదా? ఇప్పుడు యథార్థరూపములో మనసా సంకల్పము ద్వారా, స్మృతి స్వరూపములో గుణగానము చేస్తారు మరియు భక్తిలో స్థూలములోకి వస్తారు, కావున నోటి ద్వారా గానము చెయ్యటము చేస్తారు. అన్ని ఆచారాలు, పద్ధతుల ప్రారంభమైతే ఇక్కడి నుంచే ఉంటుంది కదా. కావున గుణగానము చెయ్యడం మొదలుపెట్టండి. స్వయమును అధికారిగా భావించి సర్వశక్తులను కార్యములోకి తీసుకురండి. ఇక ఎప్పుడూ మాయ మీ బుద్ధి లగనమును దూరము చెయ్యలేదు. దూరమవ్వరు, బలహీనులవ్వరు, ఓడిపోరు. సదా విజయులుగా ఉంటారు. మేము అనేకసార్లు విజయులమైనాము, ఇప్పుడు కూడా విజయులుగా అయ్యి చూపిస్తాము అన్న స్లోగన్ ను గుర్తు ఉంచుకోవాలి. ఎవరైతే అనేకసార్లు విజయులోవారు ఇప్పుడు తిరిగి ఓడిపోగలరా? ఎప్పటికీ ఓడిపోరు. ఓడిపోవటము అసంభవమని అనుభవము చెయ్యాలి. ఏవిధంగా అజ్ఞానీ ఆత్మలకు విజయాన్ని పొందటము అసంభవమని అనుభవమవుతుందో, అదేవిధంగా జ్ఞానీ ఆత్మకు ఓడిపోవటమన్నది అసంభవముగా అనుభవమవ్వాలి. ఇటువంటి విల్ పవర్ ను మీలో నింపుకున్నారా? ఎవరి సంకల్పములో కూడా బాడీ కాన్షస్ ఉండదో, దేహ అభిమానము ఉండదో వారినే సర్వ సమర్పణులు అని అంటారు. తమ దేహ భానమును కూడా అర్పణ చెయ్యాలి. నేను ఫలానాసు, అన్న ఈ సంకల్పము కూడా అర్పణమవ్వాలి. దీనినే సర్వసమర్పణ, సర్వగుణాలతో సంపన్నము అని అంటారు. సర్వ గుణాలతో సంపన్నమైనవారినే సంపూర్ణులు అని అంటారు. ఏ గుణము యొక్క లోటు ఉండకూడదు. ఈ లోపము ఉంది అని ఇప్పుడైతే వర్ణన చేస్తారు కదా, దీని ద్వారా సంపూర్ణ స్టేజ్ లేదని నిరూపణ అవుతుంది. మరి సర్వగుణ సంపన్నంగా ఉన్నారా? కావున సర్వ సమర్పణులుగా అయ్యి సర్వ గుణ సంపన్నంగా అయ్యి సంపూర్ణ స్థితిని తప్పక ప్రాప్తి చేసుకుంటాము అన్న లక్ష్యమునే ఉంచాలి. ఇటువంటి పురుషార్థులకు తండ్రి కూడా విజయీ భవ అన్నవరదానమును ఇస్తారు. ప్రతి సంకల్పములో అద్భుతమును చూపించండి, ఈ విశేషతను చూపించండి. జీవిత తీర్పును చేసుకొని వచ్చారు కదా? మీతో మీరు తీర్పు చేసుకొని వచ్చారా? ఎటువంటి సంస్కారమునకూ వశమవ్వకూడదు. ఉన్నదే జగజ్జీతులుగా, విశ్వవిజయులుగా అయినప్పుడు వారు దేనికీ వశమవ్వజాలరు. ఎవరైతే స్వయం సర్వ ఆత్మలను దృష్టితోనే పూర్తి సంతృప్తులుగా చేసేవారో, అటువంటివారి దృష్టి వేరే చోటికెక్కడికీ వెళ్ళజాలదు. ఇటువంటి దృఢ నిశ్చయ బుద్ధి కలిగినవారేనా? మీ అన్ని బలహీనతలను భట్టీలో స్వాహా చేసారా లేక చెయ్యాలా? కొంచెము మిగిలి ఉన్నాయి అని అనైతే అనరు కదా? మీ మనస్సనే జేబును మంచిగా పరిశీలించుకోవాలి, ఎక్కడైనా, ఏదైనా మూలలోనైనా ఏమీ మిగిలి లేవు కదా? లేక తెలిసే జేబుఖర్చు కోసమని ఉంచారా? దీనిని బాగా చూసుకోవాలి. ఆశావాదుల గ్రూపా లేక దానికంటే పైననా? దీనిపైన ఏముంటుంది? ఆశావాదులు కూడా మరియు విజయులు కూడా, కావున ఇది అనేకసార్ల విజయీ గ్రూపు. విజయులుగా ఉండనే ఉన్నారు. ఆశ విషయము కాదు. ఇటువంటి విజయులే విజయమాలలోని మణులుగా అవుతారు. కానీ మేము విజయులుగా ఉండనే ఉన్నాము అని 100 శాతము నిశ్చయము ఉంది. చూడాలి, మాయ తక్కువేమీ కాదు, మాయ ఛమ్-ఛమ్ లు, రిమ్ ఝిమ్ లు(ఆకర్షణలు) తక్కువేమీ కాదు. మాయ కూడా చాలా ప్రకాశవంతమైనది. మాయ ఎటువంటిది మరియు ఏ రూపముతో ఏవిధంగా వస్తుంది అన్నది అన్ని వైపుల నుండి అన్ని రూపాల నుండి మాయను గురించిన నాలెడ్జ్ ను కూడా తెలుసుకున్నారు. దీనిని గురించి కూడా పూర్తి జ్ఞానాన్ని తీసుకున్నారా? ఈ విషయము గురించి మాకు నాలెడ్జ్ లేదు అని అనైతే అనరు కదా? అలా అజ్ఞానులుగా అయ్యి స్వయమును తప్పించుకోకూడదు. ఇలా కూడా ఉంటారని మాకు తెలియనే తెలియదు, ఏమేమి చేస్తూ ఉంటారు అని కొంతమంది అంటారు. అజ్ఞానులుగా ఉన్న కారణంగా కూడా మోసములోకి వస్తారు. కానీ మాస్టర్ నాలెడ్జ్ పుల్ లుగా ఉన్నట్లయితే తెలియనితనము ఉండజాలదు. నాకు ఈ విషయమునకు చెందిన జ్ఞానము లేదు అన్న ఈ మాటలేవైతే వెలువడుతాయో అవి కూడా బలహీనతయే. జ్ఞాని అంటే జ్ఞానియే. ఏవిషయమును గురించి అయినా అజ్ఞానము ఉన్నట్లయితే వారిని జ్ఞాని అని అంటారా? జ్ఞాన స్వరూపునికి ఏ విషయము యొక్క అజ్ఞానము ఉండదు. యోగయుక్తముగా ఎవరైతే ఉంటారో వారికి అనుభవము లేకపోయినా కూడా వారికి మొదటి నుండీ అన్నీ తెలుసు అన్నట్లుగా అనుభవమవుతుంది. త్రికాలదర్శులు మళ్ళీ తెలియనివారిగా ఎలా అవ్వగలరు? కావున మాస్టర్ నాలెడ్జ్ ఫుల్లుగా అవ్వాలి మరియు విజయులుగా కూడా అయినట్లయితే ఓటమి అసంభవమని అనుభవమవుతుంది కదా? ఈ గ్రూపు ఎటువంటి ఝలక్ (ప్రకాశము)ను చూపిస్తుందో ఇప్పుడు చూడాలి. మీ స్వరూపము ద్వారా అందరికీ తండ్రి ప్రకాశము కనిపించాలి. అయ్యో పాపం, ఆత్మలన్నీ తపిస్తూ ఉన్నాయి, తండ్రి యొక్క ప్రకాశము కాస్త కనిపించినట్లయితే సర్వ ప్రాప్తి ఉంటుంది. కావున ఇప్పుడు తండ్రి ప్రకాశమును మీ ప్రకాశము ద్వారా చూపించండి. అర్థమైందా? కావున ఇది విజయీ గ్రూపు. మీరు ఉల్లాసము ద్వారా సోమరితనమును పారద్రోలేవారు. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూస్తాము. ప్రాక్టీసును ప్రాక్టికల్ లోకి ఎంతవరకు తీసుకువచ్చారు. అన్నది కూడా తెలిసిపోతుంది. ఎవరెవరు ఏ స్థానమునకు వెళ్ళినా, ఏ సహచరుల తోడు సేవలో సహాయముగా అయినా వారివైపు నుండి అద్భుతము తప్ప మరే విషయమూ రాకూడదు అన్న అద్భుతమును చూపించండి. ఒక లైనులో అద్దుతమును వ్రాసినట్లయితే అప్పుడు విజయీ గ్రూపు అని అంటారు. తండ్రి సమానంగా అయ్యి చూపించండి. నిజంగా ఈ గ్రూపు నిర్విఘ్నమైనది, సదా తండ్రి లగనములో మగనమై ఉండేవారు అని పెద్దవారు కూడా తండ్రి గుణగానమును చెయ్యాలి, ఇటువంటి అద్భుతమును చేసి చూపించండి. ఒక్కరు తప్ప మరేదీ తోచదు. ఒక్క తండ్రి లగనము కావచ్చు, తండ్రి కర్తవ్యాల లగనము కావచ్చు. ఇవి తప్ప మరే దృష్టి ఉండదు. ప్రపంచములో ఇతర వస్తువులు లేక వ్యక్తులు ఉన్నాకూడా ఆ అనుభవము ఉండకూడదు. ఇటువంటి ఒక్క లగనము, ఒక్క భరోసాలో, ఏకరస స్థితిలో, ఎక్కే కళలో ఉండేవారిగా అయ్యి చూపించండి అప్పుడే అద్భుతము అని అంటారు. ఎందుకు అన్నదానిని ఒక్కసారిగా భస్మము చేసి వెళ్ళాలి, ఇప్పటివరకు ఏవైతే కారణాలుగా అయ్యాయో ఆ కారణములను కూడా పరివర్తన చేసి నివారణ రూపముగా చెయ్యండి. ఈ కారణము ఉండింది అని మళ్ళీ అనకూడదు. ఎన్ని కారణాలు ఉన్నా నేను నివారణ చేసే వాడినే కానీ కారణమును చూసి బలహీననమవ్వకూడదు. కారణమును నివారణలోకి పరివర్తన చేసే గ్రూపు. వారినే విజయి అని అంటారు. ఇటువంటి శ్రేష్ఠ లక్షణధారులు భవిష్యత్తులో లక్ష్మి రూపంగా అవుతారు. లక్ష్మి అనగా లక్షణములు కలవారు. కావున ఇప్పుడు కూడా ముఖములో, నడవడికలో ఆ మెరుపు అన్నది కనిపించాలి. ఇప్పుడైతే ఇక్కడ నేర్చుకుంటున్నాము, అక్కడకు వెళ్ళి చూపిస్తాము అని అనడం కాదు. ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్రమాణమును ఇచ్చి వెళతారో అప్పుడే అక్కడ కూడా ప్రమాణమును ఇవ్వగలరు. అర్థమైందా?
ఇప్పుడు మీరందరూ ఉన్నదే సేవాధారులుగా, సేవాధారులు ఎప్పుడూ మనోరంజకాల సంకల్పములోకి రారు. సర్వ సంబంధాలతో సర్వ అనుభవాలను చెయ్యటము అది వేరే సంగతి, కానీ సదా స్మృతిలో తమ సేవాధారీ స్వరూపమును ఉంచుకోవాలి. మనోరంజకాలలో మునిగిపోయినట్లైతే సేవను మర్చిపోతారు. సేవాధారిని, విశ్వ పరివర్తన చేసే పతిత పావనిని, ఈ మీ స్వరూపమును స్మృతిలో ఉంచుకోండి. పతిత పావని ఎదురుగా రావటంతోనే పతితత్వము మారిపోయి పావనంగా అయిపోవాలి, అంతటి శక్తి అవసరము. పతిత ఆత్మల పతిత సంకల్పము కూడా నడవజాలకూడదు, అలా మీ బ్రేకు అంత పవర్ ఫుల్ గా ఉండాలి. ఎప్పుడైతే వారి పతిత సంకల్పమే నడవలేకపోయినప్పుడు ఇక పతితత్వపు ప్రభావము ఎలా పడగలదు? నేను పావనుడను, కానీ ఈ పతిత ఆత్మ ప్రభావము పడింది అని కూడా ఆలోచించవద్దు, ఇది కూడా బలహీనతయే. ప్రభావము పడటమునకు గల అర్థమే ప్రభావశాలి కాదని, అప్పుడే వారి ప్రభావము మిమ్మల్ని ప్రభావితము చేస్తుంది. పతిత పావని పతిత సంకల్పాల ప్రభావములోకి కూడా రాజాలదు. పతిత పావని స్వప్నములో కూడా పతితత్వపు సంకల్పము లేక దృశ్యము రాజాలదు. ఒకవేళ స్వప్నములో కూడా పతితత్వపు దృశ్యములు వచ్చినట్లయితే పాత సంస్కారాల ప్రభావము ఉందని అర్థం చేసుకోవాలి. వాటిని కూడా తేలికగా వదిలేయకూడదు. స్వప్నములో అయినా ఎందుకు వచ్చాయి? అంతటి కఠినమైన దృష్టి, కఠినమైన వృత్తి, కఠినమైన స్మృతి స్వరూపులుగా అవ్వాలి. పతిత ఆత్మ శస్త్రధారీ శక్తినైన నా ముందు ఒక్క క్షణములో భస్మమైపోవాలి. ఏ వ్యక్తి భస్మమవ్వడు కానీ, వారి పతిత సంస్కారము నాశనమైపోతుంది. ఆసురీ సంస్కారాలను నాశనము చేసే ఆవశ్యకత ఉంది. నేను పతిత పావనిని, ఆసురీ పతిత సంస్కారాల సంహారినిని. ఎవరైతే స్వయం సంహారులో వారు ఎప్పుడూ ఎవరి వేటగా అవ్వజాలరు. ఎంతటి ప్రాక్టికల్ ప్రభావము ఉండాలంటే, మీ ముందు ఎవరు సంకల్పము చేసినా వారి సంకల్పము మూర్ఛితమైపోవాలి. అటువంటి కాళీరూపులుగా అవ్వాలి. ఒక్క క్షణములో పతిత సంకల్పము యొక్క బలిని తీసేసుకోవాలి. ఎవరి పరఛాయ కూడా పడనంతటి బలశాలురుగా అయ్యారా? కోమలంగా అవ్వవద్దు. ఎవరైతే కోమలంగా ఉంటారో వారు నిర్బలులుగా ఉంటారు. శక్తులు కోమలంగా ఉండరు. మాయపై ఎప్పుడూ జాలి చూపించకూడదు.
మీరు మాయను తిరస్కారమును చేసేవారు. ఎంతగా మాయను తిరస్కారము చేస్తారో, అంతగా భక్తుల ద్వారా లేక దైవీ పరివారము ద్వారా సత్కారమును ప్రాప్తి చేసుకుంటారు. మాయపై అధికారమును చూపించాలే కానీ దయను కాదు. ఎవరి పురుషార్థములోనైనా సహాయోగులుగా అవ్వడంలో దయ చూపించాలి. మాయతో కాదు. అచ్ఛా!
Comments
Post a Comment