31-11-1971 అవ్యక్త మురళి

* 31-11-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయశక్తిని ఎదుర్కోవడము."

          మీకు ఆత్మిక డ్రిల్లు తెలుసా? ఏ విధంగా శారీరిక డ్రిల్లు యొక్క అభ్యాసకులు ఒక్క క్షణంలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎలా కావాలనుకుంటే అలా తమ శరీరమును మలుచుకోగలరో అలా ఆత్మిక డ్రిల్లును చేసే అభ్యాసకులు ఒక్క క్షణంలో బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అదే స్థితిపై, అదే శాతములో స్థిరము చేయగలరా? ఇటువంటి ఎవర్రడి ఆత్మిక మిలట్రీగా అయ్యారా? వెంటనే మీ సంపూర్ణ నిరాకారీ, నిరహంకారీ, నిర్వికారీ స్థితిలో స్థిరమైపోవాలి అని ఆర్డర్ లభించినట్లయీతే, మరి మీరు అలా స్థితులవ్వగలరా? లేక సాకార శరీరము, సాకార సృష్టి లేక వికారీ సంకల్పాలు వద్దనుకున్నా తమ వైపుకు ఆకర్షిస్తాయా? ఈ దేహపు ఆకర్షణ నుండి అతీతముగా ఒక్క  క్షణంలో అవ్వగలరా? ఓటమి గెలుపుల ఆధారము ఒక్క క్షణముపై ఉంటుంది. మరి ఈ ఒక్క క్షణపు పందెమును జయించగలరా? ఇటువంటి విజయులుగా స్వయమును భావిస్తున్నారా? ఇటువంటి సర్వశక్తుల యొక్క సంపదవంతులుగా స్వయమును భావిస్తున్నారా లేక ఇప్పటివరకు ఇంకా సంపూర్ణ సంపదవంతులుగా అవ్వాలా? దాత పిల్లలు సదా సర్వసంపత్తివంతులుగా ఉంటారు. స్వయమును ఈ విధంగా భావిస్తున్నారా లేక ఇప్పటివరకు 63 జన్మల భక్తి లేక బికారీతనపు సంస్కారాలు అప్పుడప్పుడు ఎమర్జ్ అవుతున్నాయా? బాబా సహాయం కావాలి, ఆశీర్వాదము కావాలి, సహయోగము కావాలి, శక్తి కావాలి... ఇలా కావాలి, కావాలి అనైతే లేదు కదా! ఈ కావాలి, కావాలి అన్న పదాలు దాత, విధాత, వరదాత అయిన పిల్లల ముందు శోభిస్తాయా? ఇప్పుడైతే విధాత మరియు వరదాతగా అయి విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒకటి ఇవ్వాలి లేక వరదానమును ఇవ్వాలి, అంతేకాని ఇది కావాలి, అది కావాలి... అన్న సంకల్పాలను ఇప్పటివరకు చేస్తూనే ఉంటారా? దాత పిల్లలు సర్వశక్తులతో సంపన్నంగా ఉంటారు. ఈ సంపన్న స్థితియే సంపూర్ణ స్థితికి సమీపంగా తీసుకువస్తుంది. స్వయమును విశ్వం లోపల సర్వాత్మల కన్నా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన విశేష ఆత్మలుగా భావిస్తున్నారా? మరి సాధారణ ఆత్మలలో మరియు విశేష ఆత్మలలో తేడా ఏమిటి? ఈ తేడాను గూర్చి మీకు తెలుసా? విశేష ఆత్మల విశేషత సదా స్వయమును సర్వ శక్తులతో సంపన్నంగా అనుభవం చేసుకోవాలి. ఈ జీవితంలో అప్రాప్తి అయిన వస్తువేదీ లేదు అన్న గాయనమేదైతే ఉందో అది ఈ సమయంలో ఎప్పుడైతే సర్వశక్తులతో స్వయమును సంపన్నం చేసుకుంటారో అప్పుడే భవిష్యత్తులో కూడా సర్వగుణాలతోను సంపన్నంగా, సర్వ పదార్థాలతోను సంపన్నంగా మరియు సంపూర్ణ స్థితిని పొందగలుగుతారు. కావుననే స్వయమును ఈ విధంగా తయారుచేసుకునేందుకే విశేషంగా భట్టీలోకి వచ్చారు. స్వయములో అప్రాప్తినేదైతే అనుభవం చేసుకున్నారో అది ప్రాప్తి రూపంలో పరివర్తన అయిందా లేక ఇప్పటివరకు కూడా ఏదో ఒక అప్రాప్తిని అనుభవం చేసుకుంటున్నారా? ఈ ప్రాప్తి అవినాశిగా ఉంటుంది కదా! ప్రాప్తి అంటే ప్రాప్తి.

          ఎప్పుడైతే అనుభవ స్వరూపులుగా అయిపోయారో అప్పుడిక అనుభవపు విషయాలు అవినాశిగా ఉంటాయి. విన్న విషయాలు, వాయుమండలపు ప్రభావం యొక్క ఆధారంపై ప్రాప్తించిన విషయాలు లేక ఎవరైనా శ్రేష్ఠ ఆత్మల మాటల ఆధారంపై ఆ ప్రభావం లోపల ప్రాప్తించిన విషయాలు అల్పకాలికమైనవి అవవచ్చు. కాని, తమ అనుభవపు విషయాలు సదాకాలికమైనవిగా, అవినాశిగా ఉంటాయి. కావున వినేవారిగా అయ్యారా లేక అనుభవీమూర్తులుగా అయ్యారా లేక ఇప్పుడు మళ్ళీ వినిన విషయాలను మననం చేసుకున్న తరువాత అనుభవజ్ఞులుగా అవుతారా? మీకు లభించిన ఖజానాలను అనుభవంలోకి తీసుకువచ్చారా లేక అక్కడకు వెళ్ళాక అనుభవంలోకి తెచ్చుకుంటారా? మీ అనుభవము అన్నింటికన్నా శక్తిశాలి స్థితి, ఎందుకంటే అనుభవీ ఆత్మలో విల్ పవర్ ఉంటుంది. అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క ఎటువంటి శక్తినైనా ఎదుర్కోగలుగుతారు. ఎవరిలోనైతే విల్ పవర్ ఉంటుందో వారు సహజంగానే సర్వ విషయాలను, సర్వ సమస్యలను ఎదుర్కోగలరు మరియు సర్వాత్మలను సదా సంతుష్టపరచగలరు కూడా. కావున ఎదుర్కొనే శక్తి ద్వారా సర్వులను సంతుష్టపరిచే శక్తి తమ అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా సహజంగా ప్రాప్తిస్తుంది. కావున ఈ రెండు శక్తులను స్వయములో  అనుభవం చేసుకుంటున్నారా? ఈ రెండు శక్తులు వచ్చాయంటే ఇక విజయులుగా అయిపోతారు ఇటువంటి విజయులుగా అయ్యారా? విజయులు అనగా స్వప్నంలో కూడా, సంకల్ప రూపంలో కూడా  ఓటమి జరుగకూడదు. ఎప్పుడైతే స్వప్నంలో కూడా ఓటమి జరుగదో అప్పుడిక ప్రత్యక్ష జీవితంలో కూడా జరుగదు కదా! ఈ విధంగా ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలోను విజయులుగా అవ్వాలి అనగా ఓటమి యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. ఇటువంటి సంపూర్ణ చిహ్నాలను ఒక్క క్షణంలో మీ లక్ష్యాలుగా చేసుకోగలరా? దైహికమైన మిలట్రీవారు ఒక్క క్షణకాలంలో లక్ష్యాలను ఛేదించలేకపోతే  ఓటమిని చవిచూస్తారు కదా! లక్ష్యాలపై గురి సరిగ్గా ఉన్నట్లయితే విజయులుగా అయిపోతారు. ఈ విధంగా మీ ಬುದ್ಧಿని ఈ లక్ష్యాలపై ఒక్క క్షణంలో సరిగ్గా నిలుపగలరా? ఈ విధంగా ఎవర్రడిగా అయ్యారా లేక కష్టపడ్డ తరువాత లక్ష్యంపై స్థితులవ్వగలరా? ఈ విధంగా ప్రయత్నం చేస్తూ, చేస్తూ విజయపు క్షణము గతించిపోతుంది, మరప్పుడిక విజయమాలలోని మణులుగా ఎలా అవ్వగలరు? కావున ఏ విధంగా నిరంతర స్మృతిలో ఉండాలో అలా నిరంతర విజయులుగా అవ్వండి. నేడు మొత్తం రోజంతటిలో సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధాలు, సంపర్కాలు, స్నేహము, సహయోగము మరియు సేవలో విజయులుగా ఎంతవరకు అయ్యాము అని పరిశీలించుకోండి. చాలాకాలం నుండి సదాకాలిక విజయులుగా, ప్రతి అడుగులోను విజయులుగా, ప్రతి సంకల్పంలోను విజయులుగా ఉన్నట్లయితే అప్పుడే విజయమాలలో సమీప మణులుగా అవ్వగలుగుతారు. ఇంత సేవ చేసిన తరువాత కూడా 108 మందే  విజయులుగా ఎందుకు అయ్యారు? ఎలా అయ్యారు? ఈ పురుషార్థం ద్వారా ఈ విధంగా శ్రేష్ఠంగా అయ్యారు. కావున బహుకాలం నుండి సదాకాలికమైన విజయులుగా అయినప్పుడే చాలాకాలపు స్మృతి చిహ్నాన్ని తయారుచేసుకోగలరు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? 

          భట్టీలో చాలాకాలం నుండి సదాకాలికమైన విజయులుగా అయిపోయే విధంగా పరివర్తన తీసుకురావాలి. ఇటువంటి అనుభవమును అనేక ఆత్మలు మీ ద్వారా పొంది వెళ్ళాలి. అవ్యక్త వతనం నుండి అవ్యక్త స్థితిలో స్థితులయ్యే అవ్యక్త ఫరిస్తాలు వ్యక్త దేశంలోకి విశ్వకళ్యాణ  నిమిత్తం ఈ మధువనమునకు వచ్చారు. మీ ప్రవృత్తివారు ఆత్మలైన మీ నుండి ఇటువంటి  పరివర్తనను అనుభవం చేసుకోవాలి. దీనినే భట్టీ యొక్క పరివర్తన అని అంటారు. నయనాలు ఆత్మికతను అనుభవం చేయించాలి, నడవడిక బాబా చరిత్రల సాక్షాత్కారమును చేయించాలి,  మస్తకము మస్తక మణి యొక్క సాక్షాత్కారమును చేయించాలి. ఈ అవ్యక్త ముఖము దివ్యమైన, అలౌకికమైన స్థితి యొక్క ప్రత్యక్ష రూపమును చూపించాలి. మీ అలౌకిక వృత్తి ఎటువంటి తమోగుణ వృత్తి కలిగినవారికైనా తమ సతోగుణ వృత్తి యొక్క స్మృతిని కలిగింపజేయాలి. దీనినే పరివర్తన అని, అటువంటివారినే సేవాధారులు అని అంటారు. ఎవరైతే ప్రతి అడుగులోనూ సేవలో తత్పరులై ఉంటారో అటువంటి సర్వీసబుల్ గా అయ్యారా? అంతేకాని నాలుగు గంటల సేవ చేయాలి అని భావించడం కాదు. సదా విజయులుగా అవ్వాలి. సదా సేవలో తత్పరులై ఉండే, సదా సర్వీసబుల్ గా ఉండేవారి ఒక్క క్షణం కూడా సేవ లేకుండా గతించకూడదు. ఇటువంటి సేవాధారులుగా అవ్వడమే విశేష ఆత్మల విశేషత. కావున అన్ని విషయాలలో ఫుల్ గా అవ్వాలి. బాబా మహిమలో అన్ని పదాలలోను ఫుల్ అన్న పదము వస్తుంది కదా! కావున అన్ని విషయాలలోనూ ఎవరైతే ఫుల్ గా ఉంటారో వారెప్పుడూ ఫెయిలవ్వరు. ఇలా  ఫుల్ అయ్యేవారు ఫ్లా అనగా మచ్చలు ఉండవు. కావున వారు ఫెయిలవ్వరు. వారు ఫెయిలూ అవ్వరు అలాగే వ్యర్ల విషయాలకు ఫీల్ కూడా అవ్వరు. కొన్ని కొన్ని విషయాలలో ఫీల్ అవుతారు కదా! ఎవరైత ఫుల్‌గా ఉంటారో వారు వ్యర్థ విషయాలను ఫీల్ అవ్వరు అలాగే ఫేల్ కూడా అవ్వరు. మరి ఈ విధంగా తిలకధారులుగా అయ్యారా? సర్వశక్తులతో సంపన్నమైన తిలకమును మీ మస్తకంపై దిద్దుకున్నారా? ఈ తిలకమునేదైతే వినిపించారో దానిని సదా మస్తకము పైకి తీసుకురాకపోతే స్మృతిలో కూడా స్మృతికి బదులుగా ఏమి చేస్తారు? స్మృతికి బదులుగా ఫిర్యాదులు చేస్తారు. కానీ, ఇప్పుడు చేయరా? ఫిర్యాదు  ఫైలు తయారైపోయింది. ప్రతి ఒక్కరి ఫిర్యాదుల ఫైలు ఎంత ఉందో తెలుసా? కావున నిరంతరము స్మృతిలో ఉండడం ద్వారా, నిరంతరము విజయులుగా అవ్వడం ద్వారా, నిరంతరము సర్వీసబుల్ అవ్వడం ద్వారా ఫిర్యాదుచేసే అవసరమే ఉండదు. సంపూర్ణ బలహీనతల ఆహుతిని వేసేందుకు భట్టీలోకి వచ్చారు. కావున సర్వబలహీనతల ఆహుతిని యజ్ఞంలో వేశారా లేక ఇంకా మిగిలి ఉన్నాయా? ఆహుతిని వేసేటప్పుడు అంతిమంలో ఏమంటారు? స్వాహా! మరి మీరందరూ స్వాహా అయ్యారా? ఎవరైతే స్వాహా అయిపోయారో వారు గతించిన విషయాలను స్వప్నంలో కూడా చూడలేరు. ఈ విధంగా స్వాహా అయ్యారా? ధైర్యము మరియు ఉల్లాసము ఈ రెండూ ఇప్పటి రిజల్టులో మెజార్టీలో కనిపిస్తున్నాయి. ధైర్యము మరియు ఉల్లాసమును సదాకాలికంగా మీ వృత్తిగా తయారుచేసుకోవాలి. ఈ ధరణి మెత్తగాను ఉంది మరియు ఫలీభూతముగాను ఉంది. కాని, మీ ఫలీభూత ధరణిలో గతించిన జీవితపు వికర్మలు మరియు వికర్మల ముళ్ళను నాటనివ్వవద్దు. ముళ్ళను బాబా ముందు సమర్పణ చేశారా? ఇప్పటివరకు లోపల ఉన్న కారణంగా ముళ్ళు ఏ నష్టమునైతే కలిగిస్తున్నాయో అవన్నీ ఇప్పుడు బాబా ముందు స్వాహా అయ్యాయి, స్వాహా అని బూడిదను కూడా అంటారు. బూడిదగా అయిపోయిన వస్తువులను లేక భస్మమైపోయిన వస్తువులను మళ్ళీ ఎప్పుడూ మీ ధరణిలో నాటుకోకూడదు అనగా స్మృతిలోకి తీసుకురాకూడదు. స్వాహా అనగా నామరూపాలు కూడా సమాప్తము.

          సతోగుణీ ఆత్మనైన నా యొక్క సంస్కారాలు ఇవి కావు అని ఈనాటి నుండి భావించండి. ఏ విధంగా ఇతరుల సంస్కారాలను సాక్షిగా అయి చూస్తారో అలా మీ తమో ప్రధాన స్థితి యొక్క సంస్కారాలను కూడా సాక్షిగా అయి చూడాలి. ఇలా సమాప్తం చేసెయ్యాలి. స్వాహా అయిపోయాయి అని భావించినట్లయితే సదా సఫలతను పొందుతూ ఉంటారు. అచ్ఛా!

Comments