03-10-1971 అవ్యక్త మురళి

* 03-10-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"నిర్మాణతా గుణము ద్వారా విశ్వనిర్మాతలుగా అవ్వండి"

            ఈరోజు బాప్ దాదా ఎవరిని చూస్తున్నారు? మీరు ఎవరు? ఈ రోజు బాప్ దాదా మిమ్మల్ని ఏ రూపంలో చూస్తున్నారో మీకు తెలుసా? మీరు మాస్టర్ జ్ఞాన స్వరూపులు కారా? మీరు మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా ఉన్నప్పుడు మరి బాబా ఏ రూపంలో చూస్తున్నారో మీరు తెలుసుకోలేరా? పిల్లలుగా అయితే ఉండనే ఉన్నారు, కాని బాబా ఏ రూపంలో చూస్తున్నారు? ఇంతమంది విశ్వనిర్మాతలుగా ఉన్నారు. మరి మీరు విశ్వనిర్మాతలేనా? బాబాతో పాటు బాబా కర్తవ్యంలో సహాయకులుగా ఉన్నారా? క్రొత్త విశ్వాన్ని నిర్మించడమే కర్తవ్యం కదా! ఇదే కర్తవ్యంలో నిమగ్నమయ్యారా లేక ఇప్పుడు ఇంకా నిమగ్నమవ్వాలా? మరి అలాంటప్పుడు విశ్వనిర్మాతలు కారా! మేమందరము మాస్టర్ విశ్వనిర్మాతలము అన్న స్మృతిలోనే ఎల్లప్పుడూ ఉండండి. ఇదే సృతి ఎల్లప్పుడూ ఉండడం ద్వారా ఏ విశేషమైన గుణము దానంతట అదే వచ్చేస్తుంది? నిర్మాణత యొక్క గుణము. అర్థమైందా? మరియు ఎక్కడైతే నిర్మానత అనగా సరళత సహజరూపంలో ఉంటుందో అక్కడ ఇతర గుణాలు కూడా వాటంతట అవే వచ్చేస్తాయి. కావున ఎల్లప్పుడూ ఈ స్మృతి స్వరూపంలో స్థితులై ఆ తరువాతే ప్రతి సంకల్పమును లేక కర్మను చేయండి, అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలేవైతే ఎదుర్కొనేందుకు వస్తాయో వాటన్నింటినీ, అనుభవజ్ఞులైన వృద్ధుల ముందు చిన్న చిన్న పిల్లలు తమ బాల్యపు నిర్లక్ష్యము కారణంగా ఏదో ఒకటి అనేస్తే లేక ఏదో ఒక అటువంటి కర్తవ్యమును చేసేస్తే పెద్దవారు వీరు నిర్దోషులు, ఏమీ తెలియని చిన్నపిల్లలు అని భావిస్తారు, వారి పైన ఎటువంటి ప్రభావము పడదు. అదేవిధంగా ఎప్పుడైతే మాస్టర్ విశ్వనిర్మాతలుగా స్వయమును భావిస్తారో అప్పుడు ఈ మాయ యొక్క చిన్న చిన్న విఘ్నాలు పిల్లల ఆటల్లా అనిపిస్తాయి. ఏ విధంగా చిన్నపిల్లలు బాల్యపు అమాయకత్వం కారణంగా ముక్కు, చెవులు పట్టుకున్నా వారి మీద కోపం వస్తుందా? ఎందుకంటే పిల్లలు నిర్దోషులు, వారికేమీ తెలియదు అని భావిస్తారు, వారి దోషమేమీ కనిపించదు. అలాగే మాయ కూడా ఎవరైనా ఆత్మ ద్వారా సమస్యను లేక విఘ్నాన్ని లేక పరీక్షను తీసుకువచ్చినట్లయితే ఆ ఆత్మలను నిర్దోషులుగా భావించాలి. మాయయే ఆ ఆత్మద్వారా తన ఆటను చూపిస్తోంది. మరి నిర్దోషులపై ఏమి కలుగుతుంది? దయ కలుగుతుంది కదా! అదేవిధంగా ఏ ఆత్మ అయినా నిమిత్తమౌతుంది కాని నిజానికి ఆ ఆత్మ నిర్దోషి. ఈ దృష్టితో ప్రతి ఆత్మను చూసినట్లయితే పురుషార్థపు వేగం ఎప్పుడైనా చల్లబడుతుందా? ప్రతి క్షణంలో పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటారు. కేవలం పైకి ఎక్కే కథలోకి వెళ్ళేందుకు ఈ విధంగా అర్థం చేసుకునే కళ రావాలి.

           16 కళా సంపూర్ణంగా అవ్వాలి కదా! కావున ఇది కూడా కళయే. ఈ కళను తెలుసుకున్నట్లయితే అంతా ఎక్కే కళయే ఉంటుంది, అది ఎప్పుడూ ఆగిపోదు. దాని స్పీడ్ ఎప్పుడూ ఢీలా పడజాలదు. ప్రతి క్షణంలో తీవ్రత ఉంటుంది మరియు ఇప్పుడు ఆగే సమయం కూడా ఎక్కడ ఉంది? ఆగిపోయి ఆ ఆత్మల కారణంగా ఇంకా నివారణను చేసేందుకు ఇప్పుడు సమయం ఉందా? ఇప్పుడు మీరు చాలా పెద్దవారిగా అయిపోయారు. ఇప్పుడిక వానప్రస్థావస్థలోకి వెళ్ళే సమయం సమీపంగా వస్తోంది. మన ఇల్లు మీ ముందు కనిపించడం లేదా? ఇక చివరికి ఈ యాత్రను సమాప్తం చేసి ఇంటికి వెళ్ళాలి. ఏదైనా విషయం భిన్న, భిన్న రూపాలతో, భిన్న, భిన్న విషయాలతో మీ ముందుకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ సమస్యలు లేక భిన్న, భిన్న రూపాల విషయాలను ఎన్నిసార్లు పరిష్కరించాము మరియు చేస్తూ చేస్తూ అనుభవజ్ఞులుగా అయిపోయాము! అని భావించాలి. మీరు ఎన్నిసార్ల అనుభవజ్ఞులో గుర్తుందా? అనేక సార్లు చేశాము అన్నది గుర్తుకు వస్తోందా? కలపూర్వం వాటిని దాటారు, క్రాస్ చేసి ఉంటారు. వాటిని మీరు దాటేసారా లేక చేసి ఉంటామేమో అని భావిస్తున్నారా? అనేకసార్లు వీటిని అనుభవం చేసుకోకపోతే నేడు ఇంత సమీపంగా ఎలా రాగలిగేవారము అని భావించరు. మీకు లెక్క వేయడం రాదా? పాండవులైతే లెక్కలు వేయడంలో చురుకుగా ఉండాలి. కాని శక్తులు నెంబర్ వన్‌గా అయిపోయారు. ఈ స్మృతి స్పష్టంగా మరియు సరళ రూపంలో ఉండాలి, దాన్ని లాగవలసిన పనిలేదు. కల్పపూర్వపు విషయమును ఇప్పటివరకు బుద్ధిలోకి లాగుతూ వస్తున్నట్లయితే ఏమౌతుంది? తప్పకుండా ఏదో ఒక మాయ యొక్క ఆకర్షణ ఇప్పటివరకు ఉంది, కావుననే కల్పపూర్వపు స్మృతి బుద్ధిలోకి స్పష్టంగా మరియు సరళరీతిలో రావడం లేదు. కావుననే విఘ్నాలను దాటివేయడంలో కష్టము అనుభవమవుతోంది. నిజానికి ఎటువంటి కష్టము లేదు.

           ఎంతగా పురుషార్థపు సమయము గతించిందో, ఎంతగా జ్ఞానపు శక్తి మరియు ప్రకాశము లభించిందో దాని అనుసారంగా వర్తమాన సమయము సరళంగా మరియు స్పష్టంగా ఉండాలి. ఎంత స్పష్టంగా ఉండాలంటే ఒక్క నిమిషము క్రితం ఏదైనా కార్యమును చేసి ఉన్నట్లయితే ఏవిధంగా అది గుర్తుంటుందో అలా గుర్తుండాలి లేక ఇది కూడా మరిచిపోతారా? అదేవిధంగా 5,000 సంవత్సరాల క్రితం నాటి విషయం కూడా ఒక్క నిమిషం క్రితం చేసిన కార్యములా గుర్తుండాలి. ఏ విధంగా ఏదైనా పవర్‌ఫుల్ కెమెరా ఒక్క క్షణంలో ఎంత స్పష్టముగా చిత్రమును తీయగలదో, ఎంతటి దూరమైన దృశ్యమైనా అది కూడా స్పష్టంగా ముందుకు వచ్చేస్తుందో మరి అలా శక్తివంతమైన కెమెరామెన్‌గా అవ్వలేదా? మరి మీ దగ్గర కెమెరా ఉందా లేక ఇతరులది బదులు తీసుకుని వాడుతున్నారా? అది శక్తివంతంగా ఉందా? కల్పపూర్వపు దృశ్యము అందులో స్పష్టంగా వచ్చేస్తుందా? ఈ మనస్సు కూడా పెద్ద కెమెరా లాంటిది. ప్రతి క్షణం యొక్క దృశ్యము ఇందులోకి రాదా? కెమెరా అయితే అందరి వద్దా ఉంది, కాని కొన్ని కెమెరాలు దగ్గరి చిత్రాలను ఆకర్షించగలవు, మరికొన్ని కెమెరాలు చంద్రుని వరకు కూడా ఫొటోలు తీయగలవు. అది కూడా కెమెరానే, ఇది కూడా కెమెరానే! ఇక్కడ చిన్న చిన్న కెమెరాలు కూడా ఉంటాయి కదా! మరి అందరి వద్దా ఎంతటి శక్తివంతమైన కెమెరాలు ఉన్నాయి? ఎప్పుడైతే వారు చంద్రుని నుండి ఇక్కడి దృశ్యాలను, ఇక్కడి నుండి అక్కడి దృశ్యాలను చిత్రీకరించగలరో అలా మీరు సాకారరూపంలో ఉంటూ నిరాకారీ లోకము లేక ఆకారీ లోకము లేక ఈ మొత్తం సృష్టి యొక్క భూత లేక భవిష్య చిత్రాలను చిత్రీకరించలేరా? కెమెరాను శక్తివంతంగా చేసుకోండి. తద్వారా అందులో ఏ విషయమైనా, ఏ దృశ్యమైనా ఎలా ఉండాలో అలా కనిపించాలి, భిన్న, భిన్న రూపాలలో కనిపించకూడదు. ఎలా ఉందో అలా స్పష్టంగా కనిపించాలి. దీనినే శక్తిశాలీ రూపంగా ఉండడము అని అంటారు. అప్పుడిక ఏ సమస్య అయినా సమస్య రూపంగా ఉంటుందా లేక ఆట రూపంగా అనుభవమవుతుందా? కావున ఇప్పటి స్థితి అనుసారంగా ఇటువంటి స్థితిని తయారుచేసుకోండి,అప్పుడే తీవ్ర పురుషార్థులు అని పిలువబడతారు. ఇటువంటి కెమెరా ద్వారా చిత్రాలను మొదలే తీస్తూ ఉన్నట్లయితే ఆ తరువాత వాటిని కడిగినప్పుడు అవి ఎలా తీశారో అర్థమవుతుంది. అదేవిధంగా రోజంతటిలో తమ ఆటోమేటిక్ కెమెరా ద్వారా అనేక చిత్రాలను తీస్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి కూర్చొని వాటిని ఈ రోజు ఈ కెమెరా ద్వారా ఎటువంటి చిత్రాలను తీశాము అని స్పష్టంగా చూడాలి. ఏ చిత్రాలు ఎలా ఉన్నాయో అలాగే వాటిని చిత్రీకరించామా లేక ఏవైనా పైకి క్రిందికీ అయ్యాయా అని గమనించాలి. అప్పుడప్పుడు కెమెరా సరిగ్గా లేకపోతే తెల్లటి వస్తువులు కూడా నల్లగా అయిపోతాయి, వాటి రూపం మారిపోతుంది. అప్పుడప్పుడు వాటి రూపురేఖలు కూడా మారిపోతాయి. అలాగే ఇక్కడ కూడా అప్పుడప్పుడు కెమెరా సరిగ్గా, క్లియర్ గా లేని కారణంగా విషయం సమస్యగా అయిపోతుంది, దాని రూపురేఖలు మారిపోతాయి, దాని రంగు, రూపం కూడా మారిపోతుంది. అప్పుడప్పుడు యథార్థముగా అయథార్థ రూపంగా తీసుకోవడం జరుగుతుంది. కావున ఎల్లప్పుడు మీ కెమెరాను క్లియర్ గా మరియు పవర్ ఫుల్ గా చేసుకోండి. స్వయమును సేవాధారిగా భావించడం ద్వారా త్యాగము, తపస్సు అన్నీ వచ్చేస్తాయి. నేను సేవాధారిని మరియు సేవ కొరకే ఈ జీవితం ఉంది అని భావించడం ద్వారా ఒక్క క్షణం కూడా సేవ లేకుండా పోదు. కావున సదా స్వయమును సేవాధారిగా భావిస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే స్వయమును వృద్ధులుగా కూడా భావించండి, అప్పుడిక చిన్న చిన్న విషయాలు బొమ్మలుగా కనిపిస్తూ ఉంటాయి, దయార్ద్రహృదయులు గా అయిపోతారు. తిరస్కారానికి బదులుగా దయ కలుగుతుంది. అచ్ఛా!

Comments