* 03-06-1971 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“నిరంతర యోగయుక్తులుగా అయ్యేందుకు కమల పుష్ప ఆసనము.”
ఈరోజు ఏ రోజు? భట్టీ రోజు. భట్టి రోజును ఏ రోజని అంటారు? భట్టీ ప్రారంభపు రోజు అనగా జీవిత నిర్ణయం తీసుకునే రోజు. భట్టీలోకి ఎందుకు వస్తారు? సదాకాలము కొరకు జీవిత నిర్ణయమును తీసుకునేందుకు వస్తారు. అందరూ ఈ లక్ష్యముతోనే వచ్చారు కదా! ఎందుకంటే భట్టీలోకి రావటం ద్వారా బాప్ దాదా ద్వారా లేక అనన్య పిల్లల ద్వారా ఒక కానుక లభిస్తుంది. అది ఏ కానుక? లభించిన దానిని గురించి వినపించటము కూడా సహజమౌతుంది. (ఇద్దరు-నలుగురు వారి వారి ఆలోచనలను వినిపించారు) ఏ విషయాలనైతే వినిపించారో ఆ అన్ని విషయాలు ప్రాప్తించటానికి ఆధారమైన కానుక ఏది? అది బుద్ధి పరివర్తన. రజోగుణపు లేక వ్యక్త భావపు బుద్ధి నుండి మారి సతోగుణీ, అవ్యక్త భావపు దివ్య బుద్ధిగా అవ్వాలి. ఈ దివ్య బుద్ధి ప్రాప్తించడము ద్వారానే అవ్యక్త స్థితి లేక యోగయుక్త స్థితిని ప్రాప్తించుకోగలరు. కావున కానుక ఏది? “దివ్య సతోగుణీ బుద్ధి”. బుద్ధి పరివర్తన ద్వారానే జీవన పరివర్తన జరుగుతుంది. మరి దివ్య బుద్ధి అనే కానుక విశేషంగా భట్టిలో ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఆ కానుక(గిఫ్ట్)ను ఉపయోగించటము మరియు సదాకాలము కొరకు స్థిరంగా ఉంచుకోవటము అన్నది మీ చేతిలోనే ఉంది. కానీ గిఫ్ట్ అయితే అందరికీ లభిస్తుంది. ఎవరైతే భట్టీలోకి వచ్చారో వారు దివ్య సతోగుణీ బుద్ధి అనే గిఫ్ట్ ద్వారా తమను తాము చాలా సహజంగా మరియు చాలా త్వరగా పరివర్తనలోకి తీసుకురాగలరు. కావున ఈరోజు జీవితపరివర్తనా దినము. కావున ఈ రోజు ఏ గిఫ్ట్ అయితే ప్రాప్తిస్తుందో దానిని ధారణ చేస్తూ ఉండాలి. జ్ఞానాన్నైతే వింటూనే ఉంటారు, కానీ భట్టీలోకి ఎందుకు వస్తారు? జ్ఞానస్వరూపులుగా అయ్యేందుకు వస్తారు కదా! యోగపు జ్ఞానము ఉంది, యోగ అభ్యాసమును కూడా చేస్తూ వచ్చారు, కానీ సదా యోగయుక్తులై ఉండే పాఠాన్ని దృఢం చేసుకొనేందుకు భట్టీలోకి వస్తారు. నిరంతర యోగయుక్తులుగా అయ్యేందుకు ఎటువంటి సహజ యుక్తిని భట్టి ద్వారా ప్రాప్తింపచేసుకోవాలి? హఠము లేక తపస్సు చేసే హఠయోగులెవరైతే ఉంటారో వారు తపస్సు చేసే సమయంలో ఆసనంపై కూర్చుంటారు. భిన్న భిన్న ఆసనాలు ఉంటాయి. మరి మీ కొరకు సదా యోగయుక్తులుగా అయ్యేందుకు ఏ ఆసనము కావాలి? నిరంతర యోగయుక్త స్థితి సహజంగా ఉండేందుకు బాప్ దాదా సహజ ఆసనాన్నిగురించి తెలుపుతున్నారు, అది కమలపుష్ప ఆసనము. కమల ఆసనము అని అంటారు కదా! దేవతా చిత్రాలు వేటినైతే తయారుచేస్తారో వాటిలో దేవతలను వేటి పైన నిల్చున్నట్లు లేక కూర్చున్నట్లుగా చూపిస్తారు? కమలముపై. కావున నిరంతరము కర్మ చేస్తూ కూడా సహజముగా యోగయుక్తముగా అయ్యేందుకొరకు ఎల్లప్పుడూ కమల ఆసనము వలె అనగా మీ స్థితిని కమలపుష్ప సమానంగా ఉంచుకొన్నట్లయితే నిరంతర యోగయుక్తులుగా అయిపోతారు. కానీ కమలపుష్పములా అయ్యి ఈ ఆసనముపై ఈ స్థితిలో ఉండేందుకొరకు ఏం చెయ్యవలసి వస్తుంది? స్వయాన్ని లైట్ గా చేసుకోవలసి ఉంటుంది. తేలికగా కూడా మరియు ప్రకాశ స్వరూపముగా కూడా. కమల పుష్పము ఎంత జ్ఞానయుక్తమైనది! కమలపుష్పము చూసినప్పుడు జ్ఞాన స్మృతి వస్తుంది కదా! కావున కమల ఆసనముపై సదా విరాజమానమవ్వటం ద్వారా యోగయుక్తులుగా అవ్వగలరు. ఆసనమును ఎప్పుడూ వదలవద్దు. ఈ కమలపుష్ప సమాన స్థితి అనే ఆసనాన్ని సదా స్థిరంగా ఉంచుకోవాలి అనగా దానిపై సదా స్థితులై ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో కూడా రాజ్య సింహాసనము అంతే సమయము స్థిరంగా ఉంటుంది. ఒకవేళ ఈ సింహాసనముపై కూర్చోలేకపోయినట్లయితే అనగా ఈ స్థితిలో స్థితులై ఉండలేనట్లయితే సింహాసనమును కూడా ప్రాప్తింపచేసుకోలేరు. కావున రాజ్య సింహాసనమును ప్రాప్తింపచేసుకొనేందుకు మొదట కమల ఆసనముపై స్థితుల్లో ఉండే అభ్యాసము చెయ్యవలసి ఉంటుంది. స్వయాన్ని అన్ని రకాల బంధనాల నుండి విముక్తం చేసుకొని తేలికగా అయ్యేందుకు లేక సదా కమలపుష్ప స్థితిలో స్థితులయ్యే ఆసనంపై విరాజమానమై ఉండే అభ్యాసమును నేర్చుకొనేందుకు భట్టీలోకి వచ్చారు. కావున ఏవిధమైన భారము ఉన్నా ఆ అన్ని రకాల భారాన్నంతటినీ భట్టీలో అంతము చేసి వెళ్ళాలి. మనస్సులోని సంకల్పాల భారమైనా, సంస్కారాల భారమైనా, ప్రపంచములోని ఏ వినాశీ వస్తువు పట్ల ఆకర్షితమయ్యే భారమైనా, లౌకిక సంబంధాలపై గల మమతల భారమైనా, అన్ని రకాల భారమనండి లేక బంధనమనండి, వాటిని అంతము చేసేందుకు భట్టీలోకి వచ్చారు. ఇప్పుడు మీ జీవిత ఉన్నతికి ఈ భట్టీ ఒక సువర్ణ అవకాశము. ఈ ఛాన్స్ లో ఎవరు ఎంత అవకాశానాన్ని తీసుకుంటారో అంతగానే సదాకాలము కొరకు వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరు. ఏ లక్ష్యమును ఉంచుకొని భట్టీకి వచ్చారు? సంస్కారాలను పరివర్తనలోకి తీసుకువచ్చి మళ్ళీ ఎలా తయారయ్యే లక్ష్యమును ఉంచారు? ఈ గ్రూపు విశేషంగా ఏ విషయంలో మిగిలిన అన్ని గ్రూపుల కంటే మంచిదో తెలుసా? ఈ గ్రూపుకు చాలా మంచి విశేషత ఒకటి ఉంది. బంగారములో కల్తీ కలిసిన తరువాత ఆ బంగారమును మోల్డ్ చేయలేరు(మలచలేరు). అసలైన బంగారము ఉన్నట్లయితే దానిని మోల్డ్ చెయ్యగలరు. అప్పుడే ఇది సత్యమైన బంగారము, ఇందులో ఎటువంటి కల్తీ లేదు అని భావిస్తారు. మీకు మీలో గల విశేషత తెలుసా? ఈ గ్రూపును చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే - వృక్షము ఎప్పుడైతే క్రొత్తగా నాటబడుతుందో అప్పుడు మొదట చాలా కోమలమైన, సుందరమైన చిన్ని చిన్ని ఆకులు వెలువడుతాయి, అవి చాలా ప్రియంగా అనిపిస్తాయి. మరి ఈ గ్రూపు కూడా క్రొత్త ఆకులు, కానీ కోమలమైనవి. కోమలమైన వస్తువులు, కఠినమైన వస్తువులు ఉంటాయి కదా! కోమలము అనగా సంస్కారాలనే ఎముకలు మలచుకోవటానికి వీలులేనంత కఠినముగా లేవు. చిన్న పిల్లల ఎముకలు మొదట సున్నితంగా ఉంటాయి తరువాత పెద్దగా అయ్యేకొద్దీ గట్టిబడుతూ ఉంటాయి. ఈ గ్రూపు కూడా కోమల సంస్కారాలు కలిగిన గ్రూపు. ఈ సంస్కారాలను పరివర్తన చెయ్యటము సహజమైపోతుంది. కఠిన సంస్కారాలు కలిగినవారైతే కాదు కదా!
*(దాదీజీ రెండు రోజులు మద్రాసు సేవకై వెళ్ళేందుకు బాప్ దాదా నుండి సెలవు తీసుకొంటూ ఉన్నారు)*
ఎవరైతే విశ్వానికి రాజుగా అవుతారో వారి విశేషత - సర్వ ఆత్మలను రాజీ(సంతోష) పరచటము, మహారథుల అడుగడుగులో పదమాల సంపాదన ఉంటుంది. (సీతామాత కూడా సెలవు తీసుకొంటున్నారు). మిమ్మల్ని మీరు సమర్థ ఆత్మగా భావించి ఈ శరీరమును చూస్తున్నారా? సాక్షీ స్థితిలో స్థితులవ్వటం ద్వారా శక్తి లభిస్తుంది. ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే వారిలో శక్తిని నింపేందుకు ఏవిధంగా గ్లూకోజ్ ను ఎక్కిస్తారో అలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు శరీరము నుండి అతీతముగా అశరీరి ఆత్మగా భావిస్తారో అప్పుడు ఈ సాక్షీ స్థితి శక్తిని నింపే కార్యమును చేస్తుంది. మరియు ఎంత సమయము సాక్షీ స్థితి ఉంటుందో అంతగానే సహచరుడైన తండ్రి స్మృతి కూడా ఉంటుంది అనగా తోడు ఉంటారు. కావున తోడు కూడా మరియు సాక్షి కూడా. ఒకటి సాక్షీ స్థితి యొక్క శక్తి, రెండవది తండ్రికి సహచరునిగా అయిన సంతోషమనే ఔషధము. అప్పుడు ఇక ఎలా అవుతారో చెప్పండి? నిరోగి. శక్తి రూపము అతీతము మరియు ప్రియము. ఈ సమయములో అటువంటి అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో స్థితులయ్యారా? ఈ స్థితి ఎంతటి శక్తివంతమైనదంటే - క్రిములను అంతం చేసేందుకు డాక్టర్లు ఏవిధంగా కరెంటు రేసేస్ ను ఇస్తారో, అలా ఈ స్థితి కూడా ఒక్క క్షణములో అనేక వికర్మల రూపీ క్రిములను నాశనము చేసేంతటి శక్తివంతమైనది. వికర్మలు భస్మమైనట్లయితే మిమ్మల్ని మీరు తేలికగా, శక్తిశాలిగా అనుభవము చేసుకుంటారు. ప్రవృత్తిని కూడా ఎల్లప్పుడూ సేవా భూమిగా భావించాలి. మిమ్మల్ని బాప్ దాదాకు అతి ప్రియమైనవారుగా భావిస్తారు, ఎందుకని? అతి ప్రియమైనవారుగా అనిపించేందుకు ఏ విశేషత ఉంది? ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు, ఇలా ఒక్కరి లగనములోనే ఉండేవారు తండ్రికి అతిప్రియమైనవారు. అర్థమైందా - అచ్ఛా!
Comments
Post a Comment