03-02-1976 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ధర్మం మరియు కర్మ యొక్క కంబైండ్ రూపం.
గుణమూర్తి, త్యాగమూర్తి అయిన దీదీగారు మరియు తన పిల్లలతో అవ్యక్తబాప్ దాదా మధుర సంభాషణ చేస్తూ, విశేష యుగం అయిన సంగమయుగం యొక్క విశేషతలను వివరిస్తూ పలికిన మధుర మహావాక్యాలు -
ఈనాటి ప్రపంచంలో ధర్మం మరియు కర్మ విశేషంగా మహిమ చేయబడుతున్నాయి. ధర్మం మరియు కర్మ ఈ రెండూ అవసరమే, కానీ ఈనాడు ధర్మం వారు వేరుగా, కర్మ వారు వేరుగా అయిపోయారు. కర్మ చేసేవారు ధార్మిక విషయాలు చేయకండి అని అంటున్నారు, ధర్మం వారు మేము కర్మ సన్యాసులం అని అంటున్నారు. కాని సంగమయుగంలో బ్రాహ్మణులు ధర్మం మరియు కర్మను కలిపి చేస్తున్నారు. మరయితే రోజంతటిలో ధర్మం మరియు కర్మ కంబైండ్ రూపంలో ఉంటున్నారా? ధర్మం అంటే అర్థం - దివ్యగుణాలు ధారణ చేయటం. స్వరూపం, దివ్యగుణాలు, స్మృతి స్వరూపం ఇలా అన్ని ధారణలు ఉండాలి. ఏ ధారణని అయినా ధర్మం అని అంటారు. కనుక రోజంతటిలో ఎంతటి బాధ్యతాయుత కర్మ అయినా కానీ అంటే స్థూల కర్మ అయినా, సాధారణ కర్మ అయినా లేదా బుద్ధిని ఉపయోగించి చేయవలసిన కర్మ అయినా కానీ ప్రతి కర్మలో ధారణ అంటే ధర్మం మరియు కర్మ కలిసి ఉంటున్నాయా? ఎక్కువమంది యొక్క ఫలితం ఏమిటి?
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు లేదా ఒక చేతికి రెండు లడ్డూలు రావు అని అంటారు. కానీ సంగమయుగంలో అసంభవ విషయం సంభవం అవుతుంది. ఇక్కడ ఒకే సమయంలో రెండూ వెనువెంట ఉంటాయి. ధర్మం ఉండాలి మరియు కర్మ కూడా చేయాలి. దీని గురించే అభ్యాసం చేయిస్తున్నారు. సంగమయుగం విశేష యుగం. ఎందువలన విశేషం అంటే ఈ యుగంలో ఏవైతే విశేషతలు ఉన్నాయో అవి ఇతర యుగాల్లో ఉండవు. ఇతర యుగాలకు లేని విశేషతలన్నీ సంగమయుగానికి ఉంటాయి, అందువలనే విశేష యుగం అని అంటారు. ఎవరైతే ధర్మం మరియు కర్మ కంబైండ్ రూపం యొక్క అభ్యాసిగా ఉంటారో వారే సంగమయుగం యొక్క కంబైండ్ రూపం అయిన తండ్రి మరియు పిల్లలు మరియు ప్రాలబ్దం యొక్క కంబైండ్ రూపం అయిన శ్రీ లక్ష్మి నారాయణులు ఈ రెండు కంబైండ్ రూపాలను అనుభవం చేసుకోగలరు లేదా అధికారిగా కాగలరు. మరయితే రెండూ వెనువెంట కలిసి ఉంటున్నాయా? ఎక్కువమందికి ఉంటుందా లేదా? ఫలితం ఏవిధంగా ఉందనుకుంటున్నారు? అందరూ ఈ అభ్యాసంలో నిమగ్నమై ఉన్నారా? ఎప్పుడైతే నిరంతరం ఈ కంబైండ్ రూపంగా అవుతారో అప్పుడే ప్రాలబ్దం యొక్క కంబైండ్ రూపాన్ని అంటే శ్రీలక్ష్మీ నారాయణుల యొక్క కంబైండ్ రూపాన్ని ధారణ చేయగలరు. కర్మలో ధర్మం కలిసి లేకపోతే అది సాధారణ కర్మ అయిపోయింది కదా? అందువలన ప్రతి కర్మలో ధర్మం యొక్క రసాన్ని నింపాలి.
ధర్మం మరియు కర్మ రెండూ వెనువెంట ఉన్నాయా లేక ధర్మాన్ని వేరు చేసేసి కర్మ చేస్తున్నారా? లేక ధర్మం సమయంలో కర్మను వేరు చేసేస్తున్నారా? అలా చేస్తే అది కూడా నివృత్తి మార్గం అయిపోతుంది. నివృత్తి మార్గంలో ఒకటే ఉంటుంది. ప్రవృత్తి అంటే కంబైండ్. ఆది నుండి కంబైండ్ పాత్ర , ప్రవృత్తి మార్గంలోని వారు కనుక పురుషార్థం కూడా ప్రవృత్తి పురుషార్థం ఉండాలి. కానీ నివృత్తి మార్గానిది ఉండకూడదు అంటే ఒక్కటే ఉండకూడదు. వారు కుటుంబాన్ని వదిలేసి వేరుగా వెళ్ళిపోతారు. అదేవిధంగా ధర్మాన్ని వదిలేసి కర్మలో నిమగ్నం అయిపోతే అది కూడా నివృత్తి మార్గం అయిపోతుంది. సదా ప్రవృత్తి మార్గంలో ఉండాలి ఇటువంటి అభ్యాసం అందరికి సంపన్నం అయినప్పుడు సమయం కూడా సంపన్నం అవుతుంది. ఎందుకంటే ప్రవృత్తి మార్గం యొక్క సంస్కారాన్ని పురుషార్థి జీవితంలో నింపుకోవాలి. ఇప్పటి నుండే ఈ కంబైoడ్ రూపం యొక్క సంస్కారాన్ని నింపుకోకపోతే అక్కడ ఏవిధంగా ఉంటుంది? అద్భుతమైన ప్రవృత్తి మార్గం కదా? ధర్మం మరియు కర్మ యొక్క ప్రవృత్తి మార్గం అని అనండి లేదా కర్మ మరియు యోగం యొక్క ప్రవృత్తి మార్గం అని అనండి ఎలా అనినా కానీ విషయం ఒక్కటే. మంచిది.
Comments
Post a Comment