02-08-1973 అవ్యక్త మురళి

* 02-08-1973         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

యదార్ధ విధి ద్వారా సిద్ధి యొక్క ప్రాప్తి.

           విధి ద్వారా స్వయంలో సిద్ధి యొక్క ప్రాప్తి లభిస్తుంది అని భావిస్తున్నారా? ఎందుకంటే పురుషార్థం ఎవరైతే చేస్తారో వారి పురుషార్థపు లక్ష్యమే సిద్ధిని పొందడము. ఏ విధంగా ప్రపంచంలోని వారి వద్ద ఈ మధ్య రిద్ధులు, సిద్ధులు చాలా ఎక్కువగా ఉన్నాయో అలా ఇక్కడ ఉన్నది విధి ద్వారా సిద్ధి. యథార్థమైనవి విధి మరియు సిద్ధి. దీనినే వేరే రూపంలో తీసుకున్న కారణంగా వారు రిద్ధి, సిద్ధులలోకి వెళ్ళిపోయారు. మరి మీరు స్వయమును సిద్ధి స్వరూపులుగా భావిస్తున్నారా? మీరు ఏ సంకల్పాలనైతే చేస్తారో అవి యథార్థముగా, విధిపూర్వకంగా ఉన్నట్లయితే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. విధి సరిగ్గా లేనట్లయితే సిద్ధి కూడా లేనట్లుగానే భావించండి. కావున భక్తిమార్గంలో ఎవరు ఏ కార్యమును చేసినా లేక చేయించినా దాని విలువ వారు అవలంబించే విధిపైనే ఉంటుంది. విధిపూర్వకంగా ఉన్న కారణంగానే వారు ఆ సిద్ధిని అనుభవం చేసుకుంటారు. అన్నింటి ప్రారంభము ఇక్కడినుండే జరిగింది కదా! కావుననే స్వయమును సిద్ధిస్వరూపంగా భావిస్తున్నారా లేక ఇప్పుడు ఇంకా అలా అవ్వాలా? అని అడగడం జరుగుతుంది. సమయానుసారంగా రెండు క్షేత్రాలలోను పరిణామ స్వరూపంగా ఇప్పటివరకు 95 శాతము రిజల్టు తప్పకుండా ఉండాలి. 

           సమయపు వేగమును చూస్తున్నారు, అలాగే ఛాలెంజ్ ను కూడా చేస్తున్నారు కావున ఏ చాలెంజ్  అయితే చేసారో అది, ఎప్పుడైతే మీ స్థితి సంపన్నంగా అవుతుందో అప్పుడే సంపన్నమవుతుంది. ఈ ఛాలెంజ్  నేదైతే చేస్తారో అది ఏ ఆధారంపై పరివర్తన అవుతుంది? దాని ఆధార శిల ఎవరు? దానికి మీరే ఆధార శిల(పునాది). అదే దృఢంగా లేకపోతే ముందు ముందు కార్యం ఎలా నడుస్తుంది? ఎప్పుడైతే పునాది లేక ఆధార శిల సిద్ధమైపోతుందో అప్పుడు దాని తర్వాత నెంబర్ వారీగా రాజధాని కూడా సంసిద్ధమవుతుంది. కావున ఎవరైతే రాజ్యం చేసే అధికారులుగా అవ్వాలో వారు తమ అధికారమును తీసుకోకపోతే మరి ఇతరులకు నెంబర్ వారీగా అధికారం ఎలా ప్రాప్తమవుతుంది? ఎప్పటివరకైతే మీకు విధి ద్వారా సిద్ధి సిద్ధించదో, అప్పుటివరకు మరి ఈ విశ్వకళ్యాణ కర్తవ్యంలో కూడా సిద్ధి ఎలా లభించగలదు? మొదట స్వయం యొక్క సిద్ధి లభిస్తుంది. ఇంత పెద్ద కర్తవ్యమును ఇంత కొద్ది సమయంలో సంపన్నం చేయాలంటే ఎంత తీవ్రమైన వేగం ఉండాలి? మరి ఏ విధంగా ఈ వేగమును పూర్తిచేయాలో, అనగా సిద్ధిస్వరూపులుగా ఎలా తయారవ్వాలి అన్నదానికి ఏదైనా ప్లాన్ ను తయారుచేశారా? దాని ద్వారా సంకల్పం చేయగానే సిద్ధి ప్రాప్తమవ్వాలి. ఇది 100 శాతం సిద్ధిస్వరూపులుగా అయ్యేదానికి గుర్తు. కర్మ చేయగానే సిద్ధి ప్రాప్తమవుతుంది.

           ఎప్పుడైతే సాధారణ జ్ఞానపు ఆధారంపై రిద్ధి-సిద్దులను ప్రాప్తించుకోగలరో అప్పుడు మరి శ్రేష్ఠ జ్ఞానం ఆధారంపై విధి ద్వారా సిద్ధిని ప్రాప్తించుకోలేరా? ఏ విధిలో లోపం ఉండిపోతుంది? ఆ కారణంగా సిద్ధి కూడా సంపూర్ణంగా అవ్వదు అన్న చెకింగ్ కావాలి. విధిని పరిశీలించడం ద్వారా సిద్ధి దానంతట అదే ప్రాప్తమైపోతుంది. ఇందులో కూడా సిద్ధి లభించకపోవడానికి ముఖ్య కారణము - ఒకే సమయంలో మూడు రూపాలతో సేవ చేయడం లేదు. మూడు రూపాలు మరియు మూడు విధాలుగా ఒకే సమయంలో చేయాలి. నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్ మరియు లవ్ ఫుల్. ఇందులో లవ్ మరియు లా ఈ రెండూ తోడుగా వచ్చేస్తాయి. ఈ రెండు రూపాల ద్వారా సేవ చేయవలసిందే. కాని, ఈ మూడు విధాలుగాను చేయాలి అనగా మనసా, వాచా మరియు కర్మణా ఈ మూడు విధాలుగానూ మరియు ఒకే సమయంలో ఈ మూడు రూపాలతోను చేయాలి. ఎప్పుడైతే వాణి ద్వారా సేవ చేస్తారో అప్పుడు మనస్సు కూడా శక్తిశాలిగా ఉంటుంది. శక్తి శాలీ స్థితి ద్వారా వారి మనస్సును కూడా మార్చివేస్తారు మరియు వాణి ద్వారా వారిని నాలెడ్జ్ ఫుల్ గా చేసేస్తారు మరియు కర్మణా ద్వారా అనగా ఎవరెవరైతే వారి సంపర్కంలోకి వస్తారో వారి సంపర్కం ఎంత ప్రేమపూరితంగా ఉండాలంటే, దాని ద్వారా వారు దానంతట అదే తాము తమ ఈశ్వరీయ పరివారంలోకి చేరుకున్నాము అని వారికి అన్పించాలి. వారి నడవడిక ఎలా ఉండాలంటే నిజానికి ఇదే నా వాస్తవిక పరివారము అని వారు అనుభవం చేసుకోవాలి.

           ఈ మూడు విధాలుగాను వారి మనస్సును కూడా కంట్రోల్ చేసినట్లయితే మరియు వాణి ద్వారా జ్ఞానమునిస్తూ లైట్ మరియు మైట్ యొక్క వరదానమును ఇచ్చినట్లయితే మరియు కర్మణ అనగా సంపర్కం ద్వారా, మీ స్థూలమైన యాక్టివిటీ ద్వారా ఈశ్వరీయ పరివారం యొక్క అనుభవమును కలిగించినట్లయితే మరి ఈ విధిపూర్వక సేవను చేయడం ద్వారా సిద్ధి లభించదా? కారణమేమిటంటే మీరు ఒకే సమయంలో మూడు విధాలుగా మరియు మూడు రూపాలతో సేవ చేయడం లేదు. ఎప్పుడైతే మీరు వాచాలోకి వస్తారో అప్పుడు ఏ మనస్సయితే శక్తిశాలిగా ఉండాలో అది అలా ఉండదు, అది తక్కువైపోతుంది మరియు ఎప్పుడైతే రమణీకమైన యాక్టివిటీ ద్వారా ఎవరినైనా సంపర్కంలోకి తీసుకువచ్చినా మనస్సేదైతే శక్తిశాలిగా ఉండాలో అది అలా ఉండదు. కావున ఒకే సమయంలో ఈ మూడూ కలిసి ఉన్నట్లయితే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా సేవ చేసే అభ్యాసము మరియు అటెన్షన్ కావాలి. వీరు వారితో లోతైన సంపర్కంలోకి రారు కేవలం ఏదో పైపైన సంపర్కంలోకి వస్తారు. కావున ఆ పైపైన ఉండే సంపర్కం అల్పకాలికంగానే ఉంటుంది. మీరు వారిని ప్రేమలోకి తీసుకువచ్చినా కాని లవ్ ఫుల్ గా ఉండడంతో పాటు శక్తిశాలిగా కూడా ఉండాలి. తద్వారా ఆ ఆత్మలలో కూడా శక్తిని నింపాలి. తద్వారా వారు సమస్యల యొక్క, వాయుమండలం యొక్క వైబ్రేషన్లను ఎదుర్కొని సదాకాలికంగా సంబంధంలో ఉండాలి. కాని, అది జరుగదు. వారు జ్ఞానానికైనా ఆకర్షితులవుతారు లేక ప్రేమకైనా ఆకర్షితులవుతారు. ఎక్కువగా వారు ప్రేమ పైనే ఆకర్షితులవుతారు. ఆ తర్వాత రెండవ నెంబరులో జ్ఞానానికి ఆకర్షితులవుతారు. కాని, జ్ఞానస్వరూప స్థితి ఎలా ఉండాలంటే, ఏ విషయం ముందు ఉన్నాకాని వారు చలించకూడదు. ఇప్పుడు కేవలం ఈ లోపం ఉంది.

           ఎవరైతే సేవాధారులుగా నిమిత్తులుగా అవుతారో వారిలో కూడా జ్ఞానం ఎక్కువగా ఉంది, ప్రేమ కూడా ఉంది, కాని శక్తి తక్కువగా ఉంది. శక్తిశాలీ స్థితికి గుర్తు ఏమిటి? ఒక్క క్షణంలో ఏ వాయుమండలమునైనా లేక వాతావరణమునైనా లేక మాయ యొక్క ఎటువంటి సమన్యనైనా వారు అంతం చేసేస్తారు. వారు ఎప్పుడూ ఓటమిని పొందరు. ఏ ఆత్మలైతే సమస్యా స్వరూపంగా అయి వస్తారో వారిపై వారు బలిహారమవుతారు. దానినే వేరే పదాలలో ప్రకృతి దాసి అవుతుంది అని అంటారు. ఎప్పుడైతే పంచతత్వాలు దాసిగా అవ్వగలవో అప్పుడు మరి మనుష్య ఆత్మలు బలిహారమవ్వలేరా? కావున శక్తిశాలీ స్థితికి ప్రాక్టికల్ స్వరూపము ఇదే. కావుననే ఒకే సమయంలో మూడు రూపాలతో సేవ చేసే రూపురేఖ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ప్రతి కర్తవ్యంలోను సిద్ధి కనిపిస్తుంది అని అనడం జరుగుతుంది. కావున విధి కారణంగానే సిద్ధి లభించింది కదా! విధిలో లోపం ఉన్న కారణంగానే సిద్ధిలో కూడా లోపం ఉంది కదా! కావున ఇప్పుడు సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు ఈ విధిని మొట్టమొదట సరిచేయండి. భక్తిమార్గంలో సాధన చేస్తారు. కాని, ఇక్కడ ఉన్నది సాధనాలు. ఏ సాధనాలు? బాప్ దాదాలోని ప్రతి ఒక్క విశేషతను స్వయంలో ధారణ చేస్తూ చేస్తూ విశేష ఆత్మగా అయిపోతారు. ఏ విధంగా పరీక్ష రోజులు ఎప్పుడైతే సమీపంగా ఉంటాయో, అప్పుడు మీరు ఏదైతే చదివి ఉంటారో అది థియరీ కాని లేక ప్రాక్టికల్ కాని ఆ రెండింటినీ రివైజ్ చేసి ఏ సబ్జెక్టులో ఏ ఏ లోపం మిగిలి ఉంది అని ఏవిధంగా పరిశీలిస్తారో, అదేవిధంగా ఇప్పుడు సమయం సమీపంగా వస్తున్న తరుణంలో మరి ప్రతి సబ్జెక్టులోను, ఏ ఏ సబ్బెక్టులో మరియు ఎంత శాతం వరకు లోపం మిగిలి ఉంది అని పరిశీలించుకోండి. థియరీలో మరియు ప్రాక్టికల్ లో కూడా రెండింటిలోను పరిశీలించుకోవాలి. ప్రతి సబ్జెక్టులోను లోపాన్ని చూసుకుంటూ మిమ్మల్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కాని, ఎప్పుడైతే మొదట రివైజ్ చేయడం ద్వారా తమ లోపాలను గుర్తించగలరో అప్పుడే అది పూర్తవుతుంది. సబ్జెక్టుల గురించి మీకు తెలుసు. సబ్జెక్టులను బుద్దిలో ధారణ చేశారా లేదా అన్నది గుర్తించడం ఎలా? ఏ విధంగా సిద్ధి యొక్క శాతం పెరిగిపోతూ ఉంటుందో అలా టైం కూడా వ్యర్థంగా పోదు. కొద్ది సమయంలో సఫలత ఎక్కువగా లభిస్తుంది. దీనినే సిద్ధి అని అంటారు. ఒకవేళ సమయమును ఎక్కువగా, శ్రమను కూడా ఎక్కువగా వినియోగించినట్లయితే అప్పుడు సఫలత లభించినా దానిని కూడా తక్కువ శాతం అనే అంటారు. అన్నివిధాలుగాను అది తక్కువగా అనిపించాలి. తనువును కూడా తక్కువగా ఉపయోగించాలి, సంకల్పాలను కూడా తక్కువగా వాడాలి. లేకపోతే ఎన్ని సంకల్పాలను చేస్తారు? ప్లాను చేస్తూ చేస్తూ నెలన్నర పడుతుంది. కావున సమయం లేక సంకల్పాలు మీ సర్వశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వశక్తుల ఖజానాలను ఎక్కువగా కార్యంలో వినియోగించకూడదు అనగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రఖ్యాతమవ్వాలి. ఎటువంటి సంకల్పాలు ఉత్పన్నమవ్వాలంటే వాటి ద్వారా సిద్ధి ప్రాప్తించాలి. ఎందులోనైతే సఫలత లభిస్తుందో ఆ సమయమే నిశ్చితమవుతుంది, దీనినే సిద్ధి స్వరూపము అని అంటారు.

           కావున అన్ని సబ్జెక్టులలోను మనం ఎంతవరకు పాసయ్యాము అన్నది గుర్తించడం ఎలా? ఎవరు ఎన్ని సబ్జెక్టులలో పాసవుతారో అంతగానే ఆ సబ్జెక్టుల ఆధారంపై ఆబ్జెక్ట్ మరియు రెస్పెక్ట్ (లక్ష్యము మరియు గౌరవము) లభిస్తాయి. అలాగే ప్రాప్తి యొక్క అనుభవం కూడా కలుగుతుంది. జ్ఞానపు సబ్జెక్ట్ ఏదైతే ఉందో, దాని ద్వారా లైట్ మరియు మైట్ అనే లక్ష్యము ప్రాప్తమవుతుంది. వారు ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. ఆ జ్ఞానపు సబ్జెక్టు ఆధారముపై దైవీ పరివారము నుండైనా కానీ లేక ఇతర ఆత్మలనుండైనా కానీ గౌరవము కూడా అంతే లభిస్తుంది. ఈ రోజుల్లోని మహాత్ములకు ఇంత గౌరవము ఎందుకు లభిస్తుంది? ఎందుకంటే ఏ సాధన అయితే చేసారో మరియు ఏ సబ్జెక్టులనైతే అధ్యయనం చేస్తారో వాటి లక్ష్యము లేక గౌరవమే వారికి లభిస్తుంది మరియు ప్రకృతి కూడా దాసిగా అవుతుంది. కావున ఇది జ్ఞానమును గూర్చిన విషయము అలాగే యోగమును గూర్చిన సబ్జెక్టు కూడా ఉంది, దాని లక్ష్యము ఏమిటి.

           యోగం అనగా స్మృతి అనే శక్తి ద్వారా లభించవలసిన లక్ష్యం ఏమిటంటే - వారు ఏ సంకల్పాలు చేసినా అవి సమర్థంగా ఉంటాయి మరియు ఏ సమస్య అయితే రానున్నదో అది ముందే యోగశక్తి ద్వారా ఇది జరుగనున్నది అని అనుభవమవుతుంది. కావున అది ముందే తెలిసి ఉన్న కారణంగా వారు ఎప్పుడూ ఓడిపోజాలరు. అలాగే యోగ శక్తి ద్వారా తమ గత సంస్కారాల భారమును అంతం చేసుకుంటారు. ఏ సంస్కారాలు తమ పురుషార్థంలో విఘ్నరూపంగా అవ్వవు. దేనినైతే స్వభావము అని అంటారో అది కూడా పురుషార్థంలో విఘ్నరూపంగా అవ్వదు. కావున ఏ సబ్జెక్టు యొక్క లక్ష్యమైతే ఉంటుందో అది అనుభవమవ్వాలి. లక్ష్యం ఉన్నట్లయితే దాని పరిణామంగా గౌరవము తప్పకుండా లభిస్తుంది. మీరు మీ నోటి ద్వారా ఏ పదాలనైతే రిపీట్ చేస్తారో లేక ఏ ప్లానులనైతే తయారుచేస్తారో అవి సమర్థంగా ఉన్న కారణంగా వాటిని అందరూ గౌరవిస్తారు అనగా ఒకరికొకరు ఏ సలహాలనైతే ఇస్తారో ఆ సలహాలకు అందరూ గౌరవమును ఇస్తారు. ఎందుకంటే అవి సమర్థంగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రతి సబ్జెక్టును చూడండి.

           దివ్య గుణాలు లేక సేవా సబ్జెక్టేదైతే ఉందో దాని ప్రాప్తి ఏమిటంటే - అందరూ సమీపంగా సంబంధంలోకి రావాలి. సమీపంగా మరియు సంబంధంలోకి రావడం ద్వారా గౌరవం దానంతట అదే లభిస్తుంది. ఈ విధంగా ప్రతి సబ్జెక్టు యొక్క లక్ష్యాన్ని పరిశీలించండి. అలాగే ఆ లక్ష్యాన్ని పరిశీలించుకునే సాధనము - గౌరవము. నేను జ్ఞాన సంపన్నంగా ఉన్నట్లయితే నేను ఎవ్వరికి జ్ఞానమును ఇచ్చినా, వారు ఆ జ్ఞానమునకు అంతటి గౌరవమును ఇస్తున్నారా? జ్ఞానమునకు గౌరవమునివ్వడం అనగా జ్ఞాన స్వరూపమునకు గౌరవమునివ్వడము. యోగపు సబ్జెక్టులో లక్ష్యము ఉన్నట్లయితే ఎవ్వరి సంకల్పాలనైనా పరివర్తనలోకి తీసుకురావడంలో సమర్థంగా చేయగలరు. కావున వారు తప్పకుండా గౌరవమునిస్తారు. కావున ఈ విధంగా ప్రతి సబ్జెక్టులోను పరిశీలించుకోవాలి. ప్రతి సబ్జెక్టులోను లేక సంకల్పంలోను లక్ష్యము మరియు గౌరవము ఈ రెండింటి ప్రాప్తులను ఎవరైతే అనుభవం చేసుకుంటారో వారినే పర్‌ఫెక్ట్ అని అంటారు. పర్‌ఫెక్ట్ అనగా ఎటువంటి ప్రభావమునుండైనా అతీతంగా మరియు దూరంగా ఉండడము. శరీరం యొక్క, సంకల్పాల యొక్క లేక ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఎవరి వైబ్రేషన్లు లేక వాయుమండలం యొక్క అన్నిరకాల ప్రభావాల నుండి అతీతంగా అయిపోతారు. అప్పుడు సబ్జెక్టులలో పాసైనట్లుగా అనగా పర్ ఫెక్ట్ గా ఉన్నట్లుగా భావించండి. కావున మీరు ఇలా అవుతున్నారు కదా? ఇదే లక్ష్యము కదా!

           ఇప్పుడు మీ పరిశీలన ఎక్కువగా జరుగుతూ ఉండాలి. ఏ విధంగా సమయంతో పాటు స్వయమును కూడా పరివర్తనలోకి తీసుకురండి అని ఏ విధంగా ఇతరులకు చెబుతారో అలాగే ఎల్లప్పుడూ సమయంతో పాటు స్వయమును కూడా పరివర్తనలోకి తీసుకురావాలి అన్నది కూడా ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. స్వయమును పరివర్తనలోకి తెస్తూ తెస్తూ సృష్టి యొక్క పరివర్తన కూడా జరిగిపోతుంది. ఎందుకంటే స్వపరివర్తన యొక్క ఆధారంతోనే సృష్టిని పరివర్తనలోకి తీసుకువచ్చే కార్యమును చేయగల్గుతారు. ఇతరులలో లేని, ఇక్కడ ఉన్న శ్రేష్ఠత ఇదే. వారు కేవలం ఇతరులను పరివర్తన చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ కేవలం స్వయం యొక్క ఆధారంపై సృష్టిలో పరివర్తనను తీసుకువస్తారు. కావున ఆధారమేదైతే ఉందో దానికొరకు మీతో మీరు ఇంతటి ధ్యానమును ఇవ్వాలి. మా ప్రతి సంకల్పం వెనుక విశ్వకళ్యాణపు సంబంధం ఉంది అన్న స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి.

           ఎవరైతే ఆధారమూర్తులో వారి సంకల్పాలు సమర్థంగా లేకపోతే, వారి సమయపు పరివర్తనలో కూడా బలహీనత వచ్చేస్తుంది. ఆ కారణంగా మీరు ఎంతెంతగా స్వయం సమర్థులుగా అవుతారో అంతగానే సృష్టిని పరివర్తనలోకి తీసుకువచ్చే సమయమును సమీపంగా తీసుకురాగలరు. డ్రామా అనుసారంగా సమయము నిశ్చితమై ఉన్నా కానీ ఆ డ్రామా కూడా దీని ఆధారంపై తయారైంది? ఆధారమైతే ఉంటుంది కదా! దానికి ఆధారమూర్తులు మీరే. ఇప్పుడైతే మీరు అందరి దృష్టిలోను ఉన్నారు. రెండు సంవత్సరాలు అని ఛాలెంజ్ చేశారు కదా! ఎప్పుడైతే ఇటువంటి విషయాలను వింటారో అప్పుడు, నిజంగానే అవి జరుగకపోతే! అని ఎంతో కొంత సంకల్పాలు కలుగుతాయి కదా! రెండు సంవత్సరాలలో జరుగకపోవడం కూడా సంభవమే కదా, అన్నది సంకల్పరూపంలో కలుగడం లేదా? ఎదుర్కుంటారు అది వేరే విషయము. కాని, దీని అర్థం సంకల్పాలలో ఏదో ఉంది, అప్పుడే అది వస్తుంది కదా! రెండు సంవత్సరాలలో జరుగుతుందని మీకు పూర్తిగా పక్కాగా ఉందా? వినాశనం జరుగకపోతే ఏమౌతుంది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మరి మీరేమంటారు? ఏ సమయంలోనైతే అర్థం చేయిస్తారో ఆ సమయంలో - రెండు సంవత్సరాలలో పూర్తిగా వినాశనమైతుందని కాదు, రెండు సంవత్సరాలలో ఎటువంటి దృశ్యాలు ఏర్పడతాయంటే వాటిని చూసి, వినాశనం జరుగుతోంది మరియు వినాశనం ప్రారంభమైపోయింది అని జనులు భావిస్తారు. ఈ విషయం సహజమనిపించినప్పుడు మరి వేరే విషయాలు కూడా సహజమనిపిస్తాయి. వినాశనానికి సమయమైతే పడుతుంది కదా! ఎప్పుడైతే స్వయం సంపూర్ణులైపోతారో అప్పుడు కార్యం కూడా సంపూర్ణమవుతుంది. అచ్ఛా!

           అడ్వాన్స్ పార్టీ వారి ఏ కార్యము కొనసాగుతోంది? మీ కొరకు మొత్తము మైదానమును సిద్ధం చేస్తున్నారు. వారి పరివారములోకి వెళ్ళండి లేక వెళ్ళకపోండి, కానీ స్థాపన కార్యము ఏదైతే జరగాల్సి ఉందో అందుకొరకు వారు నిమిత్తులుగా అవుతారు. కొందరు శక్తిశాలి స్థితిని తీసుకొని నిమిత్తులుగా అవుతారు. ఎటువంటి పవర్స్ ను తీసుకుంటారంటే, వాటివలన స్థాపన కార్యములో సహయోగులుగా అవుతారు. ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉంటారు, దిన ప్రతిదినము క్రొత్త రక్తానికి ఎక్కువ గౌరవము ఉంటుంది. ఎంతగా ముందుకు వెళ్తుంటే అంతగా పెద్దల బుద్ధి కంటే కూడా చిన్నవారి బుద్ధి ఎక్కువగా పని చేస్తుంది. పెద్ద వయసువారితో పోల్చినా కూడా చిన్నతనములో సతో ప్రధానత ఉంటుంది. పవిత్రతా శక్తి ఎంతో కొంత ఉన్న కారణంగా వారి బుద్ధి ఎంతగా పని చేస్తుందంటే అంతగా పెద్దల బుద్ధి కూడా పనిచెయ్యదు. ఈ పరివర్తన ఉంటుంది. పెద్దలు కూడా పిల్లల సలహాలకు గౌరవమును ఇస్తారు. ఇప్పుడు కూడా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు - మేము పాత కాలానికి చెందినవారము అని భావిస్తారు. వీరు ఈ కాలం వారు వీరికి గౌరవమును ఇవ్వనట్లయితే మరియు వీరిని పెద్దవారిగా భావించి నడిపించనట్లయితే పని జరగదు. మొదట్లో పిల్లలను అధికారముతో నడిపించేవారు, ఇప్పుడు అలా కాదు. పిల్లలను కూడా యజమానులుగా భావించి నడిపిస్తారు. మరి ఇది కూడా డ్రామాలో భాగము. చిన్నవారే అద్భుతములను చేసి చూపిస్తారు. అడ్వాన్స్ పార్టీదైతే వారి కార్యము నడుస్తూ ఉంది, కానీ వారు కూడా మీ స్థితి అడ్వాన్స్ లోకి వెళ్ళేందుకై ఆగి ఉన్నారు. వారి కార్యము కూడా మీ కనెక్షనుతో నడవాలి.

           మొత్తము కార్యపు ఆధారము విశేష ఆత్మలైన మీపైనే ఉంది. నడుస్తూ నడుస్తూ చల్లబడిపోతారు, నిప్పు అంటుకుంటుంది, మళ్ళీ చల్లబడిపోతారు. కానీ చల్లబడిపోకూడదు కదా! బాహ్యరూపము ఏదైతే ఉందో మనుష్యులు దానిని చూస్తారు, ఇదైతే నడుస్తూ వచ్చింది, గొప్ప విషయము ఏముంది అని అనుకుంటారు. తరతరాలుగా ఆట కొనసాగుతూనే ఉంది. కానీ నడుస్తూ నడుస్తూ ఈ శీతలత ఎందుకని వస్తుంది? దీనికి కారణము ఏమిటి? శాతము చాలా తక్కువగా ఉంది, ఉపన్యాసాలైతే ఇస్తారు, కానీ ఉపన్యాసాలతో పాటు ఫీచర్స్(ముఖవైఖరి)కూడా ఆకర్షితము చెయ్యాలి, అప్పుడు ఉపన్యాసాల ప్రభావము ఉంటుంది. కావున మిమ్మల్ని మీరు ప్రతి సబ్జెక్ట్ లో పరిశీలించుకోండి. ఈరోజుల్లో లెక్చర్స్ లో మీరు పోటీ చేసినట్లయితే ఇందులో వేరే వారు కూడా విజయాన్ని పొందవచ్చు, కానీ ఏదైతే ప్రాక్టికల్ లో ఉందో అందులో అందరూ మీతోటి ఓడిపోతారు.

           ప్రాక్టికల్ జీవితముదే ముఖ్య విశేషత. ప్రాక్టికల్ గా ఏవిషయమైనా మీరు చెప్పినట్లయితే వారు  ఒక్కసారిగా మౌనం వహించేస్తారు. కావున ఎప్పుడైతే ఉపన్యాసాల ద్వారా ప్రాక్టికల్ యొక్క భావము ప్రకటితమవుతుందో అప్పుడు వారు ఉపన్యాసాలివ్వటము నుండి అతీతంగా కనిపిస్తారు. మీరు ఏ మాటలనైతే మాట్లాడుతారో వాటి గురించి, వీరు ఏదైతే మాట్లాడుతారో అవి ప్రాక్టికల్, వీరు అనుభవీ మూర్తులు అని వారి నయనాల నుండి కనిపించాలి, అప్పుడే దాని ప్రభావము పడగలదు. విని విని అందరూ అలసిపోయారు, చాలా విన్నారు. వినిపించేవారు అనేకులైన కారణంగా వినటం ద్వారా అందరూ అలసిపోయి ఉన్నారు. వినటమైతే చాలా విన్నాము, ఇప్పుడు అనుభవము చెయ్యాలని కోరుకుంటున్నాము మరియు ఇప్పుడిక ఏదైనా ప్రాప్తిని చేయించండి అని అంటారు. కావున ఉపన్యాసములో ఎంతటి శక్తి ఉండాలంటే, ఆ ఒక్కొక్క మాట అనుభవము చేయించేదిగా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరంగా కాదు అని మీరు అర్థం చేయిస్తారు కదా! మరి ఈ మాటలను మాట్లాడటంలో కూడా ఎంతటి శక్తి ఉండాలంటే, వినేవారికి మీ మాటల శక్తి ద్వారా అనుభవము కలగాలి. క్షణకాలమైనా వారికి అనుభవము కలిగినట్లయితే అనుభవమును వారు ఎప్పుడూ వదిలిపెట్టలేరు, ఆకర్షితులై మీవద్దకు వస్తారు.

           భాషణ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో వారిని సైలెన్స్ లోకి తీసుకువెళ్ళే అనుభవమును ఏవిధంగా చేయిస్తారో, అలా ఇప్పుడు ఈ అభ్యాసమును పెంచుతూ వెళ్ళండి. వారిని అనుభవములోకి తీసుకువస్తూ ఉండండి. ఈ పాత ప్రపంచము నుండి అనంతమైన వైరాగ్యమును కలిగించాలనుకున్నట్లయితే భాషణలో ఏ పాయింట్స్ నైతే చెప్తుంటారో వాటిని చెప్తూ చెప్తూ వైరాగ్యవృత్తి యొక్క అనుభవములోకి తీసుకురండి. నిజంగా ఈ సృష్టి అయితే పోయేదే ఉంది. దీనిపైన మనసు పెట్టుకోవటము వ్యర్థము అని వారు ఫీల్ (అనుభవం) చెయ్యాలి. అప్పుడు తప్పకుండా ప్రాక్టికల్ లో చేస్తారు. ఆ పండితులు మొదలైనవారి మాటలలో శక్తి ఉంటుంది. ఒక్క క్షణములో సంతోషాన్ని కలిగిస్తారు మరియు ఒక్క క్షణములో ఏడిపిస్తారు. వీరి భాషణ ప్రభావితము చేసేదిగా ఉంది అని అప్పుడే అంటారు. మొత్తము సభనంతా నవ్విస్తారుకూడా, అందరినీ స్మశానవైరాగ్యములోకి కూడా తీసుకువస్తారు కదా! వారి భాషణలోనే ఇంతటి శక్తి ఉన్నప్పుడు మీ భాషణలో అంతటి శక్తి ఉండదా? అశరీరులుగా అవ్వాలనుకున్నట్లయితే ఆ అల వ్యాపించేటట్లుగా ఆ అనుభవము చేయించలేరా? మొత్తము సభ మధ్యలో తండ్రి స్నేహపు అల వ్యాపించాలి, దీనినే ప్రాక్టికల్ గా అనుభవము చెయ్యటము అని అంటారు.

           ఇప్పుడు ఇటువంటి భాషణలు అవసరము, అప్పుడే కొంత మార్పు ఉంటుంది. వీరి భాషణ అయితే ప్రపంచము వారి నుండి అతీతమైనది అని వారు భావించాలి. బయటివారైతే వారి భాషణలో సభను నవ్వించవచ్చు లేక ఏడిపించవచ్చు, కానీ అశరీరతనపు అనుభవమును వారు చేయించలేరు మరియు తండ్రితో స్నేహమును పెంచలేరు, కృష్ణునితో స్నేహమును కలిగించవచ్చు కానీ తండ్రితో చేయించలేరు. వారికి తెలియనే తెలియదు, కాబట్టి అద్భుతమైన విషయము ఉండాలి. అచ్ఛా, గీత  భగవంతునిపై పాయింట్స్ ఇస్తున్నారనుకోండి, కానీ తండ్రి అంటే ఎవరు- ఏమిటి, మనము ఆత్మలము మరియు వారు పరమాత్మ అని ఎప్పటివరకైతే వారికి అనుభవము చేయించరో అప్పటివరకు   విషయము ఎలా నిరూపణ అవుతుంది? అలా భాషణ చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఆత్మ మరియు పరమాత్మలో రాత్రికి పగలుకు ఉన్నంతటి అంతరము ఉంది అని అనుభవము చేయించాలి, ఎప్పుడైతే అంతరమును అనుభవము చేస్తారో అప్పుడు గీతాభగవానుడు కూడా నిరూపణ అవ్వనే అవుతారు. కేవలము పాయింట్లతో వారి బుద్ధిలో కూర్చోదు, వాటి మూలంగా ఇంకా మరిన్ని అలలు ఉత్పన్నమవుతాయి. కానీ అనుభవమును చేయిస్తూ పోతున్నట్లయితే అనుభవము ముందు ఏ విషయమూ గెలవజాలదు. భాషణలో ఇప్పుడు ఈ విధానమును మార్చండి. అచ్ఛా!

Comments