01-08-1971 అవ్యక్త మురళి

* 01-08-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“స్వయం యొక్క స్థితిని సెట్ చేసుకునే విధి."

               
           ఈ రోజు సమాప్తి రోజునా  లేక సమర్షణ అయ్యే రోజునా? సమర్పణ అవ్వడము అనగా ఈశ్వరీయ మర్యాదలకు విరుద్ధమైన సంస్కారాలు లేక స్వభావాలు లేక కర్మలేవైతే ఉన్నాయో వాటిని సమర్పణ చేసెయ్యాలి. ఏవిధంగా ఏదైనా మిషనరీని సెట్ చేసినప్పుడు ఒకసారి సెట్ చేయడం ద్వారా అది ఇక ఆటోమేటిక్ గా పనిచేస్తూనే ఉంటుందో, అదేవిధంగా భట్టీలో కూడా తమ సంపూర్ణ స్థితి లేక బాబా యొక్క సమాన స్థితి లేక కర్మాతీత స్థితిలో స్వయమును ఆవిధంగా సంకల్పాలు, మాటలు లేక కర్మలు అదే సెట్టింగ్ అనుసారంగా ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉండే విధంగా స్వయమును సెట్ చేసుకున్నారా? ఇటువంటి అథారిటీ యొక్క స్మృతి యొక్క స్థితిని సెటింగ్ చేసుకున్నారా? బాబా ఆల్ మైటీ అథారిటీ కదా! మరి మీరందరూ కూడా స్వయమును మాస్టర్ ఆల్‌ మైటీ అథారిటీలుగా భావిస్తున్నారా? ఎవరైతే ఆల్ మైటీ అథారిటీ స్థితిని ఒక్కసారి సెట్ చేసేసుకుంటారో వారు ఎప్పుడూ బలహీనతా లక్షణాలుగా ఉండేవాటిని ఆలోచించరు, అనరు లేక చేయరు, ఎందుకంటే మీరు మాస్టర్ ఆల్ మైటీ అథారిటీలు. విశ్వమును ఇంత కొద్ది సమయంలో పరివర్తన చేయగలిగే అథారిటీ ఉన్నప్పుడు మరి మాస్టర్ ఆల్ మైటీ అథారిటీ స్థితిలో ఇప్పటికి ఇప్పుడు ఒక్క క్షణంలో స్వయమును పరివర్తన చేసుకునే శక్తి లేదా? మేము ఆల్ మైటీ అథారిటీలము అన్న ఈ స్థితిలో స్వయమును సెట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా పనిచేసే వస్తువును పదే పదే సెట్ చేయవలసిన అవసరం ఉండదు. ఒక్కసారి సెట్ చేసేస్తే ఇక అది దానంతట అదే నడుస్తూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఇప్పుడు సహజంగా మరియు సదాకాలికమైన కర్మయోగులుగా అనగా నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగులుగా అయ్యారా లేక కేవలం యోగులుగా అయ్యారా? ఎవరైతే సదా యోగులుగా ఉంటారో వారు సదాచారులుగా ఉంటారు. సదాచారులుగా ఎవరు అవ్వగలరు? ఎవరైతే సదా యోగీస్థితిలో స్థితులై ఉంటారో వారే సదాచారులుగా ఉంటారు. కావున మీరు సదాచారులము. అందుకే ఎటువంటి అలజడిలోను అలజడి చెందజాలరు. సదా అచలముగా, స్థిరముగా ఉండే విధంగా ఈ భట్టీలో మీ ప్రతిజ్ఞరూపీ స్విచ్ ను సెట్ చేసుకున్నారా? ప్రతిజ్ఞరూపీ స్విచ్ ను సెట్ చేసుకున్నట్లయితే ప్రత్యక్షంగా ప్రతిజ్ఞ అనుసారంగానే నడుచుకుంటారు కదా! మరి అప్పుడు సదాచారులుగా లేక నిరంతర యోగులుగా లేక సహజ యోగులుగా అయిపోరా? పాండవులు పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయారు అన్న గాయనము ఉంది కదా! పర్వతాల అర్థం ఏమిటి? పర్వతాలు ఈ భూమి కన్నా పైన ఉంటాయి కదా! కావున పాండవులు ఈ భూమి అనగా క్రింద స్థితిని వదిలి ఉన్నతమైన స్థితిలోకి ఎప్పుడైతే వెళతారో అప్పుడు తమ గత లేక ఈశ్వరీయ మర్యాదలకు విపరీతమైన సంస్కారాలు, స్వభావాలు, కర్మలు, మాటలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో స్వయమును మరజీవాగా తయారుచేసుకున్నారు అనగా కరిగిపోయారు. కావున మీరు కూడా ఈ భూమి కన్నా పైకి వెళ్ళిపోయారు కదా! పూర్తిగా కరిగిపోయి వచ్చారా లేక ఎంతోకొంత మిగుల్చుకొని వచ్చారా? స్వయములో వంద శాతము నిశ్చయబుద్ధి ఉన్నట్లయితే వారు ఎప్పుడూ ఓడిపోజాలరు. ఒకటేమో ధైర్యము కావాలి, ఇంకొకటి ధైర్యంతో పాటు ఉల్లాసము కూడా కావాలి. ధైర్యము మరియు ఉల్లాసము లేకపోతే ప్రత్యక్షంగా షో జరుగజాలదు. కావున రెండూ కావాలి. ఒకటేమో అంతర్ముఖత మరియు ఇంకొకటి బైటి నుండి షో చేసే హర్షిత ముఖత. ఆ స్థితి ఉందా? రెండూ కలిసి ఉండాలి. ఇదేవిధంగా ధైర్యంతో పాటు ఉల్లాసము కూడా కావాలి. దీని ద్వారా వీరిలో ఏదో విశేషమైన ప్రాప్తి ఉంది అని దూరం నుండే తెలియాలి. ఎవరైతే ప్రాప్తి కలిగినవారిగా ఉంటారో వారి ప్రతి నడవడిక ద్వారా, నయనాల ద్వారా ఆ ఉల్లాసము, ఉత్సాహము కనిపిస్తాయి. భక్తి మార్గంలో కేవలం ఉత్సాహమును ఇచ్చేందుకు ఉత్సవాలను జరుపుకునే సాధనాలను తయారుచేసుకున్నారు. సంతోషంలో నాట్యం చేస్తారు కదా! ఎవరికైనా ఉదాసీనత లేక చిక్కులు మొదలైనవి కలిగినప్పుడు వారు ప్రక్కకు తప్పుకుంటారు కదా! కాబట్టి ధైర్యంతో పాటు ఉల్లాసము కూడా తప్పకుండా కావాలి. మరి అవినాశీ స్టాంపును వేయించుకున్నారా? అవినాశీ అనే స్టాంపును వేయించుకోకపోతే ఏమౌతుంది? శిక్ష పడుతుంది. కావున ఈ స్టాంపును తప్పకుండా వేసుకోండి. కావున ఇది సదాకాలం కొరకు సమర్పణ సమారోహమే కదా! మళ్లీ పదే పదే ఈ సమారోహమును జరుపవలసిన అవసరం ఉండదు కదా! స్మృతికి గుర్తుగా  జరుపుకోవడం వేరే విషయం. ఏ విధంగా జన్మదినమును గుర్తుగా జరుపుకుంటారో అలా ఈ  సమర్పణను ప్రతిజ్ఞా దివసముగా జరుపుకోవచ్చు.

            విజయ దివసమును కూడా జరుపుకుంటారు, మరి ఇది కూడా మీ అందరి విజయాష్టమి రోజు కదా! విజయులుగా అయ్యే రోజును సదా స్మృతిలో ఉంచుకోవాలి. చివరిలో ఎలా స్వాహా చేయాలంటే అందరి నోటి నుండి మిమ్మల్ని చూసి ఓహో, ఓహో అని వెలువడాలి మరియు మిమ్మల్ని కాపీ చేయాలి ఏదైనా మంచి విషయం ఉన్నప్పుడు తాము వద్దనుకున్నా అందరికీ కాపీ చేయాలనే కోరిక కలుగుతుంది. ఏ విధంగా బాబాను కాపీ చేస్తారో అలా మీ ప్రతి కర్మను కాపీ చేయాలి. ఎంతటి శ్రేష్ఠ కర్మలు ఉంటాయో అంతగానే శ్రేష్ఠ ఆత్మలలో స్మరింపబడతారు. నామస్మరణ చేస్తారు కదా! ఎవరు ఎంత శ్రేష్ఠ ఆత్మగా ఉంటారో అంతగానే వారి గుణాలను మరియు కర్మలను ఉదాహరణగా చేసుకునేందుకు నామస్మరణ చేస్తారు. అలాగే మీరందరూ శ్రేష్ఠ ఆత్మలుగా, స్మరణ యోగ్యులుగా అయిపోతారు. ఇప్పుడు యోగులుగా అయ్యే బాధ్యతను చేపట్టారు కదా! యోగయుక్తులు అనగా యుక్తియుక్తులు. ఏదైనా సంకల్పము, మాట  లేక కర్మ యుక్తియుక్తముగా లేనట్లయితే యోగయుక్తముగా లేము అని అర్థం చేసుకోండి. ఎందుకంటే యోగయుక్తానికి గుర్తు యుక్తియుక్తముగా ఉండడం. ఎందుకంటే యోగయుక్తులకు ఎప్పుడూ  అయుక్తమైన కర్మలు లేక సంకల్పాలు కలుగజాలవు. ఈ కనెక్షన్ ఉంటుంది. అచ్ఛా!

Comments