01-03-1971 అవ్యక్త మురళి

 * 01-03-1971         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు సహజ విధి."

            అందరూ మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యారా? త్రికాలదర్శులుగా అవ్వటం ద్వారా ఏ కార్యములోనూ అసఫలత ఉండదు. ఏ కార్యము చేసినా, అది చేసేముందు మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో స్థితులై, కార్యపు ఆది-మధ్య-అంతిమములను తెలుసుకొని కర్తవ్యము చెయ్యటం ద్వారా ఎల్లప్పుడూ సఫలత లభిస్తుంది అనగా సఫలతామూర్తులుగా అయిపోతారు మరియు సంపూర్ణమూర్తులుగా అయిపోతారు. యోగులకు రిద్ధి-సిద్ధి ప్రాప్తిస్తాయి అని గాయనము ఉంది, అది ఎటువంటి సిద్ధి? సంకల్ప సిద్ధి మరియు కర్తవ్య విధియా? ఈ రెండింటి ద్వారా జన్మసిద్ధ అధికారమును సహజముగానే పొందుతారు. సంకల్ప సిద్ధి ఎలా వస్తుంది, తెలుసా? సంకల్ప సిద్ధి జరగపోవడానికి కారణము ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు వ్యర్థమైన సంకల్పాలు చాలా నడుస్తాయి. వ్యర్ధ సంకల్పాలు మిక్స్ అయినందువలన సమర్థముగా అవ్వలేరు, కావున ఏ సంకల్పమునైతే రచిస్తారో దాని సిద్ధి జరుగదు. వ్యర్థ సంకల్పాల సిద్ధి అయితే జరగజాలదు. కావున సంకల్పాల సిద్ధిని ప్రాప్తి చేసుకొనేందుకు ముఖ్య పురుషార్థము - వ్యర్థ సంకల్పమును రచించకుండా సమర్థ సంకల్పాల రచనను చెయ్యండి. అర్థమైందా! రచనను ఎక్కువగా చేస్తారు, కావున వాటి పూర్తి పాలన చేసి వాటిని పనిలో వినియోగించటమన్నది చెయ్యలేకపోతారు. ఏవిధంగా లౌకిక రచనను కూడా ఒకవేళ అధికంగా రచించినట్లయితే వారిని యోగ్యమైనవారిగా తయారుచెయ్యలేరు. ఇదేవిధంగా సంకల్పాల స్థాపననేదైతే చేస్తారో, వాటిని చాలా అధికంగా చేస్తారు. సంకల్పాల రచన ఎంత తక్కువగా ఉంటే అంత శక్తిశాలిగా ఉంటాయి. రచన ఎంత ఎక్కువగా ఉంటే అంతగానే శక్తిహీన రచన తయారవుతుంది. కావున సంకల్పాల సిద్ధిని ప్రాప్తింపచేసుకొనేందుకు పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది. వ్యర్థ రచనను ఆపెయ్యండి. లేనట్లయితే ఈ రోజుల్లో వ్యర్థ రచనను చేసి వాటి పాలనలో సమయాన్ని వ్యర్థము చేసుకుంటారు కావున సంకల్పాల సిద్ధి మరియు కర్మల సఫలత తక్కువగా ఉంటుంది. కర్మలలో సఫలతకు యుక్తి - మాస్టర్ త్రికాలదర్శిగా అవ్వటము. కర్మ చెయ్యటానికి ముందే ఆది-మధ్య మరియు అంతిమములను తెలుసుకొని కర్మ చెయ్యండి. అంతేగానీ కర్మ చేసిన తరువాత అంతిమములో పరిణామమును చూసి అప్పుడు ఆలోచించటము కాదు కావున సంపూర్ణంగా అయ్యేందుకు ఈ రెండు విషయాలపై శ్రద్ధను పెట్టవలసి ఉంటుంది.

            ఇది ప్రవృత్తివారి గ్రూపు కావున ప్రవృత్తిలో ఉంటూ ఈ రెండు విషయాలపై శ్రద్ధను పెట్టడం ద్వారా సర్వీసబుల్(సేవాయోగ్యులు)గా అవ్వగలరు. సేవ కేవలం నోటి ద్వారా కాకుండా కర్మల ద్వారా కూడా సేవ జరగగలదు. ఇప్పుడు ఏ గ్రూపు అయితే వచ్చిందో వారు తమను సర్వీసబుల్ గ్రూపుగా భావిస్తున్నారా? ఈ గ్రూపులో ఎవరైతే తమను సర్వీసబుల్ గా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇప్పుడు ఎవరైతే సర్వీసబుల్ లో చేతులు ఎత్తారో వారు సేవకు సమయాన్ని కేటాయించి సహాయకులుగా అవ్వగలరా? మాతల సహాయ సహకారముల ద్వారా పేరు చాలా ప్రఖ్యాతమవ్వగలదు. ఎంతమంది వచ్చారో వారందరూ ఈ సేవలో సహాయకులుగా అయినట్లయితే చాలా త్వరగా పేరును ప్రఖ్యాతము చెయ్యగలరు ఎందుకంటే మీరు యుగళమూర్తిగా అయ్యి నడిచేవారు, కావున అటువంటి యుగళులు సేవలో తమ షోను చాలా చెయ్యగలరు. ప్రతి ఆత్మను తండ్రి వైపుకు ఆకర్షితము చేసే కర్తవ్యమును చేసి చూపించండి. మాతల గ్రూపు, అది కూడా యుగళుల రూపంలో నడుస్తున్న మాతలు, ఇటువంటి వారికి సమయాన్ని కేటాయించటము సహజమవ్వగలదు. ఇప్పుడు కూడా సమయాన్ని కేటాయించే వచ్చారు కదా! ఇప్పుడు కూడా మీ వెనుక ప్రవృత్తి నడుస్తూ ఉంటుంది కదా! ఏవిధంగా ఈ విషయాన్ని ముఖ్యమైనదిగా భావించి బంధనాలను తేలికగా చేసుకొని ఇక్కడకు చేరుకున్నారో అలాగే సమయ ప్రతి సమయము మీ ప్రవృత్తి బంధనాలను తేలికగా చేసుకొని సేవలో ఎంతగా సహాయకులుగా అవుతూ ఉంటారో అంతగానే మీ లెక్కాచారములు త్వరగా సమాప్తమౌతాయి. కావున ఇటువంటి సహాయకులుగా అవ్వటంలోనే తమ ఉన్నతికి సాధనమున్నదని మాతలు భావించాలి. వినటము మరియు వినిపించటము రెండింటినీ అనుభవము చెయ్యాలి. ఏవిధంగా తండ్రి సహాయకులుగా అవుతారో అలా పిల్లలు కూడా సహాయకులను తయారుచేసే సహాయాన్ని తీసుకోవాలి. కావున తమ బంధనాలను తేలికగా చేసుకొని సేవలో సహాయకులుగా అవ్వగలిగేంతటి శక్తిని ఈ గ్రూపులో నింపుకొని వెళ్ళాలి. లేనట్లయితే ఒకవేళ ఈ సబ్జెక్టులో లోటు ఉండిపోయినట్లయితే పూర్తి మార్కులు ఎలా తీసుకోగలరు? ఫుల్ పాస్ అయ్యేందుకే లక్ష్యమును ఉంచారు కదా, కావున ఈ గ్రూపునకు ముఖ్యంగా ఇటువంటి యుక్తులను రచించే ట్రైనింగు తీసుకొని వెళ్ళాలి. భట్టీ నుండి ఎలా తయారై వెళ్ళాలో అర్ధమైందా? సర్వీసబుల్ గా మరియు సహాయకులుగా అవ్వాలి. ఇంట్లో ఉంటూ శక్తిస్వరూపపు స్మృతితో ఎల్లప్పుడూ ఉండటం ద్వారా కర్మబంధనము విఘ్నమును వెయ్యదు. ఇంట్లో ఉంటారు కానీ శక్తి స్వరూపమునకు బదులుగా పవిత్ర ప్రవృత్తి భానములో ఎక్కువగా ఉంటారు. ప్రవృత్తిలో ఉంటూ శక్తితనపు వృత్తి తక్కువగా ఉంటుంది కావున, కర్మబంధనము ఉంది, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కర్మ బంధనాన్ని ఎలా తొలగించాలి లాంటి మాటలు ఏవైతే వెలువడుతాయో వాటికి కారణము - శక్తితనపు అలంకారమును ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచుకోకపోవటమే. కావున ఇప్పుడు ఈ భట్టిలో మీ స్మృతి మరియు స్వరూపమును మార్చుకొని వెళ్ళాలి, ఇందుకొరకు రెండు విషయాలను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. ఒకటి - ఛేంజ్ (పరివర్తన) అవ్వాలి, రెండు - ఛేలెంజ్ చెయ్యాలి. శక్తిరూపములో మీ వృత్తిని మరియు స్వరూపమును కూడా మార్చుకోవాలి మరియు ఎంతెంతగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వెళ్తారో అంతగా ఇతరులను ఛేలెంజ్ చెయ్యగలరు. కావున ఈ రెండు విషయాలను గుర్తు ఉంచుకోవాలి. సుకర్మ చేసినప్పుడు తండ్రి స్నేహీ స్వరూపము ముందుకు వస్తుంది మరియు ఒకవేళ వికర్మ చేసినట్లయితే వికరాళ(భయంకర) రూపమును మీ ముందుకు తీసుకురావాలి. మీరైతే స్నేహీలే కదా! స్నేహీలు సదా సుకర్ములుగా ఉంటారు. ఎటువంటి చెడు కర్మ ఉండకూడదు, దీనిని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మీరందరూ సృష్టి నాటకరంగముపై హీరో పాత్రధారులు. హీరో యాక్టర్స్ పైనే అందరి దృష్టి ఉంటుంది, కావున మిమ్మల్ని ప్రవృత్తిలో ఉండేవారిగా భావించకుండా, స్టేజ్ పై ఉండే హీరో యాక్టర్స్ గా భావించుకొని ప్రతి కర్మనూ చేస్తూ వెళ్తున్నట్లయితే ఎటువంటి చెడు కర్మా జరగజాలదు.

            ఏవిధంగా సైన్సు వారి పరమాణు శక్తి ఈ రోజు ఏమేమో చూపిస్తున్నాయి! అలాగే సైలెన్సు శక్తిదళములో ప్రవృత్తిలో ఉండే మీరు ప్రమాణులు. వారిది పరమాణు శక్తి మరియు మీరు సృష్టి ముందు ఒక ప్రమాణము. కావున మీరు కూడా ప్రమాణముగా అయ్యి చాలా సేవను చెయ్యగలరు. మాతల అవసరము ఎంతో ఉంది, మాతల కారణంగా మూల మూల ప్రదేశాలలో సందేశము వ్యాపించటము ఇప్పుడు మిగిలి ఉంది. చాలామంది ఆత్మలకు సందేశము లభించకపోవటానికి గల బాధ్యత మీపై ఉంది, కావున ఈ గ్రూపు అలా తయారవ్వాలి. ఈ గ్రూపు సమయ ప్రతి సమయము సేవలో సహాయకులుగా అవ్వగలరు. ఆశావాదులు. అథర్‌ కుమారుల గ్రూపు కూడా ఏవిధంగా ఆశావాదులుగా ఉన్నారో అలాగే ఈ గ్రూపు కూడా కాబోయే సహాయకులు. సహాయకులుగా ఎలా అవ్వాలి అన్నదానికి యుక్తి కూడా ఉంది, కానీ శక్తి లేదు. కావున మీ స్వరూపపు పరివర్తనా సర్టిఫికేట్ ను మీ టీచరు నుండి తీసుకొని వెళ్ళాలి. ఒక్కొక్క కుమారి 100మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమమైనదని ఏవిధంగా పేరు ఉందో అలా ఒక్కొక్క మాత జగన్మాత. ఎక్కడ 100మంది బ్రాహ్మణులు ఎక్కడ మొత్తము జగత్తు! మరి ఎవరి మహిమ ఉన్నతమైనది? ఒక్కొక్క మాత జగన్మాతగా అయ్యి జగత్తులోని ఆత్మలపై దయ, స్నేహము మరియు కల్యాణపు భావనను ఉంచండి. కావున ఈ గ్రూపు ఒక వాగ్దానమును చెయ్యాలి. వాగ్దానము చేసే  ధైర్యము ఉందా? ఏ వాగ్దానమైనా, దానిని విన్న తరువాత చేసే ధైర్యమును ఉంచుతారా? వినకముందే ధైర్యము ఉందా లేక విన్నతరువాత ధైర్యమును ఉంచుతారా? ఒకవేళ ఏదైనా కఠినమైన వాగ్దానమైనట్లయితే ఆలోచిస్తారు కదా. సమయ ప్రతి సమయము నేను సేవలో సహాయకురాలిగా మరియు తోడు-తోడుగా శక్తిస్వరూపముగా అయ్యి విఘ్న వినాశకురాలిగా తయారై ప్రవృత్తిలో ఉంటాను అని ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానము చెయ్యాలి. సహజ వాగ్దానము కదా! విఘ్నాలు వస్తే అరవము, గాభరా పడవము, శక్తిగా అయ్యి ఎదిరిస్తాము అని మీతో మీరు సదాకాలికముగా ఈ వాగ్దానమును చేసి వెళ్ళాలి.

            ఏవిధమైన ఆసక్తి ఉన్నా, మాయ కూడా అక్కడికే (ఆసక్తి ఉన్నచోటికే) వస్తుంది. ఆసక్తి ఉన్న కారణంగా మాయ రాగలదు, ఒకవేళ అనాసక్తులుగా అయి వెళ్ళినట్లయితే మాయ రాజాలదు. ఎప్పుడైతే అనాసక్తి సమాప్తమైపోతుందో అప్పుడు శక్తి స్వరూపులుగా అవ్వగలరు. మీ దేహముపై లేక దేహ సంబంధాలలో, ఏ పదార్థములోనైనా ఎక్కడైనా ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే మాయ కూడా రాగలదు మరియు శక్తిగా కూడా తయారవ్వలేరు. కావున శక్తిరూపులుగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి మార్చెయ్యండి. ఒక్క దీపము అనేక దీపాలను వెలిగించగలదని ఏవిధంగా మీరు ఇతరులకు చెప్తారో అలాగే మీరు ప్రతి ఒక్కరూ మొత్తము విశ్వ కల్యాణమునకు నిమిత్తులుగా అవ్వగలరు. కావున మీ కర్తవ్యమును మరియు మీ స్వరూపమును రెండింటినీ గుర్తు ఉంచుకుంటూ నడవండి. మీరు బ్రహ్మ భుజాలు కదా! కావున హ్యాండ్స్ గా అవుతారు కదా! మిమ్మల్ని మీరు బ్రహ్మకు భుజాలుగా భావిస్తున్నారా? బ్రహ్మ భుజాల కర్తవ్యము కూడా ఏమిటి? బ్రహ్మా కర్తవ్యము స్థాపన, కావున స్థాపన కార్యములో ఎల్లప్పుడూ తత్పరులై ఉండటమే బ్రహ్మ భుజాల కర్తవ్యము కూడా. హద్దు సంబంధాలలోకి వచ్చేందుకు కేవలము వీరికి పద్ధతిని నేర్పించాలి. మిమ్మల్ని మీరు నిర్బంధనులుగా తయారుచేసుకోగలరు, కానీ పద్ధతి రాదు. ఒకటేమో పద్ధతి తెలియదు, రెండవది శక్తి లేదు. కావున శక్తిని కూడా నింపాలి మరియు పద్ధతిని కూడా నేర్వాలి. అయినా కూడా బాప్ దాదా ఆశావాదుల గ్రూపుగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమను తాము ఎన్నిసార్లు ఆఫర్ చేస్తారో ఇప్పుడు చూడాలి. మిమ్మల్ని మీరు స్వయమే ఆఫర్ చేసుకోవాలి. ఎవరైతే స్వయాన్ని స్వయమే ఆఫర్ చేసుకుంటారో వారికే స్వీకృతి లభిస్తుంది. ఒకవేళ చెప్పటం ద్వారా చేసినట్లయితే స్వీకృతి లభించదు. ఎవరెవరు తమను తాము ఆఫర్ చేసుకుంటారో ఇప్పుడు చూడాలి. స్నేహులుగా అయితే ఉన్నారు, కానీ స్నేహులుగా ఉండటంతో పాటు సహయోగులుగా కూడా అవ్వండి. ఈ గ్రూపుకు ఏ పేరును పెడతాము? నామకరణ జరుగుతుంది కదా, ఎందుకంటే పరివర్తన భట్టీలో వచ్చారు. మీరు కూడా నామకరణోత్సవములోకి వచ్చారు కదా! ఈ గ్రూపు పేరేంటి? ఇది సదా సహయోగి మరియు శక్తి స్వరూపుల గ్రూపు. ఇప్పుడు మీ శక్తిని ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడైతే మీ శక్తిని పోగొడతారో అప్పుడు రావణుడు కూడా వీరు వీరి శక్తిని పోగొట్టుకొని కూర్చున్నారని గమనించి బాగా ఏడిపిస్తాడు. శక్తిని పోగొట్టుకోవటము అనగా రావణుని పిలవటము, కావున ఎప్పుడూ మీ శక్తిని తక్కువగా చేసుకోవద్దు. జమ చెయ్యటమును నేర్చుకోండి. భవిష్య 21 జన్మలకు శక్తిని జమ చేసుకోవాలి. ఇప్పటినుంచే జమ చేసుకుంటేనే జమ అవుతుంది, కావున జమ ఎంత చేసుకున్నాను అన్నదానినే ఎల్లప్పుడూ ఆలోచించండి. అచ్ఛా!

Comments