26-06-1969 అవ్యక్త మురళి

 26-06-1969                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

శిక్షణా స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణనివ్వాలి.

       బాబా ఎవరిని చూస్తున్నారు? పిల్లలని చూస్తున్నారా? ఈ రోజు మురళీలో ఏమి విన్నారు, మీరందరు ఎవరిని స్మృతి చేస్తున్నారు? (తండ్రి, టీచరు, సద్గురువు) కనుక బాప్ దాదా కూడా కేవలం పిల్లలనే కాదు కానీ మూడు సంబంధాలతో మూడు రూపాలతో చూస్తున్నారు. అందరు పిల్లలే కానీ టీచరు రూపంలో ఎవరిని చూస్తున్నారు? నెంబరువారీ విద్యార్థులను చూస్తున్నారు. మరియు గురువు రూపంలో ఎవరిని చూస్తున్నారు? తెలుసా? నెంబరువారీగా అనుసరించేవారిని చూస్తున్నారు. కొందరు అనుసరించారు మరియు కొందరు ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇద్దరినీ చూస్తున్నారు. గురువు రూపంలో ముఖ్య అనుసరణ ఏమిటి? గురువు రూపం ద్వారా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దానిలో ముఖ్యంగా దేనిలో అనుసరించాలి? గురువు ద్వారా ముఖ్య అనుసరణ ఏది? (స్మృతియాత్ర) స్మృతియాత్ర అయితే ఒక సాధనం. కానీ అది కూడా ఎందువలన చేయిస్తున్నారు? ఇతరులకి సద్గతి ఇచ్చే ముందు మీరు ఏమి అనుసరించాలి? స్మృతియాత్ర కూడా ఎందువలన నేర్పిస్తున్నారు? గురువు రూపంలో ముఖ్యంగా అనుసరించవలసినది ఏమిటంటే అశరీరి, నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. అశరీరి అవ్వడానికే స్మృతియాత్ర చేస్తున్నారు. ఎప్పుడైతే అశరీరి అవుతారో అప్పుడే గురువు వెంట వెళ్ళగలరు. ముఖ్యంగా ఇదే అనుసరిస్తున్నారు మరియు అనుసరించాలి కూడా. టీచరు రూపం యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుందా లేక పూర్తి అయిపోయిందా? రివైజ్ కోర్స్ టీచరు చేయిస్తున్నారా లేక మీరు చేసుకుంటున్నారా? చదువు చదివించటం లేదు, కానీ సహాయం చేస్తున్నారు. రివైజ్ కోర్సు కోసం స్కూలు నుండి శెలవు తీసుకుంటారు. ఇంటిలో దానిని హోంవర్క్ అంటారు. టీచరుతో సంబంధం ఉంటుంది కానీ టీచరు వెంట ఉండరు. కేవలం సంబంధం ఉంటుంది. అంతిమ పేపర్ వరకు సంబంధం ఉంటుంది. రివైజ్ కోర్స్ సమయంలో టీచరు ప్రతి సమయం వెంట ఉండరు. ఇప్పుడు టీచర్లు దూరం నుండే అన్నీ చూస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా కష్టంగా ఉంటే అడగవచ్చు. కానీ చదివించే సమయంలో ఎలా వెంట ఉండేవారో అలా ఇప్పుడు వెంట ఉండరు. ఇప్పుడు పైన కూర్చుని మంచిగా రివైజ్ కోర్స్ లో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమతో, ఉత్సాహ ఉల్లాసాలలో కోర్సు పూర్తి  చేస్తున్నారో చూస్తున్నారు. పైన కూర్చుని చూసే దృశ్యం ఎంత మంచిగా కనిపిస్తుంది. మీరు పైన కూర్చుని చూస్తున్నారు కదా! పైన కూర్చోవటంలో మరియు క్రింద కూర్చోవటంలో తేడా ఉంటుంది కదా! వీరికంటే పైన ఎవరైనా కూర్చుని చూస్తే ఎంత తేడా ఉంటుంది! బుద్ధిబలం ద్వారా అనుభవం చేసుకోగలరు. ఏమి అనుభవం అవుతుంది? ఈరోజు అనుభవం వినిపిస్తున్నాను. అనుభవం వినటం మరియు వినిపించటం చాలా కాలం నుండి నడుస్తున్న విధానం కనుక, వతనంలో ఉంటూ ఏమి అనుభవం చేసుకుంటున్నారు?  వతనంలో ఉంటూ కూడా టీచరు యొక్క సంబంధం ఉన్న కారణంగా చూస్తున్నారు. కొద్దిమంది చాలా అలౌకికతతో చదువుకుంటున్నారు, రివైజ్ చేస్తున్నారు. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు. సమయం పోగొట్టుకోవటం చూస్తే బాబాకి ఏమనిపిస్తుందో తెలుసా! దయ వస్తుంది కానీ దయతో పాటు వెనువెంట ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది. ఇప్పుడిప్పుడే బాబా నుండి శెలవు తీసుకొని సాకారరూపంలో శిక్షణా స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా వెళ్ళి వారికి ధ్యాస ఇప్పించాలి అని మనస్సులో అనిపిస్తుంది. కానీ సాకారరూపం యొక్క పాత్ర పూర్తయిపోయింది. అందువలన దూరం నుండే శక్తి ఇస్తున్నారు. బాబా ఎలా అయితే సాకారంలో ఎర్రజెండా చూపించేవారో అలాగే వతనంలో కూడా చూపిస్తున్నారు కానీ అవ్యక్త రసాన్ని, అవ్యక్త సహాయాన్ని చాలా కొద్దిమంది తీసుకుంటున్నారు. మార్గంలో నడుస్తున్నప్పుడు ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో ఆ విఘ్నాలు దాటటానికి ముఖ్యంగా ఏ శక్తికావాలి? (సహనశక్తి) సహనశక్తి కంటే ముందు ఏ శక్తి కావాలి? విఘ్నాలు వేసేది ఎవరు? (మాయ) చెప్పాను కదా! విఘ్నాలు దాటటానికి మొదట పరిశీలనా శక్తి కావాలి, తర్వాత నిర్ణయ శక్తి కావాలి. ఇది మాయ లేదా అయదార్దం అని పరిశీలించాలి. లాభమా లేక నష్టమా? అల్పకాలిక ప్రాప్తియా లేక సదాకాలిక ప్రాప్తియా? ఇలా ఎప్పుడైతే నిర్ణయం చేస్తారో ఆ నిరయం తర్వాతే సహనశక్తి వస్తుంది. మొదట పరిశీలించాలి. తర్వాత నిర్ణయించాలి. ఎవరికైతే నిర్ణయ శక్తి ఎక్కువ ఉంటుందో వారు ఎప్పుడూ ఓడిపోరు. ఓటమి నుండి రక్షించుకోవడానికి మీ నిర్ణయశక్తి మరియు పరిశీలనాశక్తిని పెంచుకోవాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ఏమి పురుషార్ధం చేయాలి? స్మృతియాత్ర అని మీరు వెంటనే చెప్పేస్తారు కానీ స్మృతియాత్రకి కూడా బలం ఇచ్చే జ్ఞానం అంటే తెలివి ఏమిటి ఇది కూడా బుద్ధిలో స్పష్టంగా ఉండాలి. మొత్తం అయితే ఉంచుకున్నారు. కానీ మొత్తంలో అక్కడక్కడ మరలా పోతుంది. స్కూలులో కూడా పిల్లలు ఒకరిని చూసి ఒకరు కాపీ చేసి లెక్కల్లో టోటల్ ని తీసుకువచ్చేస్తారు. కానీ మాస్టర్ ఇది ఎలా చేసారు అని అడిగితే అయోమయం అయిపోతారు. అలాగే మీరు కూడా మొత్తం మీద స్మృతియాత్ర అని చెప్తున్నారు కానీ అది ఎలా అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. కనుక నిర్ణయ శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా ఏ విషయం అవసరం? (విచారసాగరమధనం) విచారసాగర మధనం చేస్తూ చేస్తూ సాగరంలోనే మునిగిపోతే? కొంతమంది విచారసాగరమధనం చేయడానికి కూర్చుంటారు కానీ కొన్ని కొన్ని అలలు వచ్చి వెంట తీసుకు వెళ్ళిపోతాయి! ఎవరికైనా శారీరకశక్తి తక్కువైతే బలమైన ఆహారం ఇస్తారు. అలాగే నిర్ణయ శక్తిని వృద్ధి చేసుకోడానికి ఆహారం ముందే చెప్పాను. అశరీరి, నిరాకారి మరియు కర్మతో అతీతంగా అవ్వాలి. నిరాకారి లేక అశరీరి స్థితి బుద్ధి వరకు కానీ కర్మలో అతీతంగా ఉండాలి. ప్రతి కర్మ చూసి వీరు అతీతమైనవారు అని ఇతరులు భావించాలి. వీరు లౌకికం వారు కాదు, అలౌకికం వారు అని భావించాలి. కనుక నిర్ణయ శక్తిని పెంచుకునేటందుకు ఇది చాలా అవసరం. ఎంతగా ఈ విషయాలని ధారణ చేస్తారో అంత మీ విఘ్నాలను తొలగించుకోగలరు మరియు సృష్టిలో వచ్చే విఘ్నాల నుండి కూడా రక్షించుకోగలరు. శిక్షణ అయితే చాలా లభిస్తుంది. కానీ ఇప్పుడేం చేయాలి? శిక్షణా స్వరూపంగా అవ్వాలి. శిక్షణ మరియు మీ స్వధర్మం వేరు కాకూడదు. ఈ స్వరూపమే శిక్షణ ఇవ్వాలి. స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వవచ్చు. కొన్ని విషయాలలో వాణి ద్వారా శిక్షణ ఇవ్వలేరు. అప్పుడు శిక్షణా స్వరూపం అయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణనివ్వాలి. శిక్షణ అయితే చాలా లభించింది. కోర్సు పూర్తయిపోయింది కదా!
                 ఒక ప్రశ్న అడిగారు , ఇప్పుడు బాప్ దాదా వేరే తనువులోకి వస్తున్నారు కదా! సాకార రూపంలో వాణి చెప్తున్నట్లు ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు. అలాగే మురళీ చెప్పలేరా? భాష ఎందుకు మారింది, పద్దతి ఎందుకు మారింది? ఇటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. మీరు ఉపన్యాసం చెప్పగలుగుతున్నప్పుడు బాప్ దాదాకి ఏ తనువు ద్వారా అయినా మురళీ చెప్పటం కష్టమా? కానీ ఎందుకు చెప్పటం లేదు ? (ఇద్దరు, నలుగురు తమ ఆలోచన చెప్పారు). ఏ తనువు ద్వారా చదివించే పాత్ర ఉందో ఆ చదువు యొక్క కోర్సు పూర్తి అయిపోయింది. ఇప్పుడు మరలా చదువు చదివించడానికి రావటం లేదు, అది కోర్సు. ఆ కోర్సు ఆ తనువు  ద్వారా పాత్ర పూర్తయిపోయింది. ఇప్పుడు కలుసుకోవడానికి వస్తున్నారు మరియు పిల్లలని సంతోషపరచటానికి వస్తున్నారు. ముఖ్య విషయాలు ఏమిటి? అశరీరీ అవ్వాలి. బాబా కర్మాతీతంగా ఏమి చేసారు. ఒక సెకనులో పక్షి అయ్యి ఎగిరిపోయారు. కనుక సాకార శరీరంతో ఒక సెకనులో ఎగిరిపోయారు కదా! ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. ఇక ఒక కార్యం మిగిలి ఉంది. వెంట తీసుకువెళ్లే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయడానికి వస్తున్నాను. చదువు యొక్క పాయింట్సు చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది.  కాని ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్సు పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్సు అయ్యింది అని అందరు నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను. ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను, తర్వాత రెండవ ప్రశ్న ఇస్తున్నారు. ఇప్పుడు మీ హోమ్ వర్క్ నడుస్తుంది. దానిలో విశేషంగా ఇదే ద్యాస ఇప్పిస్తున్నారు. ఈ పాత్ర జరగవలసినది జరిగింది. సాకార బాబాని అవ్యక్తం ఎందుకు చేసారో దీనిలో కూడా చాలా గుహ్య రహస్యం ఉంది. దీని లోతులోకి వెళ్ళాలి. సాగరుని అలలలో స్నానం చేయటం కాదు, సాగరపు లోతులోకి వెళ్ళాలి. రత్నాలు తెచ్చుకుని రావాలి. దీనిలో ఏదో గుహ్య రహస్యం ఉంది అని ఆలోచించాలి. రహస్యంగా లేకుండా ఏదీ జరగదు. మంచిది. ఇప్పుడు సమయం అయిపోయింది.

Comments

  1. Om shanthi Mera Bapdada. Thank You so much Baba.

    ReplyDelete
  2. Thank you a lot pyare Baba for reveling many secrets and giving us chance to dig in more

    ReplyDelete

Post a Comment