19-06-1969 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బద్దకానికి మధురమైన రూపం- సోమరితనం
అందరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తస్థితిలో ఉంటున్నారా? అవ్యక్త స్థితి అని దేనిని అంటారు తెలుసా? అవ్యక్త స్థితి యొక్క పరిశీలన ఏమిటి? మొదట అవ్యక్తస్థితి యొక్క గ్రహింపు మరియు గ్రహించిన తర్వాత పరిశీలన ఉండాలి. ఈ రెండు విషయాల జ్ఞానం ఉందా? అవ్యక్త స్థితి అని దేనిని అంటారు? (వ్యక్తభావం ఉండకూడదు) వ్యక్తంలో కార్యం చేస్తూ కూడా వ్యక్త భావం ఉండకుండా ఎలా ఉంటుంది? వ్యక్తంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండాలి. ఈ స్థితి యొక్క అనుభవం ఎంత ఉంది? అనేది ఈ రోజు అడిగారు. అవ్యక్తస్థితిలో ఎక్కువలో ఎక్కువ ఎంత సమయం ఉంటున్నారు? ఎక్కువలో ఎక్కువ ఎంత సమయం ఉండాలి? ఎక్కువలో ఎక్కువ ఎంత సమయం ఉండాలో తెలుసా? (8గంటలు). సంపూర్ణ స్థితి యొక్క లెక్కతో చూస్తే 8గంటలు కూడా తక్కువలో తక్కువ. మీ వర్తమాన పురుషార్థం యొక్క లెక్కతో 8 గంటలు ఎక్కువా? (ఎవరు చేతులు ఎత్తలేదు) ఎవరైతే 6 గంటలు అవ్యక్త స్థితిలో ఉంటున్నారో వారు చేతులు ఎత్తండి. 4 గంటల వరకు చేరుకున్న వారు చేతులు ఎత్తారు. (కొంతమంది. 4 గంటలు, కొంతమంది 2 గంటలు అని చేతులు ఎత్తారు) ఈ ఫలితం యొక్క లెక్కతో చూస్తే పురుషార్థానికి ఇంకా ఎంత సమయం కావాలి? కోర్సు పూర్తి అయిపోయింది, రివైజ్ కోర్స్ కూడా పూర్తి అవుతూ ఉంది. అయినప్పటికి ఎక్కువమంది ఫలితం ఇలా ఉండడానికి కారణం ఏమిటి? అందరూ పురుషార్థం కూడా చేస్తున్నారు. ఉత్సాహం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది! అయినప్పటికి స్థితి ఎందుకు ఉండటం లేదు? (ధ్యాస తక్కువగా ఉంది) ఏ విషయం యొక్క ధ్యాస లోపంగా ఉంది? యోగ్యులుగా అవ్వాలనే మరియు సమీపంగా రావాలనే ధ్యాస అందరు పెట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఏ ధ్యాస లోపంగా ఉంది? దాని కారణంగా అవ్యక్తస్థితి తక్కువగా ఉంటుంది. పురుషార్థిలు అందరు కూర్చున్నారు కదా! నేను పురుషార్ధిని కాదు అనేవారు ఎవరైనా ఉన్నారా? అంతర్ముఖిగా ఉండాలనుకుంటున్నారు కానీ ఎందుకు ఉండలేకపోతున్నారు? బాహర్ముఖతలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? జ్ఞానీ ఆత్మలుగా అందరూ అయ్యారు.
జ్ఞానీ ఆత్మ తెలివైనవారిగా అయ్యి మరలా తెలివితక్కువగా ఎందుకు అయిపోతున్నారు?. తెలివి ఉంది. తెలివి యొక్క కోర్స్ కూడా పూర్తి అయిపోయింది. అయినా కానీ తెలివితక్కువవారిగా ఎందుకు అవుతున్నారు? ముఖ్య కారణం బాబా చూస్తున్నారు. ఎక్కువ మందిలో సోమరితనం వచ్చేసింది. దీనినే బద్దకం అని అంటారు. బద్దకం యొక్క మధురమైన రూపం సోమరితనం. సోమరితనం కూడా అనేక రకాలుగా ఉంటుంది. ఎక్కువమందిలో ఏదోక రూపంలో సోమరితనం మరియు బద్దకం వచ్చేస్తుంది. తయారవ్వాలనే కోరిక కూడా ఉంది. పురుషార్థం కూడా చేస్తున్నారు. కానీ సోమరితనం కారణంగా ఎంత పురుషార్ధం చేయాలో అంత చేయటం లేదు. బుద్ధిలో ఎక్కువ జ్ఞానం వచ్చే కొలదీ సోమరితనం కూడా ఎక్కువ వచ్చేస్తుంది. ఎవరైతే తమని తాము తక్కువ తెలివైన వారిగా భావిస్తున్నారో వారు తీవ్ర పురుషార్ధం చేస్తున్నారు. ఎవరైతే తమని తాము ఎక్కువ తెలివైనవారిగా భావిస్తున్నారో వారు ఎక్కువ సోమరితనంలోకి వచ్చేస్తున్నారు. మొట్టమొదటగా పురుషార్ధం యొక్క తపన ఉండాలి. ఇలా అయ్యి చూపిస్తాము అనే తపన ఇప్పుడు సమాప్తి అయిపోయింది. తృప్తి అయిపోయారు. తమతో తాము తృప్తి అయిపోయారు. జ్ఞానం అయితే అర్థం చేసుకున్నాం, సేవ అయితే చేస్తున్నాం అలా తృప్త ఆత్మగా అవ్వకూడదు. పురుషార్ధంలో తపన ఉంచాలి. బంధనాలలో ఉన్నవారు తపిస్తారు. కనుక పురుషార్ధం తీవ్రంగా చేస్తారు. బంధనాలు లేనివారు తృప్తి అయిపోయి సోమరిగా అయిపోతున్నారు. ఇలాంటి ఫలితం ఎక్కువమంది పురుషార్థీలలో కనిపిస్తుంది. సదా మేము మొదటి నెంబరు పురుషార్ధిగా తయారవుతున్నాం అని భావించండి. ఇప్పుడు ఇంకా తయారైపోలేదు. మూడు కాలాల జ్ఞానం బుద్ధిలోకి రావటం ద్వారా తమని తాము చాలా తెలివైనవారిగా భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా! ఎక్కడ పిల్లలుగా అవ్వాలో అక్కడ యజమానులు అవుతున్నారు, ఎక్కడ యజమానులు అవ్వాలో అక్కడ పిల్లలుగా అవుతున్నారు. కనుక ఇప్పుడు కూడా పిల్లలుగా అయ్యి మధురాతి మధురమైన పురుషార్ధం చేస్తున్నారు. ఇక రాజ్యాధికారి అయిపోయాం అని భావిస్తున్నారు. తిలకం కూడా పెట్టుకున్నారు. కానీ ఈ బలహీన మరియు మధుర పురుషార్ధం ఇప్పుడు నడవదు. ఎంత శక్తి రూపంలో స్థితులవుతారో అంత పురుషార్ధం కూడా శక్తిశాలిగా అవుతుంది. ఇప్పుడు పురుషార్ధం శక్తిశాలిగా లేదు, బలహీనంగా ఉంది. అందరు పురుషార్థులే కానీ ఎంత శక్తిశాలి పురుషార్ధం ఉండాలో అంత శక్తి పురుషార్ధంలో నిండటం లేదు. ఉదయం లేస్తూనే పురుషార్ధంలో శక్తి నిండే ఏదోక పాయింటుని ఎదురుగా ఉంచుకోండి. అమృతవేళ ఎలా అయితే ఆత్మిక సంభాషణ చేస్తున్నారో అలాగే మీ పురుషార్ధాన్ని శక్తిశాలిగా చేసుకోవడానికి కూడా ఏదోక పాయింటుని మీ బుద్ధిలో విశేషంగా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు విశేష పురుషార్ధం చేయవలసి ఉంది. సాధారణ పురుషార్ధం చేసే రోజులు గడిచిపోతున్నాయి. ఎలా అయితే విశేష ఫంక్షన్ యొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటారో అలాగే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది అని భావించండి. కనుక విశేష పురుషార్ధం యొక్క కార్యక్రమం పెట్టుకోవాలి మరియు విశేష పురుషార్ధం యొక్క లక్ష్యం పెట్టుకుని ముందుకి వెళ్ళాలి. ఒకవేళ అలా బలహీన ఫలితంలోనే ఉంటే వచ్చే పరీక్షలలో ఫలితం ఎలా ఉంటుంది? చాలా కఠిన పరిస్థితులు రానున్నవి. వాటిని ఎదుర్కునేటందుకు పురుషార్ధం కూడా కఠినంగా చేయాలి. పురుషార్ధం సాధారణంగా, పరీక్ష కఠినంగా ఉంటే ఫలితం ఏమి వస్తుంది? ఈరోజు గోపకులతో సంభాషణ చేస్తున్నాను. మీ పురుషార్ధంతో మీరు సంతుష్టంగా ఉన్నారా? నడుస్తున్నారు కానీ వేగం ఎంత శాతంలో ఉంది? ఎవరైతే మేము 75% శ్రీమతంపై నడుస్తున్నాం అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. (కొంతమంది చేతులు ఎత్తారు) మంచిది.
ముఖ్య శ్రీమతం ఏమిటి? ముఖ్య శ్రీమతం ఏమిటంటే ఎక్కువలో ఎక్కువ సమయం స్మృతియాత్రలో ఉండాలి. ఎందుకంటే స్మృతియాత్ర ద్వారానే పవిత్రత, దైవీగుణాలు మరియు సేవలో సఫలత లభిస్తాయి. ఎవరైతే 75% శ్రీమతంపై నడుస్తారో వారి స్మృతి చార్టు ఎంత ఉండాలి? స్మృతి చార్టు కూడా 75% ఉండాలి. వీరినే పూర్తిగా శ్రీమతంపై నడిచేవారు అని అంటారు. ఈరోజు ఎక్కువగా గోపకులని ముందు పెట్టాను. గోపికలను తర్వాత అడుగుతాను. ఎందుకంటే ఎప్పుడైనా కలయిక ఏదైనా విషయం వస్తే గోపికలు ముందు వచ్చేస్తారు. గోపకులు చూస్తూ చూస్తూ ఉండిపోతారు. వీరికి భాద్యత ఇవ్వాలి మరియు ఇచ్చాను కూడా. ద్వాపరయుగం తర్వాత మీ కిరీటం పోతుంది అని మీరు చిత్రం చూపిస్తారు కదా! ఇక్కడ బాబా బాధ్యతా కిరీటాన్ని ఇచ్చారు. కానీ అప్పుడప్పుడు దానిని తెలియకుండానే తీసేస్తున్నారు మరియు మాయ కూడా తీయించేస్తుంది. సత్యయుగంలో కిరీటం ఎంత తేలికగా ఉంటుందంటే తలపై ఏదో బరువు ఉంది అని అనిపించదు. సత్యయుగ దృశ్యాలు ఎదురుగా వస్తున్నాయా? లేదా? సత్యయుగ దృశ్యాలు అవే ఎదురుగా వస్తున్నాయా లేక మీరు ఎదురుగా తెచ్చుకుంటున్నారా? మీరు ఎంతెంత ముందుకి వెళ్తూ ఉంటారో అంతంతగా సత్యయుగ దృశ్యాలు స్వతహాగానే కనిపిస్తాయి. ఎదురుగా తెచ్చుకోవలసిన అవసరం ఉండదు. సత్యయుగంలోకి వెళ్లటం మరియు ఆటపాటలు ఇవన్నీ నిశ్చయం అయిపోయాయి కదా! మేము శ్రీకృష్ణునితో పాటు మొదటి జన్మలోకి వస్తాము, ఆయన కుటుంబంలోకి వస్తాము లేక స్నేహితునిగా, స్నేహితురాలిగా అవుతాము లేక స్కూలులో కలిసి చదువుకుంటాము. ఈ మూడింటిలో ఏదోక రకంగా తప్పకుండా అవుతాం అని నిశ్చయబుద్ధిగా ఉన్నవారు ఇక్కడ కూర్చున్నవారిలో ఎవరైనా ఉన్నారా? (అందరు చేతులు ఎత్తారు). భవిష్యత్తులో శ్రీకృష్ణునికి సమీపంగా వచ్చే వారికి సంగమయుగంలో ఏమి గుర్తులు కనిపిస్తాయి? ఇక్కడ ఎవరు తమని తాము సమీపంగా భావిస్తున్నారు? యజ్ఞ సేవ లేదా బాప్ దాదా కార్యం యొక్క భాధ్యతలో ఎవరు, ఎంత సమీపంగా అవుతారో వారే అక్కడ శ్రీ కృష్ణునికి సమీపంగా ఉండి ఆడుకుంటారు. ఇక్కడ యజ్ఞం యొక్క భాధ్యత లేదా బాప్ దాదా కార్యం యొక్క బాధ్యతలో ఎవరైతే సమీపంగా ఉంటారో వారే అక్కడ అంత సమీపంగా ఉంటారు. సమీపంగా అయ్యే వారి పరిశీలన ఏమిటి?
ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు అడగాలి - బుద్ధి, తనువు, మనస్సు, ధనాలను ఎంత సమయం లౌకిక భాధ్యతలలో ఉపయోగిస్తున్నానో అంతగానే ఇటువైపు ఉపయోగిస్తున్నానా? ఇటువైపు ఎక్కువ ఉపయోగించాలి. ఒకవేళ ఎక్కువ ఉపయోగించ లేకపోయినా రెండింటి సమానత అయినా ఉందా? రెండింటిలో సమానత ఉన్నా కానీ సమీపంలోకి వచ్చే వారి లెక్కలో ఉంటారు. ఈ లెక్కతో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇప్పటివరకు ఫలితంలో లౌకిక బాధ్యతల బరువు ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ గోపకులు (అన్నయ్యలు) ఈ విషయాల ధ్యాస తప్పకుండా ఉంచుకోవాలి. ఈరోజు ఏదైతే గడిచిపోయిందో దీనిలో ఎంత సమయం లౌకిక భాద్యతల వైపు ఉపయోగించాను మరియు ఎంత సమయం అలౌకికం లేదా పారలౌకిక భాద్యత వైపు ఉపయోగించాను, ఎంత సహాయకారిగా అయ్యాను అని పరిశీలించుకుంటే ఏ వైపు ఖాళీగా ఉందో తెలుస్తుంది. అన్ని రకాల పరిస్థితులలో ఉంటూ కూడా తక్కువలో తక్కువ రెండువైపులా తప్పకుండా సమానంగా ఉండాలి. తక్కువ ఉండకూడదు. అటువైపు తక్కువైనా పర్వాలేదు. దీని వలన లౌకిక భాధ్యతల లోపాన్ని కూడా మంచిగా చేయగలరు. పరమార్ధం ద్వారా వ్యవహారం కూడా సిద్ధిస్తుంది. కొంతమంది మొదట వ్యవహారం బావుంటే పరమార్ధంలో ఉంటాము అని భావిస్తారు. కానీ ఇది సరైనది కాదు. దీనిపై ఎక్కువ ధ్యాస పెట్టుకోవాలి. ఎక్కువ గోపకులపై బాప్ దాదాకి ఆశ ఉంది. అది గోపకులు పూర్తి చేయగలరు. గోపికల ద్వారా పూర్తి అవ్వదు. ఆ ఆశ ఏమిటి? పాండవుల ముఖ్య పని అదే - అనేకరకాల ప్రజలు మరియు అనేక రకాల పరిస్థితులు సమయానుసారంగా రానున్నవి మరియు వస్తుంటాయి. కనుక పరీక్ష మరియు ప్రజలను పరిశీలించటం విశేషంగా గోపకుల పని. ఎందుకంటే పాండవులకి శక్తులని రక్షించే ముఖ్య పని ఉంది. శక్తుల పని - బాణం వేయటం కానీ పరీక్ష మరియు ప్రజలను పరిశీలించటం మరియు శక్తులను రక్షించటం ఇది పాండవుల పని. ఇంత భాధ్యత తీసుకోగలరా? లేక శక్తుల రక్షణ మీకు అవసరమా? అక్కడక్కడ పాండవులు తమ రక్షణ కొరకు ఇతరులను ఆశిస్తున్నారు. కానీ పాండవులు తమ రక్షణతో పాటు నలువైపులా రక్షించాలి. బేహద్ దృష్టితో ఉండాలి. హద్దులో కాదు. ఒకవేళ మీ రక్షణయే చేసుకోలేకపోతే ఇతరులను రక్షించటం కష్టం అవుతుంది. మంచిది.
Om shanthi Mera Bapdada. Wonderful Murali Thank you so much Baba.
ReplyDeleteOka adugu vese dyrym pandavupadi ika aa tarvatha bapdada 1000 adugula sahayam undane undi
ReplyDelete