17-04-1969 అవ్యక్త మురళి

 17-04-1969       ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా       మధువనము

 అబూ ఆధ్యాత్మిక గ్రంధాలయం యొక్క ప్రారంభోత్సవం

      సర్వ స్నేహి పిల్లలకు తండ్రి యొక్క నమస్తే. మీ స్నేహం ఎవరితో ఉంది? (కొంతమంది బాబాతో అని చెప్పారు. కొంతమంది సేవతో అని చెప్పారు). ఇంకా దేనితో స్నేహం ఉంది? ఇప్పుడు కూడా ఒక విషయం మిగిలిపోయింది. బాప్ దాదాతో అయితే స్నేహం ఉంది. కానీ వెనువెంట పురుషార్ధంతో కూడా ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి. 1. దైవీ పరివారంతో స్నేహం, సేవతో స్నేహం, బాప్ దాదాతో స్నేహం ఇదైతే ఉంది. కానీ వర్తమాన సమయం పురుషార్ధంతో ఎక్కువ స్నేహం పెట్టుకోవాలి. ఎవరైతే పురుషార్థం యొక్క స్నేహీగా ఉంటారో వారు అందరికీ  స్నేహీ అవుతారు. ప్రతీ ఒక్కరికీ పురుషార్థంపై ఎంత స్నేహం ఉంది అనేది ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి. బాప్ దాదాతో కూడా స్నేహం ఎందువలనంటే బాప్ దాదా పురుషార్ధం చేయిస్తారు. పురుషార్ధంతో స్నేహం ఉన్నప్పుడే ప్రాలబ్దముపై కూడా స్నేహం ఉంటుంది. పురుషార్ధంపై స్నేహం లేనంతవరకు దైవీ పరివారం యొక్క స్నేహం తీసుకోలేరు, ఇవ్వలేరు. ఒకవేళ పురుషార్ధంతో స్నేహం ఉంటే ఒకరి స్నేహానికి ఒకరు పాత్రులు అవుతారు. స్నేహం కారణంగానే అందరూ ఇక్కడ కలుసుకున్నారు. కానీ అందరూ బాప్ దాదా స్నేహంలో ఉంటున్నారు. కానీ ఇప్పుడు పురుషార్ధంతో కూడా స్నేహం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పురుషార్థమే పిల్లలైన మీకు మొత్తం కల్పం యొక్క ప్రాప్తిని తయారుచేస్తుంది. ఎంత పిల్లలకి స్నేహం ఉందో దానికంటే చాలా ఎక్కువ స్నేహం బాప్ దాదాకి కూడా ఉంది. ఎవరు ఎంత స్నేహి అవుతారో వారికి అంత స్నేహం యొక్క  బదులు లభిస్తుంది. అవ్యక్తరూపంలో స్నేహాన్ని తీసుకోవాలి. అవ్యక్త స్నేహం యొక్క పాఠాన్ని ఎంత వరకు చదువుకున్నారు? వర్తమాన సమయం యొక్క పాఠం ఇదే. అవ్యక్త రూపంలో స్నేహం తీసుకోవాలి మరియు స్నేహంతో సేవ యొక్క ప్రత్యక్షత ఇవ్వాలి. ఈ అవ్యక్త స్నేహం యొక్క  పాఠం ఎంత గట్టిగా చేసుకున్నారు? ఇప్పటి వరకు ఫలితం ఎలా ఉందని భావిస్తున్నారు? సగం  వరకు చేరుకున్నారా? ఎక్కువ మంది యొక్క ఫలితం అడుగుతున్నారు. (కొంతమంది 25%, కొంతమంది 75% అని చెప్పారు) 25% మరియు 75% ఎంత తేడా ఉంది? ఎక్కువమంది  25% అంటున్నారు. ఫలితం ఇలా ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఏమిటి? 25% అవ్యక్త  స్నేహం ఉంటే మిగిలిన 75% ఏ స్నేహం ఉంది? ఎక్కువమంది 25% ఫలితంలో ఉంటే  భవిష్యత్తులో వచ్చే దానిలో పాస్ మార్కులు ఎలా లభిస్తాయి? ఇప్పుడు అవ్యక్త స్నేహమే  ముఖ్యమైనది. అవ్యక్త స్నేహమే స్మృతియాత్రకు బలం ఇస్తుంది. అవ్యక్త స్నేహమే అవ్యక్తస్థితిని  తయారుచేసుకోవటంలో సహాయం చేస్తుంది. ఫలితం 25% ఉండటానికి గల కారణం ఏమిటి? కారణం ఆలోచించారా? సమయప్రకారంగా ఇప్పటి వరకు ఈ ఫలితం ఉండకూడదు. సమయప్రకారం 75% ఉండాలి. తిరిగి ఈ ఫలితం తయారు చేసుకోవడానికి ఏమి చేస్తారు?  దానికి పద్ధతి ఏమిటి? (అంతర్ముఖత) అంతర్ముఖి అవ్వాలని సదా చెప్తున్నారు కానీ అవ్వకపోవడానికి గల కారణం ఏమిటి? బాప్ దాదాతో, సేవతో స్నేహం ఉండనే ఉంది కానీ పురుషార్ధంతో స్నేహం తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది? దీనికి కారణం ఇదే కనిపిస్తుంది - చాలామంది పరిస్థితులను చూసి అలజడి అయిపోతున్నారు. పరిస్థితుల ఆధారంగా స్థితిని తయారుచేసుకుంటున్నారు. స్థితి ద్వారా పరిస్థితులను మార్చటం లేదు. పరిస్థితి మారితే స్థితి ఉంటుంది అని భావిస్తున్నారు. కానీ స్వస్థితి యొక్క శక్తి ఉన్నప్పుడే పరిస్థితులు మారతాయి. అది పరిస్థితి. ఇది స్వస్థితి. పరిస్థితిలోకి రావటం ద్వారా బలహీనతలోకి వచ్చేస్తారు. స్వస్థితిలోకి రావటం ద్వారా శక్తి వస్తుంది. పరిస్థితిలోకి వచ్చి నిలబడిపోకూడదు. స్వస్థితి ద్వారా ఏ పరిస్థితిలోనైనా యుద్ధం చేసే శక్తి ఉంటుంది. స్వస్థితి బలహీనంగా ఉన్న కారణంగా అక్కడక్కడ పరిస్థితులు శక్తివంతంగా అవుతున్నాయి.
            చాలామంది పిల్లలు చెప్తున్నారు - బాబా ఈ విషయాన్ని మంచిగా చేస్తే మేము ఇలా అవుతాము అని. ఈ విషయం విఘ్నంగా ఉంది అని అంటారు. ధైర్యంతో ఈ పరిస్థితిని దాటి చూపిస్తాము అనేవారు అరుదుగా ఉన్నారు. కోరిక కోరతారు ఇది మంచిదే కానీ ఆ కోరికతో పాటు ఏదైతే శిక్షణ లభిస్తుందో దానిని స్వరూపంలోకి తీసుకురావటం లేదు. అందరి కోరికల ఫైల్ చాలా పెద్దది అయిపోయింది. ధర్మరాజు యొక్క లెక్కల ఖాతా ఉంటుంది కదా! అలాగే వర్తమాన సమయంలో బాప్ దాదా దగ్గర పిల్లల కోరికలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఫైల్ ఉంది.  ముఖ్య విషయం చెప్పాను కదా - పురుషార్థంపై స్నేహం పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు ఏమంటున్నారు? (పురుషార్థి). మీరు పురుషార్థులు కానీ పురుషార్థం గురించి తెలుసుకోవటం లేదు. మీ ఫైల్ గురించి తెలుసా? మీ పురుషార్థం ఏమిటో తెలుసా? సాకారరూపంలో అంతిమస్థితి ఎలా తెలిసింది?అంతిమ స్థితి ప్రకారం ఏ లోపం అయితే కనిపిస్తుందో ఆ  లోపాన్ని వెంటనే తొలగించుకోవటమే పురుషార్థంపై ప్రేమ పెట్టుకోవటం. నెమ్మది నెమ్మదిగా చేయటం కాదు. సాకార బ్రహ్మాబాబాలో ఒక విషయం ముఖ్యంగా ఉండేది - ఏ విషయాన్ని అయినా తర్వాత అని వదలలేదు. ఇప్పుడే చేయాలి అనేవారు. ఎలా అయితే బాబా ఇప్పుడే చేసేవారో అలాగే ఇప్పుడే చేయాలి. ఎప్పుడో 10 లేదా 15 రోజుల తర్వాత చేస్తాం అనకూడదు. మధువనం వెళ్ళి అభ్యాసం చేస్తాం ఇలా ఎక్కువగా ఎదురుచూస్తున్నారు, తయారవ్వటం మర్చిపోతున్నారు, తయారవ్వటం లేదు. విషయాల కోసం చాలా ఎదురు చూస్తున్నారు. నిరీక్షణ  వదిలి తయారవ్వటంలో నిమగ్నం అవ్వాలి. అప్పుడు ఫలితం 75% అయిపోతుంది. వర్తమాన సమయంలో పురుషార్ధం 75% కంటే కూడా తక్కువ కాకూడదు. కారణం కూడా వినిపిస్తున్నాను.  కొందరు సమయం కోసం లేదా సమస్యల గురించి లేదా సంబంధీకుల గురించి లేదా శరీరం కొరకు ఆలోచిస్తున్నారు. కానీ ఎలా, ఏవిధంగా, ఏది ఎదురుగా వచ్చినా అలాంటి పరిస్థితులలో ఉండగానే మరియు ఈ శరీరం ఉండగానే మేము సంపూర్ణం అవ్వాలనే లక్ష్యం పెట్టుకోండి. ఇప్పుడు ఏదోక ఆధారం తీసుకుంటున్న కారణంగా ఆధీనం అయిపోతున్నారు, విషయాలకి అధీనం అయిపోతున్నారు..
                    ప్రతి ఒక్కరు తమతమ కథని అమృతవేళ వినిపిస్తున్నారు. కొందరు శరీరానికి రోగం లేకపోతే చాలా పురుషార్ధం చేస్తాం అని అంటున్నారు. కొందరు బంధనాలు తొలగించు అని చెప్తున్నారు. కానీ ఒక బంధన తొలగిస్తే ఇంకొక బంధన వస్తుంది. తనువు యొక్క బంధన తొలగిస్తే మనస్సు లేదా ధనం లేదా సంబంధం యొక్క బంధన వస్తుంది. అప్పుడు ఏమి చేస్తారు? ఇవి వాటంతట అవి తొలగవు. వాటిని మీ శక్తితోనే తొలగించుకోవాలి. కొందరు బాప్ దాదా తొలగిస్తారు లేదా సమయానికి అదే తొలగిపోతాయి అని భావిస్తున్నారు. కాని ఇలా భావించకండి. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది. కనుక ఒకవేళ బలహీన పురుషార్థం ఉంటే ఈ పురుషార్ధ సమయాన్ని చేతులారా పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఒకొక్క సెకను, ఒకొక్క శ్వాస సఫలం చేసుకోవాలి. ఎన్ని శ్వాసలు నడుస్తున్నాయో తెలుసా? లెక్కలేనన్ని కదా! కనుక ఒకొక్క సెకను, ఒకొక్క శ్వాస సఫలం అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి సమయం. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అయితే కొంతమంది పిల్లలు సాకార మధుర కలయిక యొక్క సౌభాగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారో అలాగే పురుషార్థం చేసుకునే సౌభాగ్య సమయం కూడా చేతుల నుండి వెళ్ళిపోతుంది. అందువలన ముందుగానే చెప్తున్నాను. పురుషార్థంతో స్నేహం పెట్టుకుని పురుషార్థాన్ని పెంచుకోండి. పైనుండి మొత్తం ఆట అంతా చూస్తూ ఉంటాను. మీరు కూడా వచ్చి చూస్తే చాలా మజాగా ఉంటుంది. పిల్లలు చాలా రమణీయ ఆటలు చూపిస్తున్నారు. మీరు కూడా చూడవచ్చు. మీరు కూడా ఉన్నత స్థితిలో స్థితులై చూస్తే మీ సహితంగా ఇతరుల ఆట అంతా కనిపిస్తుంది. బాప్ దాదా అయితే చూస్తూ ఉంటారు. నవ్వు వచ్చే ఆట ఆడుతున్నారు. పెద్దపెద్ద మహారథులు సింహంతో భయపడటం లేదు కానీ చీమలతో భయపడుతున్నారు. సింహంతో చాలా సహజంగా ఎదుర్కొంటున్నారు. కానీ చీమలని తప్పించుకునే పద్ధతి రావటం లేదు. ఇది మహారథుల ఆట. గుఱ్ఱపు సవారీలు ఏమి చేస్తున్నారో తెలుసా? గుఱ్ఱపు సవారీల ఆట కూడా చూస్తున్నారు. మహారథీల గురించి చెప్పాను కదా? గుఱ్ఱపు సవారీలకు ధైర్యం, ఉల్లాసం చాలా ఉన్నాయి. పురుషార్థంలో అడుగు ముందుకి వేస్తున్నారు కూడా. కానీ ముందుకి వెళ్తూ వెళ్తూ పడిపోవటం లేదు మరియు తడబడటం లేదు, అలసిపోవటం లేదు. అలసిపోనివారిగా ఉంటున్నారు. చాలా బాగా కూడా నడుస్తున్నారు. కానీ మార్గంలోని దృశ్యాలకు ఆకర్షితం అయిపోతున్నారు. తమ పురుషార్థాన్ని నడిపిస్తున్నారు కూడా, కానీ ఇతరులని చూసే సంస్కారం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. మేము కూడా చేయాలని గుఱ్ఱపు సవారీలలో చూసే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాలిబలం వారిది ఒక నవ్వు వచ్చే విషయం ఉంది. ఆట వినిపిస్తున్నాను కదా! వారు ఏమి చేస్తున్నారు? అవ్వటానికి అది చాలా చిన్న విషయం కానీ దానిని పెద్ద పర్వతంగా చేసేసుకుంటున్నారు. పర్వతాన్ని రాయిగా కాదు, రాయిని పర్వతంగా చేసుకుని దానిలో స్వయమే అలజడి అయిపోతున్నారు. నిజానికి ఏమి లేదు. కానీ దానినే పెద్దగా చేసుకుంటారు. ఉన్నతం, ఉన్నతం అంటూ ధైర్యహీనులుగా అయిపోతున్నారు. అయినప్పటికీ వర్తమాన సమయంలో ఎవరి విషయాలు వినిపించానో వారిలో సగం మంది తమని తాము ఏదోక విధంగా మార్చుకుంటున్నారు. అందువలన వారి ధైర్యం, ఉల్లాసం, అడుగు ముందుకి వేయటం చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎవరు మహారథి, గుఱ్ఱపుసవారీ, ఎవరు కాలిబలం అని ప్రతి ఒక్కరినీ అడిగితే చెప్పగలరా? మంచిది.

Comments

Post a Comment