24-03-1985 అవ్యక్త మురళి

 24-03-1985                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

'' ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు (అబ్ నహీ తో కబ్ నహీ) ''
ఈ రోజు లవ్ఫుల్ మరియు లాఫుల్ బాప్దాదా పిల్లలందరి ఖాతాలను చూస్తున్నారు. ఒక్కొక్కరి జమ ఖాతా ఎంత ఉందో చూస్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వడమనగా ఖాతా జమ చేసుకోవడం. ఎందుకంటే ఈ ఒక్క జన్మలో జమ చేయబడిన ఖాతా అనుసారము 21 జన్మల ప్రాలబ్ధము పొందుకుంటూ ఉంటారు. కేవలం 21 జన్మలకు ప్రాలబ్ధం ప్రాప్తి చేసుకోవడమే కాక ఎంత పూజ్యులుగా అవుతారో అనగా రాజ్య పదవికి అధికారులుగా అవుతారో ఆ లెక్క అనుసారం అర్ధకల్పము భక్తిమార్గంలో పూజ కూడా రాజ్యభాగ్య అధికారము లెక్కతో జరుగుతుంది. రాజ్య పదవి ఎంత శ్రేష్ఠంగా ఉంటుందో పూజ్య స్వరూపము కూడా అంత శ్రేష్ఠంగా ఉంటుంది. ప్రజలు కూడా అంత సంఖ్యలో తయారవుతారు. ప్రజలు తమ రాజ్యాధికారిని విశ్వ మహారాజు లేక రాజును తల్లిదండ్రుల రూపంలో ప్రేమిస్తారు. భక్త ఆత్మలు కూడా అలాగే ఆ శ్రేష్ఠ ఆత్మను లేక రాజ్య అధికారి మహాత్మను తమ ప్రియమైన ఇష్టదేవతగా భావించి పూజిస్తారు. ఎవరైతే అష్టరత్నాలుగా అవుతారో వారు ఇష్టదేవతలుగా కూడా అంత మహాన్గా తయారవుతారు. ఈ లెక్క అనుసారము ఈ బ్రాహ్మణ జీవితంలోనే రాజ్య పదవిని మరియు పూజ్య పదవిని పొందుకుంటారు. అర్ధకల్పము రాజ్యపదవి పొందిన వారిగా అవుతారు, అర్ధకల్పము పూజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఈ జన్మ లేక జీవితము లేక యుగము మొత్తం కల్పంలో ఖాతాలను జమ చేసుకునే యుగము లేక జీవితము. అందువలన మీ అందరి కొరకు ఒక స్లోగన్ తయారు చేయబడింది. అది ఏమిటో గుర్తుందా? ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు (అబ్ నహీ తో కబ్ నహీ). ఈ స్లోగన్ ఈ సమయంలో ఈ జీవితము కొరకే మహిమ చేయబడింది. ఈ స్లోగన్ ఇది బ్రాహ్మణులకే కాక అజ్ఞాని ఆత్మలను మేల్కొల్పేందుకు కూడా ఉపయోగపడ్తుంది. ఒకవేళ బ్రాహ్మణాత్మలు ప్రతి శ్రేష్ఠ కర్మను చేసేందుకు ముందు సంకల్పము చేస్తూ ఈ స్లోగన్ సదా గుర్తుంచుకుంటే ఏమవుతుంది? సదా ప్రతి శ్రేష్ఠ కార్యంలో తీవ్రంగా అయి ముందుకు వెళ్తారు. అంతేకాక ఈ స్లోగన్ సదా ఉల్లాస - ఉత్సాహాలను ఇప్పిస్తుంది. స్వతహాగా ఆత్మిక జాగృతి వచ్చేస్తుంది. తర్వాత చేస్తాంలే, చూస్తాంలే, ఎలాగైనా చేయాల్సిందే, ఎలాగైనా నడవాల్సిందే, తయారవ్వాల్సిందే - ఇటువంటి సాధారణ పురుషార్థం చేయు సంకల్పాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అనే స్లోగన్ గుర్తుకొస్తుంది. ఏది చేయాలో అది ఇప్పుడే చేయండి. దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు.
సమయము మారిపోతే అప్పుడప్పుడు శుభసంకల్పాలు కూడా మారిపోతాయి. ఎంత ఉత్సాహంగా శుభకార్యము చేయాలని అనుకున్నారో అది కూడా మారిపోతుంది. అందువలన బ్రహ్మబాబా నంబరువన్లోకి వెళ్లే విశేషత అతనిలో ఏం చూశారు? ఎప్పుడో కాదు ఇప్పుడే చేయాలి. వెంటనే చేసిన దానం మహాపుణ్యమని అంటారు(తురంత్ దాన్ మహా పుణ్య్). ఒకవేళ వెంటనే దానం చేయకుంటే, ఆలోచిస్తూ ఉంటే, సమయం తీసుకుంటే, ప్లాన్ తయారుచేసి ప్రాక్టికల్లోకి తీసుకు రాకుంటే దానిని వెంటనే చేసిన దానమని అనరు. మామూలు దానము అని అంటారు. వెంటనే చేసిన దానానికి, సాధారణ దానానికి తేడా ఉంది. వెంటనే చేసిన దానం మహా దానము. మహా దానానికి ఫలము మహోన్నతంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు సంకల్పాన్ని ప్రాక్టికల్గా చేసేందుకు ఆలోచిస్తారో - బాగా చేయాలి, చేస్తాను, ఇప్పుడే కాదు, కొంత సమయము తర్వాత చేస్తాను, ఇప్పుడు ఇంత మాత్రము చేస్తాను..... ఇలా ఆలోచించి చేసేందుకు మధ్యలో ఏ సమయం పడ్తుందో ఆ సమయంలో మాయకు అవకాశం లభిస్తుంది. పిల్లల ఖాతాలో చాలాసార్లు ఆలోచనకు, చేయుటకు మధ్యలో ఏ సమయమైతే పడ్తుందో ఆ సమయంలో మాయ రావడాన్ని బాప్దాదా గమనించారు. కనుక విషయం కూడా మారిపోతుంది. శరీరంతో లేక మనసుతో ఈ పని చేస్తాము అని అనుకుంటారు కాని సమయము పట్టినందున నూరు శాతము ఆలోచిస్తారు కాని చేసే సమయంలో ఆ శాతము మారిపోతుంది. సమయము గడిచినందున, మాయ ప్రభావము వలన 8 గంటలు చేయాలనుకున్నవారు 6 గంటలే చేస్తారు. 2 గంటలు తగ్గిపోతుంది. పరిస్థితులే అలా తయారవుతాయి. ఈ విధంగా ధనము విషయంలో నూరు రూపాయలు చేయాలనుకుంటారు కాని 50 రూపాయలే చేస్తారు. ఇంత తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే మధ్యలో మాయకు అవకాశము లభిస్తుంది. తర్వాత చాలా సంకల్పాలు వస్తాయి. ఇప్పుడు 50 చేస్తాము, మిగిలిన 50 తర్వాత చేస్తాంలే అంతా బాబాదే కదా అని అనుకుంటారు. కాని తనువు, మనసు, ధనము వీటి విషయంలో వెంటనే చేసే దానము మహాపుణ్యమైనదిగా ఉంటుంది. బలి ఇచ్చే సమయంలో కూడా వెంటనే జరిగే బలి మహాప్రసాదంగా అవుతుందని తెలుసు కదా. ఒకే దెబ్బతో బలి చేసే దానిని మహాప్రసాదమని అంటారు. బలి జరిగేటప్పుడు అరుస్తూ అరుస్తూ, ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండిపోతే అది మహాప్రసాదము కాదు. ఉదాహరణానికి మేకను బలి ఇచ్చేటప్పుడు అది చాలా అరుస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు? ఇలా చేస్తామా, అలా చేస్తామా అని ఆలోచిస్తారు. దీనినే ఆలోచించడము అని అంటారు. అరిచేవారిని ఎప్పుడూ మహాప్రసాదం రూపంలో స్వీకరించరు. అలాగే ఇక్కడ కూడా వెంటనే చేసిన దానం మహాపుణ్యం..... అని గాయనం ఏదైతే ఉందో అది ఈ సమయానికి చెందినదే. అనగా ఆలోచించడము, చేయడము వెంటనే జరిగిపోతాయి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోరాదు. చాలాసార్లు ఇటువంటి అనుభవాలు కూడా వినిపిస్తారు. నేను కూడా ఇదే ఆలోచించాను, కాని వీరు చేసేశారు, నేను చేయలేదని అంటారు. మరి ఎవరు చేశారో వారే పొందుతారు కదా. ఎవరైతే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండిపోతారో వారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ త్రేతాయుగానికి చేరుకుంటారు. వెంటనే చేయకూడదు అని అనడం కూడా వ్యర్థ సంకల్పమే. శుభ కార్యము, శుభ సంకల్పానికి తక్షణ దానమే మహాపుణ్యము అని గాయనముంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు పెద్ద ఆట చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత వేగంగా వస్తాయంటే వాటిని అదుపు చేయలేరు. అప్పుడు వారు మేమేం చేయాలి, ఆపుకోలేకపోయాము, ఏది వస్తే అది చేసేశామని అంటారు. కాని వ్యర్థాన్ని అదుపు చేసేందుకు నిగ్రహ శక్తి కావాలి. ఒక్క సమర్థ సంకల్పానికి ఫలితము పదమా రెట్లు లభిస్తుంది. అదే విధంగా ఒక వ్యర్థ సంకల్పము లెక్కాచారము - ఉదాసీనంగా అవ్వడం, నిరుత్సాహంగా అవ్వడం లేక సంతోషం మాయమవ్వడం. పెద్ద విషయమేమీ కాదు కాని చాలా రోజులయింది, సంతోషము తగ్గిపోయింది, ఒంటరిగా ఉండడం ఎందుకు బాగుంటుందో తెలియదు! ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. కాని ఎక్కడికి వెళ్లాలి? ఒంటరిగా అనగా తండ్రి తోడు లేకుండా, ఒంటరిగా వెళ్లరాదు కదా. భలే ఏకాంతంగా ఉండండిి కాని తండ్రి జతలో లేకుండా ఒంటరిగా ఎప్పుడూ ఉండరాదు. తండ్రి తోడు లేకుండా ఎప్పుడూ ఒంటరిగా అవ్వకండి. బాబా తోడు లేకుండా ఒంటరిగా అవ్వడం, ఆ ఉదాసీనత, వైరాగ్యము వేరే మార్గాలకు చెందినవి. అది బ్రాహ్మణ జీవితం కాదు. మీరు కంబైండ్గా ఉన్నారు కదా. ఈ సంగమయుగం కంబైండ్గా ఉండే యుగము. ఇటువంటి అద్భుతమైన జంట మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించదు. లక్ష్మినారాయణులుగా అయినా అది ఇటువంటి జంట కాదు కదా. కనుక సంగమయుగంలో కంబైండ్ రూపము ఏదైతే ఉందో అది ఒక్క సెకండు కూడా వేరు కారాదు. వేరు అయినారంటే అంతా పోతుంది. ఇటువంటి అనుభవం ఉంది కదా. ఇంకేం చేస్తారు? ఒకసారి సాగర తీరానికి, ఒకసారి మేడ పైకి, ఒకసారి పర్వతాల పైకి వెళ్లిపోతారు. మననం చేసేందుకు వెళ్లడం వేరే విషయము. కాని తండ్రి లేకుండా ఒంటరిగా వెళ్లకండి. ఎక్కడికి వెళ్లినా తండ్రి జతలో వెళ్లండి. ఈ బ్రాహ్మణ జీవితంలో జన్మిస్తూనే మీరు చేసిన ప్రతిజ్ఞ, జతలో ఉంటాము, జతలో నడుస్తాము అని ప్రమాణము చేశారు కదా. అడవిలోకి లేక సాగరములోకి వెళ్లిపోతామని ప్రతిజ్ఞ చేయలేదు కదా. తోడుగా ఉండాలి మరియు తోడుగా వెళ్లాలి. ఇది అందరూ పక్కాగా ప్రతిజ్ఞ చేశారు కదా. దృఢ సంకల్పము గలవారు సదా సఫలతను పొందుతారు. దృఢత సఫలతకు తాళంచెవి. కనుక ఈ ప్రతిజ్ఞ కూడా దృఢంగా పక్కాగా చేశారు కదా. ఎక్కడైతే దృఢత్వము సదా ఉంటుందో అక్కడ సఫలత సదా ఉంటుంది. బ్రహ్మబాబాలో ఏ విశేషత చూశారు? బ్రహ్మబాబా వెంటనే దానం చేయడం చూశారు కదా. ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మొదట ఆలోచిస్తాను, తర్వాత చేస్తాను అని ఏమైనా అనుకున్నాడా? అలా అనుకోలేదు. తక్షణ దానం మహాపుణ్యం అని వెంటనే చేసినందున నంబరువన్ మహాన్ ఆత్మగా అయ్యాడు. అందువలన నంబరువన్ మహాన్ ఆత్మగా అయినందున కృష్ణుని రూపంలో నంబరువన్ పూజ జరుగుతా ఉంది. ఈ ఒక్క మహాన్ ఆత్మకే బాలుని రూపంలో కూడా పూజ జరుగుతోంది. బాలుని రూపం కూడా చూశారు కదా. అంతేకాక యువావస్థలో రాధా-కృష్ణుల రూపంలో కూడా పూజ జరుగుతుంది. ఇక మూడవది, గోప-గోపికల రూపంలో కూడా గాయనము మరియు పూజ జరుగుతుంది. నాల్గవది లక్ష్మినారాయణ రూపంలో పూజ జరుగుతుంది. ఈ ఒక్క మహాన్ ఆత్మకే భిన్న భిన్న ఆయువులలో, భిన్న భిన్న చరిత్రల రూపంలో గాయనము మరియు పూజ జరుగుతూ ఉంది. రాధకు కూడా గాయనము ఉంది కాని రాధను బాల్య రూపంలో ఊయలలో ఊపరు. కృష్ణుని ఊయలలో ఊపుతారు. కృష్ణుడినే ప్రేమిస్తారు. ఆయన జతలో రాధ పేరు కూడా ఉంది. ఆయన జతలో ఉన్నందున రాధ పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది. అయినా రెండవ నంబర్కు, మొదటి నంబర్కు తేడా ఉంటుంది కదా! ఇక నంబర్వారిగా అయిన దానికి కారణము ఏమిటి? మహాపుణ్యము. మహాన్ పుణ్య ఆత్మ నుండి మహాన్ పూజ్య ఆత్మగా అయిపోయారు. మీకు జరిగే పూజలో కూడా తేడా ఉంటుందని ఇంతకుముందు కూడా వినిపించాము కదా! కొంతమంది దేవీదేవతలకు విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. మరి కొందరికి ఏదో మొక్కుబడిగా పూజ జరుగుతుంది. దీని విస్త్తారము ఎంతో ఉంది. పూజకు కూడా ఎంతో విస్తారముంది కాని ఈ రోజు బాప్దాదా అందరి జమ ఖాతాలను చూస్తున్నారు. జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సంకల్పాల ఖజానాలను ఎంతవరకు జమ చేసుకున్నారు మరియు సమయ ఖజానాను ఎంతవరకు జమ చేసుకున్నారో గమనిస్తున్నారు. కావున ఇప్పుడు ఈ నాలుగు విషయాలలో స్వంత ఖాతాను పరిశీలించుకోండి. రిజల్టు ఎలా ఉందో బాప్దాదా వినిపిస్తారు. ప్రతి ఖజానాను జమ చేసుకునే విధానానికి, జరిగే ప్రాప్తికి ఏ సంబంధముందో, ఎలా జమ చేసుకోవాలో ఈ విషయాలన్నింటిని గూర్చి తర్వాత వినిపిస్తాము. అర్థమయిందా!
సమయమైతే హద్దులోనిదే కదా! హద్దులోకే వస్తారు. స్వంత శరీరము కూడా లేదు. ఇది అద్దెకు తీసుకున్న శరీరము, అది కూడా తాత్కాలికంగా పాత్ర చేసేందుకు తీసుకున్న శరీరము. కనుక సమయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. బాప్దాదాకు కూడా పిల్లలు ఒక్కొక్కరిని కలుసుకోవడంలో, పిల్లల ప్రతి ఒక్కరి నుండి మధురాతి మధురమైన ఆత్మిక సుగంధాన్ని తీసుకోవడంలో ఎంతో ఆనందం లుగుతుంది. బాప్దాదాకు ప్రతి పుత్రుని మూడు కాలాలను గురించి తెలుసు కదా! పిల్లలకు కేవలం తమ వర్తమాన సమయం గురించి ఎక్కువగా తెలుసు. అందువలన ఒక్కోసారి ఒక్కొక్క విధంగా అయిపోతారు. కాని బాప్దాదాకు మూడు కాలాలను గురించి తెలిసినందున వీరు కల్పక్రితము హక్కుదారులుగా అయిన పిల్లలు, అధికారి పిల్లలు అన్న దృష్టితోనే చూస్తారు. ఇప్పుడు కేవలం కొద్దిగా కొందరు అలజడిలో ఉన్నారు కాని ఇప్పుడిప్పుడే మళ్లీ అలజడి నుండి అచలంగా కూడా అయిపోవాలి. భవిష్యత్తును శ్రేష్ఠంగా గమనిస్తున్నారు కనుక వర్తమానాన్ని చూస్తున్నా చూడరు. కావున ప్రతి పుత్రుని విశేషతను చూస్తున్నారు. ఎలాంటి విశేషత లేనివారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి చేరుకోవడమే మొదటి విశేషత. ఏమీ లేకపోయినా సన్ముఖంగా కలుసుకునే భాగ్యము కూడా తక్కువేమీ కాదు. ఇది విశేషతయే కదా! ఇది విశేష ఆత్మల సభ. కావున విశేష ఆత్మల విశేషతను చూస్తూ బాప్దాదా హర్షిస్తారు. మంచిది.
సదా తక్షణ దానం మహాపుణ్యం అనే శ్రేష్ఠ సంకల్పము గలవారికి, ఎప్పుడో అనే దానిని ఇప్పుడే అంటూ పరివర్తన చేసేవారికి, సదా ఈ వరదాని సమయం గురించి తెలుసుకుని వరదానాలతో జోలెను నింపుకునేవారికి, సదా బ్రహ్మాబాబాను అనుసరించి బ్రహ్మాబాబాతో పాటు, శ్రేష్ఠ రాజ్య అధికారులుగా మరియు శ్రేష్ఠ పదవికి అధికారులుగా అయ్యే వారికి, సదా తండ్రితో కంబైన్డ్గా ఉండేవారికి, ఇటువంటి సదా జతలో ఉండే పిల్లలకు, సదా తోడు నిభాయించే పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
పిల్లలందరికి వీడ్కోలు సమయంలో ప్రియస్మృతులను ఇస్తూ -
బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరికి ప్రియస్మృతులను పంపిస్తున్నారు. ప్రతి స్థానానికి చెందిన స్నేహితులైన పిల్లలు, స్నేహంతో సేవలో కూడా ముందుకు వెళ్తున్నారు. అంతేకాక స్నేహము సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. స్నేహంతో సేవ చేస్తారు. కావున ఎవరి సేవ చేస్తారో వారు కూడా తండ్రికి స్నేహితులుగా అవుతారు. పిల్లలందరి సేవకు అభినందలు. శ్రమ లేదు కాని ప్రేమకు అభినందనలు. ఎందుకంటే పేరుకు శ్రమ ఉంది కాని ఉన్నదే ప్రేమ. కావున ఎవరైతే స్మృతిలో ఉంటూ సేవ చేస్తారో వారు వర్తమానము మరియు భవిష్యత్తును జమ చేసుకుంటారు. కావున ఇప్పుడు కూడా సేవకు సంతోషమూ లభిస్తుంది అంతేకాక భవిష్యత్తు కొరకు జమ అవుతుంది. సేవ చేయలేదు కాని అవినాశీ బ్యాంకులో తమ ఖాతాను జమ చేసుకున్నారు. కొద్దిపాటి సేవ చేసినా సదాకాలం కొరకు ఖాతా జమ అయిపోతుంది. కనుక ఆ సేవ ఏమయింది? జమ అయింది కదా! కావున పిల్లలందరికి బాప్దాదా ప్రియస్మృతులను పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమను సమర్థ ఆత్మగా భావించి ముందుకు వెళ్తే సమర్థ ఆత్మల సఫలత సదా ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్కరు పేరు పేరున విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి. (ఢిల్లీ పాండవ భవన్లో టెలెక్స్ సాధనము పెట్టారు) ఢిల్లీ పాండవభవన నివాసులైన పిల్లలందరికీ వారు చేసిన విశేష సేవకు అభినందనలు. ఎందుకంటే ఈ సాధనాలు కూడా సేవ కొరకే తయారయ్యాయి. సాధనాలకు అభినందలు కాదు, సేవకు అభినంధనలు. సదా ఈ సాధనాల ద్వారా బేహద్ సేవను అవినాశిగా చేస్తూ ఉంటారు. చాలా సంతోషంతో ఈ సాధనాల ద్వారా విశ్వంలో తండ్రి సందేశాన్ని అందిస్తూ ఉంటారు. కావున సేవలో పిల్లల ఉల్లాస-ఉత్సాహాలు, సంతోషము ఎంతగా ఉన్నాయో బాప్దాదా చూస్తున్నారు. ఇదే సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. పాండవ భవనము గురించి విదేశీయులందరూ సంతోష సర్టిఫికెట్ను ఇస్తారు. దీనినే తండ్రి సమానంగా అతిథి సత్కారంలో సదా ముందు ఉండడమని అంటారు. ఉదాహరణానికి బ్రహ్మబాబా ఎంత అతిథి సత్కారాలు చేసి చూపించారు! కనుక అతిథి సత్కారాలలో బ్రహ్మబాబాను ఫాలో చేసేవారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తండ్రి పేరును ప్రత్యక్షం చేస్తారు. అందువలన బాప్దాదా అందరి తరపున ప్రియస్మృతులను ఇస్తున్నారు.
అమృతవేళ 6 గం||కు బాప్దాదా మళ్లీ మురళిని నడిపించారు, ప్రియస్మృతులను తెలియజేశారు. (25.03.85)
ఈ రోజు సదా స్వయాన్ని డబల్ లైట్గా భావించి ఎగిరేకళను అనుభవం చేస్తూ ఉండండి. కర్మయోగి పాత్రను అభినయిస్తున్నా కర్మ మరియు స్మృతి అనగా యోగము ఈ రెండూ శక్తిశాలిగా ఉన్నాయా? అని కర్మ మరియు యోగముల బ్యాలెన్సును పరిశీలించుకోండి. ఒకవేళ కర్మ శక్తిశాలిగా ఉండి, స్మృతి తక్కువగా ఉంటే బ్యాలన్స్ లేనట్లే మరియు స్మృతి శక్త్తిశాలిగా ఉండి కర్మ శక్తిశాలిగా లేకపోయినా కూడా బ్యాలెన్సు లేనట్లే. కావున కర్మ మరియు స్మృతుల బ్యాలెన్సును ఉంచుతూ వెళ్లండి. రోజంతా ఇదే శ్రేష్ఠ స్థితిలో ఉండడం వలన తమ కర్మాతీత స్థితి సమీపంగా వచ్చిన అనుభవం చేస్తారు. రోజంతా కర్మాతీత స్థితి లేక అవ్యక్త ఫరిస్తా స్వరూప స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉండండి. క్రింది స్థితిలోకి రాకండి. ఈ రోజు కిందకు రాకండి, పైనే ఉండండి. ఒకవేళ ఎవరైనా బలహీనత వలన కిందకు వచ్చేసినా ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకుని సమర్థంగా తయారు చేయాలి. అందరూ ఉన్నత స్థితిని అనుభవం చేయండి. ఇది ఈ రోజు చదువులో హామ్వర్క్. హోమ్వర్క్ ఎక్కువగా ఉంది చదువు తక్కువగా ఉంది.
ఇటువంటి తండ్రిని సదా అనుసరించేవారికి, సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యమును ధారణ చేసి ముందుకు తీసుకెెళ్ళేవారికి ఎగిరేకళను అనుభవం చేసే పిల్లలకు బాప్దాదా హృదయ పూర్వకమైన, అతిప్రియమైన స్మృతులు మరియు గుడ్మార్నింగ్.

Comments