14-05-1970 అవ్యక్త మురళి

   * 14-05-1970             ఓంశాంతి       అవ్యక్త బాప్ దాదా        మధువనము  

“సమర్పణకు గుహ్యార్థము”

నేడు వతనం నుండి ఒక కానుకను తీసుకువచ్చారు. ఏ కానుకను తీసుకువచ్చారో మీకు తెలుసా? చెప్పండి! అవ్యక్త రూపంలో కానుక కూడా అవ్యక్తంగానే ఉంటుంది కదా! నేడు వతనం నుండి దర్పణం తీసుకువచ్చారు. దర్పణం ఎందుకు తెచ్చారు? మీరందరూ ఏ విశేష కార్యక్రమము కొరకు వచ్చారు? అది ఏమిటి? సమర్పణ చేయించేందుకు వచ్చారా లేక సంపూర్ణమయ్యేందుకు వచ్చారా? అందరి అర్పణమయత అనే ముఖమును చూసేందుకు మరియు చూపించేందుకు వతనం నుండి దర్పణమును తీసుకువచ్చారు. సమర్పణ అయిపోయారా? అందరూ అయిపోయారా? మేము సమర్పణ అయిపోయాము అని ఈ సభలో ఎవరెవరు భావిస్తున్నారు? సమర్పణ అని దేనిని అంటారు? దేహఅభిమానం విషయంలో సమర్పణ అయ్యారా? సమర్పణ లేక సంపూర్ణంగా అర్పణ అయిపోయారా? అవునని లేక కాదని చెప్పండి! దేహఅభిమానం నుండి సంపూర్ణ అర్పణ అయ్యారా? ఇందులో అవును అని ఎందుకు అంటున్నారు? స్వభావాలు అర్పణ అయ్యాయా? (ఇందులో పురుషార్థము ఉంది.) స్వభావమును అర్పణ చేసుకునే సమారోహమును ఎప్పుడు చేస్తారు? మీరంతా కన్యాసమర్పణ సమారోహమును జరిపేందుకు వచ్చారు. కాని, బాప్ దాదా ఆ సమారోహము జరపాలని కోరుకుంటున్నారు. దానిని ఎప్పుడు జరుపుతారు? ఇందుకోసమే దర్పణమును తీసుకువచ్చాను అని అన్నారు. ఇందులో మూడు విషయాలను చూస్తున్నారు. ఒకటి - స్వభావ సమర్పణ, రెండవది - దేహఅభిమానపు సమర్పణ మరియు మూడవది - సంబంధాల సమర్పణ. దేహము అనగా కర్మేంద్రియాల ఆకర్షణ యొక్క సమర్పణ. ఈ మూడు విషయాలను దర్పణములో చూస్తున్నారు. ఎప్పుడైతే స్వభావ సమర్పణ సమారోహము జరుగుతుందో అప్పుడు సంపూర్ణమూర్తుల సాక్షాత్కారము జరుగుతుంది. అలాగే ఏ కట్నకానుకలు లభిస్తాయి? ఎప్పుడైతే ఈ సంపూర్ణ సౌభాగ్యము ప్రాప్తమవుతుందో అప్పుడు శ్రేష్ఠభాగ్యపు కట్నకానుకలు స్వతహాగానే లభిస్తాయి. మీ సౌభాగ్యమును నిలిపి ఉంచుకోవడం ద్వారా భాగ్యము కూడా నిలిచి ఉంటుంది. సౌభాగ్యము, భాగ్యము అని అంటారు కదా! కావున సదా సౌభాగ్యము, సదా భాగ్యము. ఎవరు ఎంతగా సౌభాగ్యవంతులుగా ఉంటారో అంతగానే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవుతారు. సౌభాగ్యానికి గుర్తు బిందువు. తలపై కొంగు, బిందువు రెండూ ఉంటాయి. కావున ఎవరైతే సదా సౌభాగ్యవంతులుగా ఉంటారో వారికి బిందురూపపు స్మృతి సదా నిలిచి ఉంటుంది. ఈ బిందురూపపు స్థితి సదా తోడుగా ఉన్నట్లయితే వారే సదా సౌభాగ్యవంతులు. కావున మీ సౌభాగ్యంతో మీ భాగ్యమును చూడండి. ఎంత సౌభాగ్యమో అంతటి భాగ్యము. అవినాశీ సౌభాగ్యము ఉన్నట్లయితే అవినాశీ భాగ్యము ప్రాప్తమవుతుంది. సదా మీ సౌభాగ్యమును నిలిపి ఉంచుకునేందుకు నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏ నాలుగు విషయాలు? నాలుగు విషయాలలో ఏ ఒక్క విషయమునైనా చెప్పండి! ఏ విధంగా స్థూలమైన కానుకలను సిద్ధంచేసుకొని వచ్చారు కదా! అలాగే దీని కొరకు ఏ పురుషార్థపు కానుకలు కావాలి? ఆ నాలుగు విషయాలు ఏమిటి? ఒకటేమో సదా జీవితపు ఉద్దేశ్యము మీ ముందు ఉంచుకోండి, రెండవది బాప్ దాదాల ఆదేశము, మూడవది సందేశము మరియు నాలుగవది స్వదేశము. ఈ నాలుగు విషయాలు సదా స్మృతిలో ఉన్నట్లయితే పురుషార్థము స్వతహాగానే తీవ్రముగా ముందుకు వెళుతుంది. ఉద్దేశ్యమును మరియు బాప్ దాదాల ఆదేశమును స్మృతిలో ఉంచుకొని పురుషార్థము చేయడం ద్వారా పురుషార్థంలో కూడా సఫలత లభిస్తుంది. అలాగే అందరికీ సందేశమును కూడా ఇవ్వాలి. దానినే సేవ అని అంటారు. ఇంకా ఇప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి? స్వదేశమును గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఇది తిరిగివెళ్ళే సమయమిది, సమయం సమీపంగా వచ్చి చేరుకుంది. ఈ నాలుగు విషయాలలో ఏ విషయములో లోపము ఉన్నా దాని పేరు - బలహీన పురుషార్థము. లోటును నింపుకునేందుకు ఈ నాలుగు పదాలను మీ ముందు ఉంచుకోండి. బాప్ దాదా పిల్లలకు నేడు ఒక కొత్త టైటిల్ ఇస్తున్నారు, అది లా మేకర్స్ (న్యాయ రచయితలు) వారు పీస్ మేకర్స్ (శాంతి స్థాపకులు) అన్న టైటిల్ ఇస్తారు. కాని బాప్ దాదా పిల్లలందరికీ మీరందరూ లా మేకర్లు అన్న టైటిల్ ఇస్తున్నారు. సత్యయుగపు చట్టాలేవైతే నడువనున్నాయో వాటిని రచించేవారు మీరే. మేము లా మేకర్లము అన్నది స్మృతిలో ఉంచుకున్నట్లయితే ప్రతి అడుగును ఆలోచించి వేస్తారు. మీరు ఏ అడుగులనైతే వేస్తారో అవి చట్టాలుగా అవుతున్నాయి. ఏవిధంగా జస్టిస్ లేక చీఫ్ జస్టిస్ లు ఏ విషయములను ఫైనల్ చేస్తారో అవి చట్టాలుగా అయిపోతాయో, అలా ఇక్కడ కూడా అందరూ న్యాయాధిపతులు కూర్చున్నారు. మరి న్యాయ నిర్ణేతలు. కావున అటువంటి కర్మలేవీ చేయకండి. మీరు లామేకర్లు అయినప్పుడు మీరు ఏ సంకల్పములైతే చేస్తారో, మీరు ఏ అడుగులనైతే వేస్తారో మిమ్మల్ని చూసి మొత్తం విశ్వమంతా ఫాలో చేస్తుంది. మీ ప్రజలు మిమ్మల్నందరినీ అనుసరిస్తారు. కావున ఈ విధంగా మిమ్మల్ని మీరు భావిస్తూ ప్రతి అడుగును వేయండి. ఇందులో కూడా నెంబర్లు ఉంటాయి. కాని అందరూ లామేకర్లే.

ఈరోజు బాప్ దాదా ఈ సభను చూసి హర్షిస్తున్నారు. ఎంతమంది న్యాయ రచయితలు ఒకచోటికి చేరారు! మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తూ నడుచుకుంటున్నారా? మీకు ఇంత పెద్ద బాధ్యత ఉంది అని భావిస్తూ నడుచుకోవడం ద్వారా చిన్న, చిన్న విషయాలు స్వతహాగానే అంతమైపోతాయి. ఏ కర్మలనైతే నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అన్న స్లోగన్ కూడా ఉంది. ఈ స్లోగన్ ను సదా గుర్తుంచుకున్నప్పుడే కార్యమును సరిదిద్దగల్గుతారు. మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకండి. మీ ఒక్కొక్కరి వెనుక మీ రాజధాని ఉంది. వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు. కావున, నేను ఏ కర్మలనైతే చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అన్నది గుర్తుంచుకోండి. దీని ద్వారా అందరి స్వభావ సంస్కారాల సమర్పణ సమారోహము త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సమారోహమును వేదిక పైకి తీసుకువచ్చేందుకు త్వరత్వరగా ఏర్పాట్లు చేసుకోవాలి. అచ్చా!

*ఇద్దరు కుమారీల సమర్పణ సమారోహం*

ఈ రోజు ఏ కార్యం కొరకు పిలిచారు? సత్యయుగంలో మాతాపితలు రాజసింహాసనంపై కూర్చోబెడతారు. సంగమయుగంలో ఏ రాజతిలకము లభిస్తుందో తెలుసా? సంగమయుగపు తిలకమును దిద్దారా లేక దిద్దాలా? సంగమయుగపు సింహాసనాధికారులుగా అయ్యారా? సేవా బాధ్యత అన్నది కిరీటము. మరి సింహాసనము ఏది? సంగమయుగపు సింహాసనాధికారులుగా అయిన తరువాతే సత్యయుగపు సింహాసనాధికారులుగా అవుతారు. నగలన్నింటితోను అలంకరించుకున్నారా లేక అది కూడా చేసుకుంటున్నారా? ఈ సమయంలో నగలతో అలంకరింపబడి ఉన్నారు, సంగమయుగ నుండే ఈ ఆచార వ్యవహారాలన్నీ ప్రారంభమవుతున్నాయి, ఎందుకంటే సంగమయుగము అన్ని విషయాల బీజమును వేసే సమయము. బీజాలు నాటే సమయం ఒకటి ఉంటుంది కదా! అలాగే ప్రతి దైవీ ఆచార బీజమును వేసే సమయము ఈ సంగమ యుగము. బీజరూపము ద్వారా అన్ని విషయాల బీజాలు పడతాయి. ఆ బీజరూపునితోపాటు మీరందరూ కూడా బీజమును వేసే సహాయం చేయండి. ఈరోజు ఏదో అలా సాధారణమైన ఫంక్షన్ జరగడం లేదు. మీరందరూ లామేకర్స్ అని మీకు వినిపించడం, జరిగింది కదా! ఈ ఆచార వ్యవహారాల బీజమును వేసే రోజు ఇది! మీకు ఇంతటి నషా ఉందా? ఈ  ఆచారాలన్నీ బ్రాహ్మణుల ద్వారానే జరుగుతాయి. మీరు ఎంత పెద్ద కార్యమును చేసేందుకు (విశ్వమును మార్చేందుకు) నిమిత్తులు! ఎంత సమయంలో విశ్వాన్ని మార్చేస్తారు! మిమ్మల్ని మీరు ఎంత సమయంలో సిద్ధం చేసుకుంటారు? మీరు ఎవర్రడీగా ఉన్నారా? నేడు అందరూ స్వయమును ఏ రూపంలో అనుభవం చేసుకుంటున్నారు? మీరు ఏ రూపంలో కూర్చున్నారు? రోజు ఎలా ఉంటుందో రూపం అలా ఉంటుంది కదా! ఈ సంగమయుగపు దర్బారు సత్యయుగపు దర్బారు కన్నా ఉన్నతమైనది. నేడు అందరూ స్వయమును సర్వ అలంకరణలతో అలంకరింపబడినవారిగా చూస్తున్నారా లేక ఈ కన్యలను మాత్రమే అలా చూస్తున్నారా? మీ ఒక్కొక్కరి సంగమయుగపు అలంకరణ మొత్తం సత్యయుగపు అలంకరణ కన్నా శ్రేష్ఠమైనది. కావున బాప్ దాదా అందరినీ అలంకరింపబడిన మూర్తులుగా చూస్తున్నారు. సత్యయుగపు కిరీటము ఈ కీరీటం ముందు విలువలేనిదే! సంగమయుగపు కిరీటమును ధరించి ఉన్నారా? ఈ కిరీటము మరియు సింహాసనము సదా నిలిచి ఉండేందుకు ఏ ప్రయత్నము చేస్తారు? దీని కొరకు మూడు విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ స్వయంవరపు సమారోహమేదైతే ఉందో, పట్టాభిషేకములో కూడా ఏవైతే పద్ధతులు, ఆచారాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ సంగమయుగములోనే ఏదో ఒక రూపంలో ఉంటాయి. నేటి ప్రపంచములో ఏ పద్ధతి ఉందో తెలుసా? ఎన్ని రకాల ఆచారాలు ఉన్నాయి! ఒకటేమో బ్రాహ్మణుల ద్వారా, రెండవది కోర్టు ద్వారా, మూడవది మందిరాలు, గురువుల ద్వారా ఈ మూడు రకాల పద్ధతులకు ఏదో ఒక రూపంలో ఇక్కడ బీజము పడుతుంది. ఈ మధువనము మందిరము కూడా, ఇది చైతన్య మందిరము. ఈ మందిరములో ఆత్మ-పరమాత్మల లగనము జరుగుతుంది. దీనికి తోడుగా కోర్టు పద్ధతి ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడి నుండే మొదలవుతుంది. మీరు లా మేకర్సు అని వినిపించాము కదా, వీరి ఎదుట ఈ ప్రతిజ్ఞను చేస్తున్నప్పుడు ఇది కోర్టు అయిపోయింది కదా! మూడు రకాల పద్ధతులు ఈ సంగమయుగములో అలౌకిక రూపములో జరుగుతాయి. దీని స్మృతి చిహ్నము స్థూలరూపములో జరుగుతూ ఉంటుంది.

అచ్ఛా, ఏ మూడు విషయాలను గుర్తు ఉంచుకోవాలి? ఒకటి స్వయమును ఉపకారిగా భావించి నడవటము, రెండవది నిరహంకారి, మూడవది అధికారి. అధికారమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి, నిరహంకార గుణమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి మరియు ఉపకారము చేసే కర్తవ్యమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి. ఈ మూడు విషయాలను ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. ఎవరు ఎంతటి అపకారులైనా కానీ మీ దృష్టి మరియు వృత్తులు ఉపకారిగా ఉండాలి. అధికారిగా కూడా భావించి నడుచుకోవాలి కానీ నిరహంకారిగా ఉండాలి. ఎంతటి అధికారిగా ఉంటారో అంతటి నిరహంకారిగా ఉండాలి. అప్పుడే ఈ కిరీటము మరియు సింహాసనము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. అర్ధమైందా. అచ్ఛా!

Comments

  1. ఓంశాంతి, బాప్ దాదా సమర్పణ సమారోహణము ఏ మూడు విషయాలు ఆధారంగా చేయాలని కోరుకుంటున్నారు? చిన్న విషయాలు స్వతహాగానే ఏ స్లోగన్ గుర్తు ఆధారంగా సమాప్తమవుతాయి? ఈ విషయాలన్నీ బాప్ దాదా ఈ అవ్యక్తమురళిలో తెలిపించారు. శివబాబా యాద్ హై?

    ReplyDelete

Post a Comment