14-01-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''డబల్ సేవాధారులు స్వతహాగానే మాయాజీతులుగా ఉంటారు ''
ఈ రోజు మనోభిరాముడైన తండ్రి తన హృదయ సింహాసనాధికారులైన పిల్లలతో, తమ స్నేహితులు, సహయోగులైన పిల్లలతో మనసును ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. తండ్రి మనసులో ఏముంటుంది? మరియు పిల్లల మనసులో ఏముంటుంది? ఈ రోజు అందరి హృదయాల క్షేమ - సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చారు. విశేషంగా దూరదేశీయులైన డబల్ విదేశీ పిల్లలతో హృదయాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వచ్చారు. మురళీనైతే వింటూనే ఉంటారు. కాని ఈ రోజు ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు. పిల్లలందరూ సహజంగా, సరళంగా ముందుకు వెళ్తున్నారా? నడవడంలో ఎలాంటి కష్టమూ, అలసట కలగడం లేదు కదా! అలసిపోవడం లేదు కదా? ఏదైనా చిన్న పెద్ద విషయాలలో తికమకపడడం లేదు కదా! సంకల్పములో, మాటలో, కర్మలో ఏదో ఒక ఈశ్వరీయ మర్యాదను లేక శ్రీమతాన్ని(ఆదేశాన్ని) ఉల్లంఘించినప్పుడే తికమకపడ్తారు. లేకుంటే చాలా సంతోషంగా, సుఖంగా, విశ్రాంతిగా తండ్రికి తోడు తోడుగా నడవడంలో ఏ కష్టమూ ఉండదు, ఏ అలసటా ఉండదు. ఎటువంటి చిక్కూ ఉండదు. ఏ విధమైన బలహీనత ఉన్నా అది సహజమైన దానిని కష్టంగా చేస్తుంది. కావున బాప్దాదా పిల్లలను చూసి ఎంత ప్రియమైన, అపురూపమైన, శ్రేష్ఠమైన ఆత్మలు, విశేష ఆత్మలు, పుణ్యాత్మలు, సర్వ శ్రేష్ఠ పావన ఆత్మలు, విశ్వానికి ఆధారమూర్తులైన ఆత్మలైన మీకు కష్టమేమిటి? అని ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. చిక్కుల్లోకి ఎలా రాగలరు? మీరు ఎవరితో నడుస్తున్నారు? బాప్దాదా స్నేహము మరియు సహయోగమనే బాహువులలో ఇముడ్చుకొని జతలో తీసుకెళ్తున్నారు. స్నేహ-సహయోగాల బాహువుల(భుజాల) మాల సదా మెడలో వేయబడి ఉంది. ఇటువంటి మాలలో కూర్చబడిన పిల్లలు, ఇంకా చిక్కుల్లోకి రావడమనేది ఎలా జరగగలదు! సదా సంతోషపు ఊయలలో ఊగేవారు, సదా తండ్రి స్మృతిలో ఉండేవారు కష్టము లేక చిక్కుల్లోకి రాజాలరు. ఎప్పటి వరకు చిక్కులను మరియు కష్టాన్ని అనుభవం చేస్తూ ఉంటారు? తండ్రి పాలన అనే ఛత్రఛాయలో ఉండేవారు చిక్కుల్లోకి ఎలా రాగలరు? తండ్రికి చెందిన వారిగా అయ్యాక, శక్తిశాలి ఆత్మలుగా అయ్యాక, మాయను గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత సర్వ శక్తులు, సర్వ ఖజానాలకు అధికారులుగా అయ్యాక కూడా మాయ లేక విఘ్నాలు కదిలించగలవా? (కదిలించలేవు). చాలా మెల్ల మెల్లగా చెప్తున్నారు..... సదాకాలానికి చలింపజేయలేవని చెప్పండి. చూడండి, అందరి ఫోటో తీయబడ్తోంది. మీ మాటలు టేపులో నింపబడ్డాయి. మళ్లీ అక్కడకు వెళ్లి మారిపోరు కదా! ఇప్పటి నుండి కేవలం స్నేహం, సేవ, ఎగిరేకళ యొక్క విశేష అనుభవాల సమాచారమునే ఇస్తారు కదా! మాయ వచ్చేసింది, పడిపోయాము, చిక్కుకుపోయాము, అలసిపోయాము, గాభరా పడిపోయాము అంటూ అటువంటి ఉత్తరాలైతే రావు కదా! ఉదాహరణానికి ఈనాటి ప్రపంచంలో సమాచార పత్రికలలో ఏ వార్తలు వెలువడ్తున్నాయి? దు:ఖము, అశాంతి, సమస్యల వార్తలు వెలువడ్తున్నాయి.
కానీ మీ సమాచార పత్రాలు ఎలా ఉంటాయి? సదా సంతోషకరమైన వార్తలుంటాయి. అంటే ఈ రోజు నేను ఈ విశేషమైన అనుభవాన్ని చేశాను, ఈ రోజు ఈ విశేష సేవ చేశాను, ఈ రోజు మనసా సేవను అనుభూతి చేశాను, ఈ రోజు నిరుత్సాహంగా ఉన్నవారి హృదయాన్ని సంతోషంగా చేశాను, క్రింద పడిపోయిన వారిని ఎగిరింపజేశాను..... ఇటువంటి సంతోషపు అనుభూతులతో కూడిన ఉత్తరాలు వ్రాస్తారు కదా! ఎందుకంటే 63 జన్మలు చిక్కులలో పడ్డారు, పడిపోయారు. ఎదురుదెబ్బలు కూడా తిన్నారు. అన్నీ చేశారు. 63 జన్మల తర్వాత ఈ ఒక్క శ్రేష్ఠ జన్మ, పరివర్తన అయ్యే జన్మ, ఎక్కేకళ కన్నా ఎగిరేకళ యొక్క జన్మ లభించింది. ఇందులో చిక్కుకోవడం, పడిపోవడం, అలసిపోవడం, బుద్ధి ద్వారా భ్రమించడం, ఇది బాప్దాదా చూడలేరు. ఎందుకంటే స్నేహీ పిల్లలు కదా! కావున స్నేహీ పిల్లల ఈ దు:ఖపు అలల యొక్క కొద్ది సమయాన్ని కూడా సుఖదాత అయిన తండ్రి చూడలేరు. అర్థమయిందా! కావున ఇప్పుడు సదాకాలానికి గతించిన దానిని గతించిపోయిందిగా వదిలేశారు కదా! ఏ సమయంలోనైనా ఎవరైనా పిల్లలు కొద్దిగా అయినా చిక్కులలోకి వచ్చినా లేక మాయా విఘ్నాలకు వశమైపోయినా, బలహీనంగా అయిపోయినా, ఆ సమయంలో వతనములో బాప్దాదా ముందు ఆ పిల్లల ముఖము ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా! మిక్కీ మౌస్ఆట(అద్దాల ఆట) వలె కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మాయ యొక్క భారంతో లావుగా అయిపోతారు, ఒక్కొక్కసారి పురుషార్థం చేయడంలో ధైర్యహీనులుగా చిన్నగా(పొట్టిగా) అయిపోతారు. మిక్కీమౌస్లు కూడా కొన్ని చిన్నవిగా, కొన్ని లావుగా ఉంటాయి కదా! మిక్కీమౌస్గా అయితే అవ్వరు కదా! బాప్దాదా కూడా ఈ ఆటను చూసి నవ్వుతూ ఉంటారు. ఒకసారి చూస్తే ఫరిస్తా రూపము, ఒకసారి చూస్తే మహాదానీ రూపము, ఒకసారి చూస్తే సర్వుల స్నేహీ సహయోగీ రూపము, ఒకసారి డబల్ లైట్ రూపము మరియు అప్పుడప్పుడు మళ్లీ మిక్కీమౌస్గా కూడా అయిపోతారు. ఏ రూపం బాగుంటుంది? ఈ చిన్న రూపాలు, లావుపాటి రూపాలైతే బాగనిపించవు కదా! పిల్లలు ఇప్పుడింకా ఎన్ని కార్యాలు చేయాలి అని బాప్దాదా చూస్తున్నారు? ఏదైతే చేశారో, అది చేయవలసిన దాని ముందు చాలా తక్కువ. ఇప్పుడు ఎంతమందికి సందేశాన్ని ఇచ్చారు? తక్కువలో తక్కువ సత్యయుగం యొక్క మొదటి సంఖ్య అయిన 9 లక్షల మందినైనా తయారు చేయండి. ఎక్కువ మందినే తయారు చేయవలసి ఉంది కాని ఇప్పుడు 9 లక్షల మందినైతే తయారు చేయండి. ఇప్పుడింకా ఎంత సేవ చేయాలి! వీరి పైన ఎంత సేవా బాధ్యత ఉందో బాప్దాదా చూస్తున్నారు. బాధ్యత ఉన్నవారు ఎంత బిజీగా ఉంటారు! వారికి ఇంకేదైనా ఆలోచించే తీరిక ఉంటుందా? ఎవరైతే బిజీగా ఉంటారో వారు సహజంగానే మాయాజీతులుగా ఉంటారు. ఎందులో బిజీగా ఉన్నారు? దృష్టి ద్వారా, మనసా ద్వారా, వాణి ద్వారా, కర్మ అనగా సంపర్కం ద్వారా నాలుగు రకాల సేవలలో బిజీగా ఉన్నారు. మనసా మరియు వాణి లేక కర్మ రెండూ జత జతలో ఉండాలి. కర్మ చేస్తున్నా, నోటితో మాట్లాడ్తున్నా, ఏ విధంగా డబల్ లైటుగా ఉన్నారో, డబల్ కిరీటధారులుగా ఉన్నారో, డబల్ పూజ్యులుగా ఉన్నారో, డబల్ పరసత్వాన్ని పొందుతారో అలా సేవ కూడా డబల్ గా ఉండాలి. కేవలం మనసా కాదు, కేవలం కర్మణా కాదు. మనసాకు తోడుతోడుగా వాణి, మనసాకు తోడుతోడుగా కర్మ ఉండాలి. ఇటువంటి వారినే డబల్ సేవాధారులని అంటారు. ఇలాంటి డబల్ సేవాధారులు స్వతహాగానే మాయాజీతులుగా ఉంటారు. అర్థమయ్యిందా! కేవలం సింగిల్ సేవ చేస్తే, కేవలం వాణిలోకి లేక కేవలం కర్మలోకి వచ్చేసినప్పుడు మాయకు సాథీగా చేసుకునే అవకాశం లభిస్తుంది. మనసా అనగా స్మృతి, స్మృతి అంటే తండ్రి తోడు లేక ఆధారము. కావున ఎక్కడైతే డబల్గా ఉంటారో, సహచరుడు తోడుగా ఉంటారో అక్కడ మాయ తోడుగా అవ్వజాలదు. ఒంటరిగా అయినట్లయితే మాయ సాథీగా అయిపోతుంది. అప్పుడు సేవనైతే చాలా చేశాము, సేవ యొక్క సంతోషము కూడా ఉంటుంది కాని సేవ మధ్యలో మళ్లీ మాయ కూడా వచ్చేసింది అని అంటారు. కారణం? సింగిల్ సేవ చేశారు, డబల్ సేవాధారులుగా అవ్వలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం డబల్ విదేశీయులు ఏ విషయంలో బహుమతి తీసుకుంటారు? ప్రైజ్అయితే తీసుకోవాలి కదా!
ఏ సేవాకేంద్రమైతే ఈ సంవత్సరం సేవలో స్వ యొక్క స్థితిలో సదా నిర్విఘ్నంగా ఉంటూ, నిర్విఘ్నంగా తయారు చేసే వైబ్రేషన్లను(ప్రకంపనాలను) విశ్వంలో వ్యాపింపజేస్తారో, సంవత్సరమంతటిలో ఏ విఘ్నానికీ వశం అవ్వకుండా ఉంటారో అలాంటి సేవ మరియు స్థితిలో ఏ సేవాకేంద్రమైతే ఉదాహరణగా అవుతుందో వారికి మొదటి నెంబరు ప్రైజు(బహుమతి) లభిస్తుంది. అలాంటి ప్రైజు తీసుకుంటారు కదా! ఎన్ని సెంటర్లు అయినా తీసుకోవచ్చు. దేశంలోనివి అయినా, విదేశాలకు చెందినవైనా మొత్తం సంవత్సరంలో నిర్విఘ్నంగా ఉండాలి. ఇలా సెంటరు లెక్కాచారానికి చార్టు పెట్టుకోవాలి. ఎలాగైతే ఇతర లెక్కాచారాలను ఉంచుకుంటారు కదా! ఎన్ని ప్రదర్శినీలు అయ్యాయి, ఎంతమంది వచ్చారు అని వ్రాసినట్లుగా ప్రతి నెల ఈ లెక్కాచారాన్ని కూడా నోట్ చేయండి. ఈ నెలలో క్లాసుకు వచ్చే బ్రాహ్మణ పరివారమంతా నిర్విఘ్నంగా ఉన్నారా? మాయ వచ్చింది, ఇందులో పెద్ద విషయమేమీ లేదు. మాయ రానే రాదని కాదు. మాయ వచ్చినా మాయకు వశమవ్వరాదు. మాయ పని రావడం, మీ పని మాయను జయించడం. దాని ప్రభావంలోకి రాకూడదు. తమ ప్రభావంతో మాయను పారద్రోలాలి. మాయ ప్రభావంలోకి రాకూడదు. కావున ఏ ప్రైజ్ తీసుకోవాలో అర్థమయ్యిందా! ఒక్కరు విఘ్నంలోకి వచ్చినా ప్రైజ్ఉండదు. ఎందుకంటే మీ తోటివారే కదా! అందరూ ఒకరికొకరు తోడునిచ్చుకుంటూ ఇంటికి వెళ్లాలి కదా! దీని కొరకు సదా సేవాకేంద్రము యొక్క వాతావరణము ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఆ వాతావరణము కూడా సర్వ ఆత్మల కొరకు సదా సహయోగిగా అయిపోవాలి. శక్తిశాలి వాతావరణము బలహీనులను కూడా శక్తిశాలురుగా చేయడంలో సహయోగిగా అవుతుంది. ఉదాహరణానికి కోటను నిర్మిస్తారు కదా! కోట ఎందుకు కట్తారు? ఎందుకంటే ప్రజలు కూడా కోటలో సురక్షితంగా ఉండాలని కోటను నిర్మిస్తారు. ఒక్క రాజు కొరకు ఒక్క గదినే తయారు చేయరు, కోటను తయారు చేస్తారు. అలాగే మీరందరూ కూడా స్వయం కొరకు, సహచరుల కొరకు, అన్య ఆత్మల కొరకు జ్వాల యొక్క కోటను నిర్మించండి. స్మృతి శక్తి జ్వాలగా ఉండాలి. సంవత్సరం చివర్లో ఎవరు ప్రైజ్ తీసుకుంటారో ఇప్పుడు చూద్దాము. న్యూ ఇయర్(కొత్త సంవత్సరాన్ని) జరుపుకునేందుకు వస్తారు కదా! కావున ఎవరు విజయులుగా అవుతారో వారికి విశేషమైన ఆహ్వానమిచ్చి పిలిపించడం జరుగుతుంది. ఒంటరిగా విజయులుగా అవ్వడం కాదు. పూర్తి సెంటరంతా విజయులుగా అవ్వాలి. ఆ సెంటరు యొక్క సెరిమనీ(ఉత్సవాన్ని) చేద్దాము. ఇందులో దేశం ముందు వస్తుందో, విదేశం ముందు వస్తుందో చూద్దాము. మంచిది. ఇంకే కష్టమైతే లేదు కదా! మాయ యొక్క ఏ రూపం కూడా విసిగించడం లేదు కదా! స్మృతిచిహ్నంలో ఏ కథను విన్నారు? శూర్పణఖ వారిని విసిగించడానికి వచ్చినప్పుడు ఏమి చేశారు? మాయ ముక్కును కోయడం రాదా? ఇక్కడ అన్నీ సహజమైపోతాయి. వారైతే దీనిని ఆసక్తికరంగా తయారు చేసేందుకు కథను తయారు చేశారు. మాయ పైన ఒకసారి యుద్ధం చేస్తే చాలు. మాయలో ఏమీ బలం లేదు. మిగిలింది మీ లోపలి బలహీనత. మాయ మరణించి ఉంది. ఏదో కొద్దిగా మిగిలి ఉన్న శ్వాస ఆడుతోంది. దీనిని సమాప్తం చేయాలి, విజయులుగా అవ్వాలి. ఎందుకంటే అంతిమ సమయానికైతే చేరుకున్నారు కదా! కేవలం విజయులుగా అయ్యి విజయం లెక్కతో రాజ్యభాగ్యాన్ని పొందాలి. అందువలన ఈ అంతిమ శ్వాసలో నిమిత్త మాత్రంగా విజయులుగా అవ్వాలి. మాయాజీతులే జగత్జీతులు కదా! విజయాన్ని పొందినందుకు ఫలము రాజ్యభాగ్యము. అందువలన ఈ ఆట మాయతో నిమిత్తమాత్రంగా ఉంది, ఇది యుద్ధము కాదు, ఆట. అర్థమయ్యిందా! ఈ రోజు నుండి మిక్కీమౌస్గా అవ్వరాదు. మంచిది.
సత్యయుగ స్థాపన గురించి కొన్ని వివరాలు –
కల్పపూర్వం మర్జ్అయిన(గుప్తమైపోయిన) సర్వ సంస్కారాలను ఇమర్జ్(ప్రత్యక్షం) చేసుకున్నట్లయితే స్వయమే స్వయాన్ని సత్యయుగీ రాకుమారి లేక రాకుమారులుగా అనుభవం చేస్తారు మరియు ఏ సమయంలో అయితే సత్యయుగ సంస్కారాలను ఎమర్జ్చేస్తారో అప్పుడు సత్యయుగపు ఆచార వ్యవహారాలన్నీ నిన్నటి విషయమన్నంత స్పష్టంగా ఎమర్జ్అవుతాయి. నిన్న ఇలా చేసేవారము అని అనుభవం చేసుకోగలరు. సత్యయుగం అంటే ప్రకృతి సుఖాలు, ఆత్మ యొక్క సుఖాలు, బుద్ధి యొక్క సుఖాలు, మనసు యొక్క సుఖాలు, సంబంధాల సుఖాల మొదలైన సుఖాలేవైతే ఉంటాయో అవన్నీ హాజరై ఉండడమే. కావున ప్రకృతి యొక్క సుఖాలు ఏమిటో, మనసు యొక్క సుఖాలు ఏమిటో, సంబంధాల సుఖాలు ఏమిటో వాటి గురించి ఆలోచించండి. అలాగే ఎమర్జ్ చేసుకోండి. మీకు ఈ ప్రపంచంలో ఏవైతే ఎంతో బాగా కనిపిస్తున్నాయో ఆ వస్తువులన్నీ పవిత్ర రూపంలో, సంపన్న రూపంలో, సుఖమునిచ్చే రూపంలో అక్కడ ఉంటాయి. ధనం అనండి, మనసు అనండి, ఋతువు అనండి అన్ని ప్రాప్తులు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవిగా ఉంటాయి. దానినే సత్యయుగమని అంటారు. దానిని ఒక అత్యంత శ్రేష్ఠమైన సుఖవంతమైన సంపన్న పరివారముగా భావించండి. అక్కడ రాజు, ప్రజలు సమానంగా ఉంటారు. వేరే వేరే పదవులు ఉన్నా అందరూ పరివార రూపంలో నడుస్తారు. వీరు దాస దాసీలని అనరు. నంబరు ఉంటుంది, సేవ ఉంటుంది. కాని తాను దాసి అన్న భావనతో నడవరు. ఇలా పరివారం యొక్క సంబంధాలన్నీ సంతోషదాయకంగా, సుఖీ పరివారంగా, సమర్థ పరివారంగా, శ్రేష్ఠతలేవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. దుకాణాలలో కొనుగోలు చేసినా లెక్కలతో కొనుక్కోరు. పరివారంలో ఇచ్చిపుచ్చుకున్నట్లుగా కొన్ని ఇస్తారు, కొన్ని తీసుకుంటారు. కానుకలుగానే భావించండి. పరివారంలో ఎలాగైతే నియమం ఉంటుందో - ఎవరి వద్ద అయినా ఎక్కువ వస్తువులు ఉంటే అందరికీ పంచుతారు, లెక్క ఖాతాల పద్ధతిలో కాదు. కార్య వ్యవహారాలను నడిపించడానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క డ్యూటి(కర్తవ్యము) లభించింది అంతే. ఇక్కడ మధువనంలో కూడా అలాగే ఉంది కదా! కొందరు వస్త్రాలను సంభాళిస్తారు, కొందరు ధాన్యాన్ని సంభాళిస్తారు. ధనమునైతే ఎవ్వరూ ఇవ్వరు కదా! అయినా అందరూ ఛార్జ్ గలవారే(బాధ్యత గలవారే) కదా! అలాగే అక్కడ కూడా ఉంటారు. అన్ని వస్తువులు అపారంగా ఉంటాయి. కావున జీ హాజిర్. లోటు అయితే ఉండనే ఉండదు. ఎంత కావాలనుకుంటే అంత, ఎలా కావాలనుకుంటే అలా తీసుకోండి. కేవలం బిజీగా ఉంచుకునేందుకు ఇది ఒక సాధనము. ఇది కూడా ఒక ఆట-పాటే. ఏ లెక్కాచారాన్ని ఎవ్వరికీ చూపించనవసరము లేదు. ఇక్కడైతే సంగమము కదా! సంగమము అనగా ఎకామనీ(పొదుపు). సత్యయుగం అనగా తినండి, తాగండి, ఖర్చు చేయండి. అక్కడ కోరిక అంటే ఏమిటో తెలియదు. ఎక్కడ కోరిక ఉంటుందో, అక్కడ లెక్కాచారాలను చూసుకోవలసి వస్తుంంది. కోరికల కారణంగానే క్రిందకు, పైకి అవుతూ ఉంటుంది. అక్కడ కోరికే ఉండదు. లోపం కూడా ఉండదు. సర్వ ప్రాప్తులు ఉంటాయి మరియు సంపన్నంగా కూడా ఉంటారు. మరి ఇంకేం కావాలి. ఏదైనా వస్తువు బాగుంటే ఎక్కువగా తీసుకోవాలని కూడా అనిపించదు. నిండుగా ఉంటారు. హృదయము నిండి ఉంటుంది. సత్యయుగంలోకైతే వెళ్లవలసిందే కదా! ప్రకృతి అన్ని సేవలు చేస్తుంది. (సత్యయుగంలో బాబా అయితే ఉండరు) పిల్లల ఆటను చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు సాక్షిగా కూడా ఉండాలి కదా! అతీతమైనవారు అయితే అతీతంగానే ఉంటారు కదా! ప్రియంగా ఉంటారు కానీ అతీతంగా ఉండే ప్రియంగా ఉంటారు. ప్రియంగా ఉండడమనే ఆటనైతే ఇప్పుడు చేస్తున్నారు కదా. సత్యయుగంలో అతీతంగా ఉండడమే మంచిది. లేకపోతే మీరందరూ పడిపోయినప్పుడు ఎవరు తీస్తారు? సత్యయుగంలోకి రావడం అనగా చక్రంలోకి రావడం. మంచిది. మీరు సత్యయుగంలో జన్మ తీసుకున్నప్పుడు ఆహ్వానించండి. ఒకవేళ మీరు సంకల్పాన్ని ఎమర్జ్ చేసినట్లైతే అప్పుడు వస్తాను. సత్యయుగంలోకి రావడం అనగా చక్రంలోకి రావడం. బాప్దాదాను స్వర్గ విషయాలలోకి ఆకర్షించాలని చూస్తున్నారా! మంచిది. ఎన్ని వైభవాలు ఉంటాయంటే అవన్నీ తినలేరు కూడా. కేవలం చూస్తూ ఉంటారు. మంచిది.
ఇలా సదా సర్వ సమర్థులైన ఆత్మలకు, సదా మాయను జయించే, జగత్తును జయించే ఆత్మలకు, సదా సహజ యోగీ భవ వరదానులైన పిల్లలకు, డబల్ సేవాధారులు, డబల్ కిరీటధారులు, డబల్ లైట్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment