13-02-1984 అవ్యక్త మురళి

    13-02-1984                    ఓంశాంతి                 అవ్యక్త బాప్ దాదా           మధువనము

      ఆబూ సమ్మేళనంలో వచ్చి ఉన్న అతిథులతో కలయిక 

1) (డా. జోన్హా) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్(యు.ఎన్.ఓ/ఐక్యరాజ్యసమితి) - బాప్దాదా పిల్లల మనసులోని సంకల్పాలకు సదా సహయోగమిచ్చి పూర్తి చేస్తూ ఉంటారు. మీ సంకల్పమేదైతే ఉందో, అదే సంకల్పాన్ని సాకారంలోకి తీసుకొచ్చే యోగ్య స్థానానికి చేరుకున్నారు. వీరంతా నా సంకల్పాన్ని పూర్తి చేసే సహచరులని భావిస్తున్నారా? సదా శాంతిని స్మృతి ద్వారా అనుభవం చేస్తూ ఉంటారు. చాలా మధురమైన, సుఖమయమైన శాంతి అనుభూతి అవుతూ ఉంటుంది. శాంతిప్రియ పరివారములోకి చేరుకున్నారు. కావున సేవకు నిమిత్తంగా అయ్యారు. సేవకు నిమిత్తంగా అయినందుకు రిటర్న్గా(బదులుగా) ఎప్పుడు తండ్రిని స్మృతి చేసినా సహజ సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు. సదా ''నేను శాంతి స్వరూప ఆత్మను, శాంతి సాగరుని సంతానాన్ని, శాంతిప్రియ ఆత్మను'' అన్న స్మృతిలో ఉండండి. ఇదే అనుభవం ద్వారా ఎవరైతే సంపర్కంలోకి వస్తారో వారికి సందేశకులుగా అయ్యి సందేశమునిస్తూ ఉండండి. ఇదే అలౌకిక కర్తవ్యము సదా శ్రేష్ఠ కర్మను చేయిస్తూ ఉంటుంది. శ్రేష్ఠ కర్మ ద్వారా శ్రేష్ఠ ప్రాప్తిని చేయిస్తూ ఉంటుంది. వర్తమానం మరియు భవిష్యత్తు రెండూ శ్రేష్ఠంగా ఉంటాయి. మీరు శాంతిని అనుభవం చేసే యోగ్య ఆత్మలు. సదా శాంతిసాగరంలో తేలియాడుతూ ఉండండి.

ఎప్పుడైనా ఏదైనా కార్యంలో కష్టమనిపించినప్పుడు శాంతి ఫరిస్తాలతో సంపర్కాన్ని ఉంచుకుంటే కష్టము సహజమైపోతుంది. అర్థమయ్యిందా! అయినా చాలా భాగ్యశాలురుగా ఉన్నారు. ఈ భాగ్యవిధాత ధరణి పైకి చేరుకునేవారు కోటిలో కొందరు, కొందరిలో కూడా కొందరే ఉంటారు. భాగ్యశాలురుగా అయితే అయిపోయారు. ఇప్పుడు పదమాపదమ్ భాగ్యశాలురుగా తప్పకుండా అవ్వాలి. అటువంటి లక్ష్యము ఉంది కదా! తప్పకుండా అవుతారు. కేవలం శాంతి ఫరిస్తాల జతలో ఉంటూ ఉండాలి. విశేష ఆత్మలు, విశేష పాత్రను అభినయించే ఆత్మలు ఇక్కడకు చేరుకుంటారు. మీ ముందు కూడా విశేషమైన పాత్ర ఏదైతే ఉందో, అది కూడా మున్ముందు తెలుస్తూ ఉంటుంది. ఈ కార్యమైతే సఫలమయ్యే ఉంది. కేవలం ఎవరి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేయాలో వారి భాగ్యాన్ని తయారు చేసేందుకు ఈ సేవా సాధనముంది. ఇదైతే అయ్యే ఉంది. ఇది అనేకసార్లు జరిగింది. మీ సంకల్పం చాలా బాగుంది. మీ సహచరులెవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి వెళ్లారో, స్నేహీ సహయోగులుగా ఉన్నారో, విశేష స్నేహ పుష్పాలతో పాటు బాప్దాదాల ప్రియస్మృతులనివ్వండి.

2. మేడమ్ అన్వర్ సాదాల్తో అవ్యక్త బాప్దాదా కలయిక - ఈజిప్ట్ కొరకు సందేశము

మీ దేశానికి వెళ్లి ధనము పొదుపు చేసే విధానాన్ని నేర్పించండి. మానసిక సంతోషం ద్వారా ధనము అనుభూతి కలుగుతుంది. ధనము యొక్క పొదుపుయే మానసిక సంతోషానికి ఆధారము. ఇలా ధనము యొక్క పొదుపు మరియు మానసిక సంతోషానికి సాధనాన్ని తెలిపితే వారు మిమ్ములను ధనము మరియు మనసుకు సంతోషాన్నిచ్చే సంతోష ఫరిస్తాగా అనుభవం చేస్తారు. కావున ఇప్పుడు ఇక్కడి నుండి శాంతి మరియు సంతోష ఫరిస్తాలుగా అయ్యి వెళ్లండి. ఈ శాంతికుండానికి గల సదా అవినాశీ వరదానాన్ని జతలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చినట్లైతే ''మేరా బాబా(నా తండ్రీ)'' అని అన్నారంటే ఆ విషయం సహజమైపోతుంది. సదా లేచిన వెంటనే ముందు తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడండి. అంతేకాక రోజులో కూడా మధ్య మధ్యలో తండ్రికి తోడుగా ఉన్నానా? అని మిమ్ములను మీరు చెక్ చేసుకోండి. రాత్రి తండ్రి జతలోనే నిదురించండి. ఒంటరిగా నిదురించకండి. అప్పుడు సదా తండ్రి తోడును అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ తండ్రి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. మీరు చాలా సేవ చేయగలరు. ఎందుకంటే అందరికీ సంతోషం లభించాలి, శాంతి లభించాలి అన్న కోరిక ఉంది. హృదయంలోని కోరిక ఏదైతే ఉందో, దానితో ఏ కార్యం చేస్తారో, అందులో సఫలత లభించనే లభిస్తుంది. మంచిది. ఓంశాంతి.

Comments