20-02-1984 అవ్యక్త మురళి

20-02-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

''ఒక సర్వ శ్రేష్ఠమైన, మహోన్నతమైన, మనోహరమైన ఘడియ ''

ఈ రోజు భాగ్యాన్ని తయారుచేసే తండ్రి శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలలో, ప్రతి పుత్రుడు కల్పక్రితము వలె తన భాగ్యాన్ని ఎలా మేల్కొల్పుకొని చేరుకున్నాడో చూసి హర్షిస్తున్నారు. భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చారు. బాబాను గుర్తించడం అనగా భాగ్యం మేల్కోవడం. విశేషంగా డబల్ విదేశీ పిల్లలు వరదాన భూమి పై సంఘటితమవుతున్నారు. ఈ సంఘటన భాగ్యశాలి పిల్లల సంఘటన(సమూహము). అన్నిటికంటే ముందు ఎప్పుడైతే పిల్లలు తెలుసుకున్నారో, అంగీకరించి మేరాబాబా(నా తండ్రి) అని అన్నారో అదే అన్నిటికంటే ముందు భాగ్యాన్ని తెరిచే శ్రేష్ఠమైన సమయము లేక శ్రేష్ఠమైన ఘడియ. ఆ ఘడియే మొత్తం కల్పమంతటిలో శ్రేష్ఠమైనది మరియు మనోహరమైనది. అందరికీ ఆ ఘడియ ఇప్పుడు కూడా స్మృతి(జ్ఞాపకము) వస్తోంది కదా! తయారవ్వడం, కలవడం, అధికారాన్ని పొందడం ఇదైతే సంగమ యుగమంతా అనుభవం చేస్తూనే ఉంటారు. కాని ఆ ఘడియ అనాథల నుండి సనాథలుగా అయ్యారు, ఎలా ఉండేవారు ఎలా అయ్యారు! తప్పిపోయినవారు మళ్లీ కలిశారు. అప్రాప్త ఆత్మ, ప్రాప్తుల దాతకు చెందినదిగా అయ్యింది. ఆ మొదటి పరివర్తన ఘడియ, భాగ్యము మేల్కొనే ఘడియ ఎంత శ్రేష్ఠమైనది! మహాఉన్నతమైనది! తండ్రి వారిగా అయిన ఆ మొదటి ఘడియ స్వర్గ జీవితము కంటే ఉన్నతమైనది. 'నాది, నీది' గా అయిపోయింది. 'నీది' అన్నారంటే ఇంకా డబల్ లైట్ గా అయ్యారు. 'నాది' అన్న భారము నుండి తేలికగా అయిపోయారు. సంతోషపు రెక్కలు వచ్చేస్తాయి. భూమి నుండి ఆకాశంలోకి ఎగరసాగారు. రాయి నుండి వజ్రంగా అయ్యారు. అనేక చక్రాల నుండి విడుదలై స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. ఆ ఘడియ గుర్తుందా! ఆ బృహస్పతి దశ ఉన్న ఘడియలో తనువు, మనసు, ధనము, జనము సర్వ ప్రాప్తుల భాగ్యం నిండి ఉంది. ఇటువంటి దశ, ఇటువంటి రేఖ ఉన్న వేళలో శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యారు. మూడవ నేత్రం తెరుచుకుంది, తండ్రిని చూశారు. అందరూ అనుభవం గలవారే కదా! ఆ శ్రేష్ఠ ఘడియ, వాహ్! అని మనసులో పాడుకుంటారు కదా! అద్భుతమంతా ఆ ఘడియదే కదా! బాప్దాదా ఇలాంటి గొప్ప వేళలో, భాగ్యవంతమైన సమయంలో వచ్చిన పిల్లలను చూసి చూసి సంతోషిస్తున్నారు.

'' ఆదిదేవుని ఆదికాలపు రాజ్యభాగ్య అధికారులైన నా పిల్లలూ, వాహ్!'' అని బ్రహ్మాబాబా కూడా అన్నారు. '' అనాది కాలపు అవినాశి, అనాది అధికారాన్ని పొందే నా పిల్లలూ, వాహ్! '' అని శివబాబా అన్నారు. తండ్రి మరియు దాదా ఇరువురికి చాలాకాలం తర్వాత కలిసిన స్నేహీ సహచరులైన అధికారీ పిల్లలు. విశ్వంలో ఆత్మలందరూ జీవన సహచరులను, సత్యమైన సహచరులను, ప్రీతి యొక్క విధిని నిర్వర్తించేవారిని, చాలా వెతికిన తర్వాత పొందుతారు కూడా అయినా తృప్తి పొందడం లేదు. ఒక్కరు కూడా ఇటువంటి సహచరులు లభించరు కాని బాప్దాదాకు ఎంతమంది జీవిత సహచరులు లభించారు అని బాప్దాదాకు నషా ఉంది అంతేకాక ఒక్కొక్కరు ఒకరికంటే ఒకరు గొప్పవారు. సత్యమైన సహచరులు(సాథీలు) కదా. ప్రాణం పోయినా ప్రీతి యొక్క విధి తొలగిపోని సత్యమైన సహచరులు. ఇటువంటి సత్యమైన జీవన సహచరులు కదా!

బాప్దాదా జీవితమేమిటో తెలుసా! విశ్వ సేవయే బాప్దాదా జీవితం. మీరందరూ అలాంటి జీవిత సహచరులే కదా! కావున సత్యమైన జీవన సహచరులు, తోడును నిభాయించేవారు బాప్దాదాకు ఎంతోమంది ఉన్నారు. రాత్రింబవళ్లు ఎందులో బిజీగా ఉంటారు? తోడు నిర్వర్తించడంలోనే కదా! జీవన సహచరులైన పిల్లలందరిలో సదా ఏ సంకల్పము ఉంటుంది? సేవా ఢంకాను మ్రోగించాలి. ఇప్పుడు కూడా అందరూ ప్రేమలో మగ్నమై ఉన్నారు. సేవా సహచరులుగా అయ్యి సేవకు ఋజువు తీసుకొచ్చారు కదా! లక్ష్య ప్రమాణంగా సఫలతను పొందుతూ ఉన్నారు. ఎంత చేశారో అది డ్రామానుసారంగా చాలా బాగా చేశారు. ఇంకా ముందుకు వెళ్లాలి కదా! ఈ సంవత్సరము శబ్ధాన్ని బిగ్గరగా అయితే చేశారు కాని ఇప్పుడు కొన్ని కొన్ని వైపుల నుండి మాత్రమే మైకులు తీసుకొచ్చారు. నలువైపులా ఉన్న మైకులు రాలేదు. కావున శబ్ధమైతే వ్యాపించింది. కాని నలువైపులా నిమిత్తమై శబ్ధాన్ని వ్యాపింపజేసే పెద్ద మైకులనండి లేక సేవకు నిమిత్తమైన ఆత్మలనండి, వారు ఇక్కడికి రావాలి మరియు ప్రతి ఒక్కరూ స్వయాన్ని తాము వచ్చిన వైపుకు సందేశకులుగా భావించి వెళ్లాలి. కాని నాలుగు వైపుల నుండి మైకులు వచ్చి సందేశకులుగా అయిపోవాలి. నాలుగు వైపులా ప్రతి మూలలో అందరికీ ఈ సందేశం లభించినట్లైతే ఒకే సమయంలో నలువైపుల నుండి శబ్ధం వెలువడ్తుంది. దీనినే పెద్ద ఢంకా మ్రోగడమని అంటారు. నలువైపులా 'ఉన్నది ఒక్కటే, ఒక్కరే ఉన్నారు' అని ఢంకా మ్రోగాలి. అప్పుడు దానిని ప్రత్యక్షతా ఢంకా అని అంటారు.

ఇప్పుడు ప్రతి దేశము యొక్క బ్యాండ్ మ్రోగింది. ఇప్పుడు ఢంకా మ్రోగాలి. బ్యాండ్ బాగా మ్రోగించారు, అందువలన బాప్దాదా భిన్న భిన్న దేశాలలో నిమిత్తంగా అయిన ఆత్మల ద్వారా వెరైటీ బ్యాండ్ విని, చూచి సంతోషిస్తున్నారు. భారతదేశపు బ్యాండ్ కూడా విన్నారు. బ్యాండ్  శబ్ధానికి, ఢంకా శబ్ధానికి తేడా ఉంది. మందిరాలలో బ్యాండ్ కు బదులు ఢంకా మ్రోగిస్తారు. ఇక ముందు ఏం చేయాలో ఇప్పుడు అర్థమయ్యిందా? సంఘటన ద్వారా వ్యాపించే శబ్ధము బిగ్గరగా ఉంటుంది. ఇప్పుడు కూడా కేవలం ఒక్కరే హాజీ(అవునండి) అనడానికి, అందరూ కలిసి హాజీ అనడానికి తేడా ఉంటుంది కదా! 'ఒక్కటే, ఒక్కరే ఉన్నారు, ఆ ఒక్కరు వారే' - ఈ బిగ్గర శబ్ధము నలువైపుల నుండి ఒకే సమయంలో వెలువడాలి. టి.విలో చూచినా, రేడియోలో విన్నా, వార్తాపత్రికలలో చదివినా, అందరి నోటి నుండి ద్వారా అయినా ఈ ఒక్క శబ్ధమే బిగ్గరగా రావాలి. అంతర్జాతీయంగా శబ్ధం రావాలి. అందుకే కదా బాప్దాదా జీవన సహచరులను(సాథీలను) చూసి సంతోషిస్తారు. ఎవరికైతే ఇంతమంది జీవన సాథీలు ఉన్నారో, అంతేకాక ఆ ఒక్కొక్కరు గొప్పవారిగా ఉన్నారు కనుక అన్ని కార్యాలు జరిగే ఉన్నాయి(ముగిసే ఉన్నాయి). తండ్రి కేవలం నిమిత్తంగా అయ్యి శ్రేష్ఠ కర్మలు చేయించి పిల్లల ప్రాలబ్ధాన్ని తయారు చేయిస్తున్నారు. మంచిది.

ఇప్పుడైతే ఇది మిలనము చేసే సీజను. అందరికంటే చిన్నవారు, అపురూపమైనవారు (తప్పిపోయి చాలాకాలం తర్వాత కలిసినవారు) పోలెండ్ కు చెందిన పిల్లలు. చిన్నపిల్లలు సదా ప్రియమనిపిస్తారు. పోలెండ్ వారికి మేము అందరికన్నా ఎక్కువ అపురూపమైన పిల్లలమనే నశా ఉంది కదా! అన్ని సమస్యలను దాటుకొని అయినా చేరిపోయారు కదా! దీనినే లగ్నము(పట్టుదల, ప్రేమ) అని అంటారు. ప్రేమ విఘ్నాలను సమాప్తం చేసేస్తుంది. బాప్దాదాకు మరియు పరివారానికి కూడా ప్రియంగా ఉన్నారు. పోలెండ్ మరియు పోర్చుగీ స్ రెండు దేశాల వారు లగ్నము కలిగిన వారే. భాషనూ చూడలేదు, ధనాన్నీ చూడలేదు కాని ప్రేమ ఎగిరింపజేసింది. ఎక్కడ స్నేహముందో అక్కడ తప్పకుండా సహయోగము ప్రాప్తిస్తుంది. అసంభవము సంభవమవుతుంది. బాప్దాదా అలాంటి మధురమైన పిల్లల స్నేహాన్ని చూసి హర్షితులవుతున్నారు. లగ్నంతో సేవ చేసే నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ప్రేమతో చాలా శ్రమ చేశారు.

ఈ సంవత్సరం అయితే అందరూ మంచి గ్రూపులు తీసుకొచ్చారు. కాని ఈ దేశాలకు విశేషత కూడా ఉంది. కావున బాప్దాదా విశేషంగా చూస్తున్నారు. అందరూ తమ తమ స్థానాలలో బాగా వృద్ధిని పొందారు(చేశారు). అందువలన స్థానాల పేర్లను చెప్పడం లేదు. కాని ప్రతి స్థానానికి తమ తమ విశేషత ఉంది. మధువనం వరకు చేర్చడం - ఇదే సేవకు గల విశేషత. నలువైపులా నిమిత్తమైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి బాప్దాదా విశేష స్నేహం అనే పుష్పాలను బహుమతిగా ఇస్తున్నారు. నలువైపులా ఆర్థికంగా తలక్రిందులైనా ఇంతమంది ఆత్మలను ఎగిరింపజేసి తీసుకొచ్చారు. ఇదే ప్రేమకు తోడుగా శ్రమకు గుర్తు. ఇది సఫలతకు గుర్తు. అందువలన ప్రతి ఒక్కరూ పేరు సహితంగా స్నేహ పుష్పాలను స్వీకరించండి. ఎవరైతే ఇక్కడకు రాలేదో వారి స్మృతి పత్రాల మాలలు చాలా తెచ్చారు. కావున బాప్దాదా ఆకారీ రూపంలో చేరుకొని పిల్లలకు కూడా స్నేహభరితమైన ప్రియస్మృతులు ఇస్తున్నారు. నలువైపుల నుండి వచ్చిన పిల్లల ప్రియస్మృతులకు బదులు ఇస్తున్నారు. అందరూ స్నేహీ పిల్లలే, బాప్దాదా జీవన సాథీలు, సదా తోడు నిర్వర్తించే సమీప రత్నాలు. కావున అందరి స్మృతి పత్రాలకు ముందే, సందేశకులకు ముందే, వారి స్మృతులు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి, ఇంకా చేరుకుంటూ ఉంటాయి. పిల్లలందరూ ఇప్పుడు ఇదే సేవ సందడి చేయండి. తండ్రి ద్వారా లభించిన శాంతి మరియు సంతోష ఖజానాలను సర్వాత్మలకు బాగా పంచండి. సర్వాత్మలకు ఇప్పుడిదే అవసరము. సత్యమైన సంతోషము, సత్యమైన శాంతి అవసరము. సంతోషం కోసం ఎంత సమయం, ఎంత ధనం మరియు ఎంత శారీరిక శక్తిని కూడా సమాప్తం చేసుకుంటారు! హిప్పీలుగా అయిపోతారు. వారిని ఇప్పుడు హ్యాపీగా(సంతోషంగా) చేయండి. సర్వుల అవసరాలను పూర్తి చేసే అన్నపూర్ణ యొక్క భండారంగా అవ్వండి. ఇదే సందేశాన్ని విదేశీ పిల్లలందరికీ పంపించండి. పిల్లలందరికీ సందేశమునిస్తున్నారు. నడుస్తూ నడుస్తూ కాస్త నిర్లక్ష్యం కారణంగా తీవ్ర పురుషార్థుల నుండి ఢీలా పురుషార్థులుగా అయిపోతారు. మరి కొందరు కొంత సమయం మాయ చక్రంలోకి కూడా వచ్చేస్తారు. మళ్లీ చిక్కుకుపోయినప్పుడు పశ్చాత్తాపంలోకి వచ్చేస్తారు. మాయ ఆకర్షణ కారణంగా ముందు అది చక్రమని అనిపించదు. సుఖంగా అనిపిస్తుంది. చక్రంలో చిక్కుకొని స్పృహలోకి వచ్చేస్తారు. స్పృహలోకి వచ్చినప్పుడు, బాబా బాబా ఏం చేయను? అని అంటారు. అలాంటి చక్రానికి వశమైన పిల్లల ఉత్తరాలు కూడా చాలా వస్తాయి. అలాంటి పిల్లలకు కూడా బాప్దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు మళ్లీ ఇదే స్మృతినిప్పిస్తున్నారు. ఎలాగైతే భారతదేశంలో ''రాత్రి దారి తప్పిన వారు పగటి పూట వచ్చినట్లయితే వారిని దారి తప్పిన వారని అనరు'' అనే సామెత ఉందో అలా మళ్లీ జాగృతి వచ్చిందంటే గడచిపోయిందేదో గడచిపోయింది, మళ్లీ కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము, కొత్త జీవితాన్ని అనుభవం చేసి ముందుకు వెళ్లవచ్చు.

బాప్దాదా కూడా మూడుసార్లు క్షమిస్తారు. మూడు సార్లు మళ్లీ అవకాశము కూడా ఇస్తారు. కావున ఎవ్వరూ సంకోచించకండి. సంకోచము వదిలి స్నేహములోకి వచ్చేసినట్లయితే మళ్లీ తమ ఉన్నతిని చేసుకోగలరు(ఉన్నతి పొందగలరు). అలాంటి పిల్లలకు కూడా విశేష సందేశాన్ని ఇవ్వండి. కొంతమంది పరిస్థితుల కారణంగా ఇక్కడకు రాలేరు. వారు చాలా తపిస్తూ స్మృతి చేస్తున్నారు. బాప్దాదాకు పిల్లలందరి సత్యమైన హృదయము గురించి తెలుసు. ఎక్కడైతే సత్యమైన హృదయముంటుందో, అక్కడ ఈ రోజు లేకుంటే రేపు ఫలము తప్పకుండా వెలువడ్తుంది. మంచిది.

ఎదురుగా డబల్ విదేశీయులున్నారు. ఇది వారి సీజను కదా. సీజను వారికి ముందు వినిపించడం జరుగుతుంది. అన్ని దేశాల వారికి అనగా భాగ్యశాలి ఆత్మలకు దేశంలోని వారికి, దేశం వారికి మేము తండ్రి అవతరించిన భూమికి చెందినవారమని అదనపు నశా కూడా ఉంది. ఇటువంటి సేవ చేసే భారతదేశ భూమి తండ్రి అవతరణ భూమి మరియు భవిష్య రాజ్యభూమికి చెందిన పిల్లలందరికీ బాప్దాదా విశేషంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే అందరూ తమ తమ ప్రేమ, ఉల్లాస-ఉత్సాహాల అనుసారంగా సేవ చేశారు, సేవ ద్వారా ఆనేక ఆత్మలను తండ్రికి సమీపంగా తీసుకొచ్చారు. కావున సేవకు బదులుగా బాప్దాదా పిల్లలందరికీ స్నేహపుష్పాల పుష్పగుచ్ఛాన్ని ఇస్తున్నారు. స్వాగతం పలుకుతున్నారు. మీరు కూడా అందరికీ పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం చేస్తారు కదా! కావున పిల్లలందరికీ పుష్పగుచ్ఛాన్ని కూడా ఇస్తున్నారు అంతేకాక సఫలతా బ్యాడ్జ్ ను కూడా పెడ్తున్నారు. ప్రతి పుత్రుడు తమ తమ పేరుతో బాప్దాదా ద్వారా లభించిన బ్యాడ్జ్ మరియు పుష్పగుచ్ఛాన్ని స్వీకరించండి. మంచిది.

జోన్ల దాదీలైతే చైర్మెన్లే. చైర్మెన్అనగా సదా సీటు పై సెట్అయ్యేవారు. ఎవరైతే సదా సీటు పై సెట్అయ్యి ఉన్నారో వారినే చైర్మెన్అని అంటారు. సదా చైర్ తో పాటు నియర్(దగ్గర)గా కూడా ఉన్నారు. కావున సదా తండ్రికి ఆది నుండి అంతిమం వరకు ప్రతి అడుగులో సహచరులుగా ఉన్నారు. తండ్రి అడుగు, వారి అడుగు సదా ఒక్కటే. అడుగు పైన అడుగు వేసేవారు కనుక ఇటువంటి ప్రతి అడుగులో సదా తోడుగా ఉన్నవారికి పదమ పదమ పదమాల రెట్లు ప్రియస్మృతులు తెలుపుతున్నారు మరియు చాలా సుందరమైన వజ్రపు కమలపుష్పాలను తండ్రి నుండి స్వీకరించండి. మహారథుల్లో అన్నయ్యలు కూడా వచ్చేశారు. పాండవులు సదా శక్తులకు సాథీలు. శక్తి సైన్యం మరియు పాండవులు ఇరువురూ కలిసి తండ్రి కార్యములో నిమిత్తంగా అయ్యి సఫలం చేసే సఫలతామూర్తులుగా ఉన్నామనే సంతోషము పాండవులకు ఉంది. కావున పాండవులు కూడా తక్కువ వారు కాదు. పాండవులు కూడా గొప్పవారే. ప్రతి పాండవునికి(అన్నయ్యకు) తమ తమ విశేషత ఉంది. విశేషమైన సేవ చేస్తున్నారు. అదే విశేషత ఆధారంగా తండ్రి మరియు పరివారము ముందు విశేషాత్మలుగా ఉన్నారు. కావున అటువంటి సేవకు నిమిత్తమైన విశేష ఆత్మలకు విశేష రూపంలో బాప్దాదా విజయ తిలకం ద్వారా స్వాగతం పలుకుతున్నారు. అర్థమయ్యిందా! మంచిది.

మీ అందరికీ అన్నీ లభించాయి కదా. కమలము, తిలకము, పుష్పగుచ్ఛము, బ్యాడ్జ్అన్నీ లభించాయి కదా! డబల్ విదేశీయుల స్వాగతము ఎన్ని రకాలుగా జరిగింది. ప్రియస్మృతులైతే అందరికీ లభించాయి. అయినా డబల్ విదేశీ మరియు స్వదేశీ పిల్లలందరు సదా ఉన్నతిని పొందుతూ ఉండండి. విశ్వాన్ని పరివర్తన చేసి సదా సుఖాల ఊయలలో ఊగుతూ ఉండండి. అటువంటి విశేష సేవాధారీ పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

ట్రినిడాడ్ పార్టీతో - సదా తమను సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలమని భావిస్తున్నారా? బ్రాహ్మణులకు సదా ఉన్నతమైన శిఖను(పిలకను) గుర్తుగా చూపిస్తారు. ఉన్నతోన్నతుడైన తండ్రి మరియు ఉన్నతోన్నతమైన సమయం. కావున స్వయం మీరు కూడా ఉన్నతంగా అయ్యారు. ఎవరైతే సదా ఉన్నతమైన స్థితిలో స్థితులవుతారో వారు సదా డబల్లైట్గా స్వయాన్ని అనుభవం చేస్తారు. సంబంధాల లేక తమ పాత స్వభావ-సంస్కారాల భారము కూడా లేదు. దీనినే సర్వ బంధనాల నుండి ముక్తులుగా అవ్వడమని అంటారు. ఇలా ఫ్రీగా ఉన్నారు. మొత్తం సమూహమంతా నిర్బంధన సమూహము. ఆత్మతో మరియు శరీర సంబంధాలతో కూడా నిర్బంధనంగా ఉన్న సమూహము. నిర్బంధన ఆత్మలు ఏం చేస్తారు? సెంటరు సంభాళిస్తారు కదా! కనుక ఎన్ని సేవాకేంద్రాలు తెరవాలి? సమయము కూడా ఉంది, అంతేకాక డబల్లైట్గా కూడా ఉన్నారు. కనుక తమ సమానంగా చేస్తారు కదా! ఏదైతే లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. నేటి విశ్వంలోని ఆత్మలకు ఈ అనుభవము ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు కదా! ఇటువంటి సమయంలో ప్రాప్తి స్వరూప ఆత్మలైన మీ కర్తవ్యము ఏమిటి? కావున ఇప్పుడు సేవను మరియు వృద్ధిని ప్రాప్తి చేయించండి. ట్రినిడాడ్ఎలాగూ సంపన్న దేశము కనుక అందరికంటే ఎక్కువ సంఖ్య ట్రినిడాడ్సెంటరుదే అవ్వాలి. చుట్టుప్రక్కల కూడా చాలా ఏరియాలు ఉన్నాయి. దయ కలగడం లేదా? సెంటర్లు కూడా తెరవండి, పెద్ద పెద్ద మైకులు కూడా తీసుకు రండి. ఎంతో ధైర్యమున్న ఆత్మలు, ఏది కావాలనుకుంటే అది చేయగలరు. శ్రేష్ఠ ఆత్మలెవరైతే ఉన్నారో వారి ద్వారా శ్రేష్ఠమైన ఇమిడి ఉంది(జరుగుతుంది). మంచిది.

Comments