18-02-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
'' బ్రాహ్మణ జీవితము - అమూల్యమైన జీవితము ''
ఈ రోజు సదా స్నేహములో ఇమిడిపోయిన(లీనమైన) స్నేహీ పిల్లలను కలుసుకునేందుకు స్నేహసాగరుడు వచ్చారు. ఎలాగైతే స్నేహముతో తండ్రిని స్మృతి చేస్తారో, అలా తండ్రి కూడా స్నేహీ పిల్లలకు పదమారెట్లు బదులు ఇచ్చేందుకు సాకార సృష్టిలో కలుసుకునేందుకు వస్తారు. తండ్రి పిల్లలను తమ సమానంగా అశరీరిగా, నిరాకారులుగా చేస్తారు, పిల్లలు స్నేహముతో నిరాకారి మరియు ఆకారి తండ్రిని తమ సమానంగా సాకారులుగా చేస్తారు. ఇది పిల్లల స్నేహము యొక్క అద్భుతము. ఇటువంటి అద్భుతాన్ని చూసి బాప్దాదా హర్షితమవుతారు. సదా తండ్రి సాంగత్య రంగులో పిల్లలు తండ్రి సమానంగా ఎలా తయారవుతున్నారో చూచి పిల్లల గుణగానం చేస్తున్నారు. ఇలా తండ్రిని అనుసరించే పిల్లలను, ఆజ్ఞాకారులు, విశ్వాసపాత్రులు, విధేయులు, సత్యాతి సత్యమైన అమూల్య రత్నాలని బాప్దాదా అంటారు. పిల్లలైన మీ ముందు ఈ స్థూలమైన వజ్ర వైఢూర్యాలు కూడా మట్టితో సమానమైనవి. మీరు అంత అమూల్యమైనవారు. ఇలా స్వయాన్ని బాప్దాదా కంఠహారములోని విజయీ అమూల్య రత్నాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఇలాంటి స్వమానం ఉంటుందా?
ఎంత దూరంగా ఉన్నా దూరదేశం నుండి ఎన్నుకొని మిమ్ములను బాప్దాదా తమవారిగా చేసుకున్నారని డబల్ విదేశీ పిల్లలకు నషా మరియు సంతోషము ఉంటుంది. ప్రపంచము తండ్రిని వెతుకుతోంది, కాని తండ్రి మమ్ములను వెతుక్కున్నాడని స్వయం భావిస్తున్నారా? ప్రపంచములోని వారు వచ్చేయండి, రండి అని పిలుస్తున్నారు. కాని మీరందరూ నంబరువారీగా ఏ పాట పాడ్తున్నారు? ''మీతోనే కూర్చుంటాను, మీతోనే తింటాను, సదా మీతోనే ఉంటాను''. పిలవడం ఎక్కడ? సదా తోడుగా ఉండడం ఎక్కడ? రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది కదా! ఒక్క సెకను సత్యమైన అవినాశీ ప్రాప్తి కొరకు దాహంతో ఉన్న ఆత్మలెక్కడ? ప్రాప్తి స్వరూప ఆత్మలైన మీరెక్కడ? వారు మహిమ చేసేవారు, మీరు తండ్రి జతలో కూర్చునేవారు. వారు పిలిచేవారు, మీరు ప్రతి అడుగు వారి మతము పైన నడిచేవారు. వారు దర్శనం కోసం దాహంతో ఉన్నవారు, మీరు తండ్రి ద్వారా స్వయం దర్శనీయమూర్తులుగా అయిపోయారు. ఇంకా కొంచెం దు:ఖము, బాధల అనుభవం పెరిగినప్పుడు మీ క్షణకాలపు దర్శనం కొరకు, మీ క్షణకాలపు దృష్టి కొరకు ఎంత దాహార్తులుగా అయ్యి మీ ముందుకు వస్తారో చూడండి.
ఇప్పుడు మీరు ఆహ్వానించి రమ్మని పిలుస్తున్నారు. తర్వాత మీతో క్షణకాలం కలుసుకునేందుకు, మమ్ములను మీతో కలవనివ్వండి అని చాలా శ్రమ చేస్తారు. ఇలాంటి సాక్షాత్కార స్వరూపము మీ అందరికీ అవుతుంది(ఇలాంటి సాక్షాత్కార స్వరూపంగా ఉంటారు). అటువంటి సమయంలో తమ శ్రేష్ఠ జీవితము మరియు శ్రేష్ఠ ప్రాప్తి యొక్క మహత్వాన్ని మీ పిల్లలందరిలో కూడా ఆ సమయంలో ఎక్కువగా గుర్తిస్తారు. ఇప్పుడు నిర్లక్ష్యము మరియు సాధారణత కారణంగా తమ శ్రేష్ఠత మరియు విశేషతను మర్చిపోతూ కూడా ఉంటారు. కాని అప్రాప్తిగా ఉన్న ఆత్మలు ప్రాప్తి దాహంతో మీ ఎదురుగా వచ్చినప్పుడు మేము ఎవరు, వీరు ఎవరు! అని ఎక్కువగా అనుభవం చేస్తారు. ఇప్పుడు బాప్దాదా ద్వారా సహజంగా అనేక ఖజానాలు లభించిన కారణంగా అప్పుడప్పుడు స్వయం మరియు ఖజానాల విలువను సాధారణంగా భావిస్తున్నారు. కాని ఒక్కొక్క మహావాక్యము, ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క బ్రాహ్మణ జీవితపు శ్వాస ఎంత శ్రేష్ఠమైనదో పోను పోను చాలా అనుభవం చేస్తారు. బ్రాహ్మణ జీవితంలోని ప్రతి సెకండు ఒక జన్మకే కాదు, జన్మ-జన్మల ప్రాలబ్ధాన్ని తయారుచేస్తుంది. ఒక్క సెకండు పోయింది అనగా అనేక జన్మల ప్రాలబ్ధం పోయింది. మీరు ఇటువంటి అమూల్య జీవితం కలిగిన శ్రేష్ఠమైన ఆత్మలు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యవంతులైన విశేష ఆత్మలు. మీరెవరో అర్థము చేసుకున్నారా? ఇటువంటి శ్రేష్ఠమైన పిల్లలను కలుసుకునేందుకు తండ్రి వచ్చారు. డబల్ విదేశీ పిల్లలకు ఇది సదా గుర్తు ఉంటుంది కదా! లేక అప్పుడప్పుడు మర్చిపోవడం, అప్పుడప్పుడు గుర్తు ఉంటోందా? స్మృతి స్వరూపులుగా అయ్యారు కదా! ఎవరైతే స్వరూపులుగా అవుతారో వారు ఎప్పుడూ మర్చిపోలేరు. స్మృతి చేసేవారిగా కాదు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. మంచిది.
ఇటువంటి సదా మిలనము జరుపుకునే వారికి, సదా తండ్రి సాంగత్య రంగులో ఉండేవారికి, సదా స్వయం సమయము మరియు సర్వ ప్రాప్తుల మహత్వాన్ని తెలుసుకున్న వారికి, సదా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించేవారికి, అటువంటి చాలాకాలం తర్వాత కలిసిన సుపుత్రులైన పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
పోలెండ్ మరియు అన్య దేశాల నుండి వచ్చిన కొత్త కొత్త పిల్లలతో - అందరూ స్వయాన్ని భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ఎటువంటి భాగ్యము? ఈ శ్రేష్ఠ భూమి పైకి రావడం - ఇది అన్నిటికంటే గొప్ప భాగ్యము. ఈ నేల మహోన్నతమైన తీర్థ భూమి. ఇక్కడకు చేరుకున్నారు కావున ఇదైతే భాగ్యమే కదా! కాని ఇక ముందు ఏం చేస్తారు? స్మృతిలో ఉండాలి. స్మృతి చేసే అభ్యాసాన్ని సదా పెంచుకుంటూ ఉండండి. ఎవరు ఎంత నేర్చుకున్నారో దానిని ముందుకు పెంచుకుంటూ ఉండండి. ఒకవేళ సదా సంబంధంలో ఉంటూ ఉన్నట్లయితే సంబంధం ద్వారా చాలా ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఈనాటి విశ్వంలో అందరికీ సంతోషం మరియు శాంతి రెండూ కావాలి. కనుక ఈ రెండూ ఈ రాజయోగ అభ్యాసము ద్వారా సదాకాలం కొరకు ప్రాప్తిస్తాయి. ఈ ప్రాప్తిని కోరుకున్నట్లయితే ఇదే సహజ సాధనము. దీనిని వదలకండి. తోడుగా ఉంచుకోండి. చాలా సంతోషం లభిస్తుంది. ఎలాగైతే సంతోషపు గని లభిస్తే దాని ద్వారా ఇతరులకు కూడా సత్యమైన సంతోషాన్ని పంచగలరో అలా ఇతరులకు కూడా వినిపించాలి, ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలపాలి. విశ్వంలో ఇంతమంది ఆత్మలు ఉన్నారు కాని ఆ ఆత్మలలో కొద్దిమంది ఆత్మలైన మీరు ఇక్కడకు చేరుకున్నారు. ఇది కూడా చాలా భాగ్యానికి గుర్తు. శాంతికుండములోకి చేరుకున్నారు. శాంతి అయితే అందరికీ అవసరము కదా! స్వయం మీరు కూడా శాంతిగా ఉంటూ సర్వులకు శాంతినిస్తూ ఉండాలి. ఇదే మానవుని విశేషత. ఒకవేళ శాంతి లేకపోతే మానవ జీవితమేముంది! ఆత్మిక, అవినాశి శాంతి కావాలి. స్వయానికి మరియు అనేకులకు కూడా సత్యమైన శాంతిని ప్రాప్తించుకునే మార్గాన్ని తెలుపగలరు. తద్వారా పుణ్యాత్మలుగా అయిపోతారు. అశాంతిలో ఉన్న ఏ ఆత్మకైనా శాంతిని ఇచ్చినట్లయితే అదెంత గొప్ప పుణ్యము! ముందు స్వయాన్ని నిండుగా చేసుకోండి తర్వాత ఇతరుల పట్ల కూడా పుణ్యాత్మలుగా అవ్వగలరు. ఇటువంటి పుణ్యము మరొకటి లేదు. దు:ఖితులైన ఆత్మలకు, సుఖ - శాంతుల మెరుపును చూపించగలరు. ఎక్కడ లగ్నముంటుందో అక్కడ మనసులోని సంకల్పము పూర్తి అవుతుంది. ఇప్పుడు తండ్రి ద్వారా ఏదైతే సందేశము లభించిందో ఆ సందేశాన్ని వినిపించే సందేశీలుగా అయ్యి నడుస్తూ ఉండండి.
సేవాధారులతో - సేవా లాటరీ కూడా సదాకాలం కొరకు సంపన్నంగా తయారుచేస్తుంది. సేవ ద్వారా సదాకాలం కొరకు ఖజానాలతో నిండుగా అయిపోతారు. అందరూ నంబరువన్ సేవ చేశారు. అందరూ మొదటి బహుమతి తీసుకునేవారే కదా! ఫస్ట్ ప్రైజ్ అనగా సంతుష్టంగా ఉండడం మరియు అందరినీ సంతుష్టంగా చేయడం. కావున ఏమనుకుంటున్నారు? ఎన్ని రోజులు సేవ చేశారో అన్ని రోజులు స్వయం కూడా సంతుష్టంగా ఉన్నారా, ఇతరులను కూడా సంతుష్టపరచారా? లేక ఎవరైనా కోపగించుకున్నారా? సంతుష్టంగా ఉండి మరియు సంతుష్టంగా చేసినట్లయితే నంబరువన్గా అయిపోతారు. ప్రతి కార్యంలో విజయులుగా అవ్వడం అనగా నంబరువన్గా అవ్వడం. ఇదే సఫలత. స్వయం డిస్టర్బ్(అలజడి) అవ్వరాదు, ఇతరులను డిస్టర్బ్ చేయరాదు. ఇదే విజయము. కావున మీరు సదా ఇలాంటి విజయీరత్నాలు. విజయము సంగమయుగ అధికారము. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు కదా!
ఎవరైతే సదా ఆత్మిక దృష్టితో, ఆత్మిక వృత్తితో, ఆత్మిక గులాబీలుగా అయ్యి ఆత్మలను సంతోషపరుస్తారో, వారే సత్యమైన సేవాధారులు. కావున ఎంత సమయమైతే సేవ చేశారో అంత సమయము ఆత్మిక గులాబీలుగా అయ్యి సేవ చేశారా? మధ్యలో ముళ్లు ఏవీ రాలేదు కదా! సదా ఆత్మిక స్మృతిలో ఉండాలి అనగా ఆత్మిక గులాబి స్థితిలో ఉండాలి. ఎలాగైతే ఇక్కడ ఆ అభ్యాసాన్ని చేశారో అలాగే తమ తమ స్థానాలలో కూడా అలాంటి శ్రేష్ఠమైన స్థితిలో ఉండాలి. క్రిందికి రాకండి. ఏమి జరిగినా, ఎలాంటి వాయుమండలమున్నా ఎలాగైతే గులాబి పుష్పం ముళ్లలో ఉంటున్నా సదా స్వయం సుగంధాన్ని ఇస్తుందో, ముళ్లతో కలిసి స్వయం ముల్లుగా అవ్వదో అలా ఆత్మిక గులాబీలు సదా వాతావరణ ప్రభావం నుండి అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉండాలి. అక్కడకు వెళ్లి మాయ వచ్చేసింది, ఏమి చెయ్యాలి? అని వ్రాయరాదు. సదా మాయాజీతులుగా అయ్యి వెళ్తున్నారు కదా! మాయకు వచ్చే అనుమతిని ఇవ్వకండి. ద్వారాన్ని సదా మూసేయాలి. స్మృతి మరియు సేవ డబల్లాక్. ఎక్కడైతే డబల్లాక్ ఉంటుందో, అక్కడకు మాయ రాజాలదు.
దాదీజీ మరియు ఇతర పెద్ద అక్కయ్యలతో - ఎలాగైతే తండ్రి సదా పిల్లల ఉమంగ-ఉత్సాహాలను పెంచుతూ ఉంటారో, అలాగే తండ్రిని అనుసరించే పిల్లలు. విశేషంగా దేశ-విదేశాల నుండి వచ్చిన టీచర్లందరికీ బాప్దాదా సేవకు అభినందనలు తెలియజేస్తున్నారు - ప్రతి ఒక్కరు తమను పేరు సహితంగా తండ్రి ప్రియస్మృతులకు(స్మృతి మరియు ప్రేమలకు) అధికారులుగా భావించి మిమ్ములను మీరే ప్రేమించుకోండి. ఒక్కొక్కరి గుణాలను గానం చేసినట్లయితే ఎన్ని గుణాలు పాడాలి! అందరూ చాలా శ్రమ చేశారు. గత సంవత్సరము కంటే ఇప్పుడు ఉన్నతిని ప్రాప్తి చేసుకున్నారు అంతేకాక ఇక ముందు కూడా దీని కంటే ఎక్కువలో ఎక్కువగా స్వయం మరియు సేవలో ఉన్నతిని పొందుతూ ఉంటారు. అర్థమయిందా! బాప్దాదా మాకు చెప్పలేదు, అందరికీ చెప్తున్నారని భావించకండి. భక్తులు తండ్రి నామాన్ని వల్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నోటిలో తండ్రి పేరు ఉండాలని ఆలోచిస్తారు. కాని తండ్రి నోటిలో ఎవరి పేరు ఉంటుంది? పిల్లలైన మీ పేరు తండ్రి నోటిలో ఉంది. అర్థమయిందా! మంచిది.
డబల్ విదేశీ సోదరీ - సోదరుల ప్రశ్నలకు బాప్దాదాల జవాబులు –
ప్రశ్న :- ఈ సంవత్సరం సేవ కొరకు కొత్త ప్లాను ఏమిటి ?
జవాబు :- సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు ఒకటైతే వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేసే సేవ చేయాలి. దీని కొరకు స్వంత వృత్తి పై విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి. రెండవది - ఇతరుల సేవ చేసేందుకు, శాంతికి విధి నిజంగా ఇక్కడి నుండే లభించగలదని భావించే అలాంటి విశేష ఆత్మలను బయటకు తీయండి. ఒకవేళ శాంతి ఏర్పడ్తే ఈ విధి ద్వారానే అవుతుంది అన్న శబ్ధము ఈ సంవత్సరములోనే వెలువడాలి. విశ్వానికి ఏదైతే అవసరముందో అందుకు విధి ఇదొక్కటే, ఈ విధి తప్ప మరేదీ లేదు. ఈ వాతావరణం నలువైపులా ఒకేసారి తయారవ్వాలి. భారతదేశంలోనైనా, విదేశాలలోనైనా శాంతి మెరుపు ప్రసిద్ధ రూపంలో అవ్వాలి. యదార్థ స్థానమంటే ఇదే అని నలువైపులా అందరికీ టచ్ అవ్వాలి. అందరినీ ఆకర్షించాలి. ఎలాగైతే ప్రభుత్వాల తరఫున యు.ఎన్.ఓ(ఐక్యరాజ్య సమితి) తయారయ్యింది కదా. ఎప్పుడైనా ఏమి జరిగినా అందరి అటెన్షన్ అటువైపు వెళ్తుందో అలాగే ఎప్పుడైనా ఏదైనా అశాంతి వాతావరణం ఉన్నప్పుడు అందరి అటెన్షన్ శాంతి సందేశాన్ని ఇచ్చే ఆత్మలు వీరే అని మీ వైపుకు రావాలి. అశాంతి నుండి రక్షింపబడే స్థానం ఇదొక్కటే, ఇక్కడ రక్షణ పొందుకోవచ్చని అనుభవం చేసే వాయుమండలం ఈ సంవత్సరం తయారవ్వాలి. జ్ఞానము బాగుంది, జీవితము బాగుంది, రాజయోగము బాగుంది అనైతే అందరూ అంటారు. కాని అసలైన ప్రాప్తి ఇక్కడ నుండే లభిస్తుందని, విశ్వకళ్యాణము ఇదే స్థానము మరియు విధి ద్వారా జరుగుతుందన్న శబ్ధము బిగ్గరగా రావాలి. అర్థమయ్యిందా! ఎవరికైనా శాంతి కావాలంటే ఇక్కడ మంచి విధి లభించగలదని దీని కొరకు విశేషంగా శాంతిని అడ్వర్టైజ్ చేయండి. శాంతి సప్తాహమును జరపండి. శాంతి సమాగమాన్ని(సమావేశం) జరపండి. శాంతి అనుభూతుల శిబిరాలను ఉంచండి. ఇలా శాంతి వైబ్రేషన్లను(ప్రకంపనాలను) వ్యాపింపజేయండి.
సేవలో ఎలాగైతే విద్యార్థులను తయారు చేస్తున్నారో అదైతే చాలా బాగుంది. వారైతే తప్పకుండా వృద్ధి చెందాల్సిందే. కాని ఇప్పుడు ప్రతి వెరైటీ వారు ఎలాగైతే నలుపు, తెలుపు రకరకాల ధర్మాల ఆత్మలు ఉన్నారో, అలా రకరకాల వృత్తుల వారు ప్రతి స్థానంలో ఉండాలి. ఎవరు ఎక్కడికి వెళ్లినా ప్రతి వృత్తి వారు తమ రీతిగా వారికి అనుభవాన్ని వినిపించాలి. ఎలాగైతే ఒకసారి డాక్టర్లకు, ఒకసారి వకీళ్లకు ఇక్కడ వర్క్షాపు జరుపుతారో, రకరకాల వృత్తుల వారు ఒకే శాంతి విషయాన్ని తమ వృత్తి ఆధారంగా మాట్లాడినప్పుడు బాగుందనిపిస్తుందో, అలా ఎవరైనా సెంటరుకు వచ్చినప్పుడు కూడా ప్రతి వృత్తి వారు తమ శాంతి అనుభవాన్ని వినిపించాలి. అప్పుడు దీని ప్రభావం పడ్తుంది. అన్ని వృత్తుల వారి కోసం ఇది సహజ విధి అన్ని అనుభవమవ్వాలి. ఎలాగైతే కొద్ది సమయంలోనే అన్ని ధర్మాల వారి కోసం ఇది ఒక్కటే విధి అని శబ్ధమొచ్చిందో ఈ అడ్వర్టైజ్మెంట్ బాగా జరిగిందో, అలా ఇప్పుడు ఈ శబ్ధాన్ని వ్యాపింపజేయండి. ఎవరైతే సంపర్కంలోకి వస్తారో లేక విద్యార్థులున్నారో వారి వరకైతే ఈ శబ్ధం వెళ్తుంది కాని ఇప్పుడింకా నలువైపులా వ్యాపించాలి. దీని కోసం ఇప్పుడింకా అటెన్షన్ ఉంచండి. బ్రాహ్మణులు కూడా ఇప్పుడు కొద్దిమందే తయారయ్యారు. నంబరువారీగా బ్రాహ్మణులుగా అయ్యే గతి(వేగం) ఇప్పుడు ఏదైతే ఉందో దానిని ఫాస్ట్ అని అనలేము కదా! ఇప్పుడైతే తక్కువలో తక్కువ తొమ్మిది లక్షలు అయితే కావాలి. తక్కువలో తక్కువ సత్యయుగ ఆదిలో తొమ్మిది లక్షల ప్రజల పై రాజ్యము చేస్తారు కదా! అందులో ప్రజలు కూడా ఉంటారు. కాని సంపర్కంలో బాగా వచ్చినప్పుడే ప్రజలుగా అవుతారు. కావున ఈ లెక్క ఆధారంగా వేగము ఎలా ఉండాలి! ఇప్పుడైతే సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మొత్తం విదేశాల వారి సంఖ్య ఎంత ఉంటుంది? తక్కువలో తక్కువ విదేశీయుల సంఖ్య 2-3 లక్షలైతే ఉండాలి. శ్రమ అయితే బాగా చేస్తున్నారు. శ్రమ చేయలేదని కాదు. కానీ కొద్దిగా వేగం తీవ్రంగా ఉండాలి. సాధారణ వాతావరణం ద్వారా వేగము తీవ్రమవుతుంది.
ప్రశ్న :- ఇటువంటి శక్తిశాలి వాతావరణాన్ని తయారుచేసే యుక్తి ఏమిటి ?
జవాబు :- స్వయం శక్తిశాలిగా అవ్వండి. అందుకు అమృతవేళ నుండి ప్రతి కర్మలో తమ స్థితి శక్తిశాలిగా ఉందా లేదా అన్న చెకింగ్ పై ఇంకాస్త విశేష అటెన్షన్ ఇవ్వండి. ఇతరుల సేవలో లేక సేవా ప్లాన్లలో బిజీగా ఉండడం వలన తమ స్థితిలో అక్కడక్కడ తేలికదనం వచ్చేస్తుంది. అందువలన ఈ వాతావరణం శక్తిశాలిగా అవ్వదు. సేవ జరుగుతుంది కాని వాతావరణం శక్తిశాలిగా అవ్వదు. దీని కొరకు స్వయం పై విశేషమైన అటన్షన్ ఉంచవలసి వస్తుంది. కర్మ మరియు యోగము, కర్మతో పాటు శక్తిశాలి స్థితి - దీని బ్యాలన్స్లో కొద్దిగా లోటు ఉంది. కేవలం సేవలో బిజీగా ఉండడం వలన స్వస్థితి శక్తిశాలిగా ఉండదు. ఎంత సమయం సేవలో ఇస్తారో, ఎంతగా తనువు-మనసు-ధనములను సేవలో ఉపయోగిస్తారో, దాని అనుసారంగా ఒకటికి లక్షల రెట్లు ఏదైతే లభించాలో అది లభించడం లేదు. ఇందుకు కారణం కర్మ మరియు యోగముల బ్యాలన్స్ ఉండడం లేదు. ఎలాగైతే సేవకు ప్లాన్లు తయారు చేస్తారో, కరపత్రాలను ముద్రిస్తారో, టి.వి, రేడియోలో చేస్తారో, ఎలాగైతే బయట సాధనాలను తయారు చేస్తారో అలా ముందు తమ మనసును శక్తిశాలిగా చేసుకునే సాధనము విశేషంగా ఉండాలి. ఈ అటెన్షన్ తక్కువగా ఉంది. మళ్లీ బిజీగా ఉన్నాము, కొంచెం మిస్ అయిపోయామని అంటారు. అప్పుడు డబల్ లాభం ఉండజాలదు. మంచిది.
Comments
Post a Comment