08-04-1984 అవ్యక్త మురళి

08-04-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మధువనము సంగమ యుగములో ప్రాప్తించిన అధికారాలతో విశ్వ రాజ్యాధికారులు

బాప్దాదా ఈ రోజు స్వరాజ్య అధికారులైన శ్రేష్ఠ ఆత్మల దివ్య దర్బారును చూస్తున్నారు. విశ్వరాజ్య దర్బారు మరియు స్వరాజ్య దర్బారు, ఈ రెండు దర్బారులకు అధికారులుగా శ్రేష్ఠ ఆత్మలైన మీరే అవుతారు. స్వరాజ్య అధికారులే విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. ఈ డబల్ నషా సదా ఉంటోందా? తండ్రికి చెందినవారిగా అవ్వడమనగా అనేక అధికారాలను పొందడము. ఎన్ని రకాల అధికారాలను పొందారో మీకు తెలుసా? అధికారాల మాలను గుర్తు చేసుకోండి. మొట్టమొదటి అధికారము - పరమాత్మకు పిల్లలుగా అయ్యారు. అనగా సర్వ శ్రేష్ఠమైన గౌరవింపదగిన, పూజ్యనీయులైన ఆత్మలుగా అయ్యే అధికారాన్ని పొందారు. తండ్రికి పిల్లలుగా అవ్వకుండా పూజ్యనీయ ఆత్మలుగా అయ్యే అధికారము పాప్తించజాలదు. కావున మొదటి అధికారము--పూజ్యనీయ ఆత్మలుగా అయ్యారు. రెండవ అధికారము--జ్ఞాన ఖజానాలకు అధిపతులుగా అయ్యారు అనగా అధికారులుగా అయ్యారు. మూడవ అధికారము--సర్వ శక్తులకు, ప్రాప్తులకు అధికారులుగా అయ్యారు. నాల్గవ అధికారము--సర్వ కర్మేంద్రియజీతులుగా, స్వరాజ్య అధికారులుగా అయ్యారు. ఈ సర్వ అధికారాల ద్వారా మాయాజీతుల నుండి జగత్ జీతులుగా, విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కావున మీ సర్వ అధికారాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ, సమర్థ ఆత్మలుగా అయిపోతారు. ఇటువంటి సమర్థులుగా అయ్యారు కదా!

స్వరాజ్యమును లేక విశ్వ రాజ్యమును పొందేందుకు విశేషంగా మూడు విషయాలను ధారణ చేయుట ద్వారానే సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. ఎటువంటి శ్రేష్ఠ కార్యము సఫలత అవ్వాలన్నా అందుకు - ఆధారము 1.త్యాగము, 2.తపస్సు మరియు 3.సేవ. ఆధారమైన ఈ మూడు విషయాలు ఉంటే సఫలత లభిస్తుందా లేక లభించదా అన్న ప్రశ్నయే ఉత్పన్నమవ్వజాలదు. ఎక్కడైతే ఈ మూడు విషయాల ధారణ ఉందో అక్కడ సెకండులో సఫలత ఉండనే ఉంటుంది. సఫలత అయ్యే ఉంది. ఏ విషయంలో త్యాగము? కేవలం ఒక్క విషయాన్ని త్యాగము చేస్తే ఆ త్యాగము అన్ని త్యాగాలను సహజంగా మరియు స్వతహాగా చేయిస్తుంది. అదేమంటే - దేహ భావమును త్యాగము చేయడం. అది హద్దులోని 'నాది (మైపన్)' అన్నదానిని సహజంగా త్యాగం చేయిస్తుంది. ఈ హద్దులోని మైపన్ - తపస్సు మరియు సేవ నుండి వంచితులుగా చేసేస్తుంది. ఎక్కడైతే హద్దులోని 'మైపన్' ఉందో అక్కడ త్యాగము, తపస్సు మరియు సేవ జరగజాలదు. హద్దులోని 'నేను - నాదిని' త్యాగం చేయాలి. నేను - నాది సమాప్తమైపోతే ఇక మిగిలిందేమిటి? బేహద్ మైపన్. నేను ఒక శుద్ధమైన ఆత్మను, నాకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. కనుక ఎక్కడైతే సర్వ శక్తివంతుడైన బేహద్ తండ్రి ఉంటారో అక్కడ సదా సఫలత తోడుగా ఉంటుంది. ఈ త్యాగము ద్వారానే తపస్సు కూడా నిరూపించబడింది కదా! తపస్సు అంటే ఏమిటి? నేను ఒక్కరికి చెందినవాడిని, ఒక్కరి శ్రేష్ఠ మతము పైనే నడుచుకునేవాడను. దీని ద్వారా ఏకరస స్థితి స్వతహాగా ఏర్పడ్తుంది. సదా ఒక్క పరమాత్ముని స్మృతి ఉండడమే తపస్సు. ఏకరస స్థితియే శ్రేష్ఠమైన ఆసనము. కమలపుష్ప సమానమైన స్థితియే తపస్సుకు ఆసనము. త్యాగము ద్వారా తపస్సు కూడా స్వతహాగా సిద్ధిస్తుంది. ఎప్పుడైతే త్యాగము మరియు తపస్యా స్వరూపులుగా అయిపోయారో అప్పుడిక ఏమి చేస్తారు? నాది అన్నది త్యాగము లేక మైపన్ సమాప్తమైపోయింది. ఒక్కరి లగనంలో (ప్రేమలో) మగ్నమై తపస్వీలుగా అయిపోతే సేవ లేకుండా ఉండలేరు. ఈ హద్దులోని నేను - నాది సత్యమైన సేవను చేయనివ్వదు. త్యాగి మరియు తపస్వీ మూర్తులే సత్యమైన సేవాధారులు. నేను ఇది చేశాను, నేను ఇలా ఉన్నాను, ఈ దేహ భావము కొద్దిగా వచ్చినా సేవాధారులకు బదులుగా ఎలా అయిపోతారు? కేవలం పేరు కొరకు(నామధారీ) సేవ చేసే సేవాధారులుగా అయిపోతారు. సత్యమైన సేవాధారులుగా అవ్వరు. సత్యమైన సేవకు పునాది త్యాగము మరియు తపస్సు. ఇటువంటి త్యాగి, తపస్వీ సేవాధారులు సదా సఫలతా స్వరూపులుగా ఉంటారు. విజయము, సఫలత వారి కంఠహారంగా అయిపోతుంది. జన్మ సిద్ధ అధికారులుగా అయిపోతారు. కావున బాప్దాదా విశ్వంలో పిల్లలందరికి త్యాగులుగా అవ్వండి, తపస్వీలుగా అవ్వండి, సత్యమైన సేవాధారులుగా అవ్వండి అనే శ్రేష్ఠమైన శిక్షణనే ఇస్తారు.

ఈనాటి ప్రపంచము మృత్యు భయం గల ప్రపంచం(తుఫాను వచ్చింది). ప్రకృతి అలజడిలో మీరైతే అచలంగా ఉన్నారు కదా! తమోగుణీ ప్రకృతి పని అలజడి చేయడం మరియు అచల ఆత్మలైన మీ పని ప్రకృతిని కూడా పరివర్తన చేయడం. నథింగ్ న్యూ(క్రొత్తదేమీ కాదు). ఇవన్నీ జరగాల్సిందే. అలజడి ఉంటేనే కదా అచలంగా అవుతారు. కనుక స్వరాజ్య అధికారి దర్బారులో నివసించే శ్రేష్ఠమైన ఆత్మలూ! అర్థం చేసుకున్నారా! ఇది కూడా రాజ్య దర్బారే కదా! రాజయోగులు అనగా స్వయం పైన రాజులు. రాజయోగి దర్బారు అనగా స్వరాజ్య దర్బారు. మీరందరూ రాజ్య నేతలుగా అయిపోయారు కదా! వారు దేశ రాజ్య నేతలు కాని మీరు స్వరాజ్య నేతలు. నేత అనగా నీతి అనుసారంగా నడిచేవారు. కావున మీరు ధర్మ నీతి - స్వ రాజ్య నీతి అనుసారంగా నడిచే స్వరాజ్య నేతలు. యధార్థమైన శ్రేష్ఠ నీతి అనగా శ్రీమతము. శ్రీమతమే యదార్థమైన నీతి. ఈ నీతి పై నడిచేవారే సఫల నేతలు.

బాప్దాదా దేశ నేతలకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారు కూడా కష్టపడ్తున్నారు కదా! భలే వెరైటీగా ఉన్నారు. అయినా దేశము పట్ల లగనము ఉంది. మా రాజ్యము అమరంగా ఉండాలి అన్న లగనంతో శ్రమనైతే చేస్తున్నారు కదా! మా భారతదేశం ఉన్నతంగా ఉండాలి అన్న ఈ లగనము స్వతహాగానే శ్రమ చేయిస్తుంది. ఇప్పుడు రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా రెండూ కలిసి తోడుగా ఉండే సమయం ఇక వస్తుంది. అప్పుడు విశ్వంలో భారతదేశానికి జయ జయ ధ్వనులు జరుగుతాయి. భారతదేశమే లైట్ హౌస్ అవుతుంది. అందరి దృష్టి భారతదేశము వైపే ఉంటుంది. భారతదేశమునే విశ్వ ప్రేరణకు మూలధనంగా అనుభవం చేస్తారు. భారత ఖండము అవినాశి ఖండము. అవినాశి తండ్రి అవతరించిన భూమి. కనుక భారతదేశ మహత్వము సదా మహోన్నతమైనది. మంచిది. అందరూ తమ స్వీట్ హోమ్ లోకి(మధువనానికి) వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరూ విచ్చేసినందుకు అభినందనలను తెలియజేస్తున్నారు. భలే విచ్చేయండి. తండ్రి ఇంటికి శృంగారమైన పిల్లలూ! భలే విచ్చేయండి. మంచిది.

సఫలతా సితారలందరికీ సదా ఏకరస స్థితి అనే ఆసనం పై స్థితులై ఉండే తపస్వీ పిల్లలకు, సదా ఒక్క పరమాత్ముని శ్రేష్ఠ స్మృతిలో ఉండే మహాన్ ఆత్మలకు, శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనను ఉంచే విశ్వ కళ్యాణకారి సేవాధారులైన పిల్లలకు - బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్దాదాతో గుజరాత్ రాష్ట్ర ముఖ్య మంత్రి కలయిక- తండ్రి ఇంటికి లేక మీ ఇంటికి భలే వచ్చారు. సేవలో లగనము బాగుందని తండ్రికి తెలుసు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఇటువంటి సేవాధారులు ఉంటారు. కావున సేవ చేయుటలో శ్రమ పడినందుకు ఆంతరిక సంతోషము ప్రత్యక్షఫలం రూపంలో సదా లభిస్తూ ఉంటుంది. ఈ శ్రమ సఫలతకు ఆధారము. ఒకవేళ నిమిత్తమైన సేవాధారులందరూ శ్రమను అవలంభించినట్లయితే భారతదేశ రాజ్యము సదా సఫలతను పొందుతూ ఉంటుంది. సఫలత అయితే లభించవలసిందే. ఇది నిశ్చితము కాని ఎవరైతే నిమిత్తంగా అవుతారో ఆ నిమిత్తంగా అయ్యేవారికి సేవకు ప్రత్యక్ష ఫలము మరియు భవిష్య ఫలము ప్రాప్తిస్తాయి. కావున మీరు సేవకు నిమిత్తంగా ఉన్నారు. నిమిత్త భావముతో సదా సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఎక్కడ నిమిత్త భావముంటుందో, నేను అన్న భావము ఉండదో అక్కడ సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఈ నిమిత్త భావము, శుభ భావన, శుభ కామనలను స్వతహాగా జాగృతము చేస్తుంది. ఈ రోజు శుభ భావన, శుభ కామనలు లేవు. దానికి కారణం నిమిత్త భావానికి బదులుగా నేను అన్నది వచ్చేసింది. ఒకవేళ నిమిత్తంగా భావించినట్లయితే చేయించేవారైన తండ్రిని అర్థం చేసుకుంటారు. చేసి చేయించే స్వామి సదా శ్రేష్ఠంగానే చేయిస్తారు. నిమిత్త భావానికి(ట్రస్టీపన్) బదులుగా రాజ్య ప్రవృత్తి గల గృహస్థులుగా అయిపోయారు. గృహస్థములో భారముంటుంది మరియు (ట్రస్టీపన్) నిమిత్త భావముతో తేలికదనం ఉంటుంది. ఎప్పటివరకైతే తేలికగా ఉండరో అప్పటివరకు నిర్ణయ శక్తి కూడా ఉండదు. ట్రస్టీగా ఉంటే తేలికగా ఉంటారు కనుక నిర్ణయ శక్తి శ్రేష్ఠంగా ఉంటుంది. కనుక సదా ట్రస్టీగా ఉండండి. నిమిత్తంగా ఉన్నాననే భావన ఈ భావన ఫలదాయకంగా ఉంటుంది. భావనకు ఫలము లభిస్తుంది. కనుక ఈ నిమిత్త భావన సదా శ్రేష్ఠమైన ఫలమును ఇస్తూ ఉంటుంది. కనుక తోటివారందరికీ నిమిత్త భావము, ట్రస్టీ భావమును ఉంచమనే స్మృతిని కలిగించండి. అప్పుడు ఈ రాజనీతి విశ్వము కొరకు శ్రేష్ఠమైన నీతిగా అయిపోతుంది. విశ్వమంతా ఈ భారతదేశ రాజనీతిని కాపీ చేస్తుంది. కాని దీనికి ఆధారం ట్రస్టీ భావన అనగా నిమిత్త భావము.

కుమారులతో - కుమారులు అనగా సర్వ శక్తులను, సర్వ ఖజానాలను జమ చేసి ఇతరులను కూడా శక్తివంతులుగా తయారుచేసే సేవను చేసేవారు. సదా ఇదే సేవలో బిజీగా ఉంటున్నారు కదా! బిజీగా ఉన్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కొద్దిగా అయినా ఫ్రీగా ఉన్నట్లయితే వ్యర్థము నడుస్తుంది. సమర్థులుగా ఉండేందుకు బిజీగా ఉండండి. మీ టైమ్ టేబుల్ తయారు చేసుకోండి. ఏ విధంగా శరీరానికి టైమ్ టేబుల్ తయారు చేస్తారో, అలా బుద్ధికి కూడా టైమ్ టేబుల్ తయారు చేయండి. బుద్ధి బిజీగా ఉండే ప్లాను తయారు చేయండి. కావున బిజీగా ఉండడం ద్వారా సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఇప్పటిి సమయ ప్రమాణంగా కుమార జీవితములోనే శ్రేష్ఠముగా అవ్వడం చాలా గొప్ప భాగ్యము. ''మేము శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలము'' - సదా ఇదే ఆలోచించండి. స్మృతి మరియు సేవల బ్యాలన్స్(సమతుల్యత)ను సదా ఉంచండి. బ్యాలన్స్ ఉంచేవారికి సదా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) లభిస్తూ ఉంటాయి. మంచిది.

కొన్ని విశేషమైన అవ్యక్త మహావాక్యాలు

పరమాత్మ ప్రేమలో సదా లవలీనమై ఉండండి

పరమాత్మ ప్రేమ ఆనందమయమైన ఊయల. ఈ సుఖప్రదమైన ఊయలలో సదా ఊగుతూ పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే ఎప్పుడూ ఎటువంటి పరిస్థితి లేక మాయ అలజడి రాజాలదు. పరమాత్మ ప్రేమ తరగనిది, చలించనిది(స్థిరమైనది). ఎంత ఉందంటే అందరికి లభించగలదు. కాని పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునేందుకు విధి - అతీతంగా అవ్వడం. ఎవరు ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా వారు పరమాత్మ ప్రేమకు అధికారులుగా ఉంటారు. పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయి ఉన్న ఆత్మలు ఎప్పుడూ హద్దు ప్రభావంలోకి రారు. ఎప్పుడూ బేహద్ ప్రాప్తులలో మగ్నమై ఉంటారు. వారి నుండి సదా ఆత్మీయతా సుగంధం వస్తుంది. ఇదే ప్రేమకు గుర్తు. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారికి అన్నీ సమర్పిస్తారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉందంటే, ప్రతిరోజూ ప్రేమకు(రిటర్న్) బదులు ఇచ్చేందుకు ఇంత పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు, ప్రియస్మృతులను ఇస్తారు మరియు సదా సాథీగా (స్నేహితునిగా) అయ్యి తోడు నిభాయిస్తారు. కావున ఈ ప్రేమలో మీ బలహీనతలన్నిటినీ సమర్పణ చేయండి. పిల్లలంటే తండ్రికి ప్రేమ కావున పిల్లలు ఎవరు ఎలా ఉన్నా సదా నావారని అంటారు. అలాగే మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి. బాబా, మా సర్వ సంబంధాలు మీరే అని హృదయపూర్వకంగా అనండి. ఎప్పుడూ అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిని గుర్తు చేసుకోవలసిన అవసరముండదు, వారి స్మృతి స్వతహాగానే వచ్చేస్తుంది. కేవలం హృదయ పూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యమైన, నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. మేరా బాబా (నా తండ్రి), ప్యారా బాబా(ప్రియమైన బాబా) అని అంటారు కనుక ప్రియమైన వారిని ఎప్పుడూ మర్చిపోలేరు. నిస్వార్థ ప్రేమ తండ్రి నుండి తప్ప ఏ ఇతర ఆత్మల నుండి లభించజాలదు. కావున ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చేయకండి. నిస్వార్థమైన ప్రేమలో లవలీనమై ఉండండి. పరమాత్మ ప్రేమను అనుభవం చేసేవారిగా అయితే ఈ అనుభవంతో సహజయోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరింపజేసే సాధనము. ఎగిరేవారు ఎప్పుడూ ధరణి ఆకర్షణలోకి రాలేరు. మాయ ఎంత ఆకర్షిత రూపంలో ఉన్నా ఆ ఆకర్షణ ఎగిరేకళలోని వారి వద్దకు చేరుకోలేదు. ఈ పరమాత్మ ప్రేమ అనే దారము దూర-దూరాల నుండి లాక్కుని తీసుకొస్తుంది. ఇది ఎటువంటి సుఖప్రదమైన ప్రేమ అంటే, ఎవరైతే ఈ ప్రేమలో ఒక్క సెకను అయినా మునిగిపోతారో వారు తమ అనేక దు:ఖాలను మర్చిపోతారు మరియు సదా కొరకు సుఖ ఊయలలో ఊగుతూ ఉంటారు. జీవితంలో ఏది కావాలో దానిని ఒకవేళ ఎవరైనా ఇచ్చినట్లయితే అదే ప్రేమకు గుర్తుగా అవుతుంది. కావున తండ్రికి పిల్లలైన మీరంటే ఎంత ప్రేమ ఉందంటే జీవితములోని సుఖ-శాంతుల కామనలన్నిటిని పూర్తి చేసేస్తారు. తండ్రి కేవలం సుఖము ఇవ్వడమే కాదు, సుఖ భండారానికి(ఖజానాలకు) యజమానులుగా చేస్తారు. తోడుతోడుగా శ్రేష్ఠ భాగ్య రేఖను గీసుకునే కలమును కూడా ఇస్తారు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోగలరు - ఇదే పరమాత్మ ప్రేమ. ఏ పిల్లలైతే సదా పరమాత్ముని ప్రేమలో లవలీనమై మునిగిపోయి ఉంటారో, వారి మెరుపు మరియు నషా, అనుభూతుల కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే, ఏ సమస్య కూడా సమీపంగా రాలేదు సరి కదా కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడూ ఏ విధమైన శ్రమ ఉండజాలదు.

తండ్రికి పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంది కనుక అమృతవేళ నుండే పిల్లల పాలన చేస్తారు. ప్రతిరోజు ఆరంభ సమయమే ఎంత శ్రేష్ఠ౦గా ఉంటుంది! స్వయం భగవంతుడు మిలనము జరుపుకునేందుకు పిలుస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, శక్తులను నింపుతారు! తండ్రి ప్రేమ గీతము మిమ్ములను మేల్కొల్పుతుంది. ఎంత స్నేహంతో పిలుస్తారు, మేల్కొల్పుతారు - మీఠే బచ్చే(మధురమైన పిల్లలు), ప్యారే బచ్చే(ప్రియమైన పిల్లలు) రండి అని నిద్ర లేపుతారు. కావున ఈ ప్రేమతో కూడిన పాలనకు ప్రాక్టికల్ స్వరూపం '' సహజయోగీ జీవితం. '' ఎవరి పై ప్రేమ ఉంటుందో వారికి ఇష్టమైన దానినే చేస్తారు. కావున తండ్రికి పిల్లలు అప్సెట్ అవ్వడం(నిరాశ అవ్వడం) బాగనిపించదు. అందువలన ఎప్పుడూ ఏమి చేయాలి, విషయమే అలా ఉంది. కనుక అప్సెట్ అయిపోయామని (కలవరపడ్డామని) అనకండి. ఒకవేళ అప్సెట్ అయ్యే విషయం వచ్చినా మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి.

బాప్దాదాకు పిల్లలంటే ఎంతో ప్రేమ ఉంది. ప్రతి పిల్లవాడు నా కంటే ముందు ఉండాలని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తమకన్నా ముందుకు వృద్ధిలోకి తీసుకొస్తారు. ఇదే ప్రేమకు గుర్తు. కనక బాప్దాదా కూడా నా పిల్లల్లో ఇప్పుడు ఏ విధమైన లోపమూ ఉండకూడదు, అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలని అంటారు. ఆదికాలమైన అమృతవేళలో మీ హృదయంలో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ హృదయంలో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానము నిండుగా ఉన్నట్లయితే ఎప్పుడూ, ఎవరి వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్లజాలదు.


ఈ పరమాత్మని ప్రేమ ఈ ఒక్క జన్మలో మాత్రమే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మలు లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. ఇప్పుడు మాత్రమే పరమాత్ముని ప్రేమ లభిస్తుంది. ఆ ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడ్తుంది, పరమాత్ముని ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. కావున ఈ ప్రేమ అనుభూతులలో ఇమిడిపోయి ఉండండి. తండ్రితో సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ప్రేమకు గుర్తు - సమానంగా, కర్మాతీతంగా అవ్వండి. 'చేయించేవారిగా' అయ్యి కర్మలు చేయండి, చేయించండి. కర్మేంద్రియాలు మీతో చేయించరాదు కాని మీరు కర్మేంద్రియాలతో చేయించండి. ఎప్పుడూ మనసు- బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మను చేయకండి.

Comments